మన గుహలు..పర్యాటక ప్రాంతాలు


Fri,May 31, 2019 01:33 AM

గుహలంటే బెలుం గుహలేనా? గుహలంటే బొర్రా గుహలేనా? వీటిని మించి, మైమరిపించి ఆహ్లాదాన్ని పంచే గుహలు మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ అవి గుర్తింపునకు నోచుకోలేదు. పర్యాటక ప్రదేశాలుగా పేరుగాంచలేదు. వసతులుంటే వనాల్లోనే ఉండి హాయిని పొందే గుహలు తెలంగాణలో కూడా ఉన్నాయి. ఈ వేసవి సెలవుల్లో వీలైతే ఓ రౌండేసి రండి..
gaju-bedam
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి అందాలకు కొదువే లేదు. ఎత్తైన కొండలు, గలగలపారే జలపాతాలు అడవుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో పాటు దర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి గుహలు . గుహలు అనగానే మనకు బొర్రా గుహలు , బెలుం గుహలు గుర్తొస్తాయి. తెలంగాణలో అద్భుతమైన కళాసంపద మాత్రమే కాదు అత్యద్భుతమైన శిలా సంపద కూడా ఉన్నది.

చల్లని చందంపేట

కృష్ణానదీ లోయలో నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఉండే అరుదైన గుహలున్నాయి. ఐస్‌లాండ్లోని ఒక అగ్నిపర్వతంలో కరిగి చిమ్మిన లావా వేడి,వేగాలకు ఏర్పడిన భూమికి 400అడుగుల లోతున వున్న దిహ్నుకగిగుర్ అనే గుహ ప్రకృతే స్వయంగా వేసిన హరివిల్లు రంగులతో ఏర్పడి ఉంది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కాచరాజుపల్లికి దగ్గర వున్న గుట్టల వరుసలో మునులగుహగా పేరున్న గాజుబేడం గుహ ఆక్వామెరీన్ (నీలి ఆకుపచ్చ) రంగుతో మెరిసిపోతు కనపడుతుంది. గుహలోకి ప్రవేశించే మార్గం విశాలంగా ఉంటుంది. కళ్ళుచెదిరే రంగులగోడలు, అంతస్తుల గుహలు మనల్ని అబ్బురపరుస్థాయి. ఈ మునుల గుహ లేదా భావోజి గుహలో ఏర్పడిన గుహాంతర్భాగాలు సొరంగాలుగా, అంతస్తులుగా చక్కగా చెక్కినట్టుగా రాతిగోడలు,అందమైన ఆకృతులు ఒకచోట ఎరుపు రంగు, మరొకచోట కొంచెం నారింజవర్ణం, గుహలో 90 శాతం ఆక్వామెరీన్(నీలి ఆకుపచ్చ)రంగుతో చాలా అందంగా కనపడుతున్నాయి. ఈ రాతిగోడలు ఇలా రంగులతో మెరిసిపోతున్నాయంటే అగ్నిపర్వతంలో లావా ప్రవాహంతో ఇట్లాంటి గుహలు ఏర్పడివుంటాయి. లావావేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ప్రాకృతికంగా గుహలగోడలకు ఈ రంగులు వచ్చి ఉంటాయి .

ఈ గుహలోని రాళ్ళు ఖనిజసంపన్నమైనవి. ప్రభుత్వం వీటిని పరీక్షించి వీటిలోని ఖనిజాలను అన్వేషించాలి. అంతేకాదు దేశంలోనే అరుదైన ఈ గుహలకు మంచిదారులు వేసి విహార యాత్రాస్థలంగా రూపొందించాలి.ప్రభుత్వం దృష్టిపెడితే ప్రతిష్టాత్మకంగా మారడమే కాక రేపటి పర్యాటక సంపదకు కూడా మూలకారణం అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుహలోని మార్గాలను అన్వేషిస్తే అనేకమైన కొత్తసంగతులు, ఆశ్చర్యపరిచే చారిత్రక విశేషాలు బయటపడే అవకాశాలున్నాయి. సహజమైన అందాలు... పర్యాటకానికి అవసరమైన అన్ని హంగులనూ సొంతం చేసుకుంది చందంపేట మండలం. దేవరచర్లలోని పురాతన శివాలయంతో పాటు గాజు బేడం గుహలు, మునిస్వామి గుట్ట దగ్గర మునిస్వామి, ఏలేశ్వరంలో మల్లయ్యస్వామి ఆలయాలు పుష్కరాలకు వేదికలు. దేవరచర్ల సమీపంలోని మునిస్వామిగుట్టలో జలపాతం దగ్గరి శివలింగం ఆధ్యాత్మిక అనుభూతికి లోను చేస్తుంది. గాజు బెడం గుహలు కాచరాజుపల్లి అటవీప్రాంతంలో ఉన్నాయి. వైజాగ్ కాలనీ నుంచి కృష్ణానదిలో ప్రయాణిస్తే కొండల మధ్య కృష్ణా నది పరవళ్లు తీసే దృశ్యాలు పాపికొండలను తలపిస్తాయి.

మైమరిపించే మైలారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టకి చేరువలో ఉన్న మైలారం గుహలు లక్షల సంవత్సరాల నాటి ఆనవాళ్లకు, ప్రకృతి చెక్కిన అందాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నల్లగుట్టలుగా పేరొందిన నల్లరాతి గుట్టలలో 3.5 కి.మీ. మేర ఈ సున్నపు గుహలు విస్తరించి ఉన్నాయి. ఇలాంటి గుహలు మన దేశంలో ఉత్తరాఖండ్, హర్యానా, మేఘాలయ, మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్, అండమాన్-నికోబార్ దీవులలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న సున్నపు గుహలు ఇవొక్కటే కావడం విశేషం. నల్లగుట్టల్లో గుహల లోపలికి సహజసిద్ధంగా ఏర్పడిన సొరంగాలు, ఆ సొరంగాల్లో రహస్య మార్గాలు ఉన్నాయి.

గుహల పై భాగంలోని సున్నపురాతి పైకప్పుల నుండి సున్నపునీటితో జారిపడి గట్టిపడిన స్టాలక్టైట్స్ , వాటితో ఏర్పడిన వింతైన ఆకృతులున్నాయి. పరిసర ప్రాంతాల్లో ప్రకృతి సోయగాలు, ఎన్నో అపురూప దృశ్యాలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఈ గుట్టలను ఆదిమానవుల ఆవాసాలుగా చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ప్రాచీన శిలాయుగానికి చెందిన అనేక రాతి పనిముట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గుహల్లో ఆర్కియన్ శిలలు ఉన్నాయి. కొన్నిచోట్ల గుహలు 10, 50, 100 అడుగుల విస్తీర్ణంతో, కొన్నిచోట్ల గుండ్రంగా, మరికొన్ని చోట్ల పొడవు గదుల్లా ఉన్నాయి. గుహ ప్రారంభంలో వెలుతురు ఉన్నప్పటికీ లోపలికి వెళ్తున్న కొద్దీ చిమ్మచీకటి కమ్ముకుంటుంది. అక్కడక్కడా గుట్ట పైభాగం నుంచి పడే సూర్యరశ్మి వల్ల గుహలో కాస్త వెలుతురు ఉంటుంది. గుహలో గుండుసూది వేసినా స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం ఉంటుంది. గుహలో 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, చల్లని గాలి ఉంటాయి.

ఈ గుహల్లో సున్నపు రాతి నీళ్ళు జారిపడి అనేక ఆకృతులు ఏర్పడ్డాయి. వాటిలో ఎగిరే పక్షులు, నగిషీలు, నేల మీద వాలిన డేగ, సింహం, మనిషి ముఖం వంటి ఆకృతులు ముఖ్యమైనవి. సున్నపు గుహలను అభివృద్ధి చేస్తే బొర్రా గుహలు, బెలూం గుహలను మైమరిపించేట్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయనడంలో అతిశయోక్తి లేదు.

గుహలోకి వెళ్లేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు

gaju-bedam1
-రుగ్మతలతో బాధ పడుతున్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు వెళ్ళకపోవడం మంచిది. మంచినీటిని వెంట తీసుకెళ్ళడం మరవొద్దు.
-సన్నటి కాటన్ దుస్తులు ధరించి వెళ్లండి. లోపల ఉక్కపోత ఎక్కువ ఉంటుంది.
-గైడ్ సహాయం తీసుకోవడం మంచిది. టార్చ్‌లైట్ వెంట తీసుకెళితే సౌకర్యంగా ఉంటుంది.
-తాడు, టోపి ఇతర సాహసయాత్రలకు అవసరమయ్యే సామాగ్రిని పట్టుకెళ్లండి.

1363
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles