పిల్లల భవిష్యత్తు రంగులమయం!


Wed,June 12, 2019 01:49 AM

బడి గంట మోగింది.. ఇప్పటికే ఏ స్కూళ్లో చేర్పించాలని.. తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చేసే ఉంటారు.. బండెడు పుస్తకాలు.. బోలెడు హోమ్‌వర్క్స్.. పరీక్షల ఒత్తిడి.. ఆ పసి ప్రాయాలకు ఇవన్నీ తలకు మించిన భారం.. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కూడా కార్పొరేట్‌ల వైపు చూపు సారిస్తారు.. కానీ పుస్తకాలే అవసరం లేకుండా.. ఆడుతూ.. పాడుతూ.. వాళ్లకి నచ్చిన రీతిలో పాఠాలు నేర్చుకుంటూ.. ఆ చిరునవ్వు చిదిమేయకుండా.. రంగులమయం చేసేందుకు.. విజన్ రెయిన్‌బో కాన్సెప్ట్ స్కూల్ మొదలైంది.. దీని స్థాపకురాలు నౌషీన్ అహ్మద్.. ఆ స్కూల్ వివరాలు.. ఆమె ఈ స్కూల్ ఎందుకు స్థాపించింది.. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లిపోండి..
nousheen-child
మన స్టూడెంట్స్‌కే ర్యాంకులు రావాలని లెక్చరర్లు.. తమ పిల్లలే ఫస్ట్ రావాలని తల్లిదండ్రులు. చదువు పేరుతో తెచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్టూడెంట్‌కి మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు. సబ్జెక్ట్ నేర్పాలి. నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పటికీ అదే నడుస్తుంది. బయట ప్రపంచం రోజుకు ఒక రంగును పులుముకుంటున్నది. పుస్తకాల జ్ఞానం ఉంటే సరిపోదు. ఈ మాటలు విజన్ రెయిన్‌బో స్కూల్‌కి సరిగ్గా సరిపోతాయి. ఇక్కడ పుస్తకాలు ఉండవు. పరీక్షలు అంతకన్నా ఉండవు. కానీ ఒక విద్యార్థిని ఎలా తయారు చేయాలో, భవిష్యత్తులో ఎలా ఉండాలో మాత్రం నేర్పిస్తామంటున్నది నౌషీన్ అహ్మద్.


పిల్లల కష్టాలు: ఉదయం యూనిఫామ్ వేసుకొని బ్యాగ్, లంచ్ తీసుకొని స్కూల్ బస్ ఎక్కిన మొదలు తిరిగి సాయంత్రం ఎప్పుడో ఐదు గంటలకు ఇంటికి చేరుతారు పిల్లలు. ర్యాంకులనే ఒత్తిడి భరించలేక నిద్ర లేవగానే అమ్మా.. కడుపునొప్పి అంటూ మొదలుపెడుతారు. స్కూల్ సమయం అయిపోగానే మామూలైపోతుంది. రెండోరోజు మరొక డ్రామా. ఇలా ఊహ తెలియని వయసులో అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి. తప్పు ఎక్కడుంది. కార్పొరేట్ స్కూల్ అంటూ చెప్పుకొనే యాజమాన్యంలో ఉందా? లేక మార్కులే పరమావధిగా భావిస్తున్న తల్లిదండ్రుల్లో ఉందా? అని ప్రశ్నిస్తున్నది నౌషీన్. విజన్ రెయిన్‌బో స్కూళ్లో బెదిరించే కర్రలు ఉండవు. నచ్చినప్పుడు చదివేలా ఇక్కడ ఏర్పాటు చేశారు.
nousheen-child1
పుస్తకం బహుమతి: నౌషీన్ అహ్మద్‌కు పుస్తకాలంటే ప్రాణం. హైదరాబాద్‌లో ఉండే అన్ని లైబ్రెరీల్లో నైషీన్‌కు అకౌంట్ ఉంది. మార్కెట్లో విడుదల అయిన ప్రతి పుస్తకం నౌషీన్ దగ్గర కచ్చితంగా ఉంటుంది. కొత్త పుస్తకం రాగానే లైబ్రెరీల నుంచి నౌషీన్‌కు కబురు వెళ్తుంది. అందుకే తను పెట్టిన స్కూల్‌లో ప్రత్యేకంగా లైబ్రెరీ ఏర్పాటు చేసింది. అందులో మొత్తం 7,000 పుస్తకాలున్నాయి. నౌషీన్‌కు చదువు చెప్పడం అంటే ఇష్టం. అలా అని ఎప్పుడో వచ్చిన సిలబస్‌ను పట్టుకొని బోర్డు మీద వివరిస్తూ చెప్పడం అంటే కష్టమంటున్నది. పిల్లల కోసం ప్రత్యేకంగా మాంటిస్సోరి విద్యను ప్రవేశ పెట్టాలనుకుంది. ఈ విద్యపై అధ్యయనం చేసింది. దీనికి కావాల్సిన పూర్తి వివరాలు సేకరించింది. ఈ ఆలోచన ఇప్పటిది కాదు 15 యేండ్ల కిందటిది. పిల్లలకు సిలబస్‌లేని చదువు చెప్పాలనుకుంది. భర్త దానిష్ సాయంతో ఒక పాఠశాల స్థాపించింది. దానికి విజన్ రెయిన్‌బో స్కూల్ అని పేరు పెట్టింది. అన్ని పాఠశాలల మాదిరిగా ఇది ఉండదు. విద్యకు తగ్గట్టుగా విద్యార్థులు ఉంటారు. వీరికి పుస్తకాలుండవు. పరీక్షలుండవు. టైం టేబుల్ ఉండదు. ఇది హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉన్నది.

సంపాదన ఆశించలేదు..

danish
నా భార్య నౌషీన్ మాంటిస్సోరిని పరిచయం చేద్దామంటే. ముందుగా ఆలోచించా. కానీ నౌషీన్ మాత్రం పట్టువదల్లేదు. ఇలాంటి విద్యను అందించాలనుకుంది. ఆమె పట్టుదలను కాదనలేకపోయాను. మానవునికి సంబంధించిన ఏడు చక్రాలు అంటే శరీరం, మెదడు, ఆత్మ మొదలైన వాటిని పరిగణలోకి తీసుకొని ఈ పద్ధతిలోనే చదువు ప్రారంభించాం. విజన్ రెయిన్‌బో పేరుతో హైదరాబాద్‌లో మరెక్కడా లేదు. ఇక్కడ పది వరకు చదువుకున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కోసం వేరే కాలేజ్‌లో చేరుతుంటారు. అక్కడి స్టూడెంట్స్‌తో పోలిస్తే వీరు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటున్నారని వారి తల్లిదండ్రులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది.
- దానిష్ అహ్మద్

మాంటిస్సోరి విద్య: ఈ పాఠశాలలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉంటుంది. అయితే 1,2,3 అంటూ తరగతులుండవు. వయసుని బట్టి పదో తరగతిలోపు నాలుగు విడతులుగా విభజిస్తారు. అంటే.. 3-6, 6-9, 9-12, 12-15 యేండ్లు. ఇలా నాలుగు భాగాలుగా ఆయా వయసుతో సెపరేట్ చేస్తారు. 12-15లోపు అంటే పది పూర్తయినట్టు. వీరికి ప్రత్యేకంగా తరగతి గది అవసరం లేదు. ఐదుగురు విద్యార్థులకు ఒక టీచరు. పాఠశాలలో 60 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. అంతకుమించి ఒకరిని కూడా తీసుకోరు. టీచర్లకు ప్రత్యేకంగా యేడాది పాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాతే వారికి బోధించే అవకాశం కల్పిస్తారు. వీరు చెప్పే ప్రతి విషయాన్ని బొమ్మల ఆధారంగా యాక్టింగ్ చేస్తూ విద్యార్థులకు వివరిస్తారు. పుస్తకాలకు బదులుగా యాక్టివిటీలు ఏర్పాటు చేస్తారు. మాంటిస్సోరి అంటే శబ్దాలను బట్టి ప్రనౌన్సియేషన్, ఫొనెటిక్స్ నేర్పిస్తారు.దీంతో విద్యార్థుల్లోని గ్రాస్పింగ్ పవర్‌ను అంచనా వేయవచ్చు.

రెయిన్‌బో బజార్..

nousheen
నెలకు ఒకసారి విద్యార్థులతో వర్క్‌షాప్‌లు కండక్ట్ చేపిస్తాం. స్కూల్ పనులన్నింటినీ కో-ఆర్డినేటర్ అరీఫా అహ్మద్ దగ్గరుండి చూసుకుంటుంది. పిల్లలకు కావలసిన ఆటల వర్క్‌షాప్‌లు, టాలెంట్ ప్రోగ్రాములు, వీలైనన్నింటినీ ఉచితంగా కండక్ట్ చేస్తాం. ఇవి అన్ని రకాల వయసు వారికి వర్తిస్తాయి. ఈ నెల జూన్ 30న రెయిన్‌బో బజార్ నిర్వహిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. స్కూల్ వివరాల కొరకు https://www.facebook.com/visionrainbow/ లింక్ క్లిక్ చేయండి. ఇతర వివరాల కోసం ఫోన్ నెం. 9246805664ని సంప్రదించండి.

సంప్రదాయ ఆటలుఫ: నైషీన్ అహ్మద్ విద్యార్థులకు చదువు నేర్పడమే కాదు, చదువుతో పాటు ఆటలు, పాటలు, జీవిత సత్యాలు నేర్పిస్తున్నది. కుండల తయారీ, ఫ్యాషన్, బిజినెస్ స్కిల్స్, పెయింటింగ్, ప్రదర్శనలు, కొనుగోలు చేసే పద్ధతి ఇలా అన్ని రకాల స్కిల్స్‌లో విద్యార్థులు నేర్పరులు అవుతారు. ఇక గేమ్స్ విషయానికి వస్తే.. ఇంటర్నేషనల్ క్రీడలతో పాటు పల్లెల్ని గుర్తు చేసేలా తొక్కుడు బిల్ల, కచ్చకాయలు, కర్రబిల్ల వీటితో పాటు మెదడుకు పదును పెట్టే పజిల్స్ చేయిస్తుంటారు. నెలకు ఒకసారి తప్పకుండా పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. అందులో.. ఇంటి దగ్గర విద్యార్థులకు ఎలాంటి వాతావరణం కల్పించాలి. వారితో ఏం పనులు చేయించాలనే విషయాలు తల్లిదండ్రులతో మాట్లాడుతుంది స్కూల్ యాజమాన్యం. విద్యార్థులు ఎలాంటి మూడ్‌లో ఉన్నా వారిని యాక్టివిటీ వైపు మళ్లించడం అక్కడి టీచర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఫీజుల విషయానికి వస్తే 5,000 రూపాయలతో మొదలవుతుంది. ఒక్కో యాక్టివిటీకి ఫీజు ఉంటుంది. వేరే స్కూల్ నుంచి ఇందులో అడుగు పెట్టాలంటే.. విద్యార్థిపై పూర్తి స్టడీ చేశాకే తీసుకుంటారు.

-వనజ వనిపెంట
-బేగంపేట్ సంజయ్ చారి

904
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles