యంగెస్ట్ డ్రమ్మర్ జయంత్


Sun,July 14, 2019 12:22 AM

రకరకాల కళల్లో ప్రావీణ్యం చాలామందే సంపాదిస్తారు. కానీ, కొందరు మాత్రమే తమ సత్తా చాటుతూ చరిత్ర పుటల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. సరిగ్గా ఈ కోవకు చెందిన వాడే డ్రమ్మర్ జయంత్ చల్లా. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో సంగీతంలో పట్టు సాధించాడు. అంతేకాదు 15 ఏండ్లకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ కళాకారుడు సంగీత ప్రపంచంలో కళాకారుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అటు చదువుతో పాటు ఇటు సంగీతంలోనూ తనదైన శైలితో దూసుకుపోతున్న డ్రమ్మర్ జయంత్ గురించిన విశేషాలు..
Jayanth
సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసే వాటిలో రాక్, పాప్, జాజ్ వంటి సంగీత శైలిలున్నాయి. డ్రమ్స్ మ్యూజిక్ కూడా ఈ జాబితాలోనిదే . అటువంటి అరుదైన సంగీత రంగంలోకి 6 ఏండ్ల వయసులోనే అడుగు పెట్టాడు జయంత్ చల్లా. రెండేండ్ల ప్రాయం నుంచే సంగీతంపై ఆసక్తి కనబరిచాడు. అంతేకాదు పలురకాల శబ్దాలను గుర్తించడంలో నేర్పరి. తమ చుట్టుపక్కల ఎవరైనా కార్ స్టార్ట్ చేస్తే చాలు కారు ఇంజిన్ శబ్దాన్ని బట్టి ఎవరి కారో గుర్తించగలడు. ఇంట్లో ఆటలతో పాటు కూని రాగాలు తీస్తుంటాడు. జయంత్ వాళ్ల తాతయ్య కృష్ణారావు కామర్స్ ప్రొఫెసర్. ఆయనకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. దీంతో అప్పుడప్పుడు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం రేడియో స్టేషన్ ద్వారా పలు కచేరీలు నిర్వహించేవారు. నానమ్మ జయభారతి, తాతయ్య కృష్ణారావులు, జయంత్ తల్లిదండ్రులు తన అభిరుచిని గుర్తించారు. 6 ఏండ్లకే ప్రముఖ సంగీత కళాకారుల దగ్గర ఓనమాలు దిద్దడం మొదలు పెట్టాడు. అలా ఈ రంగంలోకి అరంగేట్రం చేశాడు.


క్లాసికల్ -వెస్ట్రన్ మ్యూజిక్‌లపై పట్టు..

ప్రముఖ సంగీత కళాకారులు ఇళయరాజ బృందంలో ఒకరైన నాగరాజన్ నాయుడు దగ్గర డ్రమ్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత తబలా వాయిద్యకారుడు మోహన్ వద్ద తబలా, మృదంగం కళాకారుడు టి నారాయణ కుమార్ దగ్గర మృదంగం నేర్చుకున్నాడు. హిందుస్తానీ, కర్ణాటక వంటి క్లాసికల్ మ్యూజిక్స్‌తోపాటు వెస్ట్రన్ మ్యూజిక్‌పై పట్టు సాధించాడు. ఎలక్ట్రో ట్రాక్స్‌కు డ్రమ్మింగ్ చేయడం ఈ రంగంలో అనుభవం ఉన్నవారికే సాధ్యమవుతుంది. అటువంటిది అనతి కాలంలోనే పలురకాల సంగీతంపై ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రో ట్రాక్స్‌కు డ్రమ్మింగ్ చేసే ఆర్టిస్ట్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన డ్రమ్మర్ జొజొ మేయర్ ఒకరు. ఆయన రెండేండ్ల నుంచి శిక్షణ మొదలు పెట్టినా 18 యేండ్లకు డ్రమ్మింగ్‌పై పట్టు సాధించాడు. అలాంటిది జయంత్ మాత్రం 15 ఏండ్లకే డ్రమ్మింగ్ మెళకువలు తెలుసుకొని ప్రొఫెషనల్ డ్రమ్మర్‌గా మారాడు. వీటితోపాటు భారతదేశ సంప్రదాయ సంగీతాన్ని, విదేశీ పాశ్చాత్య సంగీతంతో మేళవించి సరికొత్త మ్యూజిక్‌ను రూపొందిస్తున్నాడు జయంత్. క్లాసికల్ రిథమ్ కొనక్కోల్ నేర్చుకున్నాడు. ఆసక్తి ఉన్న రంగం కావడంతో జయంత్ 9 ఏండ్లకు తనదైన శైలిలో మ్యూజిక్ కంపోజ్ చేయడం మొదలు పెట్టాడు. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోనూ జీ తెలుగు, ఖుషి టీవీ షోల్లోనూ పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నాడు. లండన్‌లోని ట్రినిటి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి డ్రమ్స్ విభాగంలో ఉండే 8 గ్రేడ్‌లను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు.

డ్రమ్మింగ్ లెజెండ్ నుంచి బహుమతి

డ్రమ్మింగ్ లెజెండ్ మైఖేల్ స్టీఫెన్ పోర్ట్నాయ్ 2014లో ముంబైలోని ఐఐటీలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చాడు. ఆ సమయంలో జయంత్ కూడా తన ప్రతిభను కనబరిచాడు. జయంత్ ప్రతిభను చూసిన ఆయన ప్రశంసలతో ముంచెత్తాడు. అంతేకాదు, జయంత్‌కు ఓ బహుమతి కూడా అందించాడు స్టీఫెన్ పోర్ట్నాయ్. ఆయన ఆన్‌లైన్ ద్వారా డ్రమ్మింగ్ నేర్చుకునేవారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. ఆ మెళకువలను అనుసరిస్తూ తన ఆలోచనలకు క్రియేటివిటీని జతచేసి సరికొత్త ఆల్బమ్‌లను రూపొందిస్తున్నాడు జయంత్. కిల్లింగ్ వీరప్పన్ డ్రమ్ కవర్ పేరుతో రూపొందించిన మ్యూజిక్ వీడియోట్రాక్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలిపాడు. మ్యూజిక్ డైరెక్టర్ రాజశేఖర్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సంగీత విద్వాంసులు జయంత్‌ను అభినందించారు. 2017లో నల్సార్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన విన్నోవ్ కార్యక్రమంలో బాటిల్ ఆఫ్ బ్యాండ్స్ విన్నర్‌గా నిలిచాడు. ముంబైలో జరిగే డ్రమ్మింగ్ వర్క్‌షాప్‌లకు ముఖ్యఅతిధిగా హాజరై తన కంటే పెద్దవారికి సైతం శిక్షణ ఇస్తున్నాడు. ఇండీవుడ్ నేషనల్ టాలెంట్‌హంట్ -2018 సంవత్సరానికిగాను సోలో మ్యూజిక్ విభాగంలో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచాడు. ఫ్యూజన్ మ్యూజిక్ ఆల్బమ్‌ను తయారు చేసేందుకు జయంత్ ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దీనికి నునొ(న్యూక్లియర్ నోట్స్) బ్యాండ్ అని పేరు పెట్టాడు.

బ్రాండ్ అంబాసిడర్‌గా..

ibr-medal-pic
నా పూర్తి పేరు జయంత్ శ్రీసాయి కృష్ణ. మిడి (మ్యూజికల్ ఇన్‌స్ట్రూమెంట్ డిజిటట్ ఇంటర్ ఫేస్) విభాగంలో డ్రమ్స్‌ను ఉపయోగించి ప్రత్యేకంగా మ్యూజిక్ ట్రాక్ కంపోజ్ చేసిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిని. అందుకుగాను 2019 ఫిబ్రవరి 28న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ డ్రమ్మర్‌గా స్థానం కల్పించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో 10వేల మంది చిన్నారులతో తెలంగాణ వండర్ కిడ్స్ పేరుతో ర్యాంప్ వాక్ జరుగనున్నది. ఈ ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమానికి మ్యూజిక్ కంపోజ్ చేసి అందించనున్నాను .తెలంగాణ వండర్ కిడ్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తాను. భవిష్యత్‌లో నా సొంతంగా ఓ బ్యాండ్‌ను తయారు చేసుకొని సరికొత్త మ్యూజిక్‌ను అందించాలని ఉంది. సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేయాలనుకుంటున్నా. నా ప్రతి అడుగు నా లక్ష్యం వైపే. నా సంగీతంతో సంచలనం సృష్టించాలనుకుంటున్నా. చదువులోనూ ముందంజలో ఉంటూ పదోతరగతిలో 85 శాతం మార్కులతో పాసయ్యాను. నా వెన్నంటి మా కుటుంబం సభ్యుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది.

-జయంత్ చల్లా, యంగెస్ట్ డ్రమ్మర్-పసుపులేటి వెంకటేశ్వరరావు
-గడసంతల శ్రీనివాస్

309
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles