సుర్.్ర. సూపర్!


Thu,July 18, 2019 01:21 AM

soup
చినుకులు అప్పుడప్పుడూ పలుకరిస్తున్నా.. సాయంత్రం కాస్త చల్లబడి.. మనసు సేదతీరేలా చేస్తుంది ప్రకృతి.. ఈ ఆనందం రెండింతలు కావాలంటే.. ఒంట్లోకి కాస్త వేడిగా జుర్రుకునేలా ఏదైనా ఉంటే.. అబ్బా.. ఆలోచనే సూపర్ అనిపిస్తుంది కదా! సుర్‌మ్రంటూ పొగలు కక్కే సూప్‌లు.. ఈ కాలంలో మంచి ఉపశమనాన్నిస్తాయి.. అందుకే ఆ వెరైటీలనే మీకందిస్తున్నాం.. ఆస్వాదించండి..

ప్రాన్ లెమన్ సూప్

prawn-lemon

కావాల్సినవి :

రొయ్యలు : ఒక కప్పు
నిమ్మకాయలు : 2
కొత్తిమీర : చిన్న కట్ట
పచ్చిమిర్చి : 2
క్యాబేజీ తురుము : పావు కప్పు
క్యారెట్ : 1
కార్న్‌ఫ్లోర్ : 2 టీస్పూన్స్
నూనె : 1 1/2 టీస్పూన్స్

తయారీ :

రొయ్యలను కొంచెం ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ రసం తీసి పెట్టాలి. క్యాబేజ్, క్యారెట్‌లను సన్నగా, పొడవుగా కోసుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌లో కొన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలిపి పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసి.. క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో ఉడికించిన రొయ్యలను వేసి కలుపాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత.. నీరు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా మరగబెట్టాలి. నీరు మరుగుతున్నప్పుడు కొత్తిమీర, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి తగినంత చిక్కదనం వచ్చేవరకు ఉంచి దించేయాలి. ఈ సూప్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

మిన్స్‌డ్ మష్రూమ్ సూప్

minced-mushroom

కావాల్సినవి :

మష్రూమ్స్ : 100 గ్రా.
బటర్ : 3 టీస్పూన్స్
క్యారెట్ : 1
ఉల్లిగడ్డ : 1 (చిన్నది)
మిరియాలు : అర టీస్పూన్
పలావు ఆకు : 1, క్రీమ్ : 50 మి.లీ. మైదా : 2 టీస్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

మష్రూమ్స్‌ని శుభ్రం చేసి ఉడికించాలి. వీటిని కీమా చేసుకొని పక్కన పెట్టాలి. కడాయిలో బటర్ కరిగించి మైదాను దోరగా వేయించాలి. వేరొక పాన్ మరికొంత బటర్ వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిరియాలు, పలావు ఆకు వేసి దోరగా వేయించాలి. వేగుతున్న దీంట్లో మైదా వేసి నీరు పోసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇవి మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోయాలి. ఈ గిన్నెను మళ్లీ స్టౌ మీద పెట్టి అందులో మష్రూమ్స్, క్రీమ్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చిక్కబడేంత వరకు ఉంచి దించేయాలి. అంతే.. టేస్టీ సూప్ మీ నోరూరిస్తుంది.

వెజ్ క్లియర్ సూప్

veg-clear

కావాల్సినవి :

క్యారెట్ : 1, బీన్స్ : 2, గోబీ : పావు కప్పు ముక్కలు,
మష్రూమ్స్ : 3, బేబీకార్న్ : 1, చక్కెర : చిటికెడు, ఉప్పు : తగినంత, స్ప్రింగ్ ఆనియన్ : గార్నిష్ కొరకు

తయారీ :

క్యారెట్, బీన్స్, గోబీ, మష్రూమ్, బేబీకార్న్ సన్నగా, సమానంగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీటిని మరిగించి తగినంత ఉప్పు, చక్కెర వేయాలి. కాసేపు మరిగాక.. అందులో క్యారెట్, బీన్స్, గోబీ, మష్రూమ్స్, బేబీకార్న్ వేసి బాగా ఉడికించుకోవాలి. దీన్ని ఒక బౌల్‌లో పోసి స్ప్రింగ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేయాలి. దీన్ని ఏదైనా స్నాక్స్‌తో పాటు సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

సిల్వర్ చికెన్ సూప్

silver-chicken

కావాల్సినవి :

చికెన్ బోన్‌లెస్ : అర కప్పు
క్యాబేజీ తురుము : అర కప్పు
క్యారెట్ తురుము : ఒక కప్పు
పచ్చిమిర్చి : 2
కార్న్‌ఫ్లోర్ : 2 టీస్పూన్స్
కొత్తిమీర : చిన్న కట్ట
వెనిగర్ : ఒక టీస్పూన్
చక్కెర : పావు టీస్పూన్
కోడిగుడ్డు : 1 (తెల్లసొన)
నూనె : అర టీస్పూన్
ఉప్పు : తగినంత

తయారీ :

చికెన్‌ని చాలా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టాలి. ఎలా అంటే.. తెల్లని నురగ వచ్చేవరకు అలా చేయాలి. ఇప్పుడు గిన్నెలో నూనె పోసి చికెన్, క్యాబేజ్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక.. నీళ్లు పోసి మరిగించాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత వెనిగర్, ఉప్పు, చక్కెర, కార్న్‌ఫ్లోర్ వేసి చిక్కబడేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, గుడ్డు తెల్లసొనని వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. టేస్టీ.. సూప్ రెడీ!

టమాటా ఎగ్‌డ్రాప్ సూప్

tomato-egg-drop

కావాల్సినవి :

టమాటాలు : 250 గ్రా., బటర్ : 3 టీస్పూన్స్
మైదా : 2 టీస్పూన్స్ , చక్కెర : చిటికెడు ,
పలావు ఆకు : 1, మిరియాలు : అర టీస్పూన్
క్యారెట్ : 1, ఉల్లిగడ్డ : 1 (చిన్నది)
కోడిగుడ్డు : 1 (తెల్లసొన)
ఉప్పు : తగినంత

తయారీ :

టమాటాలను స్లయిస్‌లుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలను పెద్దగా కట్ చేయాలి. కడాయిలో బటర్ వేసి.. అందులో మైదా దోరగా రంగు మారిపోకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనిని కాసేపు చల్లారనివ్వాలి. గిన్నెలో బటర్ కరిగించి మిరియాలు, పలావు ఆకు, క్యారెట్, ఉల్లిపాయలు దోరగా వేయించి, సన్నగా తరిగిన టమాటాలు వేసి వేగనివ్వాలి. దీంట్లో కొంచెం నీరు పోసి మరిగించాలి. ఇప్పుడు ఇందులో దోరగా వేయించిన మైదాని వేసి కలుపాలి. కొంచెం చిక్కబడిన తర్వాత దించేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ వడకట్టిన నీటిని మళ్లీ మరిగించి, దాంట్లో ఎగ్ వైట్ వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి.. వేడి.. సూప్ అందరికీ సూపర్‌గా నచ్చుతుంది.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles