చాలా ఇచ్చేస్తున్నాం..


Wed,July 24, 2019 12:45 AM

FaceApp
వయసుకు సంబంధించిన ఎన్నో యాప్స్ ఉండగా ఫేస్‌యాప్ ఎందుకు ట్రెండ్ అయింది? నాలుగైదు రోజుల్లోనే ఈ యాప్ ఎందుకింత వైరల్ అయింది? సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా ఎలా వాడగలిగారు? ప్రైవసీ పాలసీ చూడకుండా ఎలా అనుమతించాలి? ఇలాంటి సందేహాలకు తావివ్వకుండా చాలామంది ఫేస్‌యాప్‌లో మునిగి ముసలివాళ్లు అయిపోయారు. కానీ ఈ యాప్ చుట్టూ పెద్ద వివాదమే నడుస్తున్నది. ఇది ముసలి తనంలోకి కాదు.. యూజర్‌ను ముప్పులోకి తీసుకెళ్తుందని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.


రెండేండ్ల క్రితమే FaceApp రిలీజ్ అయింది. కానీ ఉన్నట్టుండి ఈ వారం రోజుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఎక్కువ బూస్టింగ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ చేయడంలో డెవెలపర్ కంపెనీ సక్సెస్ అయింది. యూజర్ డేటాను కూడా సేకరించడం ఆ కంపెనీ స్ట్రాటజీ అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. ఈ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేసి వాడుతున్నంత సేపు గోప్యంగా ఉపయోగిస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఆఫొటోలు యూజర్‌కు తెలియకుండా ఎక్కడో ఒక చోట ఎవరో బహిరంగంగా ఉపయోగించుకోవచ్చు అని మీరు ఊహించి ఉండరు! ఇది నిజం..! టర్స్ అండ్ కండీషన్స్‌లో ఇది క్లియర్‌గా ఉంది. యూజర్ నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తారో ముందే ఆ నిబంధనల్లో పొందుపరిచారు. వాటిని పరిశీలించకుండా ఆక్సెప్ట్ చేసి యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడంతో ఈ గోప్యత సమస్య వస్తున్నది..
FaceApp1

ఏంటీ ఫేస్‌యాప్?

జనవరి 2017లో ఫేస్‌యాప్ రిలీజ్ అయింది. వైర్ లెస్ ల్యాబ్ అనే రష్యన్ కంపెనీ దీన్ని డెవెలప్ చేసింది. యూజర్ ఇచ్చిన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో యవ్వనంగా, వృద్ధాప్యంగా మారుస్తుంది. మెషీన్ లెర్నింగ్ పవర్‌తో ఒక మ్యాజిక్‌లా ఈ యాప్ రన్ అవుతుంది. కంప్యూటింగ్‌లో ఇది విస్తృతంగా విస్తరించే టెక్నిక్. అప్‌లోడ్ చేసిన ఫొటోకు నవ్వులు జోడించడం, కండ్లద్దాలు, వివిధ రకాల ఫిల్టర్లు అప్లే చేసుకొనే ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని చూపించే ఫీచర్ మేజర్‌గా ట్రెండింగ్‌లో ఉంది. కొన్ని వేల వృద్దుల ఫొటోలతో ముందే ట్రెయిన్ చేసి ఉంచడంతో ఈ యాప్ స్పీడ్‌గా పని చేస్తుంది. ఫేస్‌యాప్ అల్గరిథమ్ ఓ ఫొటోను తీసుకొని యూజర్ కోరుకున్నట్టుగా మార్చి ఇస్తుంది. డీప్ జెనరేటీవ్ కన్వొల్యూషన్ న్యూరల్ నెట్‌వర్క్ ద్వారా ఇది పని చేస్తుంది. భవిష్యత్‌లో ఎలా ఉంటారన్న దగ్గర్నించి జుట్టు రంగు, గడ్డం మార్చడం వరకూ ఏదైనా ఫేస్‌యాప్‌తో సాధ్యం. మగవాళ్లను ఆడవాళ్లుగా, ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే స్వాప్ జెండర్ ఫీచర్ కూడా ఉంది. భవిష్యత్‌లో ఎలా ఉంటారో, ైస్టెల్ మార్చితే ఎలా కనిపిస్తారో తెలుసుకొనేందుకు చాలామంది ఫేస్‌యాప్‌ను వాడుతున్నారు. అవుట్‌పుట్ ఫొటోను చూసి యూజర్ ఆశ్చర్యపోవాల్సిందే. ఒకవేళ ఇప్పటి వృద్ధుల యవ్వనపు ఫొటోలను ప్రాసెస్ చేసినా అచ్చం ఇప్పుడు వ్యక్తి ఎలా ఉన్నాడో అలానే చూపిస్తుంది.
FaceApp2

ప్రైవసీ పాలసీలో ఏముంది?

ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా ప్రైవసీ పాలసీ చదివే అలవాటు దాదాపు ఎవరికీ ఉండదు. ఫేస్‌యాప్ యూజర్‌ను ఎలాంటి అనుమతి అడిగిందో చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది. అగ్రీపైన క్లిక్ చేయగానే.. యూజర్ కంటెంట్ అంతా షేర్ యాప్ చేసుకోవచ్చు. యూజర్ పేరు. కుకీస్, లొకేషన్ డాటా, యూజింగ్ డేటా అంతా కలెక్ట్ చేసుకుంటుంది. ఫేస్ యాప్ సర్వర్లు లాగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అటోమేటిక్‌గా రికార్డ్‌గా చేసుకుంటాయి. యూజర్ వెబ్ రిక్వెస్ట్, ఐపీ అడ్రస్, బ్రౌజర్ టైప్, రిఫర్ పేజీలు, యూఆర్‌ఎల్, డొమైన్ పేర్లు, ల్యాండింగ్ పేజీలు, విజిటింగ్ పేజీలు ఇలా అనేక సమాచారం ఫేస్‌యాప్ తెలుసుకొనే వీలుంది. ఒకసారి ఫేస్‌యాప్‌కు యాక్సెస్ ఇస్తే అది శాశ్వతంగా ఉంటుంది. అప్‌లోడ్ చేసే ఫొటోలు కూడా ఫేస్‌యాప్ చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఆ ఫొటోలను ఒక్కడైనా, ఎందుకోసమైనా బహిరంగంగా ఉపయోగించుకోవచ్చు. ఇవ్వన్నిటికీ యూజర్ ముందే ఒప్పుకున్నట్టు అగ్రీ బటన్ నొక్కుతాడు కాబట్టి ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. అందుకే దీన్ని వాడకం పట్ల జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. అట్లాగే ఫేస్ యాప్ రిలీజ్ అయిన 2017లోనే వివాదాలను ఎదుర్కొన్నది. దీంట్లోని ఎథ్నిసిటీ ఫిట్టర్స్‌గురించి వివాదాలు వచ్చాయి. మనుషుల జాతిని ఎడిట్ చేసే ఫీచర్ ఇది. దీనిపై విమర్శలు రావడంతో ఆ కంపెనీ క్షమాపణలు కోరింది. తర్వాత ఆ ఫీచర్‌ను తీసేసింది.

ఏం ఇస్తున్నాం? ఏం తీసుకుంటుంది?

ఇదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఈ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ అయి ప్రాసెస్ అయిన తర్వాత డౌన్‌లోడ్ అవుతుంది. ఒక ఫొటోనే కదా అప్‌లోడ్ చేసేది అని యూజర్ అనుకోవచ్చు. కానీ సెక్యూరిటీ సంస్థలు అంటున్న విషయాల ప్రకారం.. ఇది చాలా డేంజర్. ఎంతా అంటే అమెరికా సెనేట్ ఈ యాప్‌పై విచారణ జరపాలని ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)ని ఆదేశించింది. దీన్ని ఒక్కసారి ఫోన్‌లోకి అనుమతివ్వగానే యూజర్ కంటెంట్‌ను షేర్ చేసేందుకు ఈ యాప్‌కు అనుమతి ఉంటుంది. ఫోన్ గ్యాలరీలోని అన్ని ఫొటోలను, డేటాను ఈ యాప్ తీసుకుంటుంది. యూజర్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గ్యాలరీ డేటాను సేకరిస్తుంది. అట్లాగే ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లను రీడ్ చేయగలదు. తర్వాత ఇవే నోటిఫికేషన్లను ప్రకటనల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రసుత్తం జరుగుతున్న వివాదం గురించి కంపెనీ స్పందించింది. అప్‌లోడ్ చేసిన ఫొటోలు మాత్రమే కంపెనీ క్లౌడ్‌లోకి వెళ్తాయనీ, అవి 48 గంటల్లో తొలగిపోతాయనీ చెప్తున్నది.

- వినో

4117
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles