చిరు వ్యాపారులకు నెలనెలా పింఛన్


Sat,July 27, 2019 12:35 AM

పదవీవిరమణ తర్వాత ఉద్యోగులకు పింఛన్ అందుతుంది. అంటే, దాదాపు అరవై ఏండ్లు దాటిన తర్వాత, ఉద్యోగులు నెలకు ఎంతోకొంత ఆదాయం చేతికొచ్చేలా ప్రణాళికలు రచిస్తారు. కానీ, చిరువ్యాపారుల సంగతేమిటి? దుకాణాల్ని నిర్వహించేవారు, రైస్ మిల్లు యజమానులు, మెకానిక్ షెడ్డుల ఓనర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కమిషన్ ఏంజెంట్లు, చిన్న హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు.. ఇలా కాస్త చిన్న స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహించేవారు.. ఇక నుంచి అరవై ఏండ్ల తర్వాత పింఛన్‌ను అందుకోవచ్చు. అదెలా అంటారా? ఇటీవల ప్రారంభమైన ప్రధానమంత్రి లఘువ్యాపారి మాన్-ధన్ యోజన 2019 అనే పథకం ద్వారా ఈ ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఈ పెన్షన్ ఫండ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు ఫండ్ మేనేజర్‌గా ఎల్‌ఐసీని నియమించారు.
pension-monthly
ఏటా రూ.1.5 కోట్ల టర్నోవర్‌ను మించని వ్యాపారులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. వయసు 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల దాకా ఉన్నవారు తమ బ్యాంకు పొదుపు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు, స్వయం ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ, ఇప్పటికే ఎవరైనా నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద చేరి ఉన్నట్లయితే వారు అనర్హులుగా పరిగణిస్తారు. ఒకవేళ, ఎవరైనా పదేండ్ల లోపు ఈ పథకం నుంచి పక్కకు జరిగితే, తను చెల్లించిన మొత్తానికి, అదనంగా కొంత బ్యాంకు వడ్డీ రేటును లెక్కించి చెల్లిస్తారు. పదేండ్ల కంటే ఎక్కువ కాలానికి సొమ్ము చెల్లించిన వ్యక్తి.. అరవై ఏండ్ల వయసు రాక ముందే.. ఈ పథకం నుంచి వెనక్కి వచ్చేయాలని భావిస్తే.. అప్పటివరకూ చెల్లించిన సొమ్ముపై పింఛన్ ఫండ్ ద్వారా వచ్చిన వడ్డీని లెక్కగట్టి అందజేస్తారు.


నెలకు ఎంత చెల్లించాలి?

ఈ పథకం కింద చేరడానికి చిరువ్యాపారుల వయసును బట్టి నెలసరి ప్రీమియం ఆధారపడుతుంది. ఉదాహరణకు, 18 ఏండ్ల వయసు గల అబ్బాయి లేదా అమ్మాయి ఈ పథకంలో చేరాలంటే, తొలుత రూ.55 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 29 ఏండ్లు గలవారు నెలకు రూ.100 కట్టాలి. 40 ఏండ్ల వ్యక్తి అయితే నెలకు కట్టాల్సింది కేవలం రెండు వందలు మాత్రమే. ఇందులో చేరిన వ్యక్తులు ప్రతినెలా చెల్లించే సొమ్ము బట్టి, కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద అంతే మొత్తాన్ని జత చేస్తుంది. ఉదాహరణకు 18 ఏండ్ల వయసు గలవారు నెలకు రూ.55 చెల్లిస్తే, అంతే మొత్తాన్ని కేంద్ర తన వాటాగా జమ చేస్తుంది.

ఒకవేళ మరణిస్తే ఎలా?

ఈ పథకంలో చేరిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే.. అప్పటివరకూ చెల్లించిన సొమ్ముకు బ్యాంకు వడ్డీ జోడించి వెనక్కి ఇచ్చేస్తారు. లేదా మరణించిన వ్యక్తి వయసును బట్టి పెన్షన్ ఫండ్ వడ్డీ లెక్కగట్టి అందజేస్తారు. అలా కాకుండా, ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తామని చెప్పినా అంగీకరిస్తారు. అయితే, ఈ పథకం కింద పింఛన్ అందుకునే వ్యక్తి దుర్మరణం చెందితే, కేవలం యాభై శాతం పింఛన్ మాత్రమే అతని భార్యకు అందజేస్తారు. అరవై ఏండ్లు రాక ముందే, అర్హుడైన వ్యక్తికి శాశ్వతంగా వికలాంగుడైతే, ఆయా పథకాన్ని కొనసాగించొచ్చు. లేకపోతే, చెల్లించిన కాలానికి గాను సొమ్ము లెక్కగడతారు. ఈ పథకంలో చేరిన వ్యక్తికి అరవై ఏండ్లు వచ్చాక, ఎల్‌ఐసీ ద్వారా నెలకు రూ.3,000 పింఛన్‌ని అందజేస్తారు.

797
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles