ఇల్లు.. ఆఫీసు.. పక్కపక్కనే


Sat,July 27, 2019 12:43 AM

-వాక్ టు వర్క్ కాన్సెప్టుకు ప్రత్యేక ప్రోత్సాహం
-డెవలపర్లకు ప్రత్యేక రాయితీలు
- సిద్ధమవుతున్న సరికొత్త పాలసీ

మనం నివసించే ఇల్లు.. పని చేసే ఆఫీసు.. పక్క పక్కనే ఉంటే ఎంత బాగుంటుంది కదా? వాహనాలు బయటికి తీయనక్కర్లేదు.. పెట్రోల్ ఖర్చూ ఉండదు.. ట్రాఫిక్‌లో ఇరుక్కపోనక్కర్లేదు.. పైగా, రవాణా సమయమెంతో ఆదా అవుతుంది. అంతేకాదు, తీరిక వేళల్లో షాపింగ్ చేయడానికి మాళ్లు, సినిమాలకు మల్టీప్లెక్స్ థియేటర్లు, అత్యవసరాల్లో ఆస్పత్రులు.. ఇవన్నీ ఒకే ఆవరణలో ఉంటే.. జీవితమెంతో సాఫీగా సాగిపోతుంది. ఇలా పట్టణాల్లో నివసించే ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పును తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాక్ టు వర్క్ కాన్సెప్టును ప్రోత్సహిస్తూ కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. వీటిని నిర్మించాలని గతంలో కేవలం జీవోలను తీసుకొచ్చాయి అప్పటి ప్రభుత్వాలు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వాక్ టు వర్క్ కాన్సెప్టు తరహా
నిర్మాణాల్ని ప్రోత్సహించడానికి ఏకంగా పురపాలక చట్టంలో పొందుపర్చడం విశేషం.

BIG-CT
తెలంగాణ అర్బన్ ప్రాంతాల్లో వాక్ టు వర్క్ కాన్సెప్టును ప్రోత్సహించాలని ప్రభుత్వం గట్టిగా తీర్మానించుకున్నది. ఈ క్రమంలో ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. పైగా వీటిని ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో అభివృద్ధి చేసేందుకు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులను ప్రోత్సహిస్తున్నది. వీటిని అభివృద్ధి చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుండటంతో.. ఈ తరహా టౌన్‌షిప్పులను చేపట్టడానికి ముందుకొచ్చే డెవలపర్లకు ప్రత్యేక రాయితీలను అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. ఇందుకోసం ఏకంగా సరికొత్త నిబంధనల్ని రూపొందించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం హైదరాబాద్ జనసాంద్రత విషయానికి వస్తే.. కిలోమీటర్‌కు 11 వేల మంది ఉన్నారని సమాచారం. ఇది రానున్న రోజుల్లో ఎంతలేదన్నా 20 వేలకు చేరుకుంటుందని అంచనా. అదే గనక జరిగితే హైదరాబాద్ మొత్తం అస్తవ్యస్తంగా మారే ప్రమాదమున్నది. ఈ అంశాన్ని ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్పులను నిర్మించి.. నగరం మీద ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, గజ్వేల్ వంటి పట్టణాల్లో వీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

కోకాపేట్ హాట్ గురూ..

పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఈ ప్రాంతంలో వచ్చే ఐదు నుంచి ఏడేండ్లలోపు కొత్త టౌన్‌షిప్పును ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ఇందులో దాదాపు 9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్క్ స్పేస్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా అందరి దృష్టి కోకాపేట్ మీద పడింది. వాస్తవానికి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకు అతి చేరువలో కోకాపేట్ ఉండగా.. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. నగరంలోని పేరెన్నిక గల సంస్థలు కోకాపేట్‌లో బడా ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇక్కడ్నుంచి అటు గచ్చిబౌలికి ఇటు శంషాబాద్ విమానాశ్రయానికి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. పశ్చిమంలో కీలకమైన ప్రాంతంలో కోకాపేట్ ఉండగా.. ఇప్పుడీ ప్రాంతం మరింత హాట్ లొకేషన్‌గా అభివృద్ధి చెందనున్నది. హైటెక్ సిటీ నుంచి పాఠాలను నేర్చుకున్న తర్వాతే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు తరహాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి కొత్త టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తారు. వాక్ టు వర్క్ కాన్సెప్టు తరహాలో ఇది ఏర్పాటు కానున్నది. ఈ తరహా కట్టడాల్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చే డెవలపర్లకు ప్రత్యేక ప్రోత్సాహాకాల్ని అందజేస్తారు. అయితే, కోకాపేట్‌లో స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు.. ప్రస్తుతమున్న రేట్లను పూర్తిగా పరిశీలించాకే ఫ్లాట్లను కొనుగోలు చేయాలి.

హమారా షహర్.. మహాన్!

2019 నుంచి 2035 మధ్యలో ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ప్రముఖంగా నిలుస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అభివర్ణించింది. ఐక్యరాజ్యసమితి 2018లో విడుదల చేసిన నివేదికలో నగర జనాభా 56 లక్షల నుంచి 95 లక్షలకు పెరిగిందని వెల్లడించింది. ఇది 2030 నాటికల్లా కోటీ ఇరవై ఎనిమిది లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భాగ్యనగరం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేండ్లలో ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫార్మా సంస్థలను విశేషంగా ఆకర్షించింది.

రిటైల్ జోరు..

హైదరాబాద్‌లో ఐటీ రంగం విశేషంగా మెరుగు అవుతుండటంతో రిటై ల్ రంగం అభివృద్ధిలో దూసుకెళుతున్నది. దీంతో, ప్రపంచంలో పేరెన్నిక గల బ్రాండ్లు ఇక్కడికొస్తున్నాయి. ఈ క్రమంలో సరికొత్త షాపింగ్ మాళ్లు ఏర్పాటవుతున్నాయి. 2016 నుంచి షాపింగ్ మాళ్లలో అద్దెలకు ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతున్నది. 2030 నాటికల్లా నగరంలో సుమారు ఒక కోటీ నుంచి కోటీ ఇరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త షాపింగ్ మాళ్లకు గిరాకీ ఉన్నది. ఇప్పటికే 70 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇవి నిర్మాణంలో ఉండటం గమనార్హం. 2030 నాటికల్లా రిటైల్ షాపింగ్ మాళ్ల సంఖ్య రెండింతలు పెరిగే ఆస్కారమున్నది. కనీసం కోటీ అరవై లక్షల నుంచి కోటీ ఎనభై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాళ్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త మాళ్లు తూర్పు, ఉత్తర హైదరాబాద్లోని ఈసీఐఎల్, దిల్‌సుక్‌నగర్, నిజాంపేట్, ఎల్‌బీనగర్, మియాపూర్, మదీనాగూడ, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి.
WALK-TO-WORK1

హైదరాబాద్‌కే ఆదరణ..

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్కసారి పట్టణాభివృద్ధిలో జోరు పెరిగింది. నగరాలకు కీలకమైన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసేందుకు పెద్దపీట వేసింది. అందుకు తగ్గ నిధుల్ని కేటాయించింది. గ్రీన్ కవర్‌ను పెంచడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నది. ఇంకా, ఏయే అంశాల వల్ల హైదరాబాద్‌కు అదరణ పెరుగుతుందంటే..
-13 ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పలు బిజినెస్ స్కూళ్లకు హైదరాబాద్ కేంద్రబిందువు.
-ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్ధుల సంఖ్య: 4000 మంది
-గ్రీన్‌కవర్‌ను 24% నుంచి 33% పెంచేందుకు కృషి
-180 ఫారెస్ట్ బ్లాకుల్లో 230 కోట్ల మొక్కల్ని నాటడానికి పక్కా ప్రణాళికలు
-40 ఎలక్ట్రిక్ బస్సుల రంగప్రవేశం. త్వరలో మరికొన్ని
-2009-19మధ్యకాలంలో.. హైదరాబాద్‌లో 65% పెరిగిన ఆస్తుల ధరలు
-ఓఆర్‌ఆర్, మెట్రో వల్ల పెరిగింది.. 50%
-2009- 19 మధ్యలో.. ఓఆర్‌ఆర్ 1 ఫేజు పూర్తయ్యాక.. గచ్చిబౌలి చుట్టుపక్కల వచ్చిన కొత్త ఫ్లాట్ల సంఖ్య.. 28,000
-ఇదే కాలంలో కొండాపూర్ చుట్టుపక్కల ఆరంభమైన ఫ్లాట్లు.. 17,000

డెవలపర్లకు ప్రత్యేక రాయితీలు..

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులకు సంబంధించి ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నాం. వీటిని అభివృద్ధి చేసేందుకు డెవలపర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలను అందించాలని భావిస్తున్నాం. ప్రజలు రవాణా కోసం తమ సమయాన్ని వృథా చేయకుండా ఉండటానికి, నగరంపై ఒత్తిడి తగ్గేందుకు వాక్ టు వర్క్ కాన్సెప్టును అభివృద్ధి చేస్తున్నాం. ఈ పాలసీ వచ్చాక.. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పుల్లో నివాస సముదాయాలతో పాటు స్కూళ్లు, ఆరోగ్య సదుపాయాలు, వాణిజ్య సముదాయాలు వంటివన్నీ నివాసితులకు అందుబాటులో ఉంటాయి.
- అరవింద్ కుమార్, ముఖ్యకార్యదర్శి, పురపాలక శాఖ

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

ప్రభుత్వం హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికొచ్చి స్థిరపడే వారి సంఖ్య పెరుగుతున్నది. మరి, వీరందరూ సాఫీగా భాగ్యనగరంలో నివసించాలన్న.. రవాణా తిప్పలు తగ్గాలన్నా.. రానున్న రోజుల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పుల సంఖ్య పెరగాల్సిన అవసరమున్నది. పైగా, హైదరాబాద్‌మీద ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గాల్సిన అవసరం ఉన్నది. అందుకే, ప్రభుత్వం వాక్ టు వర్క్ కాన్సెప్టు తరహాలో టౌన్‌షిప్పులను ప్రోత్సహించడానికి చట్టంలో పొందుపర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్

858
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles