వయసు చిన్నదే.. ఆశయం పెద్దది


Sun,July 28, 2019 12:48 AM

చిన్నవయసులో ఆటలు అందరూ ఆడుతుంటారు. పెరిగేకొద్ది వాటిమీద ఆసక్తి, పట్టు పెరుగుతుంది. పెద్ద పోటీల్లో పాల్గొనాలని, విజయం సాధించాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి అమ్మాయిలకు ఇది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు స్పోర్ట్స్‌లో రాణించాలంటే కష్టమనే చెప్పాలి. ఈ పరిస్థితులు ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయంటున్నది 17 ఏండ్ల నందితా ఆనంద్.. తనకు ఇష్టమైన స్పోర్ట్స్‌కు దూరమైన పరిస్థితులను, తోటి మహిళా అథ్లెట్ల అవేదనను షార్ట్ ఫిలిమ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు కృషి చేసింది ఈ యువతి.
nandhitha-Allari
పాఠశాలలో చదువుకునేటప్పుడు ఆమెకు ఆటలంటే ఇష్టం. కాలేజీలోకి అడుగుపెట్టాక స్టేట్ అథ్లెట్‌గా పేరు తెచ్చుకుంది. కానీ 17 ఏండ్లు నిండేసరికి అడ్డంకులు ఎదురయ్యాయి. చదువు, అమ్మానాన్న, అందని ప్రోత్సాహం.. ఇలా కారణాలేవైనా అమెకు ఇష్టమైన క్రీడలకు దూరం అవ్వాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది? తనలాంటి అమ్మాయిలు ఎందుకు క్రీడారంగంలో ఉండలేకపోతున్నారు? తెలుసుకుంది.. ఆ విషయాలనే షార్ట్‌ఫిలిమ్‌గా తీసింది. వారంరోజుల కిందటే యూట్యూబ్‌లో రిలీజ్ చేసి అందరినీ ఆలోచింపజేస్తున్నది. ఆమె తీసిన షార్ట్ ఫిలిమ్ 9.35 నిమిషాలే.. కానీ 17 ఏండ్ల వయసులో ఎదుర్కొన్న ఘటనలను, వెంటాడిన అనుభవాలను ఆమెలాంటి క్రీడాకారుల పరిస్థితిని బయటకు తెలియజేయాలనుకున్నది. ఆ ఆలోచన రాగానే ఫిలిమ్ మేకింగ్‌లో అనుభవం ఉన్న ఆమె బెస్ట్ ఫ్రెండ్‌తో విషయం చెప్పింది. ఫ్రెండ్ కూడా స్టేట్ అథ్లెట్ కావడంతో నందితా ఆలోచనను మెచ్చుకుంది. ఇలా షార్ట్‌ఫిలిమ్ మొదలు పెట్టారు. కెమెరాలు అద్దెకు తేచ్చింది. ఎలా తీయాలి, ఎవరిని సినిమాలో చూపించాలని నందిత అనుకుంది. వెంటనే మిగతా ఫ్రెండ్స్‌తో మాట్లాడి వారి సాయం తీసుకుంది.


ఏముంది ఈ షార్ట్ ఫిలిమ్‌లో...

రెడీ సెట్ గర్ల్ (Ready Set Girl) నందితా తీసిన షార్ట్ ఫిలిమ్. ఓ గ్రౌండ్‌లో ఓపెన్ అయిన ఈ షార్ట్ ఫిలిమ్ ఓ సందేశాన్ని, నందితా ప్రయత్నాన్ని, ప్రతిభను మన ముందు ఉంచుతుంది. కథలోకి వెళ్తే.. 17 ఏండ్ల వయసు వచ్చే సరికి 51 శాతం మంది బాలికలు స్పోర్ట్‌కు దూరం అవుతున్నారు. టీనేజ్ బాయ్స్ మాత్రం స్పోర్ట్స్‌లో బాగా ఉంటారు. కానీ బాలికలకు ఎలాంటి ప్రోత్సాహం ఉండదు. ఒక్కోసారి ఇంటి నుంచే చివాట్లు మొదలుపెడతారు. ఇంకా మహిళల సంగతి కూడా అంతే. కనీసం మైదానాల్లో మహిళా అథ్లెట్లకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు కూడా ఉండవనీ ఈ లఘుచిత్రంలో నందిత చెప్పగలిగింది. క్రీడాకారిణిలుగా ఉన్న కొంతమందితో వారి అనుభవాలను కెమెరా ముందు ఉంచింది. వారికి శిక్షణ, ప్రోత్సాహం విషయాల్లో ఎవరి సాయం ఉంటుంది? పురుషులకు, మహిళలకు క్రీడారంగంలో ఎంతటి తేడా ఉంటుందో వివరించింది. ఎలాంటి హడావుడి లేకుండా నందిత ప్రయత్నం, మహిళా అథ్లెట్ల అవేదన ఈ షార్ట్ ఫిలిమ్‌లో కనబడుతుంది. రానున్న రోజుల్లో క్రీడారంగంలో మహిళల పాత్ర వారికి ప్రోత్సాహం మెరుగవ్వాలనీ వాటి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తానని అంటున్నది నందిత. ఈమె తీసిన షార్ట్‌ఫిలిమ్‌ను ఇక్కడ చూడొచ్చు https://bit.ly/2MfdjfO

కుటుంబ ప్రోత్సాహం


నందిత ముంబైలోని ఓ కాలేజీలో డిప్లొమా చేస్తున్నది. పాఠశాలలో ఉన్నప్పుడు పరుగుల పోటీల్లో పాల్గొనేది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వంద, రెండొందల మీటర్ల పోటీల్లో ప్రతిభ కనబరిచేది. కానీ 17 ఏండ్లు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. వివిధ కారణాల వల్ల ఆమె స్పోర్ట్స్‌కు దూరమైనట్టు చెప్తున్నది. కానీ ఆమె ఆవేదన అక్కడితో ఆగలేదు. అది ఆమె ఒకదాని పరిస్థితి కాదనీ ఎందరో మహిళలు, టీనేజ్ అమ్మాయిల పరిస్థితి అని తెలుసుకుంది. అందుకే ఈ షార్ట్ ఫిలిమ్‌ను రూపొందించింది. నందిత కుటుంబం ఆర్ట్స్‌ను ప్రోత్సహించే నేపథ్యం కలిగి ఉంది. అందుకే ఈ షార్ట్ ఫిలిమ్ తీయడానికి వారి నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. వెంటనే ఆమె పనులు ప్రారంభించింది.
nandhitha-Allari1

షార్ట్‌ఫిలిమ్ తీస్తానని అనుకోలేదు

మన దేశంలో మహిళా అథ్లెట్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుసుకుంటే బాధగా అనిపించింది. స్వయంగా నేను కూడా అనుభవించాను. ఈ కారణాలే నన్ను ఈ షార్ట్ ఫిలిమ్ తీసేలా చేశాయి. నేను ఇలా ఒక షార్ట్‌ఫిలిమ్ తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పరిస్థితులే నాతో తీయించాయి. మన దేశంలో మహిళా అథ్లెట్ల పరిస్థితిని చిత్రీకరించాను. దీని కోసం నేను ఎక్కువ కష్టపడలేదు. కానీ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.
- నందిత

వినోద్ మామిడాల

519
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles