బాక్స్‌ఫిష్‌ల రూప నైపుణ్యం


Tue,July 30, 2019 12:43 AM

చేప మనిషికి ఈతను నేర్పినట్లే, కొన్ని రకాల మత్స్యాల రూప నైపుణ్యం శాస్త్రవేత్తలకు కొత్త యాంత్రిక శక్తిని, సాంకేతికతను అందిస్తున్నది. నీటిలో వేగంగా దూసుకుపోయే బాక్స్‌ఫిష్ జాతి చేపలను పోలిన కొన్ని కార్లు ఇవాళ వేగంలోను, ఇంధన పొదుపులోనూ అద్భుతాల్ని సృష్టిస్తున్నాయి.
hydrodynamic
చేపలన్నింటిలోకీ ఎల్లో బాక్స్‌ఫిష్‌లది ప్రత్యేక జాతి. సుమారు అర మీటరు (45 సెంటీమీటర్లు లేదా 18 అంగుళాలు) పొడవు వరకూ పెరిగే ఈ జాతిచేపలు మహాసముద్ర (పసిఫిక్, హిందూ, అట్లాంటిక్ వంటి) జలాల్లోనే కనిపిస్తాయి. బాల్యదశలో ఉండగా పసుపురంగును, వయసు పెరుగుతున్న కొద్దీ నీలం బూడిదరంగునూ పుణికి పుచ్చుకొనే వీటి రూప సామర్థ్యం అసాధారణం. విలక్షణ ఆకృతే దీనికి అంతటి జలశక్తి (Hydrodynamic)ని ఇచ్చిన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చేప సాంకేతికతను అందిపుచ్చుకొన్న ఇంజినీర్లు ఇప్పటికే కొన్ని ప్రత్యేక కార్లను తయారు చేశారు.

ఇతర చేపల వలె కాకుండా బాక్స్‌ఫిష్‌లు సాగరజలాల్లో ఎలాంటి ఒత్తిళ్లు, అవాంతరాలకు గురికావు. ఆహారవేటలో భాగంగా ఇవి చాలా వేగంగా ఈదేస్తుంటాయి. వీటి ఆకృతిని పోలిన శక్తిని ఆధారంగా చేసుకొనే ఆటోమొబైల్ ఇంజినీర్లు విలక్షణమైన కార్లను ఈమధ్య కాలంలో ప్రవేశపెట్టారు. ఇవి అతితక్కువ బరువుతో రెండే తలుపులను కలిగి ఉండడం విశేషం. ఎయిరో డైనమిక్స్ సాంకేతికతను ఇవి మించిపోయాయి. ఈ కార్లు అతి తక్కువ ఇంధన వ్యయంతో ఎంతో ఎక్కువ దూరాన్ని ప్రయాణించడంలో విజయం సాధించినట్లు నిపుణులు ప్రకటించారు. ఉదా॥కు ఒక గ్యాలెన్ (3.7 లీటర్లు) ఇంధనంతోనే 84 మైళ్ల దూరం వరకూ ప్రయాణించే శక్తిని వీటికి ఆపాదింపజేసినట్లు వారు చెబుతున్నారు. చిన్న ముఖం, వెడల్పయిన శరీరం, గుండ్రటి ఆకారంతో ఉండే బాక్స్‌ఫిష్‌ల ఈదే శక్తిని గుర్తుకు తెచ్చేలా ఒక ప్రముఖ కార్ల కంపెనీ (మెర్సెడెస్) తయారుచేసిన ఓ కారు వేగం గంటకు 118 మైళ్లుగా నమోదైనట్లు వారు వెల్లడించారు. ఇది కేవలం 8 సెకన్లలోనే 60 మైళ్ల (గంటకు) వేగాన్ని అందుకోగలదనీ అంటున్నారు. దీని డైరెక్ట్ ఇంజెక్షన్ డీజిల్ ఇంజిన్‌తో యూరోపియన్ రోడ్లపై 4.3 లీటర్ల ఇంధనంతో 100 కి.మీ. మేర ప్రయాణించవచ్చునని వారు అంటున్నారు.

బాక్స్‌ఫిష్‌లనే కాకుండా గుర్రాలు, దుప్పిలు, మగ గొర్రెలు, పక్షులు వంటి జంతువుల ఆకృతులు, పరుగుల శక్తి సామర్థ్యాల్ని ఆధారంగా చేసుకొని కూడా మరికొన్ని కంపెనీలు తమవైన కార్లను గత కొన్నాళ్లుగా ప్రవేశపెడుతున్నాయి. వాటిలో ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang అడవి గుర్రం), చెవెరొలెట్ ఇంపాలా (Chevrolet Impala కృష్ణజింక), డాడ్జ్‌రామ్ (Dodge Ram మగ గొర్రె), కోర్‌వెట్టీ స్టింగ్రే (Corvette Stingray చదును చేప), పోర్‌స్కీ కేయెన్ (Porsche Cayenne మొసలి), వోక్స్‌వేగన్ బీటిల్ (Volkswagen Beetle పురుగు), నిస్సాన్ బ్లూబర్డ్ (Nissan Bluebird నీలం రంగుపక్షి) వంటివి వున్నాయి.
-డా॥ రాజూరు రామకృష్ణారెడ్డి

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles