జంతు ఇంద్రియ జాలం!


Tue,July 30, 2019 12:49 AM

మనుషుల ఇంద్రియజ్ఞానాల్ని మించిన అద్భుతశక్తులు జంతువులకు ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి

సూక్ష్మజీవులు, చీమలు, ఈగలు, దోమల నుంచి మొదలుకొని చేప, సాలీడు, ఆక్టోపస్, పాములు, ఏనుగుల వరకు అనేక రకాల జంతువులు తమ మనుగడ కోసమైతేనేం, మరో కారణం వల్లనైతేనేం అసాధారణ ఇంద్రియజ్ఞానాల్ని, మానవాతీతమైన అద్భుతశక్తుల్నీ కలిగి ఉంటున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా రూఢీ పరిచారు. వాటి జీవన నైపుణ్యాల ముందు మన ఇంద్రియాల జ్ఞానం ఒక రకంగా పూర్తిగా దిగదుడుపేనని కూడా వారు తేల్చారు. మనకంటే అనేక రెట్లు అధిక జీవన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ జంతుజాలం నుంచి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది.
Elephant
మానవాభివృద్ధికి, వైజ్ఞానిక ప్రగతికి అడుగడుగునా ఆదర్శ నమూనాగా నిలుస్తున్న జీవజాతులు, వాటి శరీరధర్మాలు, నిర్మాణ తీరుతెన్నులపట్ల శాస్త్రవేత్తల పరిశోధనలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. మారుతున్న పర్యావరణ పరిస్థితులు ఒకవైపు కొన్ని జంతుజాతులకు ప్రాణాంతకమవుతుంటే, మరికొన్ని వాటిని అధిగమిస్తున్న తీరు అనూహ్యం. నిత్య జీవితంలో మనకు కనిపించే చాలావరకు జీవజాతులు తమ ఆహారాన్వేషణ, ప్రాణరక్షణకోసం అద్భుత ఇంద్రియశక్తులనే కనబరుస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అనేక జీవావరణాలు కనుమరుగవుతున్న తరుణంలో కొత్త పర్యావరణ పరిస్థితులలోనూ అవి అనూహ్యంగా మనుగడ సాగిస్తుండడం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

మనిషికి గల ఇంద్రియజ్ఞానాలు అయిదు (దృష్టి, వాసన, వినికిడి, రుచి, స్పర్శ) మాత్రమే. కానీ, కొన్ని రకాల జంతువులు వీటిని మించిన స్థాయిలో మరిన్ని ప్రత్యేక శక్తులనూ కలిగి ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. మనకు అసాధ్యమైన ఇంద్రియ శక్తులనూ అవి ప్రదర్శిస్తున్నాయని వారంటున్నారు. దృష్టిజ్ఞానం (Vision) లో అతినీల లోహిత (Ultraviolet), పరారుణ (Infrared), నిశీథి వీక్షణాల (Night-vision) ను, వినికిడి (hearing) లో అతి-అత్యంత సున్నిత (Ultra-Infra sounds) శబ్ద తరంగాలను, వాసన, రుచి, స్పర్శలలోనూ మనకంటే ఎన్నో రెట్లు అధికశక్తిని అవి కనబరుస్తున్నట్లు వారు గుర్తించారు. ఇంకా, విద్యుత్ వాహకగుణంతోపాటు అయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలను పసిగట్టడంలోనూ అనూహ్య సామర్థ్యాన్ని కనబరిచే జంతువులూ ఉన్నట్లు వారు వెల్లడించారు.
మనకున్న ఈపాటి ఇంద్రియశక్తులే గొప్పనుకుంటే ఇక పొరపాటే. మన చుట్టూ వున్న వృక్ష, పక్షి, జంతుజాలాల ఇంద్రియ జ్ఞానాల ముందు ఇవి అత్యల్పమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్ని లక్షలు, కోట్ల సంవత్సరాలుగా శరీరపరంగా మనకంటే ఎంతో చిన్నవైన ఈ జీవజాతులు భూమిపై మనుగడ సాగిస్తుండడం వెనుక వాటి జీవన నైపుణ్యాలే ప్రధాన కారణంగానూ వారు చెబుతున్నారు. అంతటి అతీత స్థాయిలో మనల్ని మించిన శక్తులు వాటికి ప్రకృతి సిద్ధంగానే లభించినా మానవాళి చర్యలవల్ల కొన్ని జాతులు నాశనమవుతూనే ఉన్నాయి. చీమలనుంచి ఏనుగులదాక కొన్ని జంతువులలోని శక్తియుక్తుల్ని తెలుసుకొన్నాకైనా వాటి సంరక్షణపట్ల సానుకూల దృక్పథాన్ని కనబరచవలసిన అవసరాన్ని అందరం గుర్తిద్దాం.

చీమ తన బరువుకన్నా సుమారు 20 రెట్లు అధిక బరువును మోసుకెళుతుంది. బెల్లం, చక్కెర, తేనె వంటి తీపి పదార్థాలు నేలపై ఎక్కడ పడినా కొద్ది నిమిషాలలోనే వాటిచుట్టూ ఎర్ర, నల్లచీమలు గుంపులు గుంపులుగా చేరుతాయి. వాటి వాసన శక్తి అంతటిది మరి. అలాగే, ఈగ గాలిలో ఎగిరే వేగం గంటకు సుమారు 4.5 మైళ్ల (7.5 కి.మీ.) దూరం. బాహ్య- పరాన్న సూక్ష్మజీవుల్లోని శక్తియుక్తుల గురించైతే చెప్పక్కర్లేదు. పాలను పెరుగుగా మార్చడం నుంచి ఎన్నో నైపుణ్యాలు. కాకపోతే, వాటిలో మంచితోపాటు చెడువీ లేకపోలేదు. మానవేతర జీవులు, జంతువులు ప్రదర్శించే ఇలాంటివన్నీ కొందరికి చాలా తేలిగ్గానే అనిపించవచ్చు. చిన్న శరీరానికి తగ్గట్టుగానే వాటి శరీర నిర్మాణ పోకడ ఉంటుందని, ఇది సహజమేనని సరిపెట్టుకొనే వాళ్లుంటారు. కానీ, మరికొన్ని జంతువుల విశేషాలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.

క్షీరదాలలో గుడ్లు పెట్టే జంతువులు చాలా అరుదు. ప్లాటిపస్ (Platypus) అనే అర్ధజలచరం, ఎచిడ్నస్ (echidnas) గా పిలిచే చీమలను తినే జంతువు.. ఈ రెండు మాత్రమే ఇలా గుడ్లు పెట్టే పాలిచ్చే జంతువుల (mammals) జాబితాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న వెన్నెముక లేని జీవుల్ని పట్టి తినడానికి ప్లాటిపస్ తన శరీరంలో అత్యున్నతంగా ఎదిగిన విద్యుత్ సంబంధమైన ఇంద్రియశక్తి (Electroreception) ని ఉపయోగించుకొంటున్నట్టు వారి పరిశోధనల్లో తేలింది. నీటి అడుగు నుండి విద్యుత్ సంకేతాల ద్వారా అది వాటిని పసిగడుతుందని అంటున్నారు. శబ్ద తరంగాల సంకేతాల (Echolocation)తో తాను వేటాడబోయే జీవి వున్న ప్రదేశాన్ని గబ్బిలాలు చీకట్లో సైతం గుర్తించేస్తాయి. వైపర్స్ (vipers), పైథాన్స్ (pythons), బోవస్ (boas) పేరున పిలిచే పాములకైతే మన అయిదు ఇంద్రియాలతోపాటు ఆరో ఇంద్రియమూ ఉంటుంది. అదేమంటే, కటిక చీకట్లో సైతం వీటికి దారి తెలుస్తుంది. పరారుణ (ఉష్ణ) వికిరణ శక్తి వల్లే వాటికి ఇది సాధ్యమవుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఆఖరకు పై కుటుంబానికే చెందిన కొన్ని రకాల గుడ్డి పాములు కూడా తాము వేటాడాల్సిన జీవుల్ని ఎంతటి చీకట్లోనైనా వెళ్లి పట్టేసుకుంటాయని వారు అంటున్నారు.

దృష్టి జ్ఞానంలో ఆక్టోపస్ శక్తి అసాధారణం. అఖాతగర్భంలో, చిమ్మచీకట్లోనూ ఇవి తమలోని కాంతి నియంత్రిత దృష్టి (Polarized Vision) జ్ఞానంతో తాము వేటాడబోయే జీవులపైకి దాడిచేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పొడవాటి మీసాలతో ఉండే క్యాట్‌ఫిష్‌కైతే ఒంటినిండా రుచి గ్రాహకాలే ఉంటాయి. సగటున మనిషికి 10,000 రుచి మొగ్గలు (గ్రాహకాలు) ఉంటే, ఈ రకమైన చేప శరీరమంతా కలిసి 1,75,000 అతిసున్నిత రుచి గ్రాహక కణాలు ఉన్నట్లు వారు గుర్తించారు. ఆఖరకు వీటి మీసాలకూ రుచి చూసే శక్తి ఉంటుందని వారు అంటున్నారు. ఇక, జంతుసామ్రాజ్యంలోనే మరి దేనికీ లేనంత అధిక వాసన శక్తి ఆఫ్రికాకు చెందిన బుష్ ఎలిఫెంట్ (ఏనుగు)కు ఉంటుంది. దీని తొండం లోపల 2,000 శక్తివంతమైన వాసనను పట్టేసే సెన్సర్లుంటాయని, మనిషికి అవి కేవలం 400 మాత్రమేనని వారు చెప్పారు.

పది మైళ్ల దూరంలోంచే పైన్ (pine) చెట్టు కాలుతున్న మంట వాసనను ఒక చిన్న కీటకం (Jewel Beetle) గుర్తిస్తుండడం విశేషమే. ఇవి తమ గుడ్లను ఈ చెట్లపైనే పెడతాయి, కాబట్టే వాటికి ఆ కాలుతున్న వాసన తెలిసిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎక్కువగా గుహలలోని జలాలలోనే నివసించే కేవ్ ఫిష్‌కు ఆశ్చర్యంగా కంటిచూపు ఉండకున్నా, వినికిడి శక్తి మాత్రం అద్భుతం. అతిచిన్న (1 కిలోహెర్ట్ కంటే కూడా తక్కువ స్థాయిలోని) శబ్ద సంకేతాలనైనా సరే ఇవి తేలిగ్గా పట్టేస్తాయని, ఈ అద్భుత సామర్థ్యంతోనే అవి తమకు కావలసిన ఆహార జీవులను వేటాడుతాయని వారు అన్నారు. సముద్రాలలో నివసించే జలచరం మాంటిస్ ష్రింప్ (Mantis Shrimp) దృష్టిజ్ఞానం గురించి చెబితే మనకు మరింత ఆశ్చర్యమేస్తుంది. దీని చూపు అత్యంత సంక్లిష్టమని, అతినీల లోహిత, వృత్తాకార నియంత్రిత కాంతుల్ని సైతం పట్టేయగల 16 రకాల కాంతి డిటెక్టర్లను ఇది కలిగి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ సముద్ర జలచరం (marine crustacean) రెండు కండ్ల చూపుల్ని విడివిడిగానూ ప్రసరింపజేయగలదని వారన్నారు.

తేనెటీగల తేజోశక్తి!


hypersensitive
భూమి గురుత్వాకర్షణ క్షేత్రానికి చెందిన సంకేతాలను తేనెటీగలు చాలా తేలిగ్గా (hypersensitive) పట్టేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనితోపాటు విద్యుదయస్కాంత తరంగాల ద్వారా కూడా ఇవి వాతావరణంలో సంభవించబోయే ఉరుములతో కూడిన మెరుపుల సమాచారాన్ని ముందే పసిగడతాయని కూడా వారు అంటున్నారు. ఇక, మనం తేలిగ్గా తీసిపారేసే సాలీళ్లదైతే అద్భుత స్పర్శజ్ఞానం (Sensitive to Touch). వీటి కాళ్లపైన అసంఖ్యాకమైన వెంట్రుకలు ఉంటాయని, వాటి ఆధారంగానే అవి ఏదేని వస్తువు, జంతువు కదలికలను తక్షణం కనిపెడతాయని వారన్నారు.
దోర్బల బాలశేఖరశర్మ

418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles