నర్మద పరిక్రమ


Fri,August 2, 2019 12:31 AM

నదీమతల్లి నిలువెత్తు దర్శనం!
(గత సంచిక తరువాయి)

Narmada
త్రిభి: సారస్వతం తోయం సప్తాహేన తు యామూనామ
సద్య: పునాతి గంగేయం దర్శనా దేవ నర్మదం
-స్కంధ పురాణం


భావం: యమునా నదినీటిలో ఏడుసార్లు, సరస్వతీ నదినీటిలో మూడుసార్లు, గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే పవిత్రం అవుతాం. కానీ, నర్మద నదీజల దర్శనంతోనే పవిత్రం అవుతాం.

అది కొత్తగా కట్టిన గెస్ట్‌హౌజ్. మేం బస చేసిన విశ్రాంతి గృహాల్లో ఇదొక్కటే ఆధునిక సౌకర్యాలు కలది. చౌకనే కాక ఆధునిక సౌకర్యాలు ఉండే గజానన్ మహారాజ్ గెస్ట్‌హౌజ్‌లు మహారాష్ట్రలో చాలా పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయి. పండరీపురానికి వెళ్లినప్పుడు అక్కడున్న వీరి గెస్ట్‌హౌజ్‌ని చూశాను. దేశాయ్ బస్ దిగి ఆఫీసులోకి వెళ్లి వచ్చి ముగ్గురు- నలుగురికి కలిపి ఓ గది తాళం చెవులు ఇచ్చారు. ఆ రోజు ప్రోగాం, మర్నాడు ఉదయం ఎప్పుడు సిద్ధం అవాలి అన్న కార్యక్రమం చెప్పారు. అంతా మా సామానుతో గదుల్లోకి వెళ్లాం.

మా పరిక్రమ మొదలయ్యాక నర్మద నదిని దాటకూడదు. మర్నాడు ఉదయం మా పరిక్రమ మొదలవుతుంది. కాబట్టి, నదిని దాటి ఓ చిన్న ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకోవడం ఆ రోజే జరగాలి. ఓంకారేశ్వర్ ఓం ఆకారంలో గల చిన్న ద్వీపం. నర్మద ఈ ద్వీపాన్ని చుట్టుముట్టే ముందు 30 మీటర్ల ఎత్తయిన కొండ శిఖరాల మధ్య నుంచి వస్తూ, పెద్ద గులాబీ రంగురాళ్లమీద నుంచి, 10 మీటర్ల ఎత్తునుంచి కిందకు దూకుతుంది. దాన్ని ధర్ది జలపాతం అంటారు. చుట్టుపక్కల రాళ్లమీద గీతల (ధరీలు) వల్ల ఆ జలపాతానికి ఆ పేరు వచ్చింది. అక్కడి గుహల్లో మనుషులు నివసిస్తున్నారు. ఈ ద్వీపంలోని అతి ప్రముఖ ఆలయం ఓంకారేశ్వర్. ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి. పక్కనే మాంధాత పర్వతం మీద ఒక రాజు కట్టించిన పెద్ద రాజమహల్ ఉన్నది.

ఇక్కడి అతిప్రాచీన మందిరం 10వ శతాబ్దానికి చెందింది. చక్కగా చెక్కిన ముఖద్వారం దగ్గర మీటరున్నర ఎత్తుగల ఏనుగు విగ్రహం ఉన్నది. ఈ ఆలయం సమీపంలోని సూరజ్‌కుండ్ గేట్‌దగ్గర 3 మీటర్ల ఎత్తయిన భీమార్జునుల విగ్రహాలు అటు ఇటు కనిపిస్తాయి. భక్తులు కొన్ని గంటల్లో ఓంకారేశ్వర్ ద్వీపానికి ప్రదక్షిణ చేస్తారు. దారిలో చాలా ప్రాచీన ఆలయాలు, చిన్న పెద్ద ఆశ్రమాలు, కుటీరాలు, వాటిలో నివసిస్తూ భక్తి భావంతో భజనలు చేసే సాధువులు కనపడతారు.
అరగంట తర్వాత అంతా మా గెస్ట్‌హౌజ్‌కి ఐదు నిమిషాల దూరంలో ఉన్న నర్మదా నది సమీపానికి చేరుకొన్నాం. దారిలో రతి సతి అనే పాతికేళ్ల లోపు యువతి వచ్చింది. తన అత్త, మేనమామలు వృద్ధాప్యంలో అతికష్టం మీద తీర్థయాత్రలు చేయడం చూశానని, ఎప్పటికైనా తనూ చేయాలనుకొన్నానని, అందుకే ఆగకుండా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేయాలని ఈ తీర్థయాత్రకు వచ్చానని ఆమె చెప్పింది. నేనామెను అభినందించాను. ఎందుకంటే, యుక్తవయసులో ఇలాంటి తీర్థయాత్రలు చేసే సద్బుద్ధి చాలామందికి ఒక పట్టాన కలగదు. ముఖ్యంగా ముంబై యువతకు!

ఎదురుగా దాదాపు 200 అడుగులకు పైగా విశాలంగా వున్న నర్మద నది కనబడింది. అదే మా తొలి నర్మద నదీ దర్శనం. నది కనపడగానే నేను దానికి నమస్కరించి, మా పరిక్రమకు అనుమతిని ఇచ్చి, దాన్ని విజయవంతం చేయమని కోరాను. నదికి ఎడమ, కుడివైపు కాలినడక కోసం రెండు వంతెనలు ఉన్నాయి. ఎదురుగా చిన్న ద్వీపంలో అట్టే ఎత్తులేని కొండమీద కనపడే తెల్లటి ఆలయ గోపురం. నదికి అటు, ఇటు రెండు రేవుల్లో పడవలు ఆగి ఉన్నాయి. పడవల వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టారు. ప్రభు వాళ్లతో మాట్లాడారు. తలకి అయిదు రూపాయలు ఇచ్చి అవతలి ఒడ్డుకు రెండు పడవల్లో నర్మదని నాలుగైదు నిమిషాల్లో దాటాం. అవతలి రేవు పక్కనుంచి ఉన్న మెట్లమీద దాదాపు 200 అడుగుల ఎత్తున ఉన్న ఓంకారేశ్వర్ ఆలయానికి చేరుకొన్నాం.

ఆఖరి మెట్టు కూడా ఎక్కాక ఎదురుగా ఉన్న ద్వారాన్ని దాటి కుడివైపు తిరిగితే లోపల గర్భగుడిలో నల్లటి చిన్న శివలింగం దర్శనం ఇచ్చింది. దాని పానవట్టంలో సదా నీళ్లుంటాయి. అన్ని కాలాల్లో దానిలో నీరు ఒకే స్థాయిలో ఉండడం అద్భుతం. వెనుకాల నల్లటి శిలతో చెక్కిన నర్మదా మాత విగ్రహం! అక్కడినుంచి మళ్లీ కుడివైపు బయటకు వెళ్లే ఇంకో ద్వారం ఉంది. అందులోంచి బయటకు వెళ్తే ఎదురుగా పైకప్పున్న విశాలమైన ఖాళీస్థలం. అక్కడ పూజలు, యజ్ఞాలు చేస్తుంటారు. దాని పిట్టగోడ ఆవల కింద నర్మదనది, మేము పడవ దిగిన రేవు, అవతల ఎక్కిన రేవు, కుడి- ఎడమవైపు వంతెనలు కనిపించాయి. గుళ్లో అట్టే రద్దీ లేదు. అక్కడ కూర్చుని కొద్దిసేపు శివపంచాక్షరీ జపం చేసుకొన్నాను.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

mvk murthy

తీర్థయాత్ర

theertha-yatra

464
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles