అల్లాహ్ అద్భుతం


Fri,August 2, 2019 12:32 AM

-రానున్న బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేకవ్యాసం
-భవబంధాన్ని మించిన భక్తి తత్పరత
కన్న తల్లిదండ్రులను మించిన దేవుళ్లుండరు. మరి, సృష్టినే సృష్టించిన భగవంతుడి పట్ల మనం ఇంకెంత కృతజ్ఞులమై ఉండాలి? అనంతమైన ఆరాధనతో ఆత్మసమర్పణను చాటిన అపురూప సందర్భం అది. ఆ మహోన్నత భక్తి ప్రపత్తి ముందు రక్తసంబంధం కూడా మూగబోయింది.
bakrid
దివ్య ఖురాన్ ఇబ్రహీం ప్రవక్తను మహోన్నతంగా గౌరవించింది. అల్లా ఆదేశాలను పూర్తి విశ్వాసంతో, అత్యంత భక్తి ప్రపత్తులతో ఆయన పాటించిన విధానం అద్భుతం, అనితర సాధ్యం. ఈ ఆధ్యాత్మిక వైభవాన్ని గుర్తు చేసేదే బక్రీద్. భగవంతుని పట్ల భక్తులకు ఉండవలసిన అనన్య సామాన్యమైన ఆరాధన- సమర్పణ భావానికి, తోటివారి పట్ల మానవులు చూపవలసిన త్యాగనిరతికి ఘనమైన ప్రతీకగా ముస్లిం సోదరులు ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకొంటారు.

మనుషులు పాపకార్యాలకు దూరంగా ఉండాలనే గొప్ప సందేశాన్నిస్తున్నదే బక్రీద్ పండుగ (Eid-Ul-Adha). ఈ ప్రబోధం కులమతాలకు అతీతంగా వర్తించేది. ప్రపంచ మానవులందరికీ, మరీ ముఖ్యంగా అల్లాను విశ్వసించే ముస్లింలకు ఇదొక తిరుగులేని దర్మప్రబోధం. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో జీవిస్తూ, దైవాదేశాలను విధిగా పాటిస్తూ, తోటి మానవుల పట్ల దయ, ప్రేమ, సౌభ్రాతృత్వాలతో మెలగాలనీ సూచిస్తున్నది. అహంకారం, దుర్మార్గాలను దరి చేరనీయక, మంచి మనసు, గొప్ప సంస్కారం, సౌజన్యాలతో భూమిపై శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలన్నదే ఇందులోని పరమార్థం. ఇబ్రహీం (Abraham) ప్రవక్త ఎంతో దయార్ద్ర హృదయుడు, మంచివాడు. అందుకే, ఎన్నో సుగుణాలుగల ఆయనను నా స్నేహితుని (Khalilullah) గా ఎన్నుకొన్నాను అని దివ్య ఖురాన్ గ్రంథంలో అపర కరుణామయుడు, చరాచర జగత్తుకు సృష్టికర్త అయిన అల్లా పేర్కొన్నాడు. అల్లా అంటే ముస్లింల దేవుడని చాలామంది భావిస్తారు. అరబిక్ భాషలో భగవంతుడిని అల్లా అంటారు. తనకెంతో ప్రీతిపాత్రుడైన ఇబ్రహీంను భగవంతుడు అనేక విధాలుగా పరీక్షింప దలిచాడు. ఇందులో ఇబ్రహీం విజేతగా నిలిచిన వైనం అత్యంత ఆసక్తికరం.

వేల సంవత్సరాల క్రితం అంటే ఇబ్రహీం ప్రవక్త జీవించిన కాలంలో మానవ సమాజం సంచార జాతులుగా నివసించేది. తన కోసం ఓ ప్రార్థనా మందిరాన్ని (Kaaba) నిర్మించవలసిందిగా భగవంతుడు ఇబ్రహీం ప్రవక్తను, అతని కుమారుడు ఇస్మాయిల్ (Eshmayeel) ప్రవక్తను ఆదేశించాడు. భగవంతుని ఆదేశానుసారంగా ఇబ్రహీం, ఇస్మాయిల్ ప్రవక్తలు ఇద్దరూ కాబా ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాతే ఇబ్రహీం ప్రవక్తకు అసలు పరీక్ష మొదలైంది.

ప్రభూ! నీ ఆదేశం మేరకు నేను, నా కుటుంబీకులు, నా జాతివారు అందరం ఈ కాబా పరిసరాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. కానీ, ఈ ప్రదేశం చెట్లు, పచ్చదనాలకు అవకాశం లేని బంజరు భూమి. కనుక, నీ చల్లని చూపుతో ఈ పరిసరాలను అనేక రకాల పండ్లచెట్లు, తోటలు, వనాలతో పచ్చదనం పరివ్యాపించేలా చేయు. అలాగే, నిత్యం నీ ప్రార్థనా మందిరాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేసే నీ భక్తుల కోసం ఈ ప్రదేశాన్ని అభివృద్ధి పరచు. విశ్వాసుల హృదయాలకు శాంతిని ప్రసాదించు అని ఇబ్రహీం ప్రవక్త వినమ్రంగా భగవంతుణ్ణి వేడుకొన్నాడు. అనుకొన్నట్టుగానే అంతా జరిగింది. ఇంత లో భగవంతుడు ప్రవక్తకు తనదైన పరీక్ష పెట్టాడు.

ఇబ్రహీం ప్రవక్తకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు బీబీసారా. ఆమె కుమారుడు ఇసాక్ ప్రవక్త. ఆయన రెండవ భార్య బీబీ హాజిరా కుమారుడు ఇస్మాయిల్ ప్రవక్త. ఇబ్రహీం ప్రవక్త తొలి సంతానం ఇస్మాయిల్. అందువల్ల తన కుమారుడు ఇస్మాయిల్ పట్ల తండ్రికి వెలకట్టలేని ప్రేమానురాగాలు. ఆ రాత్రి ఇబ్రహీం కలలో అనుకోని సంఘటన జరిగింది. అల్లా ఆదేశానుసారం తాను తన ప్రియకుమారుడు ఇస్మాయిల్‌ను ఓ పర్వత ప్రాంతంలో నేలపై పడుకోబెట్టి, అతని శిరస్సును ఖండిస్తున్నట్టు కలగన్నాడు. అది కల అని తెలిసినా దైవాదేశాన్ని నిజం చేయాలనుకొన్నాడు ఇస్మాయిల్ ప్రవక్త. తండ్రి మనసు తెలిసిన ఇస్మాయిల్ పితృవాక్పాలనకు సిద్ధమయ్యాడు. తండ్రీకొడుకుల ఈ త్యాగనిరతికి దేవుడు సైతం దిగివచ్చాడు.

ఇస్మాయిల్ శిరస్సును ఛేదించడానికి ఇబ్రహీం ప్రవక్త సిద్ధమైనాడు. సరిగ్గా అదే సమయంలో భగవంతుడు తన మహిమతో ఇస్మాయిల్ స్థానంలో ఓ గొర్రె పొట్టేలును ఉంచాడు. సదరు గొర్రె పొట్టేలు శిరస్సును వధించిన తర్వాతే అసలు విషయం ఇబ్రహీం ప్రవక్తకు తెలిసింది. ఇబ్రహీం.. నేను పెట్టిన పరీక్షలో నువు గెలిచావు. ఈ పరీక్షలో ఓ భాగమైన నీ కలను నిజం చేశావు. నా ఆదేశాన్ని తుచ తప్పకుండా పాటించావు. ఆ విధంగా నాకెంతో ప్రీతిపాత్రుడవు అయినావు. నీ కుటుంబంపై, నీ వంశీకులపై నేను అంతులేని దయను ప్రసరింపజేస్తాను అన్న అల్లా మాటలకు ఇబ్రహీం హృదయం పులకించిపోయింది. అలా మానవాళికి ఒక మహోన్నత త్యాగంలోని పరమార్థం బోధపడింది.

ఇబ్రహీం ప్రవక్త వంశీకులందరూ ప్రవక్తలు, చక్రవర్తులే (King Saul, King David, King Solomen). ఇస్మాయిల్ ప్రవక్త వంశీకులైన మహమ్మద్ ప్రవక్తతోపాటు యావత్తు ముస్లిం సోదరులంతా ఆ ఘటనను భగవంతుడి ఆదేశంగానే విశ్వసించారు. ఈ మేరకు అప్పట్నుంచీ త్యాగనిరతికి ప్రతీకగా బక్రీద్‌ను జరుపుకుంటున్నారు.

bakrid2

పవిత్ర కాబా దర్శన వేళ!

ప్రతి ముస్లిం తన జీవితకాలంలో తప్పనిసరిగా హజ్ యాత్రను ఆచరించడం అనాదిగా ఒక పవిత్ర సంప్రదాయంగా వస్తున్నది. హజ్ యాత్రికులు బక్రీద్ పండుగకు ముందుగానే పవిత్ర మక్కా నగరం చేరుకొంటారు. అక్కడ భగవంతుడి ప్రార్థనా స్థలమైన కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇబ్రహీం- ఇస్మాయిల్ ప్రవక్తలు ఇరువురూ కలిసి నిర్మించిన ఆ పవిత్ర ప్రార్థనా ప్రదేశం ఇవాళ అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైంది. ఏటా లక్షలమంది ముస్లిం భక్తులు మక్కా నగరంలోని పవిత్ర కాబాను దర్శించుకొంటారు. అక్కడి ప్రార్థనా మందిరపు గోడ ముందు భాగంలో స్వర్గం నుండి భగవంతుని ద్వారా వచ్చినట్లుగా భావించే ఒక పవిత్రమైన శిల (Sang-E-Aswath) నిక్షిప్తమై ఉంది. కాబా ప్రదక్షిణ సమయంలో యాత్రికులు ఆ రాయిని భక్తి పూర్వకంగా చుంబిస్తారు.

-షేక్ రఫి

513
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles