రెరాను పట్టించుకోని రియల్టర్లు


Sat,August 3, 2019 12:42 AM

రెరా వస్తే మాకేంటి? మేం మాత్రం లేఅవుట్లను వేస్తాం.. మా ఇష్టం వచ్చినట్లు ప్లాట్లను విక్రయిస్తాం. మమ్మల్ని ఎవరైనా ఆపగలరా? అన్నట్లు కొందరు రియల్టర్లు వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు రెరాలో నమోదు చేసుకోకుండానే అమాయక బయ్యర్లకు ప్లాట్లను అంటగట్టేస్తున్నారు. స్థాని సంస్థల అనుమతులు తీసుకోకుండా పంచాయతీ అనుమతి తీసుకుని రేటు తక్కువంటూ అమ్మేస్తున్నారు. మరికొందరు రియల్టర్లు సాఫ్ట్‌లాంచ్‌లు, ప్రీలాంచ్‌ల పేరిట అమాయక కొనుగోలుదారులకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అయితే, ఇక నుంచి తమ అనుమతి తీసుకోకుండా ప్లాట్లను విక్రయించే సంస్థలపై కొరడా ఝళిపించడానికి రెరా సమాయత్తం అవుతున్నది.
RERA
500 చదరపు మీటర్లు లేదా అంతకుమించిన విస్తీర్ణంలో 8 లేదా అంతకుమించిన ప్లాట్లు, ఫ్లాట్లను అభివృద్ధి చేసే రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ తెలంగాణ రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. పైగా, రియల్టర్లు తమ వెంచర్లను నమోదు చేయడానికి ఫీజు కూడా అతి తక్కువే. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ రెరా అథారిటీలను గమనిస్తే.. మన వద్ద వసూలు చేసే ఫీజే తక్కువుందని చెప్పొచ్చు. ప్లాట్లను అభివృద్ధి చేసి విక్రయించే సంస్థలు చదరపు మీటర్‌కి చెల్లించాల్సింది కేవలం ఐదు రూపాయలే. గరిష్ఠంగా మహా అయితే రూ.2 లక్షలు అవుతుంది. అయినప్పటికీ, ఇంతవరకూ రాష్ట్రవ్యాప్తంగా అధిక శాతం మంది రియల్టర్లు తమ వెంచర్లను రెరాలో నమోదు చేసుకోలేదు. రెరా అథారిటీ ఏం చేస్తుందిలే అనే నిర్లక్ష్యం చాలామంది రియల్టర్లలో నెలకొన్నట్లు సమాచారం. ఇప్పుడిలాంటి ప్రమోటర్ల నుంచి ముక్కుపిండి జరిమానాను వసూలు చేయడానికి రెరా అథారిటీ సమాయత్తం అవుతున్నది. 2017 జనవరి 1 తర్వాత తెలంగాణలో ఆరంభమైన వెంచర్లను నమోదు చేసుకునేందుకు రెరా అథారిటీ జులై 31 వరకూ గడువునిచ్చింది. ఇక మళ్లీ పొడిగించే ప్రసక్తే లేదని జులై 31న స్పష్టం చేసింది. రెరా సెక్షన్ 59 ప్రకారం, జరిమానా విధించడానికి సమాయత్తం అవుతున్నది. రెరా అథారిటీ మరింత మెరుగ్గా సేవల్ని అందిస్తేనే తెలంగాణలో ప్లాట్లను కొనేవారు మోసపోయే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారు. ప్రమోటర్ స్థాయితో సంబంధం లేకుండా జరిమానా విధించాలంటున్నారు.

పేపర్లో ప్రకటనలు..

రెరాలో అనుమతి తీసుకోకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న సంస్థల పేర్లను పత్రికల్లో ప్రచురించడానికి తెలంగాణ రెరా అథారిటీ సమాయత్తం అవుతున్నది. ఈ క్రమంలో నగరం నలువైపులా కొన్ని ప్రాజెక్టుల పేర్లను సిద్ధం చేసినట్లు సమాచారం. రెరా అనుమతి లేకుండా ఏ సంస్థా ప్రీలాంచ్‌లో కానీ సాఫ్ట్‌లాంచ్‌లో కానీ ప్లాట్లు లేదా ఫ్లాట్లను విక్రయించడానికి వీల్లేదు. అయినప్పటికీ, పలు సంస్థలు ఈ నిబంధనను బేఖాతరు చేస్తున్నాయని రెరా అథారిటీ దృష్టికి వచ్చింది. దీంతో, నిబంధనల ప్రకారం అట్టి సంస్థల నుంచి జరిమానాను వసూలు చేసేందుకు రెరా అథారిటీ దృష్టి సారిస్తోంది. పైగా, ఒక్కసారి రెరా అథారిటీ గనక పత్రికల్లో ప్రాజెక్టుల గురించి ప్రకటన విడుదల చేస్తే.. ఆ సంస్థ వద్ద ప్లాటు కానీ ఫ్లాటు కానీ కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులెవ్వరూ ముందుకు రారు. పైగా, ఆయా సంస్థ పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు పడకూడదని భావించేవారైతే ఎప్పుడో రెరాలో నమోదు చేసుకునేవారే. మరి, తమ వద్ద నమోదు కాని ప్రాజెక్టులకు సంబంధించి రెరా అథారటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం గురించి తెలంగాణ ప్రమోటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles