మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉంది?


Sat,August 3, 2019 01:12 AM

ELDERS-POLICY
తల్లిదండ్రులు కష్టపడి పిల్లిల్ని పెంచుతారు. మంచి విద్యాబుద్ధులు చెప్పించడమే కాకుండా, తమ స్థాయిని మించి ఉన్నత చదువులను చెప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఏ స్థాయిలోనూ రాజీపడరు. మొత్తానికి, తమ కళ్లముందే పిల్లలు ప్రయో జకులైతే, ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కనిపించే ఆనందమే వేరు. మరి, చిన్నప్పట్నుంచి కంటికిరెప్పలా కాపాడిన తల్లిదండ్రులను బాగోగుల చూడాల్సిన బాధ్యత పిల్లలదే కదా? అందుకే, వారి కోసం మంచి ఆరోగ్య పాలసీ ఒకటి తీసుకోండి.


మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు పదవీవిరమణ స్థాయికి చేరుకున్నారంటే.. అది నిజంగా గొప్ప ఆశీర్వాదమనే చెప్పాలి. జీవితంలో ఇదో బంగారు సమయమని అనుకోవాలి. మనం బాల్యదశలో ఉన్నప్పట్నుంచి కష్టించిన తల్లిదండ్రులకు కొంత అయినా విశ్రాంతి దొరికేదీ సమయంలోనే. ఈ దశలో వీరు తక్కువ పని చేయాలి. మనవళ్లు, మనవరాళ్లు, బంధుమిత్రులతో ఆనందంగా ఎక్కువ సమయం గడపాలి. ఒకవైపు సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నప్పటికీ, మరోవైపు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయం వారు చెప్పకున్నా.. మీకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే, మీ తల్లిదండ్రులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాల్ని అందించాలంటే, వారికి అన్నిరకాలుగా ఉపయోగపడే ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవాలి. ఇందుకోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలించి తుది నిర్ణయానికి రావాలి. ఇందుకోసం మీరేం చేయాలంటే..

ఆరోగ్య చరిత్ర తెలుసా?

మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి చరిత్ర మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. ప్రస్తుతం ఆరోగ్యపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, రోగాలు, చికిత్సకు తీసుకుంటున్న చర్యలు వంటివన్నీ కచ్చితంగా తెలుసుకోవాలి. కాస్త వీలు చేసుకుని అయినా, డాక్టర్ల వద్దకు వారిని తీసుకెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అర్థం చేసుకోవాలి. ఆతర్వాత, వారికోసమే ప్రత్యేకంగా ఒక ఆరోగ్య పాలసీని తీసుకోవాలి. ఆ పాలసీ దేనికి వర్తిస్తుందో? దేనికి వర్తించదో ముందే కనుక్కోవాలి.

పాలసీ పరిమితులు తెలుసుకోవాలి..

మార్కెట్లో అనేక సంస్థలు రకరకాల పాలసీలను అందజేస్తున్నాయి. వాటి పూర్తి వివరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆస్పత్రిలో చేరితే, ప్రతిరోజు అద్దె గదికి ఎంతిస్తారు? సర్జరీ, చికిత్సకయ్యే గరిష్ఠ పరిమితి వంటివి కనుక్కోవాలి. ఈ క్రమంలో కొన్ని పాలసీలు తక్కువ ప్రీమియం వసూలు చేయవచ్చు. కాకపోతే, అవి పలు నిబంధనల్ని విధిస్తాయని మర్చిపోవద్దు. కాబట్టి, వీలైనంత వరకూ పాలసీ నిబంధనల్ని తప్పకుండా తెలుసుకోవాలి. పాలసీ పరిమితుల్ని క్షుణ్నంగా అర్థం చేసుకున్నాకే తుది నిర్ణయానికి రావాలి.
ELDERS-POLICY1

అవగాహన పెంచుకోవాలి..

మీరు పాలసీని ఎంచుకునేటప్పుడు, ఎలాంటి పరిమితులు లేకుండా ఉన్నవే తీసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు తక్కువ పరిమితులున్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం. అంతేతప్ప, తల్లిదండ్రులకు పాలసీలను తీసుకోకుండా మాత్రం ఉండకూడదు. పైగా, మీ తల్లిదండ్రుల వయసు అరవై దాటితే, అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకోసం బీమా సంస్థలు ప్రీమియం ఎక్కువ వసూలు చేయవచ్చు. లేదా, మీకు తెలియకుండా కొత్త నిబంధనల్ని జోడించవచ్చు. ఇలాంటి వాటి గురించి ముందే అవగాహన పెంచుకోవాలి.

విడిగా తీసుకోవడం మేలు..

మీ తల్లిదండ్రులకు తీసుకునే పాలసీ మొత్తం ఎంతుండాలనే విషయంలో ఒక స్పష్టత రావాలి. ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత, వారి పాలసీ మొత్తాన్ని పెంచడం చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి, వారి వయసు ఎనభైకి చేరుకునేసరికి ఎంత అవుతుందనే విషయాన్ని అంచనా వేసి తుది నిర్ణయానికి రావాలి. ఇందుకోసం ఏటా 8 నుంచి 10 శాతం ద్రవోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని పాలసీని ఎంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో పెద్దలకు విడిగా ఆరోగ్య పాలసీ తీసుకోవడమెంతో సులువు. దరఖాస్తు పత్రంలో తల్లిదండ్రుల వివరాల్ని నింపి, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, చరిత్ర గురించి పేర్కొనాలి. ఆతర్వాత, వారు నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించాలి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, బీమా సంస్థ మీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితుల్ని అంచనా వేస్తుంది. వీలైతే, ఒకసారి ఆరోగ్య పరీక్షలను చేయించాలని సూచిస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా పాలసీని జారీ చేస్తుంది.. అదనపు ప్రీమియం చెల్లించమంటుంది.. లేదా దరఖాస్తు తిరస్కరించొచ్చు.

మీ సంస్థ పాలసీ ఇచ్చిందా?

మీరు తల్లిదండ్రులకు తీసుకున్న ఆరోగ్య పాలసీ ప్లాన్ ప్రకారమే బీమా సంస్థలు క్లెయిమ్‌లను చెల్లిస్తాయి. నగదురహిత ప్రయోజనాలు అందుకోవాలంటే, బీమా సంస్థ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న ఆస్పత్రిలో చేరడం ఉత్తమం. అందుకు సంబంధించి ముందే, ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇవ్వడం కీలకం. ఒకవేళ, మీకు వివిధ రకాల పాలసీలు ఉన్నట్లయితే, మీ సంస్థ ఇచ్చిన పాలసీని ఉపయోగించుకోవడమే ఉత్తమమని గుర్తుంచుకోండి.

పెద్దల పాలసీ ముఖ్యాంశాలు


ELDERS-POLICY2

732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles