దేశం ఏదైనా మనజెండా ఎగురాల్సిందే!


Sun,August 4, 2019 12:35 AM

ఏ క్రీడ అయినా పోటీ గట్టిగానే ఉంటుంది. అది అంతర్జాతీయ స్థాయిలో అంటే ఆ మజానే వేరు. అలాంటి ఉత్కంఠకు ఏమాత్రం తీసిపోని విధంగా బధిరుల
(మూగ,చెవిటి) క్రీడలు జరుగుతుంటాయి తెలుసా? సాధారణ అంతర్జాతీయ క్రీడలకు ఏమాత్రం తీసిపోకుండా అంతే రసవత్తరంగా జరుగుతుంటాయి. ఇందుకు ఉదాహరణే తైపీలో జరిగిన ‘వరల్డ్‌ యూత్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌'. ఈ పోటీల్లో మన దేశానికి చెందిన ఈ యువ క్రీడాకారిణి నాలుగు పతకాలు సాధించి.. తన పేరు చరిత్రలో లిఖించుకున్నది.

Flag-of-India
అక్కడ ఆడేదంతా బధిరులు. సాధారణ క్రీడల్లో మాదిరిగా అక్కడ అరుపులు, కేకలు వినిపించడం చాలా అరుదు. అయితే ఆటమాత్రం చాలా రసవత్తరంగానే సాగుతుంటుంది. కంటి చూపులే ఆటను రక్తి కట్టిస్తాయి. ఇలాంటి క్రీడలకు మన దగ్గర ప్రోత్సాహం చాలా తక్కువే అయినా క్రీడాకారులకు కొదువ లేదు. అలాంటి క్రీడా ఆణిముత్యాల్లో జెర్లిన్‌ అనికా ఒకరు. ఈ యువ క్రీడాకారిణి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఒక బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాలు సాధించి.. దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఎలాంటి ప్రోత్సాహపు అరుపులు వినిపించని చోట.. స్టేడియం మొత్తం హోరెత్తేలా తన విజయఢంకా మోగించింది అనిక.
anika

పతకాల వేట..

మదురై జిల్లాలోని విల్లాపురానికి చెందిన 15 యేండ్ల జెర్లిన్‌ అనికా బధిర క్రీడాకారిణి. ప్రస్తుతం మదురైలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది అనిక. చిన్నప్పటి నుంచి ఈమెకు క్రీడలంటే చాలా ఆసక్తి. తైపీలో జూలై 17 నుంచి 22 వరకు ‘ప్రపంచ బధిర యూత్‌ బ్యాడ్మింటన్‌' పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి ఎంతోమంది బధిర క్రీడాకారిణులు పాల్గొన్నారు. వారిలో అనికా కూడా ఒకరు. ఆ పోటీల్లో పలు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది అనిక. ఫైనల్లో జర్మనీకి చెందిన టాప్‌సీడ్‌ క్రీడాకారిణి ఫిన్జా రోసెందహల్‌ను 21-12, 21-13తో ఓడించి మువ్వన్నెల జెండాను రెపరెపలాండించింది అనిక. జూలై 28న బంగారు పతకం స్వీకరించి దేశ ప్రతిష్ఠను మరింత పెంచింది ఈ యువ క్రీడాకారిణి. ఈ విజయం ఆమెది మాత్రమే కాదు.. యావత్‌ భారతావనిది. గతంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగించింది అనిక. మలేషియాలో జరిగిన 5వ ‘ఆసియా పసిఫిక్‌ బధిర బ్యాడ్మింటన్‌షిప్‌'లో రెండు రజత పతకాలు, కాంస్యం సాధించింది అనిక.

అనుకోకుండా ఒకరోజు..

అనికా తండ్రి జయ రాట్చగన్‌, తల్లి లీమా. జయ రాట్చగన్‌ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడుతుండేవాడు. తనతోపాటు అనికాను కూడా తీసుకెళ్లేవాడు తండ్రి. 8 యేండ్ల వయసు వచ్చేనాటికి ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడను ఎంతో శ్రద్ధగా చూసేది. అందరూ ఎలా ఆడుతున్నారు? కోర్టులో ఎలా వేగంగా కదులుతున్నారో గమనించేది. అలా ఒకరోజు తండ్రి బ్యాట్‌ ఆమె చేతికిచ్చి ఆడమని చెప్పాడు. కోర్టులో అడుగుపెట్టిన మొదటిసారే అనుభవం ఉన్న క్రీడాకారిణిలా ఆడింది. ఆమె ఆట చూసిన జయ అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. బ్యాడ్మింటన్‌లో శిక్షణలో చేర్చిస్తే గొప్ప క్రీడాకారిణి అవుతుందని స్నేహితులు సలహా ఇచ్చారు. 8 ఏండ్ల వయసులో కోచ్‌ టి.శరవణన్‌ దగ్గర ట్రైనింగ్‌ ఇప్పించాడు. కోచ్‌ ఆమెను అన్ని విధాలా పరిక్షించాడు. ఆమె బలం, బలహీనత తెలుసుకున్నాడు. బధిరులకు ఎలా చెబితే అర్థమవుతుందో తెలుసుకొని అదే విధంగా సున్నితంగా చెప్పేవాడు కోచ్‌. అన్ని విధాలా ఆమెను క్రీడాకారిణిగా తీర్చిదిద్దాడు. అలా జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ప్రతిభ చూపించింది అనిక. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఒకవైపు స్కూల్‌ మరొకవైపు బ్యాడ్మింటన్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటున్నది. తనను నిత్యం ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యం, కోచ్‌లకు కృతజ్ఞతలు చెబుతున్నది అనిక.

కోచ్‌బాటలోనే..

అనికా ఈ ఏడాది ప్రారంభంలో టర్కీలో జరిగిన ‘డెఫీలింపిక్స్‌'లో పాల్గొన్నది. అందులో ఐదవ స్థానంలో నిలిచింది. ఇటీవలే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రపంచ జూనియ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి.. చైనా క్రీడాకారిణిని ఓడించింది. అనికను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతానని ఆమె తల్లిదండ్రులకు భరోసా కల్పించాడు కోచ్‌. ఇలా మరిన్ని అథ్లెటిక్స్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నది అనిక.

..?వనజ వనిపెంట

128
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles