జర్నలిజాన్ని వదులుకొని చెఫ్‌గా రాణిస్తున్న మందాకిని గుప్తా


Mon,August 5, 2019 01:14 AM

చిన్నతనం నుంచి అమ్మను చూసి ఆమె ఎప్పటికైనా తనొక చెఫ్‌ని కావాలని కలలు కన్నది. కానీ, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో పట్టా పుచ్చుకొని జర్నలిస్ట్ అయ్యింది. టెలివిజన్ జర్నలిజం కెరియర్‌లో ఎన్నో ఉన్నతావకాశాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ వదులుకుంది. తన డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం ఆ వృత్తిని వదిలి చెఫ్‌గా మారింది. పేస్ట్రీ తయారీ చెఫ్‌గా మెళకువలు నేర్చుకునేందుకు ఆమె ఢిల్లీలోని పార్క్ హోటల్లో గంటల తరబడి నిలబడటమే కాదు, అక్కడ మురికిపట్టిన ఫ్రిడ్జ్‌ను కూడా శుభ్రం చేసింది. అయితేనేం నిన్న మొన్నటి వరకు ఎలాంటి కేక్ తయారు చేయడం కూడా రాని ఆమె ఏకంగా కంపెనీ ప్రారంభించే స్థాయికి ఎదిగింది. కష్టాల కిచెన్ నుంచే కార్పొరేట్ స్థాయికి ఎదిగిన స్మిటన్ పేస్ట్రీ అధినేత మందాకిని గుప్తా సక్సెస్‌మంత్ర.
Mandakini-Gupta
మందాకిని గుప్తా చిన్ననాటి కలల్ని నిజం చేసుకోవడానికి పేస్ట్రీ చెఫ్‌గా మారింది. అయితే చెఫ్‌గా మారడం అంత సులువుగా ఏం కాలేదంటున్నదామె. కేక్‌లు తయారుచేయడం నేర్చుకున్నాక సొంతంగా ఆమె స్మిటన్ పేరుతో పేస్ట్రీ కంపెనీ ప్రారంభించింది. ప్రారంభంలో వారానికి పది ఆర్డర్లు కూడా రాని రోజుల నుంచి గడిచిన కొన్నేళ్లుగా ఆమె ఇప్పుడు వందలాది ఆర్డర్లే కాదు, అంతకు మించిన నమ్మకమైన కస్టమర్లను కూడా సంపాదించుకోగలిగింది. ఢిల్లీలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ వివాహానికి రుచికరంగా అలంకరించిన చాకొలెట్ లెమన్ కేకుల ఆర్డర్ కూడా దక్కించుకుంది. ఇప్పటికీ ఆమె తయారు చేసే నాణ్యమైన సాల్టెడ్ కారెమిల్ చాకొలెట్, డార్క్ చాక్లెట్ సీసాల్ట్ కుకీలు, లెమన్ పాపీ సీడ్ కేకులు, ఓవెన్ నుంచి బయటకు తీసేలోగానే అమ్ముడైపోయేంత ఆర్డర్లు వస్తున్నాయి.

సొంతంగా..

జర్నలిస్ట్‌గా సరదాగా తిరిగే ఓ టీనేజర్ అమ్మాయి నుంచి ఒక విజయవంతమైన బిజినెస్ వుమన్‌గా, తన వ్యాపారాన్ని విస్తరించేంత స్థాయికి మందాకిని ఎదగడం వెనుక ఆమె కష్టం దాగుంది. ఆమె ఇదంతా సొంతంగా సాధించుకుంది. జర్నలిస్టుగా విధులు నిర్వహించి ఇంటికొచ్చాక ఆమెకు సాయం చేసే చక్కటి భర్త, ఒక సహాయకురాలు తప్ప ఆమెకు బయటి నుంచి ఎవరూ సాయం చేయలేదు. ఆమె భర్త ప్రోత్సామం, కుకింగ్ అంటే ఆమెకున్న అమితాసక్తి రెండూ ఏకమై.. ఆమెను జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునేలా స్ఫూర్తి నింపాయి. ఇక ఆమె ట్రైనింగ్ కూడా ఆసక్తికరంగానే సాగింది. బేకింగ్ అంటే ఆమెకు అమితాసక్తి. కానీ ఆమె తన షాపును వంద శాతం నిర్వహించేంత సామర్థ్యం వచ్చేంత వరకూ సొంతంగా షాప్ పెట్టుకోవాలని మాత్రం అనుకోలేదు.

హోటల్స్‌లో నేర్చుకొని..

గుర్తింపు పొందిన పాకశాస్త్ర కళాశాలలో పాఠాలు నేర్చుకోవాలంటే ఏడాదికి 50 లక్షలు చెల్లించేంత స్థోమత మందాకినికి లేదు. అందుకే ఆమె తొలినాళ్లలో ముంబైలోని ఇండిగో, న్యూయార్క్‌లోని డబ్ల్యూ డి 50 వంటి కమర్షియల్ హోటళ్ల కిచెన్లలో ఎక్కువ సేపు నేర్చుకునేవారు. ఆ తర్వాత మన్‌హట్టన్‌లో ఉన్న ఒక ఫ్రెంచ్ పాకశాస్త్ర ఇన్సిట్యూట్‌లో మూడు నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తి చేశారు. భారత్ తిరిగి వచ్చి స్మిటన్ అనే సొంత కంపెనీ మొదలు పెట్టే ముందు, తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని పరిపుష్ఠం. చేసుకునేందుకు పేస్ట్రీ చైన్ అయిన ఎల్ ఒపేరాలో పనిచేశారు. ఇది కాకుండా మందాకిని గురించి కొద్దిమందికే తెలిసిన విషయం మరొకటి ఉంది. అదేంటంటే ఆమె మూగజీవుల్ని అమితంగా ప్రేమిస్తుంది. ఆమె ఇంట్లో ఐదు కుక్కల్ని కూడా పెంచుకుంటున్నది. ఊపిరి సలపని బేకింగ్ పని నుంచి కాస్తంత వీలు దొరికినప్పుడల్లా వీధి కుక్కల్ని రక్షిస్తూ ఉంటారు. ఇక బేకరీ ప్రపంచంలో మందాకినీ విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించడానికి ఆమె వేసిన అడుగులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి.
Mandakini-Gupta2

నమ్మకం కుదిరాక మాత్రమే

నేను ఇప్పుడున్న స్థాయికి రావడానికి ముందు ఎంతో ఆలోచించాను, ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను. నన్ను నేను ఎన్నోసార్లు నిరూపించుకున్నాను. నేను ఒక ప్రొఫెషనల్ కిచెన్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఏకధాటిగా పన్నెండు గంటల పాటు బేకింగ్ ప్రక్రియలో ఉన్నా.. అలసిపోను, సంతోషంగానే ఉంటాను అని నన్ను నేను ఒప్పించుకోగలగాలి అనుకున్నాను. నేను కచ్చితంగా అది సాధించిన రోజున మాత్రమే.. నా టీవీ జర్నలిజం ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సంతృప్తి, నమ్మకం సాధించాను కాబట్టే ఇప్పుడిలా ఉన్నాను అంటారామె.

ప్రత్యేకత ఎమిటంటే?

నేను వాడే కొన్ని వస్తువులు చాలా ఖరీదైనవే కానీ, నా డెసర్ట్స్ అన్నీ ఖరీదైనవిగా ఉండాలని నేను అనుకోను. నేను కేవలం లగ్జరీ డెసర్ట్స్‌ను మాత్రమే తయారు చెయ్యాలనుకోను. నా కస్టమర్లకు సరసమైన ధరలోనే అందివ్వాలనుకుంటాను. నా కేకుల్లో నేను స్థానిక చాక్లెట్లు వాడను. ఎందుకంటే అవి నాణ్యతలో బెస్ట్ కాదు. విదేశీ చాక్లెట్లు మాత్రమే వాడతాను. రాస్ బెర్రీ వంటి పళ్లను ఫ్రాన్స్ నుంచి తెప్పిస్తాను. నిమ్మకాయలైతే.. మా అమ్మ తోట నుంచి తెచ్చుకుంటాను అని తన కేక్‌ల ప్రత్యేకతను వివరిస్తారామె.

కొత్తవారికి సలహా

Mandakini-Gupta1
మీరు ఎన్ని ఆర్డర్లు సమర్థంగా పూర్తి చేయగలరో తెలుసుకునేంత వరకూ పెద్ద ఆర్డర్లు తీసుకోవద్దు. పెద్దగా ప్రకటనలూ ఇవ్వద్దు. మీరు చిన్నగా మొదలు పెడితే మరింత వృద్ది చెందే అవకాశం ఉంటుంది. అంతేగానీ మీరు పెద్దదిగా ప్రారంభించి చివరికి వ్యాపారాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరం కాదు. మీ వరకూ ఉత్పత్తిలో, నాణ్యతలో ఉన్నత విలువలు పాటించండి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకోండి. నేనైతే.. ఎప్పుడూ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత రోజు నా కస్టమర్లకు ఫోన్ చేసి అవి వాళ్లకు నచ్చాయో లేదో అని ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటాను. కొన్నిసార్లు ఆ కేకులు చాలా ముక్కలైపోయాయని, సరిగా లేవని అంటారు. అప్పుడు వాళ్ల అభిప్రాయాన్ని ఒకసారి చెక్ చేసుకుంటాను. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా తయారు చేశానా? లేక కస్టమర్లు ఏమైనా వేరే రకం కత్తితో వాటిని కోశారా? లేకపోతే కేక్ సరిగ్గా అమర్చడంలో తప్పు జరిగిందా? ఇలా చెక్ చేసుకోవడం ద్వారా నా నాణ్యతను మరింత మెరుగుపర్చుకుంటాను. ఏ వ్యాపారంలో అయినా.. వినియోగదారుడి ఫీడ్‌బ్యాక్‌ను తక్కువ చేయకూడదు అని సలహా ఇస్తున్నారు మందాకిని గుప్తా.

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles