గాంధేయ సాంకేతిక విజ్ఞానం బాపూ వైజ్ఞానిక బాటలో!


Tue,August 6, 2019 12:29 AM

మహాత్మాగాంధీ అనగానే మనకు దేశ స్వాతంత్య్ర పోరాట విశేషాలే గుర్తుకు వస్తాయి. కానీ, ఆయన శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా తనదైన ముద్రతో కూడిన ఆలోచన వెలువరించారన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. దశాబ్దం క్రితం ఇద్దరు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఆయనలోని వైజ్ఞానిక, సాంకేతిక దృష్టిని పరిచయం చేశారు. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి (పుట్టిన ఏడాది: 1869) సంవత్సరం సందర్భంగా ప్రస్తుత తరం పరిశోధకులకు పనికి వచ్చే ఆ విశేషాలపైనే ఈ వ్యాసం.
Mahatma-Gandhi
గాంధేయ సాంకేతిక విజ్ఞానం (గాంధీయన్ ఇంజినీరింగ్) అనే పదప్రయోగం తొలిసారిగా ఒక దశాబ్దం క్రితం జరిగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆర్.ఏ. మషేల్కర్, సి.కె. ప్రహ్లాద్‌లు దీనిని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం. మన జాతిపిత మహాత్మాగాంధీ దృష్టిలో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, వాటి పరమార్థం వంటి విషయాలను అర్థం చేసుకొనే అవకాశం చాలామందికి దీనితో లభించింది. ముఖ్యంగా గాంధీయన్ ఇంజినీరింగ్ (Gandhian Engineering) అన్నది మిగిలిన సాంకేతికతలకంటే ఏ రకంగా విభిన్నమో, అధిక ప్రయోజనదాయకమో వారిద్దరూ అప్పట్లోనే సవివరంగా పేర్కొన్నారు. 2010 ఏప్రిల్‌లో మషేల్కర్ చేసిన గాంధీయన్ ఇంజినీరింగ్: మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మోర్ అనే ప్రసంగం, ప్రదర్శన అప్పట్లోనేకాక ఇప్పటికింకా చాలామందిని ఆలోచింపజేస్తున్నది.


మషేల్కర్ (R.A.Mashelkar) ప్రఖ్యాత రసాయనిక శాస్త్రవేత్త. సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. సి.కె.ప్రసాద్ మేనేజ్‌మెంట్ విభాగపు నిపుణులు. వీరిద్దరూ ఈ గాంధీయన్ ఇంజినీరింగ్ భావనను ప్రపంచవ్యాప్తం చేయాలని అప్పట్లో విశేషంగా కృషి చేశారు. అయితే, సి.కె. ప్రహ్లాద్ 2010 ఏప్రిల్‌లోనే గతించడం విషాదం. తక్కువ వనరులను వినియోగించుకొని తద్వారా పొందే ఫలితం మాత్రం ఎక్కువమందికి అందాలన్ననేదే బాపూజీ ప్రతిపాదించిన సాంకేతికతా విధానంలోని అంతఃసూత్రం. అత్యుత్తమమైన, అత్యున్నతమైన టెక్నాలజీ ద్వారా ఉన్నత ప్రమాణాలతో, తక్కువ ఖర్చుతో ఎక్కువమందికి ప్రయోజనం చేకూర్చాలన్నదే ఈ గాంధీయన్ ఇంజినీరింగ్ పరమార్థం. ఇంతకూ, ఇది సాధ్యమా, అదెలా? వంటి ప్రశ్నలకు పై శాస్త్రవేత్తలు అత్యంత సముచితమైన రీతిలోనే సమాధానం ఇచ్చారు.
పూర్తిగా, విభిన్నంగా ఆలోచించడం గాంధీజీ శైలి. యాపిల్ సంస్థ ప్రారంభకులలో ఒకరైన స్టీవ్ జాబ్స్ (Steven Paul Jobs) కు గాంధీజీ అంటే వ్యక్తిగతమైన ఆరాధనాభావం ఉండేదని, విభిన్నంగా ఆలోచించే రీతికి గాంధీస్ఫూర్తి అనీ, జాబ్స్ జీవిత చరిత్రలో వాల్టర్ ఐజాక్సన్ (Walter Isaacson) అభిప్రాయపడ్డారు. పరిశోధనలు, ప్రయోగాల పేరిట జంతువులను, రకరకాల ప్రాణులను చంపడం గురించి త్రీవంగా వ్యతిరేకించిన గాంధీ అప్పట్లోనే ఒకమాట అన్నారు- రక్తప్రసరణను కనుగొన్న శాస్త్రవేత్త ఎంత జీవహింస చేశారో కదా! అని. కాస్త నెమ్మదిగా ఈ అంశంపై దృష్టి పెడితే గాంధీజీలోని భిన్నకోణం మనకు ద్యోతకమవుతుంది.

మషేల్కర్, ప్రహ్లాద్‌లు ఇరువురూ గాంధీయన్ ఇంజినీరింగ్‌ను, ఇన్నోవేషన్‌నూ ఇలా వివరించారు- డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ మేకింగ్ ఇంపాజిబుల్ పాజిబుల్ (విభిన్నంగా ఆచరించడం, అసాధ్యమైన దానిని సాధ్యపరుస్తూ, చేసే పనులలో వైవిధ్యభరితంగా సత్ఫలితాలను రాబట్టగలగడం). ఇదీ ఆ మహాత్ముని ఆలోచన. మషేల్కర్, ప్రహ్లాద్ ఇచ్చిన అయిదు ఉదాహరణలలో డా॥ పి.కె.సేథి నేతృత్వంలోని రామచంద్రశర్మ కృత్రిమపాదం ఒకటి. అమెరికాలో అథమపక్షం 12 వేల డాలర్లు అయ్యేది, కానీ 30 డాలర్ల ఖర్చుతో పదిరెట్లు దానిని మెరుగ్గా సాధించారు ఈ జైపూర్ పాదంతో! ఇటువంటి ఆవిష్కరణలు గాంధేయ సృజనాత్మక సాంకేతిక విజ్ఞానంతోనే సాధ్యం.
మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే కనీసం 20 ఏండ్లు పడుతుంది. సంప్రదాయ పద్ధతిలో అక్షరమాలతో ప్రారంభించకుండా పదాలను నేర్పడంతో మొదలుపెట్టి రెండు నెలలలోపు కనీసజ్ఞానాన్ని, తక్కువ ఖర్చుతో పొందవచ్చు. దీన్ని ఎఫ్.సి.కోహ్లి రూపొందించారు. ఇది గాంధీయన్ ఇంజినీరింగ్‌కు రెండవ ఉదాహరణ. ఎవరీ ఎఫ్.సి.కోహ్లి? అంటే, టిసిఎస్ (టాటా కన్సల్టెంట్ సర్వీసెస్) సంస్థాపకులు. మొత్తం మీద తక్షణ అవసరాలను తక్కువ ఖర్చుతో, త్వరగా, మెరుగ్గా సాధించడమే గాంధీజీ ఆలోచనా విధానంగా మనం అర్థం చేసుకోవాలి.

1920 దశాబ్దంలో చర్కాను మెరుగుపరిచే ఇంజినీరింగ్ ఇన్నోవేషన్‌కు ఏటా బహుమతులు ప్రకటించారు. ఈ బహుమతి మొత్తం 10 సంవత్సరాలలో రూ॥ 5,000 నుంచి లక్ష రూపాయల దాకా పెరిగింది. ఖాదీ అనేది కేవలం వస్త్రం కాదు. అది ఒక కట్టుకున్న భార్య వంటిది, ఓ ఆదర్శం (ఐడియా, ఐడియల్) అంటారు గాంధీజీ. నిజానికి దీన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు కూడా. కనుకనే ఆయన గతించి ఏడు దశాబ్దాలు అవుతున్నా ఇంకా కొన్ని అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా సమస్యలు కలుగుతై. ఇదే ఇంతవరకు జరిగింది. డా॥ ప్రాణ్ జీవన్ మెహతా 1909 నవంబర్ 8న గోపాలకృష్ణ గోఖలేకు రాసిన లేఖలో గాంధీజీని మహాత్మా అని సంబోధించారు. ఇది ఠాగోర్ పిలువడం కంటే చాలా ముందు. ఇలాంటి విషయాలు లోతుగా గమనించిన మషేల్కర్, సి.కె.ప్రహ్లాద్‌లు గాంధీజీ సాంకేతికతా వైజ్ఞానిక దృష్టిని ప్రపంచానికి చాటాలని దశాబ్దం క్రితం భావించడం విశేషం.

ఇంతేకాదు, అంతర్జాతీయంగా 800 రూపాయలకు లభించే హెపటైటిస్ వాక్సిన్ కేవలం 34 రూపాయలకు శాంతా బయోటిక్ వరప్రసాద్‌రెడ్డి సాధించారు. ప్రపంచవ్యాప్తంగా సగం మార్కెట్ వాడకాన్ని ఇదే కైవసం చేసుకొంది. ఇదీ గాంధీయన్ ఇంజినీరింగ్ విధానమే. నాలుగు నిమిషాలు తొక్కితే నాలుగు గంటలు వెలిగే ఎల్‌ఈడీ కెపాసిటర్‌ను సి.కె.ప్రహ్లాద్ శిష్యుడు ఆశీష్ గావ్‌డే రూపొందించారు. దాంతో సంబంధిత కెపాసిటర్‌ను 50 డాలర్ల ఖరీదునుంచి 5 డాలర్లకు తగ్గించారు ఆయన తన పరిశోధన ద్వారా. ఇలా బాపూజీ బాటలో వైజ్ఞానిక ఆలోచనలు చేస్తున్నది ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు. మాటలకన్నా చేతలు, వాటి ఫలితాలు ప్రధానమనే నిపుణులు వారు. ఇది మన బాపూజీ 150వ జయంతి సంవత్సరం. ఇప్పటికైనా ఆయనలోని విభిన్నమైన, సృజనాత్మకమైన, అత్యధిక ప్రయోజనకరమైన ఆలోచనలను మనం స్వీకరిద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలకు మనవంతు ఊతమిద్దాం.
-డా॥ నాగసూరి వేణుగోపాల్
సెల్: 94407 32392


ఆ పుస్తకంలో మరిన్ని విశేషాలు

Mahatma-Gandhi1
హింద్ స్వరాజ్ గ్రంథాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేక పోయామని భారత రాజకీయవేత్త, కాలమిస్టు సుధీంద్ర కులకర్ణి అంటారు. అది 275 పుటల గ్రంథం. ఇంగ్లాండ్ నుంచి దక్షిణాఫ్రికా వెళుతున్నప్పుడు గాంధీజీకి, ఆయన ఆప్తమిత్రుడు, ప్రఖ్యాత వైద్యుడు, లాయర్ అయిన డా॥ ప్రాణ్‌జీవన్ మెహతా (1864-1932)కు మధ్య విస్తృత చర్చ జరిగింది. తర్వాత గాంధీజీ కేవలం 4 రోజులలో దీనిని రచించారు. మధ్యలో కుడిచేయి సహకరించకపోతే సుమారు 40 పేజీలు ఎడమచేతితో రాశారు గాంధీజీ. తర్వాత 60 లైన్లను తీసివేయడం, అక్కడక్కడ కొన్ని పదాలు మార్చడం మినహా అందులో మరేమీ మార్పు చేయలేదాయన. ఈ పుస్తకంలో సైన్స్, టెక్నాలజీ, ఆధునీకరణ వంటి విషయాలను గాంధీజీ చర్చించారు.

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles