తెలంగాణ పాలనలో.. యువ ఐఏఎస్‌లు!


Wed,August 7, 2019 12:53 AM

శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుంది. ఈ స్ఫూర్తి మంత్రం అందిరికీ తెలుసు. కానీ, శ్రమను ఆయుధంగా చేసుకునేది.. విజయాన్ని బానిసగా మలుచుకునేది కొందరే. ఆ కోవకు చెందినవారే ఈ యువ ఐఏఎస్‌లు. సివిల్స్-2018లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణ పూర్తిచేసుకున్న యువ అధికారులు రాష్ట్ర పరిపాలనా విభాగంలోకి అడుగుపెడుతున్నారు.
ts-ias


మన సమస్యలు కండ్ల నిండా చూశాను..

అనుదీప్ దూరిశెట్టి, అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ) భద్రాచలం జిల్లా
ANUDEEP-DURISHETTY
ట్రైనీ ఐఏఎస్ అధికారిగా నాకు భద్రాచలం చాలా నేర్చుకునే అవకాశాన్ని కలిగించింది. స్వయంగా గిరిజనుల వద్దకు వెళ్లి వారి సమస్యలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులను చూసిన తరువాత ప్రభుత్వ పరిపాలనను అక్కడకు తీసుకువెళ్లడం ఛాలెంజింగ్‌లా ఉంది. భద్రాచలం జిల్లాల్లో గిరిజనులు, గిరిజనేతరుల సమస్య, గిరిజనుల పోడు భూముల సమస్యలున్నాయి. మైదాన ప్రాంతాల భూముల సమస్యలు ఉన్నాయి. వీటన్నింటితో పాటు గిరిజనులకు అన్ని ప్రాంతాల ప్రజలతో సమానంగా విద్య, వైద్యం,పోషకాహారం అందించాల్సి ఉంది...నా తండ్రి విద్యుత్ సంస్థలో ఉద్యోగి... నేను చదువుకునే రోజుల్లో రైతులు ఇంటికివచ్చి నా తండ్రికి కృతజ్ఞతలు తెలిపేవారు.. చిన్న ఉద్యోగి రైతులకు చెందిన సమస్యలు పరిష్కరిస్తే.. ఇంత చదువు చదివిన మనం ఏమి చేయాలి? ప్రజలకు సర్వీస్ ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించుకున్నాను.. అయితే నాకు ఐఏఎస్ కావాలనే కోరిక ఇంజినీరింగ్‌లోనే బలపడింది. పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు.. ర్యాంకు గురించి ఆలోచించకుండా సొంతగా చదివాను. సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్‌గా తెలంగాణలో చేయాలనుకున్నా.... ఫస్ట్ ర్యాంకు రావడంతో తెలంగాణలోనే వచ్చింది. సొంత రాష్ట్రంలో పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన నాకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు, ఇప్పటి స్వరాష్ట్ర తెలంగాణకు తేడా స్పష్టంగా కనిపిసున్నది. అప్పుడు ఉపాధి కోసం చాలా మంది గల్ఫ్‌కు వెళ్లే వాళ్లు.. ఇప్పుడు ఉపాధి ఇక్కడే దొరుకుతున్నది. అభివృద్ది చెందుతున్న తెలంగాణలో పని చేసే అవకాశం వచ్చింది. గ్రోత్ రేట్ బాగుంది. ఇక్కడి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. రైతుబంధు పథకం దేశంలో పీఎం కిసాన్ పథకమైంది. ఇలా అబివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నా... అధికారిగా అందరికీ న్యాయం చేయాలన్నదే నా కోరిక. తెలంగాణ యువ రాష్ట్రం... ఇక్కడ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఇక్కడి యువత చేరుకోవాలి. హైదరాబాద్ ఒక్కటే కాదు.. ఒక్కో జిల్లాను ఒక్కో నోడల్ హబ్‌లా అభివృద్ధి చేసుకోవాలి.

సివిల్స్ పోటీలో రాష్ట్ర విద్యార్థులు..

గతానికి ఇప్పటికీ చాలా మారింది.. 2011 వరకు పెద్దగా సివిల్స్‌పై తెలంగాణ విద్యార్థులు దృష్టి కేంద్రీకరించలేదు.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతున్నది. సివిల్స్‌ను తెలంగాణ యువత లక్ష్యంగా ఎంచుకుంటున్నది. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వాళ్లు తమపై తాము నమ్మకం ఉంచుకోవాలి? మనకు ఎందుకు రాదు అని ప్రశ్నించుకొని సాధిస్తామని ముందుకు కదలాలి... తెలంగాణ నుంచి టాపర్స్ వస్తారు... ఆ నమ ్మకం నాకుంది... సివిల్స్‌కు ప్రిపేర్ కావాలనుకునే విద్యార్థులందరికీ నావంతు సహకారం అందిస్తున్నాను. వెబ్‌సైట్, బ్లాగులో నేను రాసుకున్న నోట్స్ అందుబాటులో ఉంచాను... ఇప్పటికే 15 వేల డౌన్లోడ్స్ అయ్యాయి. anudeepdurishetty.in, anudeepblog లో నోట్స్ ఉన్నాయి, సందేహాలు తీరుస్తూ సలహాలు ఇస్తున్నా. [email protected] ద్వారా అభ్యర్థులు నన్ను సంప్రదించవచ్చు.

అభివృద్ధి సూపర్ ఫాస్ట్

మాసండ మగ్దలిన్ పెర్టిన్, (ట్రైనీ) అసిస్టెంట్ కలెక్టర్ వనపర్తి జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చాను. తెలంగాణ క్యాడర్ రావడం నాకు చాలా సంతోషం. శిక్షణలో భాగంగా చాలా జిల్లాలు తిరిగాం. పట్టణ, గ్రామాల ప్రజలతో మాట్లాడాం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం చాలా ఆసక్తిగా ఉంది. కొత్త రాష్ట్రంలో కొత్త సవాళ్లు, లక్ష్యాలు ఉన్నాయి. అన్నింటినీ అధిగమిస్తూ పురోభివృద్ధిలో ముందుకు వెళ్లడం గొప్ప విషయం. సముద్ర మట్టానికి ఎత్తున ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది. గ్రావిటీ ద్వారా నీరు అందుతున్న ప్రాంతాలు తక్కువే. వీటిని దృష్టిలో పెట్టుకొని మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం. ప్రాజెక్టు గురించి విన్నాను.. ప్రత్యక్షంగా చూస్తే గాని తెలియలేదు. నిజంగా చాలా పెద్ద ప్రాజెక్టు. తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బౌద్ధమతానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, నిజాంల కట్టడాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి ఆహార అలవాట్లు చాలా ప్రత్యేకం. హైదరాబాద్ బిర్యానీ సూపర్. వనపర్తి, గద్వాల, పోచంపల్లి ఇలా చాలా ప్రాంతాల్లో చేనేత కళ విలసిల్లుతున్నది. సివిల్స్ సాధించడం చాలా కష్టం అని అంటారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని, నిరంతరం స్ఫూర్తిని రగిలించుకుంటూ ముందుకు వెళ్తే అసాధ్యమేమి ఉండదు.

ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం

తేజాస్ నందపాల్ పవార్, (ట్రైనీ) అసిస్టెంట్ కలెక్టర్, కామారెడ్డి జిల్లా
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నుంచి వచ్చాను. నాకు తెలంగాణ క్యాడర్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. అభివృద్ధి, సంస్కృతి పరంగా రాష్ట్రం ఎంతో రిచ్. ముఖ్యమైన ప్రాంతాలు తిరిగాము. ఇక్కడిది యునిక్ కల్చర్. రోజురోజుకీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇక్కడి ఆహారం, సాంప్రదాయాలు నాకు చాలా నచ్చాయి. కామారెడ్డికి వెళ్తే ప్రజలు ఎంతో ఆదరణ చూపెట్టారు. సొంత గ్రామంలో ఉన్న ఫీలింగ్ కలుగుతున్నది. ఇక్కడి ప్రజలు ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. అద్భుతమైన కల్చర్ ఉంది.. నేను సైనిక్ స్కూల్‌లో చదివాను. ఎన్‌డీఏలో ఉద్యోగం సాధించాలి.. దేశానికి నా వంతు సేవ చేయాలని కోరిక ఉండేది. అయితే ఎన్‌డీఏకు సెలెక్ట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అవకాశం చేజారింది. అందరూ అదే యూనివర్సిటీల్లో చేరుతారు.. అందరూ అవే పుస్తకాలు చదువుతారు.. కానీ టాపర్ మాత్రం ఒక్కరే ఉంటారు.

లర్నింగ్ ప్రాసెస్ అనేది ముఖ్యం. నాలెడ్జ్ అనేది ఒక్క రోజు.. వారం.. సంవత్సరంలోనో వచ్చేది కాదు. ఇది నిరంత ప్రక్రియ. స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పరిస్థితులు, అనుభవాలు.. ఇలా ప్రతీ దాని నుంచి కొంత నాలెడ్జ్ వస్తుంది. అంతే తప్ప అప్పటికప్పుడే రాదు. ఏదైనా సాధించాలంటే నాలెడ్జ్, స్కిల్, పర్సనాలిటీ అనేవి చాలా ముఖ్యం. ఏది కావాలో ఎంపిక చేసుకునే అవకాశం పిల్లలకు ఉండాలి. ఎవరో సివిల్స్ ర్యాంకు కొట్టారని, ఇంకెవరో సాఫ్ట్‌వేర్ అయ్యారని.. లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవద్దు. మా తల్లిదండ్రులు నాకు ముందు నుంచి స్వేచ్ఛను ఇచ్చారు. మార్కులు మాత్రమే చూసి ఎవర్నీ అంచనా వేయలేం.

ఇక్కడి విద్యార్థినే

బుడుమజ్జి సత్యప్రసాద్, ట్రైనీ ఐఏఎస్ (వెయిటింగ్)
మాది ఏపీలోని విజయనగరం జిల్లా. హైదరాబాద్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇంటర్ ఇక్కడే చేశాను. నాడు విద్యార్థిగా ఉన్నాను.. నేడు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎదిగాను. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. శిక్షణలో భాగంగా హైదరాబాద్ సహా, పలు జిల్లాలు సందర్శించాము. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి అక్కడి వైద్యం గురించి తెలుసుకున్నాం. ఇక్కడి ఆసుపత్రులు చాలా బాగున్నాయి. హైదరాబాద్‌కు మెట్రో ఒక మణిహారం. చాలా ఆకర్షణీయంగా ఉంది. గతంలో కంటే ఇప్పటికి ట్రాఫిక్ పెరిగింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఎంఎన్‌సీ కంపెనీలు ఉన్నాయి. ఐటీ రంగంలో ప్రత్యేక ముద్ర వేసింది. చిన్నతనంలో వార్తా పత్రికలు ఎక్కువగా చదివేవాడిని. ముఖ్యంగా జిల్లా ట్యాబ్‌లాయిడ్స్ చూసేవాడిని. అందులో అధికారుల గురించి చదువడం వల్ల నాకు స్ఫూర్తి కలిగింది. కళాశాలలో ఉండగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ప్రసంగం నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. సివిల్స్ ద్వారానే సేవ చేయడం సాధ్యమని చాలా మంది అనుకుంటారు.. మంచిదే. కానీ సేవ చేయాలనుకుంటే చాలా మార్గాలున్నాయి. ఏ రంగానికైనా దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది.

సొంత రాష్ట్రానికి సేవ

కోయ శ్రీహర్ష అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) జోగులాంబ గద్వాల జిల్లా
భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ ముందున్నది.. పౌరసరఫరాల విభాగంలో పేదలకు ఇచ్చే రేషన్ పక్కదారి పట్టడానికి అవకాశం లేకుండా టెక్నాలజీని బాగా వాడుతున్నారు. అత్యంత ఆధునికమైన టెక్నాలజీని వినియోగించి చాలా క్రియేటీవ్ ఐడియాతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో పట్టుదలగా నిర్మించింది. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో నీళ్లున్నాయి. గోదావరి నీటిని పూర్తి స్థాయిలో కృష్ణా బేసిన్‌లో కూడ వినియోగించుకునే ప్రణాళికలు రూపొందించడమనేది క్రియేటీవ్ ఐడియానే.. నాది ఖమ్మం జిల్లా.. స్కూల్ విద్య అంతా ఖమ్మంలోనే జరిగింది.

అయితే ఇంటర్‌కు మాత్రం హైదరాబాద్ వచ్చి చదువుకున్నాను. అప్పుడు నాకు ఖమ్మం, హైదరాబాద్ తప్ప ఏదీ తెలియదు.. చాలామందికి స్వరాష్ట్రంలో పనిచేసే అవకాశం రాదు.. కానీ నాకు ర్యాంకు రావడం వల్ల పురిటి గడ్డపై పనిచేసే అవకాశం వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది.గద్వాలకు వెళ్లిన తరువాతనే అసలైన తెలంగాణను నా కళ్లతో చూడగలిగాను. అక్కడి పేదల కష్టాలు చూశాను.. ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. అలా వెనుకబడి ఉన్న ప్రజలను అభివృద్ధి చేయాలన్న పట్టుదల నాకు కలిగింది. తెలంగాణలో చాలామంది విద్యార్థులు సివిల్స్ వైపు వెళ్లడం లేదు. తెలంగాణ సమాజానికి సేవ చేయడానికి సివిల్స్‌ను ఒక లక్ష్యంగా ఎన్నుకోవాలని విద్యార్థులను కోరుతున్నా.

-తిప్పన కోటిరెడ్డి, సిద్ధార్థ్ బీసగోని
-జి. భాస్కర్

1430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles