అత్యద్భుత శక్తి మంత్రం!


Fri,August 9, 2019 12:54 AM

మానవాళికి విద్య, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులను అన్నింటినీ ప్రసాదించే ఏకైక మంత్రరాజం గాయత్రి. త్రికరణ శుద్ధిగా నిత్యం దీనిని స్మరించే వారికి ఆత్మచైతన్యంతోపాటు దివ్యతేజస్సూ సొంతమవుతుందని భారతీయ శాస్ర్తాలు చెబుతున్నాయి.
Vela-vishesham
అసలు గాయత్రీ మాత ఎవరో తెలిస్తే ఆమెలోని అత్యద్భుత శక్తి మనకు అర్థమవుతుంది. సమస్త జగత్ సృష్టికారిణి సాక్షాత్ ఆదిపరాశక్తికి ఆమె ప్రతీకాత్మక దేవత. సర్వదేవతల ఆవిర్భావ మూలస్వరూపమూ ఆమెనే. 24 బీజాక్షరాలతో కూడిన ఆమె ఆరాధనా జపజలానికి ఉన్న శక్తి అనంతం. పవిత్రజలాన్ని ఈ మంత్రంతో ఆవాహన పరిచి పైకి విసిరిన ఫలితంగా ఆ నీళ్లు కాస్తా వజ్రాలుగా మారిన వైనం కృతయుగంలో జరిగినట్టు ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. నేటికీ ఈ మంత్రజలశక్తి మన భౌతిక నేత్రాలకు కనిపించని ఫలాలనిస్తుందని, దీనికి ఎందరో మహానుభావుల జీవితచరిత్రలే నిదర్శనమనీ వారంటారు. భర్గస్సు (భర్గో దేవస్య) అనే తేజోశక్తి ఆరాధనే గాయత్రీ మంత్రజపం. వేగిన, ఉడకబెట్టిన విత్తనాలను సైతం మొలకెత్తింపజేసే అనూహ్య ప్రాణశక్తి ఈమె సొంతం. త్రికాల సంధ్యోపాసకులకు, నాలుగో సంధ్యకాలం (అర్ధరాత్రి)లోనూ జపతపాలు చేసుకొనే యోగులకు గాయత్రీ మంత్రం నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం. తల్లిని మించిన దైవం లేదన్నది ఎంత నిజమో గాయత్రిని మించిన మంత్రమూ లేదన్నది అంతే సత్యమని జగద్గురువు ఆదిశంకర భగవత్పాదుల వారే తేల్చేశారు. ఇందులోని రెండు జతల బీజాక్షరాల్లో ఒక్కోటి ఒక్కో దేవతాశక్తికి ప్రతీకలుగా పండితులు చెప్తారు. అందుకే, అంతటి అసాధారణ శక్తి సంపన్నురాలిగా గాయత్రీ మాతను వారు అభివర్ణిస్తారు.


అయిదు ముఖాలు, పది చేతులతో మహాతేజస్సుతో వెలుగొందే, గాయత్రీమాత ప్రతీ సంవత్సరం శరన్నవరాత్రులలో వరదాభయ హస్తాలతో దీవించే కమలాసనగా దర్శనమిస్తుంది. అలాగే, శుభ శ్రావణమాస పౌర్ణమి వెండివెలుగుల వేళ గాయత్రీ ఉపాసనకు ప్రతిబంబం వంటి యజ్ఞోపవీతాన్ని వేదపండితులంతా విధిగా కొత్తది పునర్ధరిస్తారు. ఉపనయమైన బ్రహ్మచారులంతా ఈరోజు తప్పనిసరిగా ఉపాకర్మ ఆచరిస్తారు. అందుకే, ఇది జంధ్యాల పున్నమిగానూ పేరొందింది. ఈ మంత్రం ఆదివేదమైన ఋగ్వేదంలోనే మొట్టమొదట దర్శనమిచ్చినట్లు వేదపండితులు చెప్తారు. భారతీయ ధార్మికమంత్రాలేవీ చాలావరకు రహస్యాలుగా లేవు. అందరూ చదువుకోవడానికి వీలుగా అందుబాటులోకి వచ్చాయి. గాయత్రీ మంత్రం సీడీలలోనూ అందుబాటులోకి వచ్చింది. దీనిని విన్నా, స్మరించినా లభించే పుణ్యం అనంతం. ఈ పున్నమి రోజే కాదు, ప్రతిరోజూ ఉదయ- సాయంత్రాలలో ప్రతి ఒక్కరూ శుచి శుభ్రతలతో ఎంత వీలైతే అంతసేపు వ్యక్తిగతంగా మనసులోనే ఈ జపాన్ని చేసుకోవచ్చు. కాకపోతే, ఉచ్ఛారణ దోషాలు రాకుండా చూసుకోగలిగితే ఎంతో మంచిది. ఏమైనా, ఈ జపప్రభావం ఊరికే పోదని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు.
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1196
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles