నర్మద పరిక్రమ


Fri,August 9, 2019 12:57 AM

ఆదిశంకరుల దీక్షాస్థలి!

(గత సంచిక తరువాయి)
Narmada
* నర్మదానది ఒడ్డునగల పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఎక్కువమంది భక్తులు సందర్శించేది ఈ ఓంకారేశ్వరుడి ఆలయాన్నే!

అక్కడ ఓ పాశ్చాత్య జంట కనిపించింది. వాళ్ల అనుమతితో వారి ఫొటోలు తీశాను. అతని పేరు మిఖాయిల్ బ్రెండెల్. ఇద్దరూ జర్మనీనుంచి వచ్చారు. వారు హిందూ సంప్రదాయం ప్రకారం కూర్చొని హోమం చేస్తున్నారు. మాటల్లో నేను వారితో చెప్పాను.
తూర్పు దేశాల్లో ఆధ్యాత్మిక సంపద అత్యధికం. అద్వైత సిద్ధాంతం ఇక్కడి గని. దాన్ని సాధ్యమైనంత ఎక్కువ పొందాలి.
నేను తీసిన ఫొటోలు పంపడానికి తమ మెయిల్ ఐడీ ఇచ్చాడతను. తర్వాత వారికి వెంకటేశ్వరరావు వాటిని పంపితే, థ్యాంక్స్ చెపుతూ తను తీసిన ఓంకారేశ్వర్ రాజమహల్ ఫొటోలు మా ఇద్దరికీ పంపాడు మిఖాయిల్.

మధ్యప్రదేశ్‌లో భక్తులు అధికంగా వచ్చే ఆలయం ఓంకారేశ్వర్. గుళ్లోంచి బయటకు రాగానే పక్కనే ఓ చిన్న గుహ ఉంది. మన జగద్గురువు ఆదిశంకరాచార్యకే గురువైన గోవిందతీర్థుల వారు ఈ గుహలోనే ఉండేవారని చెప్తారు. ఆదిశంకరాచార్యుల వారు కొన్ని వందల ఏండ్ల క్రితం గోవిందతీర్థుల వారిని కలుసుకొన్న ప్రదేశమూ ఇదే. ఈ క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యుల వారికి ఆయన సన్యాసదీక్ష ఇచ్చారనీ అంటారు. దర్శనం అయ్యాక పడవరేవుకు తిరిగి వెళ్లేదారిలో అటు ఇటు అనేక దుకాణాలు ఉన్నాయి. శివలింగాలు, దేవుళ్ల ప్రతిమలు, పూజా సామగ్రి, హిందీ భక్తి పుస్తకాలు, అనేక దేవుళ్ల ఫొటోలు అమ్ముతున్నారు. కొన్ని షాపుల్లోంచి భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్వరరావు నర్మద పరిక్రమ సీడీల సెట్‌ను డెబ్బయి రూపాయలు ఇచ్చి చెరొకటి కొన్నారు. మళ్లీ మెట్లు దిగి పడవల్లో ఆవలి ఒడ్డుకు చేరుకున్నాం.

నర్మద నది పరిక్రమకు ముందు దీక్షను తీసుకోవాలి. అందుకు అందరం నదిలో స్నానాలు చేశాం. నర్మదలో స్నానాలు చేసే తీరాలు తక్కువ. హోషంగాపూర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, నాపేశ్వర్, నారేశ్వర్, గరుడేశ్వర్ ప్రదేశాలలో భక్తులు అధికంగా స్నానాలు చేస్తుంటారు. నర్మదానది ఒడ్డునగల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఎక్కువమంది ప్రజలు సందర్శించేది ఈ ఓంకారేశ్వరుడి ఆలయాన్నే. అధికంగా ఉన్నవి హనుమంతుడి ఆలయాలు, తర్వాత శివాలయాలే. నర్మదీయ బ్రాహ్మణులు నర్మదమాతను పూజిస్తారు. కాబట్టి, నర్మద ఆలయాలు కూడా తీరప్రాంతాలలో చాలానే ఉన్నాయి. ప్రభు మాట్లాడిన ఓ పురోహితుడు ఓ కలశంలో నర్మద నీటిని నింపి దానికి పావుగంటకు పైగా చేశాడు. అందులోని జలాన్ని అందరిపైనా చిలకరించాడు. అందరి చేతులకు కంకణ దారాన్ని కట్టి, దీక్షను ఇచ్చాడు. పూజ పూర్తయ్యాక బ్రాహ్మణుడికి దక్షిణగా తలో ఇరవై రూపాయలు ఇవ్వమన్నారు దేశాయ్.

నర్మద పరిక్రమ నియమాలు

పరిక్రమ వాసులు పాటించవలసిన నియమాలను దేశాయ్ మాకు చెప్పారు. వాటిలో ప్రధానమైవి ఇవీ:
-దీక్షను పూర్తయ్యేదాకా నదిని ఎక్కడా దాటకూడదు.
-కనీస ద్రవ్యం, వస్తువులనే వెంట ఉంచుకోవాలి. (ఉదా॥కు ఒంటిమీద ఓ జత- సంచీలో మరొక జత దుస్తులు చాలు).
-భోజనం యాచించకుండా, లభించిందే తినాలి. (అక్కడి గ్రామస్థులే పిలిచి భోజనం పెడతారు. గోధుమరొట్టెలో పచ్చిమిర్చి, -ఉప్పు కలిపి నూరిన పచ్చడిని నంచుకొని తినాలి. మజ్జిగ తాగాలి. అంతే).
-కందిపప్పు, బఠానీలను పరిక్రమవాసులు తినకూడదు.
-కాళ్లకు చెప్పులు ధరించకూడదు.
-సాయంత్రం హారతి ఇవ్వాలి.
-ఓ సీసాలో నర్మదాజలం సేకరించి పరిక్రమ మొదటినుంచి పూర్తయ్యేదాకా నిత్యం నర్మదామాతకు పూజ చేయాలి. -చాతుర్మాస సమయంలో 4 నెలలు ఆగిపోవాలి. (ఆ సమయంలో పరిక్రమ ప్రయాణం చేయకూడదు. అంటే, మూడేండ్ల పరిక్రమలో ఏడాదికి 4 నెలలు చొప్పున 12 నెలలు పరిక్రమను ఆపేయాలన్న మాట.)
పరిక్రమ వాసులు అందరినీ ఓం నర్మదే హర అనే మాటలతో పలకరించాలి.

mvk murthy
మల్లాది వెంకట కృష్ణమూర్తి

theertha-yatra
తీర్థయాత్ర

-సశేషం

711
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles