ఇంతింత కాదయా.. ఇజ్రాయేల్ ఘనత


Sat,August 10, 2019 01:05 AM

రహదారుల మీద ట్రాఫిక్ పోలీసుల్లేరుకాలుష్యం లేదు.. చెత్త కనిపించదు స్థానిక నిర్మాణ సామగ్రితో నిర్మాణాలు ఆధునిక తరహాలోఅపార్టుమెంట్ల నిర్మాణం ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్న ఇజ్రాయేల్ గొప్పతనమంతా.. అక్కడి ప్రజల్లోనే ఉన్నది. వీరికి తమ దేశం పట్ల ఎంతో ప్రేమ ఉండటమే కాదు.. వారి వ్యవహారశైలిలోనూ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం నిబంధనల్ని ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నదో.. ప్రజలూ వాటిని అదే స్థాయిలో స్వచ్ఛందంగా పాటిస్తుండటం విశేషం.
Israel
ఇజ్రాయేల్‌ని చూసి మనమెంతో నేర్చుకోవాల్సిన అవసరముంది. 650 చదరపు కిలోమీటర్ల వైశాల్యం.. 90 లక్షల జనాభా గల ఈ దేశ ప్రజలు ట్రాఫిక్ నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తున్నారు. అసలు ఎక్కడా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించనే కనిపించడు. ప్రతిఒక్కరూ ఒక పద్ధతిగా రహదారుల మీద ప్రయాణం చేస్తున్నారే తప్ప.. ఎక్కడ నిబంధనలను అతిక్రమిస్తున్నట్టు కనిపించలేదు. గొప్ప విషయం ఏమిటంటే.. పాదాచారులకు ప్రతిఒక్కరూ ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరైనా రోడ్డు దాటుతుంటే.. కారు అయినా, బస్సు అయినా నిలిపివేస్తున్నారు. పాదాచారులు రోడ్డు దాటిన తర్వాతే ముందుకు వెళ్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో ఎవరికీ వారే స్వచ్ఛందంగా టికెట్లు తీసుకుని, వాహనాల్ని క్రమపద్ధతిలో నిలుపుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం నగరమంతటా సీసీ టీవీ కెమెరాలను బిగించడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసులకు క్షణాల్లో తెలిసిపోతోంది.

బాధ్యతాయుతంగా ప్రజలు

ఇజ్రాయేల్ ప్రజల గొప్పతనమేమిటంటే.. అధిక శాతం మంది బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక సంస్థలు పరిసరాల్ని ఎంత పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయో, ప్రజలూ అదే రీతిలో తమ వంతు బాధ్యతతో మెలుగుతున్నారు. రోడ్డు మీద చెత్త వేయడమనేది ఎక్కడా కనిపించలేదు. అందుకే, ఇక్కడి పరిసరాలెంతో పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. జెరుసలేంలోని టెల్ అవీవ్‌లో రహదారులన్నీ తళతళ మెరుస్తున్నాయి. పైగా, ఉద్యానవనాల్ని సైతం ప్రజలెంతో పద్ధతిగా వినియోగిస్తున్నారు. టెల్ అవీవ్‌లో ఎక్కువ శాతం ప్రజలు సైకిల్ వినియోగించడానికే ఇష్టపడుతున్నారు. కోటీశ్వరులు సైతం ఆఫీసులకు వెళ్లడానికి సైకిల్‌ను వాడుతుండటం విశేషం.

ఒకే రంగులో ఇండ్లు

ఇజ్రాయేల్‌లో భవనాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. వాటి నిర్మాణానికి స్థానికంగా దొరికే సున్నపు రాయిని విరివిగా వినియోగిస్తున్నారు. విమానాశ్రయం దగ్గర్నుంచి జెరుసలేం వరకూ నిర్మాణాలన్నీ ఒకే రంగులో ఉండటం విశేషం. వ్యక్తిగత గృహాలు, అపార్టుమెంట్లు షేర్‌వాల్ పరిజ్ఞానంతో కడుతుండగా.. కాస్త ఖరీదైన గృహాల పైభాగాన్ని స్థానికంగా లభించే ఎర్రటి టైళ్లను వాడుతున్నారు. అయితే, టెల్ అవీవ్‌లో మాత్రం వాణిజ్య భవనాలు తెలుపు, బూడిదరంగుల్లోనే ఎక్కువగా దర్శనమిచ్చాయి. వీటి నిర్మాణంలోనూ పెద్దగా హడావిడి కనిపించలేదు. కార్మికుల హడావిడీ లేదు. నిర్మాణంలో పూర్తిస్థాయి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండటం విశేషం. మన మెట్రోను నిర్మించినట్లే.. భవనానికి సంబంధించిన శ్లాబులను సిమెంట్ సాయంతో ఒక చోట తయారుచేసి.. సైటు వద్దకు వాటిని తీసుకొచ్చి క్రమ పద్ధతిలో బిగిస్తున్నారు. ఇలా, పదిహేను, ఇరవై అంతస్తుల ఆకాశహార్మ్యమైనా సులువుగా కట్టేస్తున్నారు. బరనోవిట్జ్ తరహాలో టెల్ అవీవ్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. సంప్రదాయ విధానంతో పోలిస్తే దీని వల్ల 45 శాతం ఖర్చు తగ్గుతుంది. టెల్ అవీవ్ సముద్రం ఒడ్డున ఉండటంతో.. ఒకవేళ సునామీ వస్తే ప్రజలు ఎటువైపు వెళితే క్షేమమో చెప్పే బోర్డులను ప్రతి ప్రాంతంలోనూ ఏర్పాటు చేశారు.

స్టార్టప్‌లకు చిరునామా

పురాతమైన నగరంగా ఖ్యాతిగాంచిన ఆక్కో నగర వారసత్వ సంపదకు ఎక్కడా భంగం కలిగించకుండా ఆధునిక స్థాయిలో అభివృద్ధి చేశారు. కొన్నేండ్ల క్రితమే ఈ నగరం నుంచి ఇతర దేశాలకు వాణిజ్యం జరిగేది. ఆక్కో సిటీ నుంచి సముద్రం వరకూ ఉన్న ప్రత్యేక సొరంగమార్గం నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సముద్ర తీరంలో ఉన్న ఇండ్లన్నీ ఒకే పద్ధతిలో నిర్మించి ఉండగా.. ప్రతి ఇంటి మీద ప్రత్యేకంగా సోలార్ ఏర్పాటు చేసి ఉండటం విశేషం. ఇంటెల్, గూగుల్, యాహూ, క్వాల్‌కామ్ వంటి అనేక ఐటీ సంస్థలకు ఇజ్రాయేల్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టెల్ అవీవ్‌ను స్టార్టప్స్ నగరంగా అభివర్ణిస్తారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఇక్కడి యువత విరివిగా వినియోగిస్తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలను పరిష్కరించడానికి స్టార్టప్ సంస్థలు ముందుకొస్తుండటం విశేషం.

3215
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles