వైభవంగా క్రెడాయ్ న్యాట్‌కాన్


Sat,August 10, 2019 01:06 AM

మూడు రోజులపాటు ఇజ్రాయేల్‌లోని టెల్ అవీవ్‌లో జరిగిన క్రెడాయ్ న్యాట్‌కాన్ 2019 సమావేశం అట్టహాసంగా జరిగింది. దాదాపు పద్దెనిమిదికి పైగా సెషన్లు జరగ్గా.. అంతర్జాతీయ నిపుణులు పలు కీలక అంశాల గురించి సభకు వివరించారు. నిర్మాణ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన తీరు, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాల్ని ప్రత్యేకంగా వివరించారు. స్టార్టప్ నేషన్‌గా పిలవబడే ఇజ్రాయేల్ దేశీయ పరిస్థితులు భారత నిర్మాణ రంగంతో చక్కగా సరిపోతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్ని సమర్థంగా అధిగమించడమే కాకుండా.. పరిస్థితులకు తగ్గట్టుగా వినూత్న నిర్ణయాలతో ముందుకెళితేనే దేశమైనా, నిర్మాణ రంగమైనా నిలబడుతుందని వక్తలు తెలిపారు.

ఇందుకోసం దేశానికైనా, రాష్ర్టానికైనా సమర్థులైన నాయకులు ఉండాలి. అదే విధంగా నిర్మాణ సంస్థ రథసారథి ఆలోచనాపూరితమైన నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు. ఒకవేళ పడినా అధైర్యపడకుండా, అదే స్పీడులో మళ్లీ లేచి నిలబడగలిగే ఆత్మైస్థెర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. అరవై లక్షల మంది యూదులను ప్రపంచవ్యాప్తంగా ఊచకోత కోసినా.. నాలుగు వైపుల నుంచి శత్రువులతో ప్రతినిత్యం పోరాటం చేస్తూనే.. ఇజ్రాయేల్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుందని చెప్పారు. ప్రకృతి నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ, మేథోసంపత్తితో ముందుకు దూసుకెళుతున్నామని వివరించారు. ఇదే స్థాయిలో నిర్మాణ రంగానికి చెందిన యజమానులు ముందుకు దూసుకెళ్లాలని సూచించారు.

Natcon

టెల్ అవీవ్ నుంచి కింగ్ జాన్సన్ కొయ్యడ

నిర్మాణ రంగం కష్టకాలంలో ఉన్నదని.. కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఆదుకోవాలని క్రెడాయ్.. టెల్ అవీవ్ వేదికగా కోరింది. లేకపోతే, ఈ రంగంపై ఆధారపడ్డ 150కి పైగా పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయని అభిప్రాయపడింది. ఉక్కు పరిశ్రమలు వంటివి వారంలో రెండు, మూడు రోజులపాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయని తెలియజేసింది. భారత జీడీపీకి సుమారు 6.7 శాతం నిర్మాణ రంగం నుంచే వస్తున్నదని, పైగా వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పించేది నిర్మాణ రంగమేనని గుర్తు చేసింది. కాబట్టి, ఈ రంగం పురోగతి చెందేలా కేంద్రం పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలని సూచించింది. ఇన్‌సాల్వెన్సీ చట్టానికి కొత్తరూపమివ్వాలని కోరింది. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల కొరతను పరిష్కరించే విధంగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం నిర్మాణ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదని, ఇదే సమయంలో కేంద్రం ఆదుకోవాలని కోరింది. మొదటిసారి ఇల్లు కొనుక్కునేవారికి ఏడున్నర శాతం వడ్డీకే గృహరుణాన్ని అందజేసేలా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది.

మారుతున్న మిలీనియల్స్ తీరు..


credai
ఆసియా పసిఫిక్ దేశాల్లో మిలీనియల్స్ వ్యవహరిస్తున్న తీరు, ఇంటి కొనుగోలుకు సంబంధించి వారి ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయాన్ని స్పష్టంగా ఒక సెషన్‌లో వివరించారు. 22-29 ఏండ్ల మధ్యలో ఉన్నవారిని మిలీనియల్స్‌గా పిలుస్తారు. ఇందులో 25 శాతానికి పైగా యువకులు ఉద్యోగం చేస్తున్నవారే. భారతదేశంలో దాదాపు 90 శాతం మంది సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
-ట్రాఫిక్ రణగొణధ్వనుల్ని మిలీనియల్స్ ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఇంటి నుంచి ఆఫీసుకు సులువుగా వెళ్లడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. భారతదేశంలో అధిక శాతం మిలీనియల్స్ సుమారు 42 నిమిషాల్లో ఆఫీసులకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ చేరువలో అధిక శాతం మంది స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. 70 శాతం మంది నవ యువకులు ఆఫీసుకు సమీపంలో ఉండటానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సుమారు 15 శాతం మంది మిలీనియల్స్ సొంత ఆఫీసులను ఏర్పాటు చేయడానికే ప్రయత్నిస్తున్నారు.

-నెలసరి జీతంలో మిలీనియల్స్ దాదాపు 18 శాతం సొమ్మును పొదుపు చేస్తుండటం విశేషం. 20 శాతం మంది స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. సినిమాలు, కన్సర్ట్‌ల కోసం సొమ్మును వెచ్చించేవారి సంఖ్య తక్కువేం కాదు.

-క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ యూత్ వింగ్ సభ్యులు, ఇతరులు కలిసి న్యాట్‌కాన్ సదస్సును నిర్వహించడంలో విజయం సాధించారు. సదస్సు ఆరంభానికి ముందు వీసాలను మంజూరు చేయడం వద్ద నుంచి డెవలపర్లందరూ క్షేమంగా తమ స్వస్థలాలకు చేరుకునే వరకూ పకడ్బందీగా వ్యవహరించారు. దీంతో, నిర్వాహకులను సభ్యులందరూ ప్రశంసలతో ముంచెత్తారు.

యువత కచ్చితంగా ఆర్మీలో సేవచేయాలి.

ఇజ్రాయేల్ పోరాట పటిమను ప్రశంసించాల్సిందే. వారి సరిహద్దులు, అస్థిత్వం కోసం జోర్డాన్, పాలస్తీనా, లిబియా, సిరియా దేశాలతో పోరాడుతున్నారు. ఇజ్రాయేల్ గత ఐదారు ఏండ్లుగా భారతదేశంతో మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తుంది. ఇజ్రాయేల్ దేశం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది. 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సులో ప్రతిఒక్కరూ మూడేండ్ల పాటు సైన్యంలో సేవ చేయాలని నిబంధన ఉంటుంది. సవాళ్లను అవకాశాలుగా మార్చడంలో ఈవిధమైన క్రమశిక్షణ వారికి ఎంతో ఉపయోగపడుతోంది. మన దేశంలోనూ ఈ విధానాన్ని అవలంభించాలి. యువత కచ్చితంగా 2-3 ఏండ్లు ఆర్మీ లేదా సంబంధిత సేవల్లో పనిచేయాలని నిబంధనను అమలు చేయాలి.
Ramreddy1

- గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ

మనమూ ఇజ్రాయేల్లా ఆర్థికంగా ఎదగొచ్చు.

మేం ఊహించిన దానికంటే న్యాట్‌కాన్-2019 విజయవంతమైంది. ఈ దేశంలో వినియోగిస్తున్న సరికొత్త పరిజ్ఞానం గురించి తెలిసింది. నిర్మాణ రంగంలో అనుసరిస్తోన్న ఆధునిక పోకడలపై డెవలపర్లకు అవగాహన పెరిగింది. నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, నిర్మాణాల్లో పరిజ్ఞానం వంటి అంశాలపై కొత్త విషయాలు తెలిశాయి. ఇజ్రాయేల్ ప్రభుత్వం పౌరుల భద్రత, కఠినమైన చట్టాలను ఎంతో పటిష్టంగా అమలు చేస్తోంది. కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గించేందుకు అన్ని రంగాల్లోనూ స్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇజ్రాయేల్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను మన దేశంలోనూ అమలు చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. సంస్కృతి, ఆర్థిక విధానం అమలులో భారతదేశం ఎంతో ముందుంది. దేశంలోని ప్రతి రాష్ర్టానికీ ఇజ్రాయేల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అవకాశం ఉంది.
Radha-krishna
- రాధాకృష్ణ, బిజినెస్ హెడ్, ఏషియా పసిఫిక్

క్రెడాయ్ నిర్వహించిన న్యాట్‌కాన్ 2019లో భారతదేశంలోని 200 నగరాల నుంచి దాదాపు 12 వేల మంది డెవలపర్లు పాల్గొన్నారు. వీరిలో దక్షిణం నుంచి వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉన్నది. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందలకు పైగా డెవలపర్లు ఈ సదస్సులో పాల్గొనడం విశేషం.

348
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles