సాధారణ సమస్యలు కావు.. క్యాన్సర్ కారకాలు!


Mon,August 12, 2019 11:42 PM

కొందరికి బాగా తలనొప్పి వస్తుంది. పని ఒత్తిడిలే అనుకుంటారు. ఆయాసం వస్తే.. తిన్నది జీర్ణంగాక కావచ్చు అనుకుంటారు. విపరీతమైన గొంతునొప్పి వస్తే.. వాతావరణంలో మార్పులనుకుంటారు. కానీ.. వీటిలో ఏది తీవ్రంగా ఉన్నా అది క్యాన్సర్‌కు దారితీస్తుందనే విషయం తెలుసుకోరు!
Pancreatic-Cancer
జ్వరంగా ఉందనుకోండి.. ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరకు గానీ.. మెడికల్ షాప్‌కు గానీ వెళ్లడానికి కుదరదు. కారణం బిజీలైఫ్. ఏవైనా గడ్డలైతే ఏం చేస్తాం? వేడి చేయడం వల్ల అలా అయుండొచ్చు.. గతంలో తగిలిన దెబ్బల చిహ్నాలై ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఇవేంటి అని జాగ్రత్త పడని వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు క్యాన్సర్ గురించి తెలియదు. పైగా వీటన్నింటినీ లైట్‌గా తీసుకుంటారు.

ఎందుకు?: నిరక్షరాస్యత.. గ్రామీణ నేపథ్యం.. ఆర్థిక పరిస్థితులు.. అమాయకత్వం వంటివి ఇలాంటి ఆరోగ్య సమస్యలకు ఒక కారణం అయితే బిజీలైఫ్ మరో కారణం. ఫోన్లోనో లేక ఇంటర్నెట్‌లోనో వైద్య సలహాలు పొందుతారు. వీటివల్ల తాత్కాలిక ఉపశమనం వస్తుండొచ్చు కానీ దీర్ఘకాలికంగా అలాగే ఉంటే మాత్రం క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లే.

అవగాహన అవసరం: క్యాన్సర్‌ను గుర్తించాలంటే ముందు ఆ వ్యాధిపట్ల అవగాహన కావాలి. ముందు దశలోనే దానిని గుర్తిస్తే ఆధునిక వైద్య చికిత్సలను అనుసరించి నయం చేసుకోవచ్చు. అందుకోసం అత్యాధునిక విధానంలో చికిత్స అందించేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ పని పడితే ఆరోగ్యంగా ఉండొచ్చు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాలంటే కొన్ని సర్వ సాధారణ లక్షణాలను గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి, గొంతునొప్పి, ఆయాసం, దగ్గు, కడుపు ఉబ్బరం, మూత్ర వ్యవస్థలో తేడాలు, మలవిసర్జన సమస్యలు గుర్తించి డాక్టర్‌ను సంప్రదిస్తే క్యాన్సర్‌ను అరికట్టవచ్చు.

తలనొప్పి: మామూలుగా అందరికీ వస్తుంది. చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రెయిన్ లేక అప్పుడప్పుడు తలనొప్పి రావటం సహజమే. తలనొప్పి లక్షణాలు కన్పించగానే సొంత వైద్యం చేసుకునేందుకు ఎడాపెడా ఇష్టమొచ్చిన మందులు వాడితే లివర్, కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ముందుగా చేయాల్సింది తలనొప్పికి కారణం తెలుసుకోవాలి. నిర్దిష్టకాలం పాటు సరైన మందులు వాడాలి. ఇలా చేస్తేనే సమస్యను అధిగమించవచ్చు.

గొంతునొప్పి: చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల.. వాతావరణంలో మార్పుల వల్ల.. ఏదైనా కొత్తప్రదేశానికి వెళ్లినప్పుడు.. గొంతు సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు రెండు మూడు రోజుల్లో తగ్గకపొతే డాక్టర్ సలహా ప్రకారం కోర్సుగా మందులు వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి.

Stock
దగ్గు, ఆయాసం: సిగరెట్లు తాగేవారు తమకు ఇలాంటివి అలవాటే అనుకుంటారు కానీ వీరికి లంగ్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్స్ వచ్చే ముప్పు ఎక్కువ. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లెలో రక్తం, ఆయాసం టీబీ వంటివి లంగ్ క్యాన్సర్ లక్షణాలు.

కడుపు ఉబ్బరం, మంట: ఆహార వేళల్లో టైమ్‌సెన్స్ లేకపోవడం, నోరూరించే అనారోగ్య ఆహారపదార్థాలు తినడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాల వల కడుపులో మంట, త్రేన్పులు, ఉబ్బరం, ఆకలి తగ్గటం, వికారం వంటి లక్షణాలు కనిస్తుంటాయి. ఇవి పిల్లలు, పెద్దలు అందరిలో ఉంటాయి. సరైన జీవనశైలి అలవర్చుకుంటే ఇలాంటి సమస్యలు రావు. నీరు ఎక్కువగా తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎండోస్కోపి, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయంకు సంబంధించిన క్యాన్సర్స్, లివర్, ప్యాంక్రియాజ్, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్‌ను తొలిదశలోనే కనుక్కోవచ్చు.

మూత్ర వ్యవస్థలో తేడాలు: మూత్రంలో రక్తం పడటం, మూత్రం ఆగి రావడం, మంటగా ఉండటం మొదలైనవి చూస్తూ వేడి చేసిందనుకుంటారు. సాధారణంగా నీళ్లు తక్కువగా తాగటం, ఇన్‌ఫెక్షన్స్, కిడ్నీస్టోన్స్ వంటి కారణాల
వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపొతే యూరినరి బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు అని గమనించుకోవాలి. 50 ఏళ్ల పైబడిన పురుషులలో ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరి మధ్య రక్తస్రావం, పొట్ట భారంగా ఉండటం, ఆకలి మందగించటం స్త్రీలు నెలసరి ముందు ఉంటే సమస్యలుగా (PMS) పొరబడచ్చుకాని కొన్ని సందర్భాలలో ఒవేరియన్, యుటిరైన్ క్యాన్సర్స్ కావచ్చు.

మలవిసర్జనలో తేడాలు : అజీర్తి, విరోచనాలు, మలంలో రక్తం వంటి సింప్టమ్స్ ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కన్పించవచ్చు. కాని ఎప్పుడూ మలవిసర్జన సమయంలో పడే రక్తాన్ని ఫైల్స్ అనుకున్నట్లయితే పొరబడుతున్నట్లే. దక్షిణ భారతదేశంలో పురుషులలో ఎక్కువగా కన్పించే కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు.

పరీక్షలు: మామూలు గడ్డలే అని, పాలగడ్డలు అని రొమ్ములో దీర్ఘకాలంపాటు కన్పించే కణితులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉన్నట్లే, అలసట, రక్తహీనతతోపాటు చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవటం బ్లడ్ క్యాన్సర్‌గా హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పు లు, ముందుకు వంగినట్లు ఉండటం లివర్, లంగ్ క్యాన్సర్స్ కు సూచనలు కావచ్చు. సిగ్మాయిడోస్కోపి, కొలనోస్కోపి వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తేలిపోతుంది. ఇలాంటి లక్షణాలు కన్పించే సరికే క్యాన్సర్ ఇతర భాగాలకూ వ్యాపించి చికిత్సకు లొంగకుండా తయారవుతుంది. చాలావరకు క్యాన్సర్ ముదిరిన దశలోనే ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. ఇలా చేయొద్దు. అంతకుముందే మీకు అనుమానం ఉంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్, స్క్రీనింగ్ టెస్ట్లు, గైనిక్ చెకప్ చేయించుకోవాలి.
ch-mohana-vamshi

71
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles