ప్రజల కోసమే సైన్సు


Fri,August 16, 2019 12:47 AM

Shastreeyam
అభివృద్ధి చెందుతున్న (ఇంకా ఇప్పటికీ) భారత్ వంటి దేశానికి సైన్సు, అంతరిక్ష పరిశోధనల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అన్న విమర్శనాత్మక ప్రశ్నకు ఏడు దశాబ్దాల కిందటే ఆనాటి యోధులైన కీలక నాయకులు, శాస్త్రవేత్తల నుంచి అత్యంత సమర్థవంతమైన జవాబే లభించింది. కాకపోతే అది తదుపరి, ప్రస్తుత తరాలు అందిపుచ్చుకున్నట్టు లేదు.

భారత అంతరిక్ష యుగానికి ఆద్యుడు, రోదసీ కార్యక్రమ పితామహుడు (Father of Space Programme), ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ (జీవితకాలం: 1963-71) శతజయంతి సంవత్సరం (1919-2019) సందర్భంగా ఆయనతోపాటు ప్రసిద్ధ అణుభౌతిక శాస్త్రవేత్త డా॥ హోమీ జహంగీర్ భాబా (జీవితకాలం: 1909-1966), నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ త్రయం కలిసి పంచుకొన్న ఏకాభిప్రాయం పై ప్రశ్నకు సరిగ్గా సమాధానమిస్తుంది. మన దేశంలోని ఆకలి, పేదరికం, అపరిశుభ్రత, నిరక్షరాసత్య వంటి సమస్యలన్నింటికీ సైన్సు మాత్రమే పరిష్కారం చూపగలదు అన్నది వారి దృఢ విశ్వాసం. పండిట్ నెహ్రూ దీనినే స్వయంగా ఒకానొక సందర్భంలో వెల్లడించారు కూడా.

అంతేకాదు, భారతదేశంలో ప్రాచీనకాలం నుంచీ కొనసాగుతున్న మూర్ఖ విశ్వాసాలు, కాలం చెల్లిన ఆచార-సంప్రదాయాల నిర్మూలనకూ విజ్ఞానశాస్త్ర ప్రగతే ఏకైక పరిష్కారమని పై ముగ్గురితోపాటు పలువురు ఆనాటి ప్రసిద్ధ నాయకులు, శాస్త్రవేత్తలూ అభిప్రాయ పడేవారు. సుసంపన్నమైన మన భారతదేశంలో అపార వనరులెన్నో ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో అనేకం సద్వినియోగానికి నోచుకోక వ్యర్థమవుతున్నాయి. మరోవైపు దేశ ప్రజలు క్షుద్బాధతో అలమటించే పరిస్థితి. దీనికంతటికీ ఒకే ఒక్క పరిష్కారంగా సైన్సును అభివృద్ధి పరచుకోవడమే అని వారంతా నమ్మేవారు.

భారత అంతరిక్ష యుగావిర్భావం నుంచి ప్రస్తుత ఇస్రోవంటి పలు సంస్థల ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతున్న పరిశోధనల వరకు సారాభాయ్ సల్పిన కృషి వెలకట్టలేనిది. హోమీ భాబా (మరణం: 1966) లేని లోటును ఆయన ఒకింత తీర్చినా మరో అయిదేళ్లలోనే భాయ్‌కూడా (మరణం: 1971) అర్ధాంతరంగానే తనువు చాలించడం పెద్ద విషాదం. రాజకీయ రంగంలోనే కాకుండా, శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ నాటి స్వాతంత్య్ర కాలం నాటి యోధానుయోధులు పలువురిని ఇలా దేశం అనుకోకుండా కోల్పోవడం ప్రజల దురదృష్టమే. అటువంటి వారంతా మరికొన్నేండ్లు జీవించి వుంటే వివిధ రంగాలలో అభివృద్ధి వేగం పెరిగేదే. అయినప్పటికీ వారు వేసిన పునాది, ఇచ్చిన స్ఫూర్తి, అందించిన మార్గదర్శకత్వాల పైనే నేటికీ దేశం ప్రగతిపథంలో దూసుకెళుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.

సైన్సు, టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనలన్నీ చివరాఖరకు సామాన్య ప్రజానీకానికి మెరుగైన జీవితాన్ని అందించడం కోసమేనని విక్రమ్ సారాభాయ్ ఎప్పుడూ చెప్పేవారు. విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలను ప్రజలు అర్థం చేసుకొని, ఆచరణలోకి తెచ్చుకోవాలని, దీనితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంటుందని ఆయన అనేవారు.

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles