ద్విలింగ చేపల రహస్యం!


Fri,August 16, 2019 12:51 AM

SHASTRA
ఆడ, మగ.. ఏదైనా పుట్టినప్పుడు జరిగిన లింగ నిర్ధారణలో ఇక మార్పులుండవన్న నియమం ఒక్క మనుషులకే వర్తిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అనేక జీవజాతుల్లో ఉభయలింగ జీవులు (Hermaphrodites) సహజమే. ఏకకాలంలో రెండు (స్త్రీ-పురుష) రకాల పునరుత్పాదక అవయవాలను ఇవి కలిగి ఉంటాయి. ఇదే సమయంలో ఏదనుకొంటే దానికి మారే అనూహ్య సౌలభ్యాన్ని కలిగి ఉన్న ద్విలింగ జీవులూ (Sequential hermaphroditism) సృష్టిలో అనేకం ఉన్నట్టు వారు చెబుతున్నారు. మరి, వీటిలో ఈ లింగమార్పిడి ఎప్పుడు, ఎందుకు, ఎలా సంభవమవుతున్నది? అన్నది పెద్ద మిస్టరీ. దీనినే కొందరు పరిశోధకులు తాజాగా ఛేదించారు.

స్విచ్ వేసి, బంద్ చేసినంత తేలిగ్గా ప్రత్యేకించి కొన్ని రకాల ద్విలింగజాతి చేపలలో లింగమార్పిడి ప్రక్రియ జరిగిపోతున్న వైనం అత్యంత ఆశ్చర్యకరం. ఆడచేపలు మగచేపలుగా, మగచేపలు ఆడచేపలుగా, మళ్లీ కావాలనుకుంటే పూర్వస్థితికి అవి మారిపోతున్న అద్భుత జీవకణజాల- జన్యుమార్పులు శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. దీనినే శాస్త్రవేత్తలు ఇటీవల ప్రయోగాత్మకంగా బట్టబయలు చేశారు. సృష్టిలో ద్విలింగ (ఉభయచరాల వలె) జీవుల (ప్రత్యేకించి చేపలు) వ్యవస్థ ఎంత సర్వసాధారణమో ఇది రుజువు చేస్తున్నది.

లింగభేదం మానవులలో ఉన్నంత స్పష్టంగా, విస్తృతంగా ప్రత్యేకించి చేపలలో లేదనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. మానవ శరీరావయవాల వ్యవస్థలకు, ఇతరేతర జీవజాతుల దేహధర్మాలకూ చాలా తేడాలు ఉంటాయనడంలో సందేహం లేదు. పలు జీవజాతుల శరీర నిర్మాణాలకు సంబంధించి ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిశోధనల్లో అత్యంత ఆసక్తికరమైన ఫలితాలే వెల్లడవుతున్నాయి. మనకంటే ఎంతో చిన్నజీవులైన వాటి శరీరావయవాల భౌతిక నిర్మాణాల ముందు మనిషి ఎంత అల్పజీవియో దీనినిబట్టి అర్థమవుతున్నది. వాటన్నింటినీ మించిన స్థాయిలో మనకే పరిమితమైన ఒకే ఒక్క గొప్ప భౌతిక బలం మన మెదడు. ఇదే మానవజాతికి బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతున్నది.

మహాసముద్రాలు (అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ వంటివి), ప్రత్యేకించి ఉష్ణమండల, ఉపోష్ణమండల సాగరజలాల్లోనే ప్రధానంగా కనిపించే వ్రాస్సే (wrasse) చేపలలో పైన పేర్కొన్నట్టు సహజసిద్ధమైన పద్ధతిలో లింగమార్పిడి ప్రక్రియ జరుగుతున్న తీరును శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా కనిపెట్టారు. ఇవే కాదు, అనేక రకాల మత్స్యజాతులలో లింగ పరివర్తన అన్నది వాటి జీవన విధానంలో అత్యంత సహజసిద్ధ కార్యమని వారంటున్నారు. అయితే, పై జాతి చేపల్లో ఇది ఎలా సంభవమవుతున్నదన్న దానిని మాత్రం వారు మొట్టమొదటిసారిగా కనిపెట్టారు. నీలితలతో కూడిన వ్రాస్సే జాతి చిన్న చేపలలో దీనిని ఇటీవల వారు పరిశోధనాత్మకంగా గుర్తించారు.

ఫ్లోరిడా (అమెరికా రాష్ట్రం)లోని కీ లార్గో (Key Largo) కు చెందిన సాగరదిబ్బ (Reefs) ల్లో న్యూజీలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో (University of Otago) పరిశోధకులు అంతర్జాతీయ శాస్త్రవేత్తల సహకారంతో పై పరిశోధన నిర్వహించారు. అక్కడి చేపల సమూహాల్లోంచి కొన్ని మగచేపలను ఏరి మరీ తొలగించి వేశారు. దీంతో ఆయా జలప్రదేశాలలో ఆడచేపలే చాలావరకు మిగిలాయి. అప్పుడు వాటికి మగచేపల అవసరం ఏర్పడక తప్పదన్నది వారి ఆలోచన. అనుకొన్నట్లుగానే కొన్ని ఆడచేపలే మగచేపలుగా పరివర్తన చెందడం కొద్దిరోజుల్లోనే మొదలైంది. రోజురోజుకూ అక్కడి ఆడచేపలలో వస్తున్న మార్పులను శాస్త్రవేత్తలు గమనిస్తూ పోగా, కొన్నాళ్లలోనే ఆసక్తికరమైన పరిణామాలను వారు చూశారు. వాటి శరీరధర్మాలలో పూర్తి వ్యతిరేక మార్పులు వచ్చేశాయి. ఆడచేపల బీజకోశంలోని అండోత్పత్తి కణజాలాలు ముడుచుకొని పోయి, వాటి స్థానాల్లోకి వీర్యోత్పత్తి కణజాలాలు ఉద్భవించడాన్ని వారు స్పష్టంగా గుర్తించారు.

కేవలం 8 నుంచి 10 రోజుల్లోనే ప్రౌఢ అండాశయాలు (mature ovaries) కాస్తా వృషణాలు (testes) గా పరివర్తన చెందడాన్ని పై పరిశోధకులు కండ్లారా చూశారు. ఇక, ఆ మగచేపలు తోటి ఆడచేపలతో జతకూడి సంతానోత్పత్తికి కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగల స్థితి (sire offspring) కి వచ్చేశాయి. 20 రోజుల తర్వాత ఆ పరివర్తిత మగచేపలు పూర్తి స్థాయిలో దేహవర్ణాన్ని కూడా సంతరించుకొన్నట్టు పై శాస్త్రవేత్తల బృందం నాయకురాలు ఎరికా టోడ్ (Erica Todd) వెల్లడించారు. ఈ జాతి ఆడచేపలు పసుపు, గోధుమ వర్ణాల్లో ఉంటే, మగచేపలు నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఈ చేపల రంగుల ప్రపంచం అత్యంతాసక్తికరమైందిగా పేరు పడింది కూడా.

సుమారు 500 రకాల జాతుల చేపలలో ఇలా సహజసిద్ధమైన లింగమార్పిడి జరుగుతున్నట్టు జీవశాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. అయితే, 2017లో బ్లూ ప్లానెట్-2 పేరున బిబిసి నేచురల్ హిస్టరీ యూనిట్ ఆధ్వర్యంలో సాగరగర్భ జీవులపై డేవిడ్ అటెన్‌బరో (David Attenborough) రూపొందించిన ఒక డాక్యుమెంటరీతో ఏసియన్ షీప్‌హెడ్ వ్రాస్సే జాతి చేపల లింగమార్పిడి వ్యవహారం ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎరికా టోడ్ బృందం వారు పై పరిశోధనలు నిర్వహించారు. మగచేపల కొరతతో సదరు ఆడచేపలు ఆగ్రహానికి వచ్చినట్లు కనిపించిందని, ఫలితంగా వాటిలోనే లింగ మార్పు సంభవమైనట్టు వారు పేర్కొన్నారు.
SHASTRA1

అవి మగవిగా మారితే ఇక అంతే!

ఆడచేపలు మగచేపలుగా మారడం సర్వసాధారణమే అయినా, క్లౌన్ ఫిష్ (clownfish) జాతి చేపల్లో మాత్రం మగచేపలు ఆడచేపలుగా మారిపోతాయని తెలుస్తున్నది. దక్షిణాది జపాన్ పరిసర సాగరజలాల్లో కనిపించే హ్యాక్‌ఫిష్‌లలో అయితే మరింత ఆసక్తికరంగా ఆడచేపలు మగవిగా మారడమే కాక, అలా మారిన మగచేపలు మళ్లీ అవసరాన్నిబట్టి ఆడచేపలుగా యథాస్థితికి సైతం రాగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు. ష్రింప్ (shrimp) జాతి జలచరాలలో ఇలా యథాపూర్వ స్థితి సంభవం కాదని వారు అంటున్నారు. వీటిలోని ఆడజీవులు మగవిగా మారితే ఇక అంతే! అవి అలా ఉభయలింగ జీవుల్లా ఉండిపోవాల్సిందే. అంటే, ఏకకాలంలో ద్వి(స్త్రీ పురుష) లింగావయవాలను అవి కలిగి ఉంటాయి.
- దోర్బల బాలశేఖరశర్మ

692
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles