సంస్కరణల కలెక్టర్‌!


Tue,August 20, 2019 12:36 AM

Collector-Hanumanthara
‘చలపతి గారు.. మీ అబ్బాయి చదువు ఎలా సాగుతున్నది?’ ‘రాఘవయ్య గారు మీకు పాస్‌ పుస్తకం వచ్చింది కదా?’‘అమ్మా.. సైదమ్మా పింఛన్‌ అందుతున్నదా?’ ‘సర్పంచ్‌ గారు.. మన ఊళ్లో అందరికీ వంద శాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయి కదా?!’ ..అంటూ పేరు పేరున ఆత్మీయ పలకరింపు. వాత్సల్య కరచాలన స్పర్శ. బాధితులకు నేనున్నానంటూ భుజం తట్టే భరోసా. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం చూపే జిల్లా ఉద్యోగులకు ఆయనో ఛండశాసనుడు. ‘ఏంటీ ఈ చెత్త’ అంటూ పార, పొరక తెప్పించి తానే స్వయంగా శుభ్రం చేసే.. స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. తాను పనిచేసే జిల్లాల్లో నిత్యం సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టి.. సమస్య ఏదైనా అక్కడికక్కడే పరిష్కారం చూపి, సంగారెడ్డి జిల్లాను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు కలెక్టర్‌ హనుమంతరావు. కేంద్రప్రభుత్వం అందించే ‘పోషణ్‌ అభియాన్‌' అవార్డును తెలంగాణ తరఫునఆయన అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా ‘జిందగీ’ ఆయనను పలుకరించింది.

ఓ సామాన్యుడు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలంటే గతంలో వారం రోజులు పట్టేది. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడా పరిస్థితి లేదు. కారణం.. మంత్రిప్రగడ హనుమంతరావు లాంటి కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ ఉన్నారు. బాధితుల పక్షాన నిలబడుతూ జనరంజక పాలన అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిపాలనా ఉన్నతాధికారిగా కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపడుతూ ప్రజారంజక పాలన అందిస్తున్నారు మంత్రిప్రగడ హనుమంతరావు. ఆయన చేస్తున్న సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలను ఇతర జిల్లాలలో కూడా వేర్వేరు పేర్లతో అమలు చేస్తుండడం విశేషం.
Collector-Hanumanthara1
ఉద్యమంలా ‘హరిత దత్తత’: సంగారెడ్డి పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నది. దీంతో మన ముఖ్యమంత్రి చేపట్టిన ‘హరిత హారం’ను అత్యంత సమర్థవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ‘గ్రీన్‌ క్లబ్‌'ను ఏర్పాటు చేసి అందులో పరిశ్రమల యాజమానులను సభ్యులుగా చేర్చారు. వారి సౌజన్యంతో ‘హరిత దత్తత’ చేపట్టారు. ఇందులో భాగంగా 40 పరిశ్రమల యజమానులు రూ.3 కోట్ల విలువైన రెండు లక్షల ట్రీ గార్డులు, వాటికి అవసరమైన సరంజామాను అందించారు. రోడ్డు కిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ కోసం ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. ప్రతి మండలంలో జిల్లా స్థాయి అధికారిని దీనికి పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పారు. రెండు కిలోమీటర్ల వరకు 400 మొక్కలను నాటుతున్నారు.

జిల్లా పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు అనేకం ఉన్నాయనే విషయాన్ని గమనించారు హనుమంతరావు. ఇందుకు పరిష్కారంగా ‘భూ వాణి’ని ప్రవేశపెట్టారు. జిల్లాలోని రెవెన్యూ, ఫారెస్ట్‌, ఇరిగేషన్‌ భూ సంబంధిత అధికారులందరినీ ఇందులో భాగస్వామ్యం చేశారు. ప్రతి నెల ఒక మండల కేంద్రంలో ‘భూ వాణి’ నిర్వహిస్తున్నారు. తద్వారా అప్పటికప్పుడు రైతుల సమస్యలను పరిష్కరించారు. సమస్య చెప్పుకోవడానికి వచ్చే వారికి నీడ, భోజన, నీటి వసతులు కల్పిస్తారు. అన్నం పెట్టి తమ సమస్యలను పరిష్కరించిన ఈ కలెక్టర్‌ సారు సేవలు మర్చిపోలేమని బాధిత రైతులంటున్నారు. 26 మండలాల్లో దీనిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓల అక్రమాలు వెలుగులోకి రావడంతో వారిని సస్పెండ్‌ చేశారు.
Collector-Hanumanthara2

ప్రజల చెంతకే ‘ప్రజావాణి’

సంగారెడ్డి జిల్లాలో ప్రతీ సోమవారం ‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రతీ మండల కేంద్రంలోనూ ప్రతి సోమవారం కలెక్టర్‌ అధ్యక్షతన ప్రజావాణి జరుగుతున్నది. దీనికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు రావాల్సి ఉంటుంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చే బాధితులకు ఉపశమనం దొరికింది. జిల్లాలోని అన్ని మండలాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

అభివృద్ధి కోసం ‘తండా బాట’

సంగారెడ్డి జిల్లాలో విసిరేసినట్లుగా ఉండే 75 మారుమూల తండాల అభివృద్ధిపై కలెక్టర్‌ హనుమంతరావు దృష్టి సారించారు. ఒక్కో తండాలో రెండు రోజులు కలెక్టర్‌తో సహా అన్ని విభాగాల అధికారులు పర్యటిస్తారు. తాగునీటి సమస్య మొదలుకొని అన్నింటినీ దగ్గరుండి పరిష్కరించనున్నారు. తండా బాటను ఈ నెల 27న కంది మండలం, ఎర్ణమూర్‌ తండా నుంచి ప్రారంభించనున్నారు.
Collector-Hanumanthara3

ఫోకస్‌.. రూట్స్‌.. మేము సైతం

చదువుతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి కలెక్టర్‌ హనుమంతరావు. అందుకే విద్యాశాఖలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించడానికి ఫోకస్‌, రూట్స్‌, నేను సైతం కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఎంపికైన 100 మందికి జిల్లా సైన్స్‌ కేంద్రంలో రెసిడెన్సియల్‌ పద్ధతిలో శిక్షణ ఇప్పిస్తున్నారు. పదో తరగతిలో నూరు శాతం ఫలితాల సాధననకు ‘రూట్స్‌' కార్యక్రమం ద్వారా శిక్షణ కొనసాగుతున్నది. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులను వలంటీర్లుగా కొనసాగిస్తున్నారు. గతంలో పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 11వ స్థానంలో ఉన్న జిల్లాను.. గతేడాది 4వ స్థానానికి తీసుకొచ్చారు.
Collector-Hanumanthara4

గ్రామాల్లో ‘ఆరోగ్య వేదిక’లు

గ్రామాల్లోకి వైద్యాన్ని తీసుకెళ్లేందుకు ‘గ్రామ ఆరోగ్య వేదిక’లను హనుమంతరావు ప్రారంభించారు. దీని ద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో అవగాహన కల్పించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేదికల ద్వారా చికిత్సలు చేసి, మందుల పంపిణీ చేస్తున్నారు. ఝరాసంగం మండలంలో నర్సాపూర్‌, బెదులువాడి గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి, విజయవంతంగా నిర్వహించారు. వారానికి 3 గ్రామాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

శుక్రవారం ‘శ్రమదానం’

నివసించే ఇల్లువలే.. ప్రభుత్వ కార్యాలయాలు కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని చేపట్టారు హనుమంతరావు. ఉదయం 8.30 నుంచి 10.30 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వలంటీర్లుగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పరిశుభ్రతకు నడుం బిగించాలి. దీనికి మున్సిపల్‌ పరిధిలోని ప్రతి వార్డుకు ఒక జిల్లా అధికారిని నియమించారు.

పేదల కోసం ‘సహాయం’

సంగారెడ్డిలో ప్రభుత్వ అధికారుల వేతనాల్లొంచి కొంత నిధిని ‘సహాయం’ పేరిట పేదల కోసం ఖర్చు చేస్తున్నారు కలెక్టర్‌ హనుమంతరావు. ఈయన సిద్దిపేట ఆర్‌డీఓగా ఉన్నప్పుడు ‘సహాయం’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. అలా వచ్చిన డబ్బుతో ఓ నిరుపేదకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ‘సహాయం’ ద్వారా చాలామందికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు. గ్రామాల్లో యువత కోసం త్వరలోనే మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం

సమస్యలు లేని గ్రామాలుగా మన పల్లెలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మా ప్రతి అడుగులోనూ ప్రభుత్వ సహకారం ఉన్నది. గతంలో గజ్వేల్‌లో ‘గడప గడపకు గడా’ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారితో కలిసి పనిచేసిన అనుభూతి మర్చిపోలేనిది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, దళారులు, మధ్యవర్తులు లేకుండా.. ప్రజల వద్దకే పాలన అందించడం మా ఉద్దేశం. అందుకే పారదర్శక పాలన కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. నేను చేసే ప్రతి పనిలో నా తోటి ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారుల సహకారం మరువలేనిది. సంగారెడ్డిని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.
- మంత్రిప్రగడ హనుమంతరావు, కలెక్టర్‌
Collector-Hanumanthara5

కలెక్టర్‌ హనుమంతరావు ప్రొఫైల్‌

సూర్యాపేట జిల్లా బేతవోలు గ్రామానికి చెందిన హనుమంతరావు తల్లిదండ్రులు శంకర్‌రావు, ప్రమీల. ఆయనకు రమేష్‌, జగదీష్‌, శ్రీనివాసరావు సోదరులు. పద్మ, విజయలక్ష్మి సోదరీమణులు. తాత రాజగోపాలరావు నిజాం వ్యతిరేక ఉద్యమంలో రైతుల పక్షాన పాల్గొని మరణించారు. నాన్న శంకర్‌రావు ఉపాధ్యాయుడిగా చేస్తూనే పశువులకు ఉచితంగా వైద్య సేవలందించేవారు. హనుమంతరావును కలెక్టర్‌గా చూడకుండానే 2007లో అనారోగ్యంతో మరణించారు. హనుమంతరావుకు 2001లో నల్లగొండకు చెందిన స్రవంతితో వివాహం జరిగింది. వీరికి సాయి హర్షిణి, సాయి ప్రణవ్‌ బాలాజీ సంతానం. ఓయూలో పీజీ గణితం ఎంట్రెన్స్‌లో 7వ ర్యాంక్‌తో.. అక్కడే ఎంఫిల్‌ పూర్తి చేశారు. కోదాడ, హుజూర్‌నగర్‌లలోని ప్రైవేటు కళాశాలల్లో గణిత అధ్యాపకుడిగా రోజూ మూడు కళాశాల్లో పని చేస్తూ.. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు. ఆయన ప్రతిభకు వరుసగా ఎంసీఆర్‌డీఓ, లెక్చరర్‌, రైల్వే ఎఎస్‌ఎం, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, పీఎన్‌బీ పీఓ, జిల్లా ఏటీఓ, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, డీఎస్పీ ఉద్యోగాలు వచ్చాయి. 2007 గ్రూప్‌-1లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్‌ సాధించారు. 2008లో ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జగిత్యాలలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు. గజ్వేల్‌లో ‘గజ్వేల్‌ ఏరియా డెవలెప్‌మెంట్‌ అథారిడీ’ (గడా) అధికారిగా పని చేశారు. 2013 బ్యాచ్‌లో కన్ఫర్డ్‌ ఐఏఎస్‌. జిల్లాల పునర్విభజన అనంతరం సిద్దిపేట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా చేశారు. గతేడాది ఆగస్టు 31 నుంచి సంగారెడ్డి కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ పరిధిలో విశేషమైన సేవలందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పోషణ్‌ అభియాన్‌' అవార్డును ఈనెల 23న ఢిల్లీలో కలెక్టర్‌ హనుమంతరావు అందుకోనున్నారు. రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు హనుమంతరావు ఒక్కరే ఎంపిక కావడం విశేషం.
- డప్పు రవి

749
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles