త్రివేణి సమ్మాన్‌


Wed,August 21, 2019 01:13 AM

Triveni
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతీయేటా రాష్ట్రపతి పురస్కారాలు అందచేస్తున్నది. గత యాభైయేండ్లుగా సంస్కృతి, పాళి, ప్రాకృతం, అరబిక్‌, పర్శియన్‌ వంటి భాషలలో ఈ పురస్కారాలు ఇస్తున్నారు. సర్టిఫికెట్‌ ఆఫ్‌ హానర్‌, బాదరాయణ్‌ వ్యాస్‌ సమ్మాన్‌ అనే రెండు పురస్కారాలు వీటిలో ఉంటాయి. తెలుగు భాష ప్రాచీన హోదా పొందిన నేపథ్యంలో తెలుగులోకూడా ఈ పురస్కారాలు ఇస్తున్నారు. ఇంత గొప్ప పురస్కారం త్రివేణి అందుకోనుండడం అభినందనీయం.

ఆమె ఒకప్పుడు కూలీ. ఇప్పుడు.. రాష్ట్రపతి పురస్కారం అందుకోనున్నది. డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తిచేసిన ఆమెను.. భాషా పురస్కారం వరించింది. సాధించాలనే తపన.. పట్టుదల ఉంటే కూలీ కూడా ప్రొఫెసర్‌ కావచ్చని ఆమె నిరూపించారు. ప్రతిష్ఠాత్మక
రాష్ట్రపతి పురస్కారం బాదరాయణ్‌ వ్యాస్‌ సమ్మాన్‌ అవార్డ్‌-2019కు ఎంపికై.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటిన తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ విభాగాధిపతి డాక్టర్‌ వంగరి త్రివేణి పరిచయం.

వంగరి త్రివేణి గమ్యం ఎన్నో మలుపుల మయం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌ మండలంలోని లాల్‌గడి మలక్‌పేట్‌ గ్రామం వీరి సొంతూరు. చేనేత కుటుంబం. నలుగురు అక్కా చెల్లెళ్లు, ఒక తమ్ముడు. తండ్రి టీచర్‌. కానీ అప్పుడు టీచర్లది బతకలేక బడిపంతులు అన్నట్లే ఉండేది కదా? పెద్ద కుటుంబం.. సంపాదన తక్కువ. గడవడానికే కష్టంగా ఉండేది. అమ్మ బీడీలు చుడుతూ.. ఇస్తరాకులు తయారు చేస్తూ ఇంటి అవసరాలకు డబ్బు సంపాదించేది. ఒకపూట ఉంటే మరో పూట పస్తులుండే పరిస్థితిని చూసింది త్రివేణి. టీచర్‌గా తండ్రి జీవితం అప్పులు కట్టడానికే సరిపోవడంతో త్రివేణి భవిష్యత్‌ ఆందోళనలో పడింది.

- పత్తి మిల్లులో కూలీ

అప్పులు చేసి అక్కల పెండ్లిళ్లు చేశారు. ఆమె తల్లిదండ్రులు. దీంతో పిల్లల చదువు మాన్పించి ఏదైనా పనికి పంపాలనే ఆలోచన చేశారు తండ్రి. అప్పుడు త్రివేణి తొమ్మిదో తరగతి. ఇంకో తరగతి చదివితే పదన్నా పూర్తవుతుంది కదా అని తల్లి అడ్డుపడటంతో పదో తరగతి గట్టెక్కింది. పదో తరగతి కాగానే ఓ పత్తి మిల్లులో రోజుకు రూ. 9 కూలీగా పనిలో కుదిరారు. ఆమె మిల్లుకు వెళ్తుంటే ఆమె తోటి స్నేహితులంతా కాలేజీకి వెళ్తుండేవారు. ఉదయం 4గంటలకల్లా లేచి మిల్లుకు వెళ్లేది. మిల్లు కూలీలందరినీ కంపెనీకి తీసుకుపోవడానికి ప్రతిరోజు ఒక ట్రాలీ వచ్చేది. ఉదయమే నిద్ర లేవాల్సి రావడం.. పనిఒత్తిడి వల్ల తిండి సరిగ్గా తినకపోవడం, యంత్రాల స్పీడ్‌కు చేతులు కోసుకుపోవడం వంటి సమస్యలెన్ని చుట్టుముట్టినా మూడేండ్ల పాటు పత్తి మిల్లులో కూలీగా చేసింది.

- కూలీ పనులు చేస్తూనే చదువు

పదో తరగతి పాస్‌ అయ్యింది. కొంతమంది ఫెయిల్‌ అయినవాళ్లు కూడా మళ్లీ పరీక్షలు రాసి కాలేజ్‌కు వెళ్తున్నారు. కానీ తాను మంచి మార్కులు సంపాదించినా కుటుంబ పరిస్థితి కారణంగా పై తరగతులకు వెళ్లలేకపోయారు. ఆలోచనలో పడింది త్రివేణి. చదువును ఎలాగైనా కొనసాగించాలి అనుకున్నది. ఓవైపు ఉదయం పత్తి మిల్లులో పనిచేస్తూనే సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది. 14 వయసులోపు బడికి వెళ్లని పిల్లలకు ఆమె పాఠాలు చెప్పాలి. అలా నాలుగేండ్ల పాటు ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు.

- ప్రైవేట్‌గా ఇంటర్‌

పదో తరగతి ఆంగ్ల ఉపాధ్యాయురాలు సుహాసిని ప్రోత్సాహంతో ఇంటర్‌మీడియట్‌ ప్రైవేట్‌గా హాజరై పరీక్షలు రాసింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షలను ఒకేసారి కట్టేసి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పాసై అందర్నీ ఆశ్చర్యపరిచింది త్రివేణి. ఒకసారి లాల్‌గడి మలక్‌పేట్‌లోని పాఠశాలలో ప్రైవేటు టీచర్లు కావాలనే సమాచారం తెలిసింది. ఆమె చదువుకున్న స్కూల్‌కూడా అదే. వలంటీర్‌గా దరఖాస్తు చేసింది. ఎనిమిదేళ్లు అదే పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేసింది. సహోపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి సలహాతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేసేందుకు సిద్ధమైంది. ఆదివారాలు కాలేజీకి వెళ్లి చదువుకునే ది. మూడేండ్లు కష్టపడి డిస్టెన్స్‌లో బీఏ చేసింది.

- కుటుంబ బాధ్యత

విద్యావలంటీర్‌గా పనిచేస్తున్న సమయంలోనే త్రివేణికి గంజి నరసింహాతో వివాహమైంది. నల్లగొండజిల్లా పలివెల మెట్టినిల్లు. భర్త పత్తి మిల్లులో దినసరి కూలీ. ఏడాదికే బిడ్డ పుట్టడంతో బాధ్యత మళ్లీ మీద పడింది. ఆమెకు పై చదువులు చదవాలనే ఆశ. వెనకడుగు వేయలేదు. తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ తీసుకుంది. అప్పుడే భర్తకు పత్తి కంపెనీలో ఉద్యోగం పోయింది. టీచర్‌గా ఆమెకు వచ్చే రూ.400 జీతంతోనే ఇల్లు గడవాల్సిన పరిస్థితి. ట్రైనింగ్‌ పేరుతో ఆమె ఆ ప్రైవేటు ఉద్యోగం మానేస్తే ఇంటి పరిస్థితి ఎలా అని ఆలోచించి ప్రత్యేక అనుమతి తీసుకొని ఉద్యోగం చేసింది.

- ఉద్యోగం వచ్చేసింది

తెలుగు పండిట్‌ శిక్షణలో పరిచయమైన స్నేహితుల సలహా మేరకు ఎంఏ తెలుగు ఎంట్రెన్స్‌ రాసింది. మొత్తం యూనివర్సిటీలోనే 6వ ర్యాంక్‌ వచ్చింది. పిల్లల్ని వదిలి రోజూ కాలేజీకి వెళ్లే పరిస్థితి ఆమెకు లేదు. ఫీజు కట్టి సీటు తీసుకుంది. కాలేజీకి వెళ్లడానికి వారానికి రెండు రోజులు స్కూల్లో అనుమతి తీసుకుంది. 70 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పీజీ పాసై ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంక్‌ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతూనే డీఎస్సీ రాసింది. ఉద్యోగం రాలేదు. తర్వాత ప్రయత్నించింది. ఇబ్రహీంపట్నం ఎలిమినేడు ఉన్నత పాఠశాలలో ఉద్యోగం. ఉదయం 6గంటలకు వాళ్ల ఊరు నుంచి స్కూల్‌కి బయలుదేరితే మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయ్యేది.

- పరిశోధనలు

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో ప్రవేశం లభించింది త్రివేణికి. చిల్లరిగే స్వరాజ్య లక్ష్మి కవిత్వ పరిశీలన మీద ఎంఫిల్‌ పరిశోధన చేసింది. 2003లో నెట్‌, జేఆర్‌ఎఫ్‌ సాధించింది. ఇక ఆమె సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి రచనల మీద సమగ్ర పరిశీలన చేసి పీహెచ్‌డీ సాధించింది. రాత్రింబవళ్లు కష్టపడి కేవలం మూడే ండ్లలో పీహెచ్‌డీ పరిశోధనను పూర్తి చేసి తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంతోపాటు నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనశాఖకు పీహెచ్‌డీ, ఎంఫిల్‌ పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు.
Triveni1

దేశాల్లో ఖ్యాతి

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, కర్నూలు, కడప, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాల్లోనూ సాహిత్య ప్రసంగాలు చేశారు. వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యం మీద పునశ్చరణ తరగతుల్లో శిక్షణ కూడా ఇచ్చారు. ఇక విదేశాల్లోనూ ఆమె ప్రసంగాలు కొనసాగాయి. అమెరికాలోని చికాగోలో జూన్‌ -2016లో జరిగిన ఆటా -16 తెలంగాణ మహాసభల్లో సాహిత్య పత్రాలను సమర్పించారు. న్యూజెర్సీ, న్యూయార్క్‌, విస్కాన్‌సిన్‌ వంటి నగరాల్లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌, డెట్రాయిట్‌ తెలుగు లిటరటీ క్లబ్‌, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) వంటి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని సాహిత్య పత్రాలను సమర్పించడమేకాకుండా ప్రసంగాలు కూడా చేశారు. అదేవిధంగా మలేషియా, సింగపూర్‌, వంటి దేశాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పత్రసమర్పణలేకాకుండా అక్కడా సాహిత్య ప్రసంగాలు చేశారు. అలాంటి త్రివేణి నేడు రాష్ట్రపతి పురస్కారంతో గౌరవాన్ని నిలబెట్టుకున్నారు.

- లోకాని గంగారామ్‌, నమస్తే తెలంగాణ, డిచ్‌పల్లి రవీందర్‌ నాయక్‌

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles