కాలేయ మదనం


Fri,August 23, 2019 01:15 AM

-మానవ జీవకణాలతో మినీ లివర్ సృష్టి
-చిన్న కాలేయంతో పెద్ద ప్రయోగం విజయవంతం
-స్థూలకాలేయ సంక్లిష్ట సమస్యలకు ఇక సత్వర పరిష్కారం
అత్యంత సంక్లిష్టమైన కాలేయాన్ని చిన్న పరిమాణంలో శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఇటీవల ప్రయోగశాలలో అభివృద్ధి పరిచడమేకాక దానిపై వ్యాధి సంక్రమణ పరీక్షలనూ విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా రోగనిర్ధారణ, చికిత్సలను మరింత సులభతరం, వేగవంతం, కచ్చితత్వం చేసే దిశగా సాగే పరిశోధనలకు మార్గం సుగమమవుతుందని వారు అంటున్నారు.
heart-disease
ఈమధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని పీడిస్తూ, అంతుబట్టకుండా ఉన్న స్థూల కాలేయ వ్యాధి (fatty liver disease) పెరుగుదల, నివారణోపాయలను కనుగొనే పరిశోధన నొకదానిని శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. అదికూడా ప్రయోగశాలలో సొంతంగా అభివృద్ధి పరిచిన చిన్న కాలేయం (mini-liver) పై వ్యాధి సంక్రమణ పరీక్షలను జరిపి ఆ మేరకు సత్ఫలితాన్ని పొందారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (University of Pittsburgh School of Medicine) పరిశోధకులు వెలువరించిన ఈ అధ్యయనా పత్రం సెల్ మెటబొలిజమ్ (Cell Metabolism) జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది.

మనిషి శరీరాంతర అవయవాల్లో కాలేయం విలువ అత్యంత విలక్షణమైంది. శరీర మనుగడకు అత్యావశ్యకమైన జీర్ణవ్యవస్థ పనితనానికి ఒక రకంగా ఇదే శక్తికారకం కూడా. మన మొత్తం ఆరోగ్య నిర్వహణే నూటికి 90 శాతం కాలేయ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఏది పడితే అది తినేసి, ఎలా పడితే అలా ఆహార జీవనశైలిని అలవరచుకోవడం వల్ల కడుపు నిండి, నోటికి, నాలుకకు తృప్తి లభించవచ్చు. కానీ, ఈ అపసవ్యపు ఆహార అలవాట్లు పరోక్షంగా కాలేయ నైపుణ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆఖరకు మద్యపానం అలవాటు లేనివారి (non-alcoholic)లో, మామూలు స్థూలకాయుల్లో కూడా కాలేయాలు కొవ్వుతో లాకెక్కిపోతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగి పోతున్నాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందిన అగ్రదేశమైన ఒక్క అమెరికాలోనే ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు 80-100 మిలియన్ (8-10 కోట్ల మంది) ప్రజలు ఈ స్థూల కాలేయ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తున్నది.

కారణాలేవైతేనేం ఈ కొవ్వు కాలేయ వ్యాధి రాన్రాను ప్రపంచవ్యాప్తంగా ముదురుతూనే ఉంది. కానీ, దీని పెరుగుదలకు మూలకారణం మాత్రం శాస్త్రవేత్తలకు చాలాకాలంగా అంతుబట్టకుండా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పై విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రయోగశాలలో మానవ జీవకణాలతోనే చిన్న కాలేయాన్ని సృష్టించి, ఆ మేరకు పరీక్షలు జరిపారు. ఎలుక కాలేయమంత చిన్న పరిమాణంలో వారు దీనిని అభివృద్ధి పరిచారు. ఇది 2-3 అంగుళాల చుట్టుకొలతను కలిగి ఉన్నది. ఫ్యాటీ లివర్ తాలూకు రోగకారకాలను ప్రవేశపెట్టిన 24 గంటలలోనే అది ఆ వ్యాధి బారిన పడడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలి కాలంలో ఆర్గనాయిడ్స్ (organoids) గా పిలిచే చిన్న సైజు (Pint-sized) అవయవాలు ఉదాహరణకు మెదడు, ఉదరం, అన్నవాహిక (ఆహారనాళం) తదితరాలను ఇలా ప్రయోగశాలల్లో పెంపొందింపజేస్తూ తత్సంబంధ పరిశోధనలను వారు జరుపుతున్నారు. ఇందులో విజయం సాధించిన తర్వాత మానవ అవయవాల పరిమాణం (సైజు)లోకి వాటిని అభివృద్ధి పరచడం వారికి కొంత సులువవుతుంది.

శరీరం లోపలి అన్ని అవయవాల్లోకెల్లా కాలేయం పెద్దదే కాక మొత్తం దేహంలోనే దీనిని అతిపెద్ద గ్రంథిగా చెప్తారు. ముఖ్యంగా మానవ శరీరావయవాల్లోని కణాల్లోకెల్లా ఒక్క కాలేయానికి చెందిన జీవకణాలకు మాత్రమే పునరుత్పాదక (regeneration) శక్తి ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. కాకపోతే, ఇది పూర్తి ఆకారాన్ని సంతరించుకొనే స్థాయిలో జరగదని వారంటారు. ఒక కాలేయాన్ని రెండుగా చేసి ఇద్దరు వ్యక్తులకు అమర్చ వచ్చని, అవి విడివిడిగా కొంత కణజాలాన్ని పునరుత్పత్తి చేసుకోగలవనీ వారంటున్నారు. అంతేకానీ, పూర్తిస్థాయి ఆకారాలకు ఎదగలేవు. ఎంతో కీలకమైన కాలేయానికి స్థూలకాయ వ్యాధి సోకడం ఒక రకంగా ప్రమాదకర పరిణామమేనని వారు పేర్కొన్నారు. మద్యపానం అలవాటు లేనివారిలోను కొవ్వు శాతం పెరగడం వల్ల కాలేయం కూడా వాచిపోతున్నది.

పరిశోధనల కోసమైతేనేం మానవ జీవకణాలతో కాలేయాన్ని సృష్టించగలగడం తాజాగా గొప్ప పరిణామం. ప్రస్తుతానికి చిన్న పరిమాణంలోనే దీనిని ప్రయోగశాలలో పై శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచినా మున్ముందు మానవ కాలేయమంత సైజులోనూ తయారీకి మార్గం సుగమమం కాగలదన్న విశ్వాసాన్ని వారు వ్యక్తపరిచారు. ఇందుకుగాను తొలుత వారు మానవ జీవకణాలను సేకరించి, వాటిలోని జన్యుసముదాయం (genome) లోకి ఒక చిన్న ఔషధపు (drug) చుక్కను ప్రవేశపెట్టారు. మానవులు సహా జంతువులలోనూ కొవ్వు వ్యాధి పెంపొందడానికి కారణంగా భావిస్తున్న ముఖ్య జన్యువు ఎస్‌ఐఆర్ టి1 (SIRT1 gene) నే వారు తమ పరిశోధనా లక్ష్యంగా ఎంచుకొన్నారు. పై ఔషధ ప్రయోగంతో జీవకణాల్లోని జన్యుకార్యశీలతలలో వచ్చిన మార్పులను వారు సునిశితంగా పరిశీలించారు. ఇదే దశలో జీవకణాలను ఎదిగే మూలకణాల (pluripotent stem cells) స్థితిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కాలేయ కణాలుగా అభివృద్ధి పరిచారు. ఈ రకంగా ఒక కాలేయ కణాల వ్యవస్థ ఏర్పడినప్పటికీ దానికి అవయవ రూపాన్ని సిద్ధింపజేయడానికి పరిశోధకులు ఎలుకల కాలేయ కణజాలాన్ని వాడుకొన్నారు.

ఈ చిన్న కాలేయ పరిశోధనా ఫలితాన్ని ఎంతో పెద్ద విజయంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఆల్కహాల్ (మత్తుమందు) రహిత స్థూలకాలేయ వ్యాధితో ముడిపడిన అనేక క్లిష్ట, పెద్ద సమస్యలకు ఇదొక మంచి పరిష్కారం చూపగలదన్న ఆశాభావాన్ని వారు వ్యక్తంచేశారు. కాలేయం స్థూలస్థితికి చేరుకోవడం వెనుక సంభవిస్తున్న పరిణామాలను అవగాహన పరచుకొనే అవకాశం ఇవ్వడమేకాక రోగ నిర్ధారణను ఇది తేలిక పరచగలదనీ వారు నమ్ముతున్నారు. అయితే, ఈ ప్రయోగంలో వలె ఒక జన్యువును బలహీన పరిచినంత సులువుగా పై వ్యాధి స్థితిగతులను తెలుసుకోలేమని, ఈ వ్యాధి అత్యంత సంక్లిష్టమని కూడా వారంటున్నారు. ఏమైనా, ప్రస్తుత పరిశోధనా ఫలితం మరింత కచ్చితత్వంతో, పూర్తిస్థాయి మానవ కాలేయ అభివృద్ధికి దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

heart-disease2

24 గంటల్లోనే వాపు

ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన చిన్న కాలేయ కణాల సముదాయాన్ని శాస్త్రవేత్తలు చిట్టెలుకల కాలేయ కణజాలంతో మేళవింపజేయడం ద్వారా సహజ సిద్ధమైన లివర్ నిర్మాణంలోకి దానిని మార్చారు. వాటితోపాటు మానవ కాలేయంలో ఉండే ఇతరేతర జీవకణాలనూ పరిశోధకులు అందులోకి ప్రవేశపెట్టారు. వీటిలో మాక్రోఫేజెస్ (macrophages) గా పిలిచే రోగనిరోధక వ్యవస్థ కణాలు, ఫైబ్రోబ్లాస్ట్స్ (fibroblasts)గా వ్యవహరించే కణజాల ఆలంబన కణాలు వంటివి ఉన్నాయి. ఇది జరిగిన కేవలం 3 నుంచి 4 రోజుల లోపల చిన్న కాలేయం కాస్తా నిర్దిష్ట నిర్మాణంలోకి వచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అందులోని వ్యాధి ప్రభావిత జన్యువు (SIRT1) పనితనాన్ని క్షీణింపజేయడానికి ఒక చిన్న ఔషధ చుక్కను కొత్త కాలేయంలోకి ప్రవేశపెట్టారు. అంతే! 24 గంటలలోనే చిన్న కాలేయం కాస్తా ఉబ్బడం (లావు) ప్రారంభమైంది. కాలేయానికి వ్యాధి సంక్రమణ మొదలైందనడానికి ఇదే నిదర్శనమని వారు పేర్కొన్నారు.

-దోర్బల బాలశేఖరశర్మ

581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles