నర్మద పరిక్రమ


Sun,August 25, 2019 12:54 AM

అశ్వత్థ వృక్షానికి కొత్త చిగుళ్లు!

(గత సంచిక తరువాయి)


అశ్వత్థ వృక్ష చిత్రం

Narmada
* అక్కడ చాలా వయసుగల అశ్వత్థ వృక్షాన్ని నరికేశారు. అది ఎండి పోయింది. ఆశ్చర్యంగా ఆ చెట్టు కాండం నుంచి ప్రకృతి విరుద్ధంగా తిరిగి చిగుళ్లు వచ్చాయి!

ఒక లీటర్ బెయిలీ వాటర్ బాటిల్ ధర 12 రూపాయలు. కానీ, ఆ సంస్థాన్ క్యాంటీన్‌లో 7 రూపాయలకే యాత్రికులకు అమ్ముతారని, కొనుక్కోమని, మనిషికి 5 చొప్పున మాత్రమే ఇస్తారని దేశాయ్ అందరికీ చెప్పారు. నేను, వెంకటేశ్వరరావు క్యాంటిన్‌కు వెళ్లాం. నా మొహం చూస్తే ఆ క్యాషియర్‌కు ఏమనిపించిందో ఏమోకాని, నాకు ఆ రేటుకు ఒకటే ఇస్తానన్నాడు. వెంకటేశ్వరరావును చూసి, చివరికి ఇద్దరికి కలిపి అయిదు బాటిల్స్ ఇచ్చాడు. సాయంత్రం ఆరు బయట అందరికీ టీ చేసి ఇచ్చారు. అక్కడున్న ఓ అశ్వత్థ వృక్షాన్ని చూపించి ఓ విషయం చెప్పారు దేశాయ్. కొత్తగా నిర్మించే మరో గెస్ట్‌హౌస్ కోసం అక్కడ చాలా వయసుగల అశ్వత్థ వృక్షాన్ని నరికేశారు. అది ఎండి పోయింది. ఆశ్చర్యంగా ఆ చెట్టు కాండం నుంచి ప్రకృతి విరుద్ధంగా తిరిగి చిగుళ్లు వచ్చాయి! దాంతో భవన నిర్మాణం ఆపేసి తిరిగి ఆ చెట్టును మళ్లీ పెరగనిస్తున్నారు. కొట్టేసిన కాండానికి వచ్చిన చిగుళ్లను చూశాం.

వెంకటేశ్వరరావు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని 108 వెంకటేశ్వరస్వామి ఆలయాలకు ఓ టూరిస్ట్ బస్‌లో వెళ్లి దర్శించినప్పుడు చూసిన ఇలాంటి మరో సంఘటన గురించి చెప్పాడు. ఇలాగే, ఓ ఆలయంలోని బాదం చెట్టును కొట్టేయాలని అనుకొన్నారుట. మర్నాడు ఉదయానికల్లా దాని కాండానికి ఓ శంఖు మొలిచింది. దాంతో దాన్ని కొట్టడం విరమించుకొన్నారని అతను చెప్పారు. ఆ ఫొటోని అతను నాకు చూపించారు. గజానన్ మహారాజ్ గెస్ట్‌హౌస్‌లోని అన్ని గదుల్లో పరుపులు, దుప్పట్లు చెక్క స్టాండ్స్‌లో ఉంచారు. వాటిని పరుచుకొని పడుకున్నాం. నా పక్కన నాసిక్‌లో ఎక్కిన రూపేష్ పడుకున్నారు. అహ్మద్‌నగర్ నుంచి నాసిక్‌కు వచ్చిన వారిలో అతను ఒకరు. చూడటానికి 18 ఏండ్ల వయసు వాడిలా కనిపిస్తారు. కానీ, పాతికేళ్ల బ్రహ్మచారి. వ్యాపారం చేస్తున్నారు. ఇంగ్లిష్ మాట్లాడలేరు కానీ, అర్థం చేసుకోగలరు. దేశాయ్ గురువైన శంకర్ మహారాజ్ భక్తుడు. కొద్దిసేపు అతనితో సత్సంగం సాగింది. తర్వాత నిద్రకు ఉపక్రమించాను.

పడుకోబోయే ముందు వెంకటేశ్వరరావు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. గత రాత్రి అతనికి కలలో తమ ఊళ్లోని ఓ సిద్ధాంతి కనిపించారు. పడవలో ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్తుంటే అతని సెల్‌ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. అతను దాన్ని చూసుకోలేదు. గుడినుంచి వచ్చాక చూస్తే ఆ కాల్ ఎవరిదో తెలీలేదు. అతను ఆ నంబర్‌కు ఫోన్ చేసి, తనకు మిస్డ్ కాల్ ఉందని, అది ఎవరిదని అడిగితే, గత రాత్రి కలలో కనపడ్డ ఆ సిద్ధాంతి నుంచే! వెంకటేశ్వరరావు పేరుగల మరొకరికి చేయబోయి పొరపాటున అతనికి చేశారుట. వెంకటేశ్వరరావు ప్రతీ రాత్రి నిరంజన్ ఫల్ అనే పళ్లను నానపెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే తింటారు. నాకు ఒకటి ఇచ్చారు. పండు నానాక నల్లటి దారాల్లా వేలాడుతూ కనిపిస్తాయి. ఇక మళ్లీ నాకు నానపెట్ట వద్దన్నాను. మలబద్దక సమస్య వున్నవారికి అవి బాగా సహాయం చేస్తాయని చెప్పారాయన.

21 అక్టోబర్ 2008, మంగళవారం: మూడో రోజు

అటాచ్డ్ బాత్‌రూం లేకపోయినా బయట చాలా బాత్‌రూమ్‌లు ఉండటంతో లేచాక త్వరగా తెమిలాను. ఉదయం 7కు రవ్వ కేసరి బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టారు. ఏడున్నరకల్లా బస్సు బయల్దేరింది. వెంకటేశ్వరరావు మళ్లీ క్యాంటిన్‌కు వెళ్లి ఏడు మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చి మా సీటుకింద ఆ కార్టన్‌ను ఉంచారు. దారిలో అటూ ఇటూ చెట్లు. మా యాత్రలో మా రోడ్డుకు కుడివైపు 5-20 కిలోమీటర్ల దూరంలో నర్మద నది పారుతూ ఉంటుంది. మా యాత్ర మొత్తంలో నదిని చూసింది ఏడెనిమిదిసార్లే. హైవేమీద కాక, నదికి దగ్గరగా అడవిలోని చిన్న రోడ్లమీదే మా ప్రయాణం సాగింది. కాబట్టి, రోడ్లకి అటు ఇటు చెట్లు, గుబుర్లు కనిపించాయి. నది ఒడ్డున రోడ్డు లేదు.

అక్కడక్కడ చిన్నచిన్న ఊళ్లు తారసపడ్డాయి. కాలినడకన పరిక్రమ చేసేవాళ్లకు కూడా నిత్యం నర్మద దర్శనం అవదుట. కొంతదూరం వెళ్లాక చాలా వాహనాలు ఆగి వున్నాయి. అది మధ్యప్రదేశ్‌లోకి వెళ్లే చెక్‌పోస్ట్. దేశాయ్, డ్రైవర్ బస్సుకి చెందిన కాగితాలు, ప్రయాణీకుల జాబితాని తీసుకొని వెళ్లి పద్నాలుగు రోజులకు రోడ్ ట్యాక్సీ కట్టి లంచం ఇచ్చి వచ్చారు. దాంతో అంతా ప్రశాంతంగా జరిగింది. లంచం ముట్టేదాకా బస్సును తమ రాష్ట్రంలోకి వదలకుండా ఏదో వంక చెప్పి ఒక్కోసారి అయదారు గంటలసేపు ఆపేస్తారట.

మల్లాది వెంకట కృష్ణమూర్తి
mvk murthy

తీర్థయాత్ర
theertha-yatra

432
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles