అలుపెరుగని న్యాయవాది


Sun,August 25, 2019 12:58 AM

లాయర్.. న్యాయం.. అన్యాయాన్ని విశ్లేషించే నిత్య అధ్యయనకారుడు. నేరం ఏంటి? దానికి శిక్ష ఏంటి? సాక్ష్యాలు ఏమున్నాయి? చట్టం ఏం చెప్తున్నది? వంటి విషయాలు జేబులో పెట్టుకొని చేయాల్సిన బాధ్యతాయుతమైన పని. మామూలుగా ఏదైనా వృత్తిలో అనుభవం.. వయసు పెరుగుతున్న కొద్దీ పని భారం ఆటోమేటిగ్గా తగ్గుతుంది. కానీ.. న్యాయవాద వృత్తికి అది వర్తించదని అంటున్నారు. 92 ఏండ్ల వకీల్ సాబ్ అనిరెడ్డి పుల్లారెడ్డి. అవిశ్రాంత న్యాయవాదిగా.. నల్లకోటేసుకొని.. ఇప్పటికీ కోర్టులో కేసులు వాదిస్తున్నారు! ఆయన దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది ఉన్నత హోదాల్లో ఉన్నారు. తాజాగా ఆయన కుమారుడు అనిరెడ్డి అభిషేక్ రెడ్డి హైకోర్టు జడ్జిగా నియమితులైన సందర్భంగా పుల్లారెడ్డిని పరిచయం చేసుకుందాం. ఓల్డ్ మలక్‌పేట్‌లో ఓ ఉదయం. పాత.. కొత్త కలబోసిన ఇండ్ల సముదాయం. ఇరానీ చాయ్ కేఫ్‌లు.. ఇరుకైన రోడ్లు.. రోడ్డు పక్కనే కార్నర్‌లో శశి నివాస్. పైన అనిరెడ్డి పుల్లారెడ్డి-న్యాయవాది అని రాసి ఉంది. లోపల దర్వాజలన్నీ మూసేసి ఉన్నాయి. మూడు నాలుగుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎలాంటి స్పందన లేదు. కిటికీ సందులోంచి చూస్తే.. ఇల్లంతా గ్రంథాలతో నిండిపోయి ఉంది. వాటి మధ్యన ఒక పెద్దాయన కుర్చీ వేసుకొని పుస్తకంలో లీనమై చదువుతున్నారు. సార్.. సార్.. అనే అరుపులకు ఆ.. ఎవరూ? అనుకుంటూ ఊతకర్ర సాయంతో బయటకు వచ్చారు. ఆయనే సీనియర్ న్యాయవాది అనిరెడ్డి పుల్లారెడ్డి. వయసు 92 సంవత్సరాలు. రంగారెడ్డి జిల్లా కోర్టులో లాయర్. ఇది ఇల్లా? కోర్టా అనిపించింది. వేల సంఖ్యలో న్యాయశాస్ర్తానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఏ కేసును ఎలా డీల్ చేయాలి? ఏ సెక్షన్ కింద ఏయే కేసులు ఉంటాయి? నేరం రుజువైతే ఎలాంటి శిక్షలు ఉంటాయి? వంటి సంపూర్ణ సమాచారమంతా తన ఇంట్లోనే పెట్టుకొని నిరంతరం అధ్యయనం చేస్తున్నారు ఆయన.
anireddy-pullla-reddy
నిజంగా ఆ వయసులో కూర్చోవడం.. లేవడం.. నడవడమే కష్టం. అలాంటిది పుల్లారెడ్డి అలవోకగా ఇలాంటివన్నీ చేసేస్తూనే కోర్టుకు వెళ్తూ.. కేసులు వాదిస్తున్నారు. పుల్లారెడ్డి వయసు పండిన లాయరే కాదు.. అనుభవం పదింతలు పండి నేటితరం న్యాయనిర్ణేతలకు పాఠమైన లాయరు కూడా. నిత్యం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకొని చురుగ్గా.. యువ న్యాయవాదులతో కలిసి కేసులు వాదిస్తున్నారు. ఇంత అనుభవం ఉండి కూడా ఈ గ్రంథాలయం అవసరమా? మీకు తెలియనివంటూ ఏముంటాయి? అని అడిగితే.. కాదు.. కాదు.. న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉండాలి. రోజూ న్యాయశాస్త్ర పుస్తకాలతో పాటు ఉన్నత న్యాయస్థానాలు వెలువరించే తీర్పులు చదువుతుండాలి. అప్పుడే వాదించే కేసుపై స్పష్టత.. వెలువడే తీర్పుపై నమ్మకం ఏర్పడుతాయి అన్నారు పుల్లారెడ్డి. వయసు పైబడితే పని చేయాలన్న ఆసక్తి తగ్గుతుంది అంటుంటారు చాలామంది. కానీ పుల్లారెడ్డి తొంభైయేళ్లు పైబడినా తొణకని విశ్వాసం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. నిత్య స్ఫూర్తితో వెలిగే జీవితం ఆయనది. నాటి.. నేటి తరాల న్యాయవాదులెందరికో ప్రేరణ అయన.

న్యాయవాద వృత్తి అంటే ఇంత ప్రేమ ఎందుకు? అని అడిగితే.. చిన్నప్పటి నుంచి చూసిన ప్రజల సమస్యలే న్యాయవాద శాస్త్రం చదివేలా ప్రోత్సహించాయని చెప్పారు. పుల్లారెడ్డిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామం. 1928లో రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి అనిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తల్లి రుక్కమ్మ. వెంకట్‌రెడ్డి గ్రామంలో పట్వారీగా పనిచేసేవారు. భూ సమస్యలు.. ఇతర సమస్యల గురించి ఆయన వద్దకు రోజూ ఎంతోమంది వచ్చేవారు. పట్వారీగా నాన్న అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల పట్ల కనబర్చే నిబద్ధత తనకు నచ్చేవి. వెంకట్‌రెడ్డి పట్వారీ అయినా పిల్లలు మాత్రం అందరిలాగే నడుచుకుంటూ వెళ్లి రాయపోల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని నిర్ణయించుకొని హైదరాబాద్‌లోని చుట్టాల ఇంట్లో ఉంచి చదివించారు. అలా గౌలిగూడలోని మేనమామల ఇంట్లో ఉంటూ పుల్లారెడ్డి చదువుకున్నారు. అది 1950.. సెప్టెంబర్. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా పుల్లారెడ్డిని చూసివెళ్లేవారు వాళ్ల నాన్న. ఆ రోజు కూడా ఏదో పని కోసం హైదరాబాద్ వెళ్లే పని ఉంది. కొద్దిసేపటికే పట్వారీ వెంకట్‌రెడ్డి దారుణ హత్య అనే వార్త. పుల్లారెడ్డి కుటుంబానికి ఇదో పెద్ద షాక్. అప్పుడు పుల్లారెడ్డి ఎల్‌ఎల్‌బీ ఫస్టియర్ చదువుతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయాక చదువు సాగించడం అవుతుందా? లేదా? అనే ఆందోళన మొదలైంది.

anireddy-pullla-reddy3
అయినా ఏమాత్రం వెనుకడుగు వేయక తల్లి ధైర్యం.. ప్రోత్సాహంతో ముందుకెళ్లారు. చదువుతుండగానే పౌరసరఫరాల శాఖలో ఉద్యోగం వచ్చింది. అయితే.. వాళ్ల నాన్నలా ప్రజలకు మేలు చేసే వృత్తిలో ఉండాలని న్యాయవాద కోర్సు పూర్తిచేశారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి 1952లో న్యాయవాదిగా బార్‌కౌన్సిల్‌లో నమోదు అయ్యారు. అప్పట్లో ప్రముఖ న్యాయవాది త్రయంబక్‌రావు దేశ్‌ముఖ్ వద్ద జూనియర్‌గా చేరి ఐదేళ్లు శిక్షణ పొందారు. ఆ తర్వాత సొంతంగా మలక్‌పేట్‌లో కార్యాలయం పెట్టి న్యాయవాదిగా కొనసాగుతున్నారు. పుల్లారెడ్డి చదువంతా ఉర్దూ మీడియంలోనే సాగింది. అయినా ఆయన కోర్టులో అనర్ఘళంగా ఆంగ్ల వాదనలు వినిపిస్తూ ఎందరికో ఆదర్శమయ్యారు. అరవై సంవత్సరాలకు పైబడి న్యాయవాద వృత్తిలో రోజూ కోర్టుకెళుతూ కేసులు వాదిస్తూ చాలా బిజీగా ఉంటారాయన. ఆయన దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది విజయవంతంగా వృత్తి నిర్వహిస్తున్నారు. అదే కోర్టులో ఆయనతో సమంగా కేసులు వాదించేవారు కొందరైతే.. హైకోర్టులో సీనియర్లుగా కొనసాగుతున్నవారు మరికొందరు. దీనికి ఉదాహరణగా వారి ఇద్దరు కుమారులను చెప్పుకోవచ్చు. పుల్లారెడ్డికి వృత్తిపట్ల ఉన్న అంకితభావం, కష్టించే మనస్తత్వానికి ఆకర్షితులై న్యాయవాద వృత్తిలోకి వచ్చి.. ఆయన దగ్గర శిశ్యరికం చేసిన ఎంతోమందిలో ఆయన కుమారులు కూడా ఉండటం విశేషం.

మర్రి చెన్నారెడ్డి.. రాజశేఖర్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులతో ఉత్తమ న్యాయవాదిగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు పుల్లారెడ్డి. వారి సతీమణి డాక్టర్ అనిరెడ్డి శశిరేఖ సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు. ప్రముఖ కవి.. రచయిత్రి కూడా. ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సంస్కృత శాఖలో A Study Of The Commentaries Of Ghan-shyam On Sanskrit Dramas అనే అంశంపై పరిశోధనా సిద్ధాంత వ్యాసంతో పీహెచ్‌డీతో పాటు డాక్టర్ సాతవ లేకర్ గోల్డ్‌మెడల్ అవార్డు పొందారు. సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ మహావిద్యాలయంలో సంస్కృత విభాగం అధ్యక్షురాలిగా 22 సంవత్సరాలు సేవ చేశారు. గాంధీ జ్ఞానమందిర్ యోగకేంద్రంలో 40 సంవత్సరాలకు పైగా యోగాభ్యాసం చేస్తూ యోగరత్న బిరుదు పొందారు. పుల్లారెడ్డి యువ లాయర్లతో ఎంతో కలివిడిగా వారిలో నూతన విద్యార్థిగా ఒదిగిపోతారు. వారందరికీ సలహాలు.. సూచనలు ఇస్తుంటారు. కక్షిదారులకు కేసులోని లోటుపాట్లను ముందే స్పష్టంగా వివరించి వారి అభిప్రాయాలను విని ధైర్యం చెప్పాలి.. ధనార్జనే ధ్యేయంగా కాకుండా కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా సేవాతత్పరతను కలిగి ఉండాలి.. బెంచ్ ముందుకు వెళ్లేముందు కేసు వివరాలను పూర్తిగా చదివి.. న్యాయస్థానం చెప్పే విషయాన్ని ముందే నిర్ధారించుకోవాలి.. ఇవన్నీ చేస్తే దోషులకు శిక్ష పడి.. నిర్ధోశులకు న్యాయం చేసినవాళ్లం అవుతాం అని చెప్తుంటారు వకీల్‌సాబ్ అనిరెడ్డి పుల్లారెడ్డి.

anireddy-pullla-reddy2
తాజాగా సుప్రీంకోర్టు కొంతమంది తెలుగు లాయర్లను హైకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో అభిషేక్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ అభిషేక్‌రెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు. తండ్రి దగ్గరే శిక్షణ పొందారు. అభిషేక్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కూడా న్యాయవాద వృత్తి పట్ల వాళ్ల నాన్నకు ఉన్న అంకితభావాన్ని.. సొసైటీలో గుర్తింపును గమనించి తాము ఇదే వృత్తిలోకి రావాలని అనుకున్నారు. తండ్రికి విషయం చెప్పారు. కొడుకుల మాటలు విని పుల్లారెడ్డి మురిసిపోయారు. తాను ఎంత నిక్కచ్చిగా ఉంటే తన కొడుకులు కూడా ఇదే రంగంలోకి వస్తారు అనేది ఆయన సంతోషానికి కారణం. అంటే.. పిల్లలకు మంచి విలువలే నేర్పించాను అని ఆయన నమ్మకం. అలా పిల్లల అభీష్టాన్ని గౌరవించి న్యాయవాద వృత్తిలోకి వచ్చేందుకు పూర్తి సహకారం.. ప్రోత్సాహం అందించారు. అలా అభిషేక్ రెడ్డి నాన్నను చూసి నేర్చుకొని.. ఇంతింతై ఎదిగి హైకోర్టు జడ్జీగా ప్రమోషన్ సంపాదించారు. తన దగ్గర శిక్షణ తీసుకొని.. హైకోర్టులో సేవలందిస్తూ.. ఇప్పుడు జడ్జీగా పదోన్నతి సాధించడం పట్ల పుల్లారెడ్డి ఇటు ఫలాలను ఆస్వాదిస్తూ.. అటు పుత్రోత్సాహం పొందుతూ మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది అనేవారట.. తండ్రి లాయరే.. కొడుకులు లాయరే.. ఇక ఏం అభివృద్ధి చెందినట్లు? అని చాలామంది అనేవారట. కానీ పుల్లారెడ్డి కొడుకులు ఏనాడు వీటిని లెక్క చేయలేదు. పైగా మూడోతరాన్ని కూడా స్వాగతిస్తున్నారు. పుల్లారెడ్డి వారి మనవరాలు కూడా న్యాయవాద వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి కనబర్చడంతో ప్రస్తుతం లా కోర్సు చదివిస్తున్నారు.

-దాయి శ్రీశైలం
-నర్రె రాజేశ్

606
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles