గృహావసరాలు తీరుస్తానంటున్న దేవదత్తా ఉపాధ్యాయ


Mon,August 26, 2019 01:28 AM

ఆమె జర్నలిస్ట్‌గా రాణించాలనుకుంది. మీడియాలోనే సేల్స్ రంగంలో కాలుమోపాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. కానీ అవేవీ తనకు సంతృప్తినివ్వలేదు. తనకంటూ సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకుంది. కుదరలేదు. పెండ్లి, ఉద్యోగం, గృహిణిగా, తల్లిగా ఇలా అనేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. అన్ని పాత్రల్ని సమన్వయం చేసుకోలేక సతమతమయ్యేది. సమయాన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక తలపట్టుకునేది.ఆ ఆలోచన నుండి ఉద్భవించింది భారతీయ మహిళల గృహావసరాలు తీర్చే మార్కెట్ టైమ్‌సేవర్స్ తొలి మొబైల్ మార్కెట్. తనదైన మార్గంలో పయనిస్తూ గృహిణులూ, తల్లులూ, ఉద్యోగ నిపుణులకు సేవలందిస్తున్న సంస్థ సి.ఇ.ఓ., సహవ్యవస్థాపకురాలు
దేవదత్తా ఉపాధ్యాయ సక్సెస్‌మంత్ర.

Teacher
తను అనుభవించిన కష్టాలు సాధారణంగా అందరు మహిళలకూ వచ్చేవే. అలాంటి వారి గృహావసరాలు తీర్చేందుకు ఉపక్రమించారు దేవదత్తా. దానికోసం ఓ సంస్థను స్థాపించారు. తనదైన మార్గంలో పయనిస్తూ గృహిణులూ, తల్లులూ, ఉద్యోగ నిపుణులకు సేవలందిస్తున్నారు. భారతీయ గృహావసరాలు తీర్చే ఓ విశిష్ఠమైన మొబైల్-ఫస్ట్ విపణి టైమ్ సేవర్స్. జీవితాన్ని మీరెలా కావాలంటే అలా మలచుకోవచ్చు. మనలో ప్రతిఒక్కరికీ ఓ ఎంపిక ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్నదాన్నిబట్టి సులువైన అంశ మో, కష్టమైన అంశమో దాన్నుంచి ఉత్పన్నమవుతుందని అంటారామె.

తొలి పరిచయం

ఒడిశాలో ఉక్కునగరమైన రూర్కెలాలో దేవ్ జన్మించారు. ఆమె తండ్రి ఓ హెచ్ ఆర్ నిపుణుడు. తల్లి విద్యా వేత్త. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత, తొంభయ్యవ దశకం చివర్లో చత్తీస్‌గడ్‌లోని బిలాయ్‌కి ఆమె కుటుంబం తరలిపోయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆమె నాగపూర్‌కు వెళ్ళారు. అక్కడే ఆమె వృత్తిపరమైన ప్రయాణం ఆరంభమయింది. జర్నలిజం విద్యార్థిని అయిన దేవ్ తన వివాహం తర్వాత, మీడియా సేల్స్ రంగంలోకి ప్రవేశించారు.

ఉద్యోగ పర్వం

దేవదత్త (దేవ్) చదువుకుంటున్న సమయంలోనే తను ఏదో ఒకటి సాధించాలనే తాపత్రయంతో ఉండేవారు. దానికోసం అనేక రకాలుగా ప్రయత్నించేవారు. అలా తన సకల ప్రయత్నాలను, ప్రేరణనీ విజయం దిశగా మళ్ళించుకున్నారు. సాహిత్యంలో పటిష్టమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె పాత్రికేయురాలు కావాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. తన కలలను సాఫల్యం చేసుకోవడం కోసం నాగపూర్‌లోని ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమె కోరుకున్నట్లు తనకు జర్నలిస్ట్‌గా అవకాశం రాలేదు. సేల్స్ విభాగంలో చేరాల్సి వచ్చింది. అలా అని ఏ మాత్రం నిరాశ చెందకుండా మీడియా-సేల్స్ విభాగంలో ఓ బాధ్యతగల ఎగ్జిక్యూటివ్‌గా తన వృత్తిజీవితాన్ని ఆరంభించారు. ఆ తరువాత, అప్పుడే ఆరంభమైన సంస్థలు మొదలు ఫార్చ్యూన్ 500 వంటి ప్రతిష్టాత్మక సంస్థలెన్నింటిలోనో పనిచేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, యాహూ! ఇండియా, వీడోపియా ఇంక్.లాంటి అగ్రశ్రేణి సంస్థలకు ఆమె సేవలందించి అనుభవం గడించారు.

అనుభవం నేర్పిన వ్యాపారం

తను ఉద్యోగం చేస్తున్నప్పటికీ సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక ఆమెను ఎల్లప్పుడూ వెన్నాడేది. ఎలాంటి వ్యాపారం చేయాలనే ఒక నిర్ణయానికి అంత త్వరగా రాలేదు. వ్యక్తిగతమైన అనుభవమే తన వ్యాపారరంగంలోకి అడుగుపెట్టడానికి అంకురార్పణ అయింది. 2012లోకి వెళ్తే ఉద్యోగినిగా వ్యక్తిగతమైన, వృత్తిపరమైన జీవితం మధ్య దేవ్ సతమతమైపోయేవారు. గృహిణిగా, ఓ తల్లిగా, ఓ వృత్తి నిపుణురాలిగా తన పాత్రల్ని సమన్వయం చేసుకోవడం ఆమెకు ఎల్లప్పుడూ కష్టమైపోతూ ఉండేది. వేగంగా పరిగెడుతున్న నగరజీవనంలో, అండగా నిలిచే ఎలాంటి వ్యవస్థా లేకుండా, ఓ చిన్న కుటుంబంలో శిశువుకు తల్లిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉండేది. రోజువారీ పనులూ, కార్యకలాపాలకు అందుబాటులో సాయం చేసేవారు లేకపోవడం తనలాంటి ఎందరికో సవాలు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నప్పుడు, ఎల్లప్పుడూ విస్తరణకు అవకాశం ఉన్న రంగం సేవల రంగమని గుర్తించింది. అలా దేవ్ ఆమె సహవ్యవస్థాపకులు కలిసి టైమ్‌సేవర్స్ గురించి ఆలోచించారు. అలా వారి మానసపుత్రిక అయిన ఈ సంస్థ ఇప్పుడు ఓ సాకారమైన వ్యాపారంగా ఆవిర్భవించింది.

టైమ్‌సేవర్స్ గురించి ...

Debadutta-Upa
గృహ సేవా అవసరాలన్నిటికీ పరిష్కారం చూపించే ఏకైక గమ్యం టైమ్‌సేవర్స్. ధ్రువీకరణ పొందిన హోం సర్వీస్ ప్రొవైడర్లను పరిశీలించి, పర్యవేక్షించిన తర్వాత కస్టమర్లకు ఇది అనుసంధానం చేస్తుంది. ఈ సేవల్లో ఎక్కువశాతం గృహ నిర్వహణ, వన్-టైమ్ సేవలు లాంటివి ఉంటాయి. ఇది ఈ సంస్థ అందిస్తున్న సేవల్లో ఒక కోణం మాత్రమే. అసంఘటితంగా ఉన్న హోం సర్వీస్ ప్రొవైడర్లను మరింత సంఘటితపరిచేందుకు ఇది తోడ్పడుతున్నది. తద్వారా వారి జీవన ప్రమాణం మెరుగయ్యేందుకు దోహదం చేస్తున్నది. ప్రస్తుతం, ముంబాయి, పుణే నగరాల్లో 500కు పైగా సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కంపెనీ చేరువైంది. వారికి తగినంత గౌరవం, హుందాతనం కల్పిస్తున్నది. ప్రస్తుతం ఈ సంస్థ గృహ సేవా అవసరాల్లో దాదాపు 70 నుంచి 75 శాతం వరకూ తీరుస్తున్నది.

కుటుంబానికి పెద్దపీట

ఉద్యోగ సమయంలో ఏదైనా సాధించాలనే దృక్పథంతో ప్రారంభించిన టైమ్‌సేవర్ ఇప్పుడు విజయవంతంగా నడుస్తుండడంతో తన కుమారుడు పెరుగుతున్న దశలో అతనికి ఎక్కువ సంరక్షణ, మద్దతు, మార్గదర్శకత్వం అవసరం కాబట్టి తన కుమారుడితో గరిష్టంగా కాలం గడపడానికే ఆసక్తి చూపుతున్నానని దేవాదత్తా అంటారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తన ప్రయాణాన్ని నిర్దేశించుకున్న ఆమె ఇప్పుడు తన బిడ్డకు పూర్తికాలం ఆలనాపాలనా చూస్తున్న తల్లి కూడా.

భవిష్యత్ ప్రణాళిక

బాలల విద్యారంగంలో ఏదైనా చేయడం నాకు చాలా ఇష్టమైన విషయం అన్నారు దేవ్. నిజమే మరి, ఆమె సాధించిన అభివృద్ధికి మూలాలన్నీ పటిష్ఠమైన విద్యావ్యవస్థమీదే ఆధారపడి ఉన్నాయి. అత్యుత్తమ విద్యను పొందేలా ప్రతిఒక్కరినీ ప్రోత్సహించడం చాలా ముఖ్యమన్నది ఆమె విశ్వాసం.

Teacher1
ఒక సంస్థను నిర్వహించడంలో ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకూ ఒకే రకమైన కష్టాలూ, సాఫల్యాలూ, విజయాలూ వస్తాయి. దేవ్ నమ్ముతారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆధారపడడాన్ని సిగ్గు పడే విషయం అనుకుని దూరంగా ఉండిపోకూడదనీ, ఒంటరిగా ఉండడం కన్నా కలిసికట్టుగా ఉన్నట్టయితే మరిన్ని ఎక్కువ సమస్యలను వారు పరిష్కరించుకోగలరనీ ఆమె సూచిస్తున్నారు.

508
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles