స్క్రీనింగ్ టెస్ట్‌లతో క్యాన్సర్‌ను పసిగట్టొచ్చు!


Mon,August 26, 2019 11:38 PM

పుట్టుమచ్చలు అందరికీ ఉంటాయి. కాకపోతే కొందరికి ఎక్కువగా ఉంటాయి. నోటి సమస్యలూ చాలామందికి ఉంటాయి. కొందరికి వాటంతట అవే వస్తే.. మరికొందరికి చెడు అలవాట్ల వల్ల వస్తాయి. పెద్దపేగు సమస్యలు వస్తే చాలామంది ఏదో మామూలు మార్పులే అయుండొచ్చని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ.. ఇవన్నీ చాలా ప్రమాదకరం. పుట్టుమచ్చలు చర్మ క్యాన్సర్‌కు.. నోటి సమస్యలు నోటి క్యాన్సర్‌కు.. పేగు సమస్యలు పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి మార్పులను గమనించండి. స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోండి, క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడండి!
Cancer
ప్రమాదకర క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్.. పెద్దపేగు క్యాన్సర్.. ప్రొస్టేట్ క్యాన్సర్.. నోటి క్యాన్సర్ ఇలా చాలా ఉన్నాయి. వీటిని ముందుగానే ఎలా గుర్తించవచ్చో.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. క్యాన్సర్ ఏదైనా గుర్తించాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌లే కీలకం. ఏ క్యాన్సర్‌కు ఏ స్క్రీనింగ్ టెస్ట్ అవసరమో తెలుసుకుందాం.


Skin-Cancer

చర్మక్యాన్సర్

చర్మ క్యాన్సర్ స్త్రీ, పురుషులిద్దరిలో వస్తుంది. పుట్టు మచ్చల పరిమాణంలో.. ఆకారంలో.. రంగులో వచ్చిన మార్పులవల్ల చర్మక్యాన్సర్ వస్తుంది. ఇందులో పుట్టుమచ్చలు ఒక కారణం. కాబట్టి వాటిలో ఏమైనా మార్పులు కనిపిస్తే జాగ్రత్త పడాలి.

ఎలా గుర్తించాలి?

ఏబీసీడీఈ పద్ధతి ద్వారా పుట్టుమచ్చల పరిమాణంలో ఏం మార్పులు వచ్చాయో? అవి ఎలాంటివో? రంగులో ఏం మార్పులు వచ్చాయో గుర్తింవచ్చు. చర్మ క్యాన్సర్ నిర్ధారణలో ఏబీసీడీఈ పద్ధతి కీలకంగా పనిచేస్తుంది.

ఏబీసీడీఈ పద్ధతేంటి?

ఏ: పుట్టుమచ్చలను మధ్యగా విభజించి చూసినప్పుడు రెండు అర్ధభాగాలు ఒకేలా ఉండకూడదు.
బీ: పుట్టుమచ్చ అంచులు, పలుచని రంగులో లేదా రఫ్‌గా ఉండకూడదు.
సీ: పుట్టుమచ్చల రంగులో మార్పు రాకూడదు. అంటే అవి మొదట ఉన్న రంగు కంటే ముదురురంగులోకి మారటం లేదా పలుచబడటం జరగొద్దు.
డీ: పుట్టుమచ్చ వ్యాసం 1/4 అంగుళం కన్నా ఎక్కువగా ఉండడం.
ఈ: పుట్టుమచ్చ చర్మంపై ఉబ్బెత్తుగా, వాచినట్లుగా ఉండడం.

పెద్దపేగు క్యాన్సర్

పెద్దపేగు క్యాన్సర్ మొదట చిన్న గుల్లలుగా మొదలై క్రమంగా క్యాన్సర్ కణతిగా మారుతుంది. కాబట్టి పేగుకు సంబంధించి ఏమైనా సమస్య వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ నుంచి బయటపడాలి.

Cancer2

లక్షణాలు

పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు సాధారణంగానే అనిపిస్తాయి. అందువల్ల దానిని నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. అలా కాకుండా మామూలు సమస్యలకు.. పెద్దపేగు క్యాన్సర్‌తో వచ్చే సమస్యలకు తేడా ఏంటో వ్యక్తిగతంగా విశ్లేషించుకొని ప్రాథమికంగా మీరే ఓ అంచనాకు రావాలి. పెద్దపేగు క్యాన్సర్ పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ లక్షణాలేంటో తెలుసుకోండి.
-మలద్వారం వద్ద రక్తస్రావం. మలంలో రక్తం పడటం.
-డయేరియా, మలబద్దకం మొదలైనవి వారాల తరబడి కొనసాగుతాయి.
-పొత్త్తి కడుపు భాగంలో నొప్పి లేదా పట్టేసినట్లు ఉంటుంది.
-ఆకస్మికంగా బరువు తగ్గుతారు.

ఎవరికి వస్తుంది?

పెద్దపేగు క్యాన్సర్ వ్యాధి ఫలానా వారికే వస్తుందని చెప్పలేం. వ్యక్తి జీవన విధానాన్ని బట్టి.. ఉన్న అలవాట్లను బట్టి వస్తుంది. కొన్నిసార్లు మాత్రం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ స్త్రీ, పురుషులిద్దరికీ వస్తుంది.

ఇంకా..

-ఇంతకుముందు క్యాన్సర్ వచ్చి తగ్గిన వారిలో పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది.
-అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవారిలో కూడా పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది.
-రక్త సంబంధీకుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే కొన్నిసార్లు పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది.
పైన పేర్కొన్న సందర్భాల్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి FOBT, ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడో స్కోపీ పరీక్షలు చేయించుకోవాలి.

నోటి క్యాన్సర్

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి.. నోటిని శుభ్రంగా ఉంచుకునేదాన్ని బట్టి నోటి క్యాన్సర్ వస్తుందా లేదా? అనేది చెప్పొచ్చు. మిగతా శరీర భాగాల్లాగా కాకుండా నోటి క్యాన్సర్‌ను గుర్తించడం చాలా సులువు. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వస్తుంది.

ఎలా గుర్తించాలి?

నోటిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా పొగాకు నమిలే అలవాటు ఉన్నవారు వెంటనే దానిని మానుకోవాలి. పొగాకు అలవాటు ఉండి మానేసిన వారు కూడా నోటిలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నోటి క్యాన్సర్ ఇండియాలో ఎక్కువగా ఉంది. దీనిని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు.

ప్రోస్టేట్ క్యాన్సర్

భారతదేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణం అయిపోయింది. అయినప్పటికీ చాలామందికి ఈ వ్యాధి పట్ల అవగాహన లేదు. తెలిసినవారు కూడా అంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ విజృంభిస్తున్నది.

ఎవరికి వస్తుంది?

ప్రోస్టేట్ క్యాన్సర్ మగవారిలో మాత్రమే వస్తుంది. 50 ఏండ్ల వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఏ పరీక్షలు చేయించుకోవాలి?

మగవారు తప్పనిసరిగా ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా సలహా ఇస్తున్నాయి. 50 సంవత్సరాల వయసు నిండిన మగవారు ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ అంటిజన్ (పీఎస్‌ఏ) రక్తపరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే మిగతా మగవారు 40 సంవత్సరాల వయసు నుంచే ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవాలి.
ch-mohana-vamshi

130
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles