కీళ్లవాతం.. ఇక హతం!


Tue,August 27, 2019 01:37 AM

ఒకప్పుడు.. కీళ్లనొప్పులు అరవైయేండ్లు పైబడిన వారికే వచ్చేవి. కానీ.. ఇప్పుడు ముప్పైయేండ్లకే వచ్చేస్తున్నాయి. లోపం ఎక్కడుంది? మనలోనే ఉంది. పోషకాహార లోపం.. వ్యాయామం లేకపోవడం.. క్రమం తప్పిన జీవనశైలి వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కీళ్లు బాగుంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అలా కీళ్లను లక్ష్యంగా చేసుకొని శరీరాన్ని బలహీనంగా తయారుచేస్తున్న వ్యాధి కీళ్లవాతం.
knee-pain
కదలికలే తగ్గిపోయిన ఆధునిక జీవనశైలిలో కీళ్లని ఉపయోగించడం తక్కువ అవుతున్నది. మనిషికి తగినంత శారీరకశ్రమ ఉండటం లేదు. దీనికి తోడు కీళ్లకు పోషక లోపం. మరోవైపు అధిక బరువు.. స్థూలకాయం. వీటన్నింటితో ఒత్తిడి. ఇవన్నీ కలిసి కీళ్లవాతంగా మారి ఈ సమస్య తీవ్రమవుతున్నది. గతంలో ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నది. కాబట్టి అప్రమత్తంగా ఉండి కీళ్లవాతంను హతం చేయాలి.

కీళ్లవాతం అంటే?

శరీరంలో రెండు ఎముకలను కలిపి ఉంచే భాగం కీలు. ఎముకలు సులువుగా అటూ ఇటూ కదలడానికి కీలులో ఉండే కార్టిలేజ్ పదార్థం ఉపయోగపడుతుంది. ఇది అరిగిపోతే ఎముకలు రెండూ ఒరుసుకుపోయి, నొప్పి మొదలై, కీలు వాస్తుంది. ఇదే కీళ్లవాతం.

లక్షణాలేంటి?

చేతులు, కాళ్ల జాయింట్లలో నొప్పితో ప్రారంభమై కాళ్లూ, చేతులూ కదల్చలేనిస్థితికి ఈ వ్యాధి దారితీస్తుంది. ఒక్కసారి కీళ్ల నొప్పుల బారిన పడితే జీవితాంతం అవి వేధిస్తూనే ఉంటాయి. కీళ్లవాతం ముదిరితే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. రాత్రిపూట నొప్పి వల్ల నిద్ర కరువవుతుంది. నడవలేని పరిస్థితీ ఎదురవుతుంది. కీళ్లవాతం ప్రభావం గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపైనా పడుతుంది. చర్మ సమస్యలు, దృష్టి లోపాలు కూడా చుట్టుముడతాయి. దీనివల్ల దైనందిన జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.

ఎలా వస్తుంది?

ఎముకల మధ్య కదలిక ఉండటం శరీర ధర్మం. కదలికలే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. వీటివల్లనే కీళ్లను కప్పి ఉంచే పొరల మధ్య సైనోవియల్ ద్రవం ఏర్పడుతుంది. కీళ్లకు అవసరమైన పోషకాలను రవాణా చేయడమే దీని పని. ఎప్పుడైతే కదలికలు తగ్గిపోతాయో అప్పుడు తగినంత సైనోవియల్ ద్రవం ఉత్పత్తికాక కీళ్లు తొందరగా అరిగిపోతాయి. బలహీనం అవుతాయి. శారీరక బరువు ఎక్కువైనప్పుడు బరువును మోసే మోకాళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనై చిన్న వయసులోనే కీళ్లవాతం సమస్యకు గురవుతున్నారు.

నొప్పులు ఎన్ని రకాలు?

కీళ్ల నొప్పుల్లో చాలా రకాలున్నాయి. వంద రకాలు వీటిలో ఉన్నాయని గుర్తించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. ఇందులో కొన్నిరకాల ఆర్థరైటిస్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

రుమటాయిడ్:

చేతులు, పాదాల జాయింట్లలో వచ్చే తీవ్రమైన నొప్పినే రుమటాయిడ్ అంటారు. ఎముకలు, కండరాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. నొప్పి, వాపు, నొప్పి ఉన్నచోట ఎర్రగా మారడం, కీళ్లు బిగుసుకుపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి. వంశపారపర్యంగా, ఇతర ఇన్ఫెక్షన్ల మూలంగా, వ్యాధి నిరోధకశక్తి అతిగా స్పందించడం వల్ల ఈ రకం ఆర్థరైటిస్ వస్తుంది.

సోరియాటిక్:

సొరియాసిస్ ఉన్నవారిలో చేతి వేళ్లు, కాళ్ల వేళ్ల వాపులు వస్తాయి. మడమనొప్పులు కూడా అధికంగా ఉంటాయి.

స్పాండైలో:

యువకుల్లో నడుము నొప్పులు, రాత్రి సమయాల్లో నడుము పట్టేసినట్టుగా అన్పించి నిద్రలేకపోవడం, ఉదయాన్నే నడుము బిగుతుగా ఉండడం, మడమల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్ధారణ- చికిత్స

రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా కీళ్లవాతంను గుర్తిస్తారు. ఇది ప్రారంభదశలోనే ఉంటే కీలు మరింత దెబ్బతినకుండా జాగ్రత్తపడవచ్చు. కార్టిలేజ్ మరింత అరిగిపోకుండా నివారించవచ్చు. మందులు, ఫిజియోథెరపీతో కీళ్లను బలోపేతం చేయవచ్చు. వాపును తగ్గించవచ్చు. ఈ మందుల్ని రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో వాడాలి. అయితే కీళ్ల వ్యాధులు తీవ్రమైతే అరిగిపోయిన కీలు స్థానంలో కొత్త కీలు అమర్చడం తప్ప మరోమార్గం లేదు. సాధారణంగా నలభై శాతం మందికి ఆపరేషన్ అవసరం అవుతుంటుంది. ప్రారంభంలోనే చికిత్స తీసుకుంటూ, సరైన జాగ్రత్తలు పాటిస్తే కీళ్లు అరిగే ప్రక్రియను వాయిదా వేయవచ్చు. ఈ వ్యాధి నాలుగు దశల్లో ఉంటుంది. నాలుగో దశలో మాత్రమే కీలు మార్పిడి అవసరం.

jeuvenileArthritis

కీలు మార్పిడి అవసరమా?

మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న ప్రతివాళ్లకూ ఆపరేషన్ చేస్తారన్నది నిజం కాదు. అవసరాన్ని బట్టి మార్పిడి అనేది ఆధారపడి ఉంటుంది. నడవలేనంత నొప్పి ఉండి, సాధారణ జీవనశైలికి అంతరాయం ఏర్పడితే, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కీలుమార్పిడి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కృత్రిమ కీళ్లు పాతికేళ్లు గ్యారెంటీగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఇ కోటెడ్ పాలీ ఇథిలీన్ ఇంప్లాంట్ అన్నింటికన్నా ఆధునికమైంది. ఇక కీళ్లల్లో సిరామిక్ పదార్థంతో తయారుచేసినవి కూడా వచ్చాయి. లోహమంటే అలర్జీ ఉన్నవాళ్లకు ఇవి మేలైనవి. ఒక్కో పేషెంటుకు ప్రత్యేకంగా తయారుచేసి, అమర్చగల కీళ్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటినే పేషెంట్ స్పెసిఫిక్ ఇన్ట్రుమెంటేషన్ (పిఎస్‌ఐ) అంటారు. ఇందులో భాగంగా మోకాలికి సీటీ స్కాన్ తీసి, ఏ కీలు ఏ మేరకు, ఏ విధంగా అరిగిపోయిందో చూస్తారు. దానికి అనుగుణంగా కృత్రిమ కీలును రూపొందించి, అమరుస్తారు. ఇవి సురక్షితమైనవే.

తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

-డాక్టర్లు సూచించిన విధంగా సక్రమంగా మందులు వాడుతూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తే కీళ్లవాతాన్ని తగ్గించుకోవచ్చు.
-సమతలంగా ఉన్న ప్రదేశంలో నడవడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
-క్రమం తప్పకుండా అరగంట వ్యాయామం చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
-శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
-ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
-మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి.
-ఊపిరితిత్తులకు, కాలేయానికి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి.
-ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి.
-క్యాల్షియం, విటమిన్ డి వంటివి శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి.
dr-kiran-kumar-reddy

104
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles