సొసైటీ మీద పోలీసు కేసు


Sat,August 31, 2019 12:48 AM

KENWORTH

- మెయింటనెన్స్‌ మెరుగ్గా ఉండటం లేదా?
- నిధులను సొసైటీ దుర్వినియోగం చేస్తున్నదా?
- తోటి సభ్యులతో కలిసి పోరాటం చేయవచ్చు


హైదరాబాద్లో దాదాపు యాభై శాతానికి పైగా గేటెడ్‌ కమ్యూనిటీల మెయింటనెన్స్‌ మెరుగ్గా లేకపోవడం వల్ల అందులోని నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సొమ్మెక్కువ చెల్లించి.. మరోవైపు నాసిరకమైన సేవలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. బయటికి చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందోననే భయంతో బహిరంగంగా మాట్లాడటానికి జంకుతున్నారు. ఈమధ్య కాలంలో సహజంగా మారిన ఇలాంటి సమస్యలకు పరిష్కారమే లేదా?

రాజస్థాన్‌ నుంచి రాజీవ్‌ నగర్‌కు విచ్చేసిన రాజీవ్‌ శర్మ.. మాదాపూర్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేండ్ల నుంచి కుటుంబంతో కలిసి ఒక చిన్న అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. ఎప్పటికైనా లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలో నివసించాలన్నది అతని కోరిక. స్విమ్మింగ్‌ పూల్‌, ఆధునిక క్లబ్‌హౌజ్‌, చిన్న పిల్లలకు ఆటస్థలాలు, క్రీడాస్థలాలు వంటివి ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనేవాడు. ఆయన ఆశించినట్టే పశ్చిమ హైదరాబాద్‌లో ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో ఫ్లాట్‌ వచ్చింది. దీంతో, ఎగిరి గంతేశాడు. ప్రస్తుతమున్న ఫ్లాట్‌ను ఎలాగోలా విక్రయించేసి.. కుటుంబంతో కలిసి దర్జాగా గేటెడ్‌ కమ్యూనిటీలోకి అడుగుపెట్టాడు. ఇక, అతని ఆనందానికి అవధుల్లేవు. బంధుమిత్రుల సమక్షంలో ఎంచక్కా గృహప్రవేశం కూడా చేసేశాడు. మిత్రులకు ఖరీదైన పార్టీ కూడా ఇచ్చేశాడు. వర్షలు కురవడం ప్రారంభం కావడంతో నెమ్మదిగా బాత్‌రూములో నుంచి నీరు కారడం మొదలైంది. మొత్తం కిచెన్‌ క్యాబినెట్‌ అంతా పాడైంది. మెయింటనెన్స్‌ ఆఫీసును సంప్రదించినా పట్టించుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు రాజీవ్‌శర్మ.

రెరా ఏం చెబుతోంది?

రెరా చట్టం సెక్షన్‌ 11(4) ప్రకారం.. అపార్టుమెంట్‌ను నివాసితుల సంఘానికి అప్పగించేంత వరకూ అందులోని ప్రాథమిక సౌకర్యాలన్నీ ప్రమోటరే నిర్వహించాలి. అంతేకాదు, ఐదేండ్ల పాటు ఆయా అపార్టుమెంట్‌లోని స్ట్రక్చరల్‌ బాధ్యతల్ని ప్రమోటరే చేపట్టాలి. కాకపోతే, కొందరు ప్రమోటర్లు కొనుగోలుదారులకు అపార్టుమెంట్లను అప్పగించడంలో ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అయితే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చాకే కొనుగోలుదారులు అపార్టుమెంట్‌లోకి ప్రవేశించాలని గుర్తుంచుకోండి.

మెయింటనెన్స్‌ ఛార్జీ ఎంత?

ప్రతి అపార్టుమెంటులోని నివాసితుల సంఘం మెయింటనెన్స్‌ ఛార్జీలను నిర్ణయిస్తుంది. ఇది చదరపు అడుక్కీ రూ.1.50 నుంచి 3 దాకా ఉంటుంది. కొన్ని లగ్జరీ ప్రాజెక్టుల్లో రేటు కాస్త అటుఇటుగా ఉండొచ్చు. నెలకు రూ.7,500 కంటే ఎక్కువ మెయింటనెన్స్‌ చెల్లించే నిర్మాణాల నుంచి అదనంగా 18% జీఎస్టీని నివాసితుల సంఘం వసూలు చేయా ల్సి ఉంటుంది. అపార్టుమెంట్‌ను బిల్డర్‌ కొనుగోలుదారులకు అప్పగించిన తర్వాత.. ఆయా కమిటీ మెయింటనెన్స్‌ ఛార్జీల గురించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా వసూలు చేసే సొమ్ముకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అధికారం నివాసితులకు ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ప్రమోటర్‌ లేదా అసోసియేషన్‌ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.

ఫిర్యాదు ఎవరికి?

ప్రమోటర్‌ లేదా నివాసితుల సంఘం.. అపార్టుమెంట్‌ నిర్వహణను మెరుగ్గా నిర్వహించకున్నా.. నివాసితుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకున్నా.. సమస్య గురించి వినకపోయినా.. జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. మెయింటనెన్స్‌ సొమ్మును నివాసితుల సంఘం దుర్వినియోగం చేస్తున్నట్లు భావిస్తే.. పోలీసు కేసు కూడా పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. క్రమం తప్పకుండా మెయింటనెన్స్‌ సొమ్ము కడుతున్నప్పటికీ, ప్రమోటర్‌ లేదా నివాసితుల సంఘం నుంచి నాసిరకమైన సేవలను అందుతున్నట్లయితే రాజీపడాల్సిన అవసరమే లేదు. మీతో పాటు కొందరిని కలుపుకుని ఒక బృందంగా ఏర్పడి పోరాటం చేయాల్సిందే. మీరు చేసే ఫిర్యాదు విలువ రూ.కోటి కంటే అధికంగా ఉంటే, నేరుగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రానికి (ఎన్‌సీడీఆర్‌సీ)కి ఫిర్యాదు చేయవచ్చు. 2017 జనవరి 1 తర్వాత అనుమతి తీసుకుని కట్టిన అపార్టుమెంట్‌లో సమస్య ఉన్నట్లయితే తెలంగాణ రెరా అథారిటీకి ఫిర్యాదు చేస్తే సరిపోతుంది.

మెయింటనెన్స్‌ విషయంలో ప్రమోటర్లు ఇబ్బంది పెడుతున్నారా? మీ అసోసియేషన్‌ అపార్టుమెంట్‌ను సక్రమంగా నిర్వహించడం లేదా? ఎలాంటి సమస్యలున్నా మాకు రాయండి. నిపుణులు మీకు సమాధానాలిస్తారు. ప్రశ్నలు పంపాల్సిన చిరునామా..

నమస్తే సంపద
8-2-3/7/8/9, క్రిష్ణాపురం. రోడ్‌ నెం.10, నమస్తే తెలంగాణ, మొదటి అంతస్తు, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034, [email protected]

174
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles