పంచాయతీ ప్లాట్ల క్రమబద్ధీకరణ?


Sat,August 31, 2019 12:54 AM

panchayat-plots
పంచాయతీ ప్లాట్లను కొనుక్కుని మోసపోయేవారి సంఖ్య తక్కువేం కాదు. కొన్నేండ్ల నుంచి ఈ అక్రమ తంతు యధేచ్చగా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ, రియల్టర్లు అక్రమ లేఅవుట్లు వేస్తూనే ఉన్నారు. అందులో కొన్నవారు మోసపోతూనే
ఉన్నారు. మరి, ఈ అక్రమ తంతుకు చరమగీతం పాడే అవకాశమే లేదా?


ధర తక్కువని.. ఏదో ఒకటుంటే చాలని.. ఇప్పుడు కాకున్నా, భవిష్యత్తులో అయినా ఉపయోగపడుతుందని.. చాలామంది పంచాయతీ ప్లాట్లను కొంటుంటారు. కొన్ని ఆర్థిక సంస్థలు అలాంటి వాటికి రుణాల్ని కూడా మంజూరు చేస్తున్నాయి. అందుకే, వెనకా ముందు చూడకుండా అధిక శాతం మంది మధ్యతరగతి ప్రజానీకం వాటిని కొనుగోలు చేసి దారుణంగా మోసపోతున్నారు. ఇలాంటి వాటిలో ప్లాటు కొంటే, ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కూడా లభించదు. ఒకవేళ, అడ్డదారుల్లో ఇల్లు కట్టుకున్నా.. విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ వంటి కనెక్షన్లు మంజూరు చేయరు. అది కూడా అక్రమ మార్గాల్లో తెచ్చుకున్నా ప్రశాంతంగా నిద్రపోలేరు. కారణం, అది అక్రమ కట్టడం కావడమే. స్థానిక సంస్థల అధికారులు ఎప్పుడొచ్చి కూలగొడతారో తెలియదు. ఒకవేళ అదే జరిగితే, అప్పటివరకూ ఆనందంగా ఉన్న కుటుంబమంతా చెల్లాచెదురవ్వక తప్పదు. మరి, అలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదంటే.. పంచాయతీ లేఅవుట్లలో ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. లేకపోతే, అదిలాబాద్‌ జిల్లాలో జరిగిందే మీకూ ఎదురు కావొచ్చు.

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం..

అదిలాబాద్‌ జిల్లాలో అక్రమార్కులు నిబంధనల్ని పాటించకుండా.. పంచాయతీల నుంచి అనుమతి తీసుకుని.. యధేచ్చగా అక్రమ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లను అరికట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల్ని అందుకున్న జిల్లా కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ రంగంలోకి దిగారు. ఆదిలాబాద్‌లో ఏకకాలంలో సుమారు 135 అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేశారు. అంతేనా? అవి అక్రమ లేఅవుట్లు అని, అందులో ఎవరూ కొనకూడదని బోర్డులు పాతిపెట్టారు. దీంతో, రియల్టర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. తమవారిని కలెక్టర్‌ మీద ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, ఆమె వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ ముందుకెళ్లడంతో అక్కడి ప్రజలు జిల్లా కలెక్టర్‌ అంటే ఇలాగుండాలని ప్రశంసిస్తున్నారు.

ఎలా క్రమబద్ధీకరిస్తారు?

- డీటీసీపీ నుంచి అనుమతి లేకుండా పంచాయతీ లేఅవుట్‌ వేసి, అభివృద్ధి పనులన్నీ చేసిన రియల్టర్ల సంఖ్య తక్కువేం కాదు. ఇలాంటి లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలంటే.. ఆయా భూమి విలువలో పదిరెట్లు మొత్తాన్ని పంచాయతీకి చెల్లిస్తే క్రమబద్ధీకరణ చేస్తారు.
- కొందరు రియల్టర్లు లేఅవుట్లు వేశాక, అందులో అభివృద్ధి పనులు చేయకుండా వదిలేస్తుంటారు. నిజానికి, రియల్టర్లు వెంచర్‌లో ప్రాథమిక సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలి. అందులో అమ్ముడు కాని ప్లాట్ల నుంచి స్థలం తీసుకుని మౌలిక సదుపాయాల్ని కల్పించాలి. ఒకవేళ, స్థలం లేకపోతే ఆయా భూమి విలువలో పదిరెట్లు సొమ్మును గ్రామ పంచాయతీకి చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలి.
- స్థానిక సంస్థ నుంచి అనుమతి లేకుండా లేఅవుట్లను అభివృద్ధి నిలిపివేసిన వెంచర్లను రెగ్యులరైజ్‌ చేయరని గుర్తుంచుకోండి.

పరిష్కారం ఎలా?

రియల్టర్లు వేసిన అక్రమ లేఅవుట్లలో.. తెలిసో తెలియకో ప్లాట్లు కొన్నవారు ఇబ్బందులు పడాల్సిందేనా? మరి, వారి కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు కావాల్సిందేనా? రియల్టరేమో లేఅవుటు వేసి వెళ్లిపోతే, అందులో కొన్నవారి పరిస్థితి ఏం కావాలి? ఇలాంటి అంశాల్లో సాయం చేయడానికి ఒక చక్కటి అవకాశమున్నదనే విషయం మనలో చాలామందికి తెలియదు. సదరు రియల్టర్లు లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని మన కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం కల్పిస్తున్నది. సాధారణ లేఅవుట్లకు అనుమతి తీసుకున్నట్లే, క్రమబద్ధీకరణను కోరుతూ రియల్టర్లు పంచాయతీలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆయా వెంచర్‌లో ఎన్ని ప్లాట్లు విక్రయించారు? ఎన్ని అమ్ముడుపోలేదు? వెంచర్‌లో రోడ్ల వెడల్పు ఎంతుంది? నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాలేమైనా వదిలేశారా? వంటివి పొందుపర్చాల్సి ఉంటుంది. లేఅవుట్లలో జరిమానా ఎలా లెక్కిస్తారనే విషయాన్ని పంచాయతీ రాజ్‌ చట్టంలో స్పష్టంగా రాసి ఉన్నది. దాని ప్రకారం జరిమానా కడితే సరిపోతుంది. వెంచర్‌ క్రమబద్ధీకరణ పూర్తవుతుంది. ఫలితంగా, అందులో ప్లాట్లు కొనుక్కున్నవారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురు కానే కావు. ఇది కేవలం పంచాయతీ పరిధిలోని లేఅవుట్లకు మాత్రమే వర్తిస్తుంది. పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లేఅవుట్లకు ఇది వర్తించదని గుర్తుంచుకోండి.
panchayat-plots1

అమ్ముకుని వెళ్లిపోయారా?

కొందరు రియల్టర్లు ఎప్పుడో వెంచర్లను అభివృద్ధి చేసి వెళ్లిపోయి ఉంటారు. వారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా వెంచర్‌ను క్రమబద్ధీకరించాలంటే ఎలా? ఇలాంటి సందర్భాల్లో లే అవుట్‌లో ప్లాట్లు కొన్నవారందరూ కలిసికట్టుగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
- కింగ్‌ జాన్సన్‌ కొయ్యడ

292
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles