జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని!


Sat,August 31, 2019 12:55 AM

ఈత రావాలంటే కచ్చితంగా నీళ్లలోకి దిగాల్సిందే. అప్పుడే భయం పోతుంది. నీళ్ల లోతు తెలుస్తుంది. ఎలా ఈదాలో అవగాహన వస్తుంది. మరీ.. ఇంగ్లిష్ మాట్లాడడం రావాలంటే? ఈ ప్రశ్నకు కూడా ఈత సూత్రమే వర్తిస్తుందని అంటున్నారు
ఆషారాణి టీచర్. పదాల అర్థం తెలిసినా, తెలియకపోయినా.. ముందు ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. అప్పుడే భయం పోయి, ఎలా మాట్లాడాలో తెలుస్తుందని చెబుతున్నారు. పిల్లల కోసం పద ప్రయోగాలు చేసి, వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు పరిశోధనలు చేసి విజయవంతమయ్యారు ఆషారాణి టీచర్. అందుకే భాషా విభాగంలో తెలుగు రాష్ర్టాల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు అందుకోబోతున్నారు.

teacherBAsharani
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇన్నాళ్లూ.. ప్రయోగాలు, పరిశోధనలు చేసిన ఉపాధ్యాయులకే ఇచ్చేవారు. సైన్స్, మ్యాథ్స్, సోషల్ విభాగాల్లోనే అవార్డులు ఎక్కువగా వస్తుండేవి. ఆ ట్రెండ్‌కు బ్రేక్ వేశారు మన ఆషారాణి టీచర్. భాషా విభాగంలో తెలుగు రాష్ర్టాల నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయనిగా ఎంపికయ్యారు. ఫలితం ఆశించకుండా అంకితభావంతో పనిచేస్తే.. ఆలస్యంగానైనా ప్రతిఫలం దక్కుతుంది అనడానికి మన ఆషారాణి టీచర్ ఓ ఉదాహరణ. ఆంగ్లభాష పట్ల పిల్లలకున్న భయాన్ని పోగొడుతూ, వినూత్న పద్ధతిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. మరోవైపు సామాజిక బాధ్యతతో ఎంతో మంది విద్యార్థులకు సాయమందిస్తున్నారు. ఇలా నిస్వార్థంగా తన విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన 45 మంది ఉత్తమ జాతీయ ఉపాధ్యాయుల్లో ఆషారాణి ఒకరు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకోనున్నారు. తెలంగాణ నుంచి ఆషారాణి టీచర్ ఒక్కరే ఈ యేడాది ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు.

ఆట పాటలతో బోధన

ప్రభుత్వ పాఠశాల అనగానే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. కారణం.. ఇంగ్లిష్ సహా ఇతర సబ్జెక్టులు సరిగా బోధించరని. ఆ అపోహను తొలగిస్తూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా జీడిమెట్ల ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఈ బడిలో ఇంగ్లిష్ చెప్పే ఉపాధ్యాయినిగా ఆషారాణి తనదైన ముద్రవేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంగ్లిష్ భయాన్ని పిల్లల మనసుల్లోంచి పారదోలారు. ఇందుకు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి సఫలీకృతమయ్యారు. అంత్యాక్షరీ ద్వారా సులువుగా స్పెల్లింగ్స్ నేర్పిస్తారు. apple అనే పదంతో aఒకరు మొదలు పెడితే.. మరొకరు ఆ పదంలోని చివరి అక్షరం e తో ప్రారంభమయ్యే పదాన్ని చెప్పాల్సి ఉంటుంది. పాఠ్యాంశాలను ఉదాహరణగా తీసుకొని, సంబంధిత కథలోని పాత్రతో విద్యార్థులను పోల్చుతూ, వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. మైదానంలో పిల్లలకు బంతి విసురుతూ ఒక్కో ఇంగ్లీష్ పదాన్ని నేర్పిస్తున్నారు. ఎవరైనా ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే.. తిరిగి ఎలా సమాధానం ఇవ్వాలి అనే సందర్భాలను కల్పించి, చిన్న పాత్రలు సృష్టించి విద్యార్థులతో రోల్ ప్లే చేయిస్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడించడం వంటివి చేస్తున్నారు. ఇలా వినూత్నంగా పాఠాలు చెప్పడం వల్ల ఆషారాణి టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారు విద్యార్థులు. ఆమె తరగతి గదిలోని విద్యార్థులంతా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతున్నారు. ఆషారాణి చెప్పే పాఠాలు ఆసక్తిగా ఉండడంతో ఆమె క్లాస్ మిస్ అయ్యే విద్యార్థులే ఉండరంటే అతిశయోక్తి కాదు.
teacherBAsharani1

పలు అంశాలపై అవగాహన

విద్యార్థులకు పాఠాలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు ఆషారాణి టీచర్. ముఖ్యంగా విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రుతుచక్ర సమస్యలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై వివరిస్తూ వారిని చైతన్య పరుస్తున్నారు. దాతల సహాయంతో స్కూల్‌లో సానిటరీ నాప్‌కిన్ మిషన్‌ను ఏర్పాటు చేయించి, పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు ఆషారాణి. విద్యార్థి దశలో సరైన బీజాలు పడితేనే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది అని అంటున్నారు. వ్యక్తిత్వ వికాసం-అభివృద్ధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు ఆషారాణి. దీంతోపాటు విద్యార్థులు చెప్పుకోలేని సమస్యలు, ప్రశ్నలు పరిష్కరించేందుకు ఓ బాక్సు ఏర్పాటు చేశారు. దానిద్వారా వారి సమస్యలకు పరిష్కారాలు చూపించి, వారికి ఓదార్పునిస్తున్నారు ఆషారాణి టీచర్.

పేద విద్యార్థులకు చేయూత

తరగతిలో తక్కువ మార్కులతో పాసైన విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు ఆషారాణి. పదో తరగతి పాసైనా చదువుకోలేని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందుకోసం ఆషారాణి, తోటి ఉపాధ్యాయులతో కలిసి పీఎల్‌ఎన్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ని ప్రారంభించారు. దాతల ఆర్థిక ప్రోత్సాహంతో ఈ సొసైటీ ద్వారా ఖరీదైన పుస్తకాలు, వస్తువులు విద్యార్థులకు అందిస్తున్నారు. ఇలా దాతలు, కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో జీడిమెట్ల ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 2 వేలకుపైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయ నిర్వహణ విద్యార్థులే చేపట్టేలా వారికి తర్ఫీదు ఇచ్చారు ఆషారాణి టీచర్.

వాట్సప్ గ్రూపుల్లోనూ బోధన

తెలుగు రాష్ర్టాల నుంచి భాషా విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఆషారాణి ఎంపికవ్వడం విశేషం. ఉపాధ్యాయ వృత్తిలో ఆషారాణికి 24 యేండ్ల అనుభవం ఉన్నది. ఇంగ్లిష్, పొలిటికల్ సైన్సుల్లో డబుల్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో అయినా.. తెలంగాణలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆషారాణి చిన్నప్పుడు ఆంగ్లంలో మాట్లాడాలంటే భయపడేవారు. పరీక్షల్లో మాత్రం వందకు 90 మార్కులు వచ్చేవి. ఇంగ్లీష్ రాయడంలో ముందున్నా, మాట్లాడాలంటే వెనుకాడేవారు. ఇప్పుడు ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడడమేకాదు.. పలు వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఇతర ఉపాధ్యాయులకు సైతం ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తున్నారు. అంతేకాదు ఇతర పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పిస్తున్నారు.

నా బాధ్యత పెరిగింది

teacherBAsharani2
నాకు గతంలో టీచింగ్ ఎక్స్‌లెన్స్ అండ్ అచీవ్‌మెంట్ (టీఇఏ) ప్రోగ్రాంలో భాగంగా అమెరికా విద్యావ్యవస్థపై పరిశోధన చేసే అవకాశం వచ్చింది. 2017లో ఇండియా నుంచి ఎంపికైన ఇద్దరిలో నేనూ ఉన్నా. అక్కడి విద్యావ్యవస్థ తీరుతెన్నులు తెలుసుకోవడానికి 6 వారాలు అధ్యయనం చేశా. నాకు జాతీయస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలంటే చులకన భావం పోగొట్టాలి. అందుకే సర్కారు బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మార్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ జాతీయ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది.
-బి.ఆషారాణి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని

-పసుపులేటి వెంకటేశ్వరరావు
-విద్యాసాగర్

717
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles