నాడు చేతిలో రూ.300 నేడు రూ.7.5 కోట్ల టర్నోవర్ చినుకాలా


Mon,September 2, 2019 01:06 AM

ఆమె వయసు అప్పుడు కేవలం 15 సంవత్సరాలు. ఆమెను పోషించలేని స్థితిలో రూ. 300 చేతిలో పెట్టి వదిలించుకుంది అమె కుటుంబం. అప్పుడు ఆమె దగ్గర రెండు జతల బట్టలు, ఒక జత చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఇంటి నుండి బయటికి
వచ్చిన మొదటి రెండు రోజులు తను ఏదో పోగొట్టుకున్నట్లు భయపడింది. ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రావడానికి రెండు-మూడు రోజులు పట్టింది. దగ్గరలోనే వసతి గృహాన్ని కనుగొన్నప్పుడు ఆమెకు మరింత ధైర్యం వచ్చింది. నిజానికి అప్పటికే ఆమె మనసు విరిగింది. కానీ, ఆమె వద్ద మనుగడ సాగించే నిశ్చయమైన సంకల్పం మాత్రం అలాగే ఉంది. ఆ సంకల్పమే ఆమెను ముందుకు నడిపించింది. నాడు కేవలం 300 రూపాయాలతో కాలు బయట పెట్టిన ఆమె నేడు రూ. 7.5 కోట్ల టర్నోవర్ కలిగిన
ఆభరణాల తయారీ సంస్థకు యాజమాని. రూబన్స్ ఉపకరణాల సంస్థ అధినేత చినుకాలా సక్సెస్‌మంత్ర.

chinukala
ఆ రోజు నాకు ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని మీరు నన్ను అడిగితే, నా దగ్గర నిజంగా సమాధానం లేదు. దాని నుండి బయటకు రావడానికి నేను ఏదో ఒకటి చేయాల్సి ఉందని నాకు తెలుసు. అంటూ నాటి రోజులను గుర్తుచేసుకుంది చినుకాలా.


తొలి రోజుల్లో...

చిను వెళ్ళిన వసతిగృహానికి రాత్రి పడుకోవడానికి పరుపుకు రూ.20 చెల్లించాలి. అది కూడా ఒక పోరాటమే. ఆ సమయంలో తను ఏదో ఒక పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించింది. ఎవరైనా పని ఇస్తే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కొన్ని రోజులకు రోజుకు రూ.20 నుంచి రూ.60లు సంపాదించే సేల్స్‌గళ్ ఉద్యోగాన్ని సంపాదించింది. ఇంటింటికీ తిరిగి కత్తుల సెట్లు, కోస్టర్లు, ఇతర గృహావసర ఉత్పత్తులను విక్రయించడం ఆమె దినచర్య. అది 90వ దశకం చివరిదశ. ఒక రకంగా అది చాలా భిన్నమైన సమయం. ఒక ఇంటికి వెళ్లి డోర్ బెల్ మోగించి వారిని సంప్రదించాలి. ఎన్నోసార్లు ఆమె మొఖం మీదే డోర్ మూసివేసేవారు. కానీ ఆమె ప్రతి తిరస్కారాన్ని స్వీకరించింది. ఆ తిరస్కరణల నుండి పుట్టిన షాక్ ఆమెలో మరింత బలమైన సంకల్పాన్ని పెంచింది. ఒక సంవత్సరం తరువాత, చిను పదోన్నతి పొందింది. 16 ఏళ్ళ వయసులో మరో ముగ్గురు అమ్మాయిలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంది. నేను ఒక రకంగా సూపర్‌వైజర్ అయ్యాను, దానితో నాకు కొంచెం ఎక్కువ చెల్లించారు. అది నా అమ్మకాల శిక్షణకు నాంది అని ఆమె తెలిపింది. చిను ఎప్పుడూ వ్యాపారవేత్తగా ఉండాలనే ఆశతో పనిచేసింది. ఎప్పటికైనా స్వంతంగా వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో పనిచేసింది. వ్యాపారంలో విజయం సాధించాలన్న పట్టుదలతో పనిచేసింది. రోజుకు కేవలం భోజనం సంపాదించే సంపాదనతో ఆమె జీవితం ప్రారంభమైంది.

సంకల్పమే చదువు

పదిహేనేళ్ల వయస్సులో ఇంట్లో నుండి బయటకు వచ్చిన చినుకు చదువుకున్న చదువులేదు. కానీ ఆమె ఆచరణాత్మక అనుభవాల ద్వారా నేర్చుకుంది. తరువాత ఆమె రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా చేరింది. దానికి ఆమె సాయంత్రం 6 నుండి 11 గంటల వరకు కేటాయించాలి. అలా ఆమె పని చేస్తూనే ఉంది. ఆమె చేస్తున్న పనితో ఎప్పుడూ బాధపడలేదు, అలసిపోలేదు. ఆమె చేస్తున్న ప్రతి ఉద్యోగంతో వృద్దిని సాధిస్తూనే ఉంది. మూడు సంవత్సరాల్లో ఆమె ఆర్థికంగా కొంత మేరకు స్థిరపడింది.

మిసెస్ ఇండియా

చినుకాలా 2004లో అమిత్ కాలాను వివాహం చేసుకుంది. అది ఆమెకు అతిపెద్ద మద్దతు. పెండ్లి తర్వాత వారు బెంగళూరుకు వెళ్లిపోయారు. రెండు సంవత్సరాల తరువాత ఆమె స్నేహితుల ఒత్తిడితో గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఆ అనుభవం ఎలా ఉంది అని అడిగితే ఒక పెద్ద గదిలో ఎంతోమంది ఎన్నో సాధించిన వారు. నేను నా విద్యను కూడా పూర్తి చేయలేదు. ఇక్కడ నేను చాలా సాధించిన వ్యక్తుల మధ్య ఉన్నాను. ఒక రకమైన భయం. నేను చాలా దృఢమైన విద్యా నేపథ్యాల ప్రజలతో ఉన్నాను కాని ఏదో ఒకవిధంగా నన్ను నేను నియంత్రించుకున్నాను. నా అనుభవాలు నాలో చాలా స్థిరత్వాన్ని పెంచాయి. అంటూ నాటి అనుభవాలు చెప్పారామె. పోటీలో ఫైనలిస్టులలో చిను కూడా ఉంది. దానితో మరిన్ని అవకాశాలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఫ్యాషన్‌ను ప్రేమిస్తాను కాని దాని మీద ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఎప్పుడూ డబ్బు లేదు అని ఆమె గుర్తు చేసుకుంది. నిజానికి మోడలింగ్‌ను ఆస్వాదించినప్పటికీ, మోడలింగ్ నిజంగా ఆమె వృత్తికాదు. ఆమె ఎప్పుడూ తన స్వంత యజమానిగా ఉండాలని కోరుకుంది.

రూబన్స్, ఫ్యాషన్ ఉపకరణాలు

chinukala2
చిను మోడల్‌గా పనిచేయడం, ఫ్యాషన్ పరిశ్రమలో భాగమవ్వడంతో ఆ రంగంలోని అవసరాలను గుర్తించగలిగింది. అలా ఫ్యాషన్ ఆభరణాల కొరత చాలా ఉందని గ్రహించింది. దాన్నే వ్యాపారంగా ఎంచుకోవాలనుకుంది. అన్ని సంవత్సరాల్లో నేను వివిధ ఉద్యోగాలు చేశాను. నేను డబ్బు ఆదా చేస్తూనే ఉన్నాను.నేను రూబన్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగించాను అంటూ తన తొలి పెట్టుబడిని వివరించారు. నేను 2014 లో నా కంపెనీని ప్రారంభించినప్పుడు, అది నా మనస్సులో ఒక ఆలోచన తప్ప మరొకటి కాదు. బెంగళూరులో 6 x 6 అడుగుల రిటైల్ స్థలం పొందడం కూడా ఒక పోరాటమే. దీన్ని నిర్వహించడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది అని ఆమె చెప్పింది.

దేశవ్యాప్త విస్తరణ, కోట్లల్లో వ్యాపారం

రూబన్స్‌లో జాతి, పాశ్చాత్య ఆభరణాలను రూ.229 నుండి రూ .10,000 వరకు క్యూరేట్ చేస్తారు. ఇది వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసే ఖాతాదారులకు 24 గంటల డెలివరీని కూడా అందిస్తుంది.ఆమె కేవలం బెంగళూరులో ప్రారంభించి ఊర్కోలేదు. తన బ్రాండ్‌ను కొచ్చి, హైదరాబాద్‌లలోనూ విస్తరించింది. చిను అన్ని రకాల డిజైన్లను విక్రయిస్తుంది.ప్రారంభంలో, మమ్మల్ని విశ్వసించడానికి, మాకు ఏదైనా స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మాల్ లేదు. కోరమంగళలోని ఫోరం మాల్‌లో స్థలాన్ని పొందడానికి నాకు దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. అక్కడి మేనేజర్‌ను నిరంతరం కలిసేదాన్ని అంటూ ఆమె గుర్తుచేసుకుంది. చిను ఎన్ని తిరస్కరణలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె చేస్తున్న పనిపై నమ్మకం. సాధిస్తాననే విశ్వాసాన్ని ఏనాడు కోల్పోలేదు. దాని ఫలితమే 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ .20 లక్షల ఆదాయం, 2016-17 సంవత్సరంలో సుమారు 56 లక్షల ఆదాయాన్ని గడించింది. మరుసటి సంవత్సరం ఆదాయం దాదాపు 670 శాతం పెరిగి రూ.3.5 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం 7.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

నన్ను నేను మలుచుకున్నాను..

ఈ విజయం నా బ్రాండ్ పొందుతున్న ప్రేమ. నేను చేస్తున్న ప్రతి పనిలోనూ ఎన్నో నేర్చుకున్నాను. ఇంటింటికీ తిరిగి అమ్మడం, రెస్టారెంట్లలో వెయిట్రెస్‌గా చేయడం, ఇవ్వన్నీ నేను ముందు ఎదుర్కొన్న తిరస్కరణల నుండి లభించిన విజయాలే. అవన్నీ నన్ను నేను ఒక ఆకృతిగా తీర్చిదిద్దుకోవడానికి, ఎదగడానికి సహాయపడింది అంటూ నవ్వింది చిను. మనం చేసే పని ప్రతి రోజూ కొంతవృద్ధిని తీసుకురావాలని నేను నమ్ముతాను. అది నేర్చుకోవడం, కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడం లేదా ద్రవ్య లాభాలు ఇలా ఏదైనా కావచ్చు. నేను నా జీవితాన్ని ఎక్కడ నుండి ప్రారంభించానో మరచిపోలేను. రూబన్స్ బృందంలో 20 మంది ఉద్యోగులు, ఐదుగురు డిజైనర్లు ఉన్నారు. ఈ రోజు నేను వారికి జీతాలు చెల్లించగలుగుతున్నానన్న ఆ అనుభూతి అద్భుతంగా ఉంది. నేను కష్టపడి పనిచేస్తానని నమ్ముతున్నాను. అలాగే నా బ్రాండ్‌తో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి నుండి కూడా అదే ఆశిస్తున్నాను. అంటూ తను ఎదిగి వచ్చిన తీరును వివరించారు చిను కాలా.

తొలి ప్రయత్నం

chinukala1
చిను తన మొదటి వెంచర్, ఫోంటే కార్పొరేట్ సొల్యూషన్స్, కార్పొరేట్ మర్చంటైజింగ్ స్టార్టప్, 2008 లో ప్రారంభించింది. ఈ సంస్థ ఒరాకిల్, ఐటిసి లిమిటెడ్, సోనీ పిక్చర్స్, టివి టుడే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి పలు బ్రాండ్లతో పనిచేస్తుంది. ఈ అగ్ర బ్రాండ్ల నుండి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో రోజువారీ ప్రతిపాదనలను నేర్చుకోవడం, ఏదో ఒక రోజు నా స్వంత బ్రాండ్‌ను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనను పెంచుకోవడం చేసింది. ఫ్యాషన్, చేతన, సృజనాత్మకత ఉన్నందున తన నైపుణ్యాన్ని వ్యాపార చతురతతో కలిపి తన స్వంత లేబుల్ రూబన్స్‌ను సృష్టించింది.

1044
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles