ఆనందమే బ్రహ్మానందం!


Mon,September 2, 2019 01:10 AM

సంస్కృతీ సంప్రదాయాలనూ, ఆచార వ్యవహారాలనూ, నియమ నిష్ఠలనూ, బంధాలనూ, మానవీయ విలువలనూ, జీవిత దృక్పథాన్నీ, పరమార్థాన్నీ గణేశ తత్త చర్చ విశదీకరిస్తుంది. ప్రపంచంలోని ప్రతీ రూపంలోనూ గణపతి ప్రతిరూపం ఉన్నట్లుగానే.. గణనాథుని తత్త వీక్షణం విశ్వ కల్యాణ భావనానిలయమై పల్లవిస్తుంది. జ్ఞాన నిర్వాణ శాసకుడైన గణపతి తత్తం వ్యక్తం నుంచి అవ్యక్తం వైపు సాగే సానుకూల పయనం, ప్రకృతి ఏర్పర్చిన అనంత సృష్టి రహస్యం.
Vinaya-intro
గణేశుని అనంత రూపంలోని సౌందర్యం, సౌష్ఠవం, సౌజన్యం, సౌమ్యం.. అన్నీ గణనాథుని వైభవాలే! ఆయన రూపమంటే ఆయనకు అభిమానం. ఆయన వ్యక్తిత్వం నిండుదనంతో శోభిల్లే ఆత్మాభిమానం. సామాన్య - అసామాన్య రూపం సమస్త జీవాకృతి రూపంలో మూర్తీభవించి స్వయం ప్రేరకమైన మహాగణపతిగా పరిఢవిల్లింది. తనను తాను ప్రేమించుకోలేని వాడు ప్రపంచాన్ని ప్రేమించలేడు. తనను తాను ఉద్ధరించుకుంటేనే తనదైన లోక కల్యాణం సంభవమవుతుంది. వ్యక్తి వ్యక్తిత్వం పరిమళిస్తేనే ప్రపంచ మనుగడ సాధ్యపడుతుందనే ఆలోచన ఆనందమనే రూపంగా కొలువైన గణపతితత్తంలోని పరమార్థం. పద్నాలుగు లోకాల సామర్థ్యం, స్థిరత్వం, దృఢత్వం గణపతే కదా!

వినాయక వైభవం

విఘ్నాలను తొలగిస్తాడు కనుక విఘ్నేశ్వరుడు. సంకటాలను హరించే వాడు కనుక హేరంబరుడు, సర్వలోక రక్షకుడు గనుక లంబోదరుడు, అద్వయ సత్వస్వరూపుడు గనుక ఏకదంతుడు, పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, సర్వదా రక్షించేవాడు కనుక శూర్పూకర్ణుడు. ఎన్నో విశేషాలకు ఆలవాలమై, విభిన్న రూపాల్లో పలునామాలతో కొలువబడే మహాగణపతి పంథా మాత్రం ఒక్కటే ఆనందం. అవ్యాజమానమైన శుద్ధాత్మకు ప్రతీకయైన ఆనందం. అందుకే గణేశుడు ప్రశస్తమైన ప్రణవస్వరూపుడై శబ్ద బ్రహ్మగా ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతాడు. తొలిపూజలందుకునే గణేశుని దివ్య నీరాజనం వినాయక చవితి పర్వదినాన ద్విగుణీకృతం అవుతుంది. నాయకుడే లేని సర్వ స్వతంత్రుడూ, కాలానికి అతీతుడైన మహాగణపతి ప్రతీ ఇంటిలోనూ, వాడవాడలోనూ, అనేక ప్రపంచ వేదికల పైనా భక్తికి కట్టుబడి ఆనందతాండవం చేస్తాడు. ఆయన కొలువుదీరిన చోట ఆనందం, సంబరం.
ganeshganapati

వినాయకత్వం

రుగ్వేదం విఘ్నేశ్వరుని జ్యేష్ఠ రాజుగా, దేవతారాధనలో ప్రథమునిగా కీర్తించింది. సృష్టిని నడిపే 33 కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించబడ్డారు. ఆ గణాలకు అధిపతి గణపతి. ద్వాదశ ఆధిత్యులకూ, అష్టవసువులకూ, ఏకాదశ రుద్రులకూ, దేవ, గంధర్వ, అసుర, మనుష్య గణాలకూ ఆయనే ప్రభువు. విఘ్నేశ్వరుని నాయకత్వం సామాజిక సమష్టితత్వాన్నీ, సౌభ్రాతృత్వ వాతావరణాన్నీ ఏకీకృతం చేస్తుంది. గణాధిపత్యం వహించడమే కాదు.. సమస్త లోకాల్లోని ప్రత్యేకమైన జీవజాతిలో సమస్తం తానే ఉంటాడనీ, జగం బాధ్యతను స్వీకరించిన మహా గణపతి దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ చేస్తూ లోకాలను ఏలుతున్నాడని వర్ణించింది శుక్లయజుర్వేదం. శ్రీ గణేశ అన్న సంస్కృత పదానికి ప్రారంభం అనే అర్థం ఉంది. అందుకే వినాయకుడు ఆదిదేవుడైనాడు. సృష్టి ప్రారంభం నుంచీ ఆది పూజ్యుడిగా ఆరాధించబడుతూ విశ్వనాయకత్వం నిర్వహించే వినాయకుని ప్రస్తావించింది గణేశ పురాణం.

పరిపూర్ణ వ్యక్తిత్వం

వ్యక్తం నుంచి అవ్యక్తం వైపు సాగే ప్రపంచానికి నిశ్చయుడై మార్గనిర్దేశనం చేశాడు గణేశుడు. తల్లిదండ్రుల పట్ల పూజ్యతాభావం, గురువుల పట్ల ఆరాధ్యభావన, సోదరుని పట్ల బాధ్యత. దేవతా గణాలపట్ల కర్తవ్యం, లోక కల్యాణానికై అంకిత భావం కలగలిసిన మూర్తిమత్వం వినాయకుడు. ఆదర్శం. ఆనందం వెల్లివిరిసే నిండైన వ్యక్తిత్వం ప్రపంచాన్నే ఆరాధించేలా చేశాయంటే, ఆదర్శంగా కొనియాడాయంటే అతిశయోక్తి కాదు. వివేకం, వినయం గణేశుని వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి. విలువైన జీవిత పరమార్థాన్ని గణపతి తత్తం తెలియపర్చింది. శుభకరుడు, శుభప్రదాత అయిన వినాయకుని దివ్యారాధన పుణ్యప్రదం.. శుభప్రదం.
ganeshganapati1

విఘ్నేశ్వరారాధన:

జ్ఞానంతో ముక్తి మార్గాన్ని పొందడానికి, గణేశుని ఆవిర్భావానికి తాత్తిక సమన్వయ సంబంధం ఉందని శివపురాణం అద్భుతంగా విశదీకరించింది. వినాయక చవితి అంటేనే నవరాత్రులు, ఉత్సవాలు, సంబరాలు, ప్రాణప్రతిష్ట చేసిన విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేంత వరకు విధిగా, నిష్ఠగా పూజించుకొని దివ్య నీరాజనం గావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆధ్యాత్మికతత్తం ఆడంబరాల కన్నా ఆరాధనపైనే దృష్టి నిలపాలనే సందేశమిస్తుంది. అనంతమైన పరమార్థ తత్తం విఘ్నేశ్వరుని పట్ల కృతజ్ఞతా భావంతో గణేశుని ప్రతిమలో దైవాన్ని దర్శించి ఆరాధించడం నిశ్చల నిర్మల భక్తికి నిదర్శనం. ప్రముఖుల మధ్య ప్రముఖుడిగా వెలుగొందే మంత్రాధి దేవతగా గణపతిని ఆహ్వానిస్తూ ఉపయోగించే ఈ వేదమంత్రం విఘ్నేశ్వరుని ఆరాధనకు అక్షర భాష్యం చెబుతుంది. సృష్టియజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా చూడమనే భావనై విలసిల్లుతుంది.

ఓం గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే
కవిం కవీనా ముపమశ్రవస్తవమ్.
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
అనః శృణ్వన్నూతిభిః సీదసాధనమ్.


-ఇట్టేడు అర్కనందనాదేవి

1370
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles