స్థిరత్వం దిశగా పయనం


Sat,September 7, 2019 01:38 AM

rera
ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా.. ఆర్థిక మాంద్యం గురించే చర్చలు. జీడీపీ ఐదు శాతానికి చేరుకోవడం, ఉత్పత్తి రంగం దెబ్బతినడం, ఎన్‌బీఎఫ్‌సీ సమస్యలు, లభించని రుణాలు వంటి వాటితో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నది. రియల్ రంగంలోనూ ఆర్థిక మాంద్యం ప్రవేశించిందని, నిర్మాణ దిగ్గజమైన లోధా గ్రూప్ నాలుగు వందల మంది ఉద్యోగులను పక్కన పెట్టడమే ఇందుకు నిదర్శనమని నిపుణులు అంటున్నారు. మరికొన్ని సంస్థలు ఇదే బాటపడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో, ఆర్థిక మాంద్యం హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిందా? మూడు నెలల్నుంచి ఫ్లాట్ల అమ్మకాలు తగ్గిపోవడమే ఇందుకు సాక్ష్యమా?

హైదరాబాద్ నిర్మాణ రంగం గొప్పతనమేమిటంటే.. స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారే నేటికీ ఇండ్లను కొనుక్కుంటున్నారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల తరహాలో కార్పొరేట్ ఏజెంట్ల హడావిడి ఉండదిక్కడ. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాల కారణంగా, మూడేండ్ల నుంచి రియల్ రంగం పుంజుకున్నది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా ప్లాట్లు, స్థలాల్ని తీసుకుంటున్నారు. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేయడం.. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విచ్చేస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో అమ్మకాలు తగ్గాయి. దీంతో, భాగ్యనగరం వైపు అందరి దృష్టి పడింది. ఇలాంటి సానుకూల వాతావరణంలో, కొందరు డెవలపర్లు ఒక్కసారిగా ఫ్లాట్ల ధరలను పెంచేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అధిక శాతం మంది ఫ్లాట్లు కొనడాన్ని నిలిపివేశారు. ధర పెరిగినా ఫర్వాలేదు, స్థిరనివాసమే ముఖ్యమని భావించేవారు మాత్రమే ముందుకొస్తున్నారు. మిగతావారు ఇల్లు కొనడాన్ని పూర్తిగా వాయిదా వేశారు.

మళ్లీ పెట్టుబడిదారుల రంగప్రవేశం

2005 నుంచి 2007 మధ్యలో హైదరాబాద్ రియల్ రంగంలో నెలకొన్న పరిస్థితులే మళ్లీ మన వద్ద 2018 నుంచి సాక్షాత్కరిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ముఖ్య పట్టణాల్లో భూముల మీద అధిక శాతం మంది పెట్టుబడుల్ని పెట్టడం మొదలెట్టారు. కొన్ని సందర్భాల్లో యాభై శాతం లాభాల్ని సైతం అందుకున్నారు. దీంతో, ఇతర వృత్తులను వదిలేసి కేవలం భూముల కొనుగోళ్లు, అమ్మకాల మీదే దృష్టి సారించేవారి సంఖ్య పెరిగింది. పెరిగిన రేట్ల ప్రకారం భూములను కొనుగోలు చేసి.. వెంచర్లు అభివృద్ధి చేసి అమ్ముదామంటే కొనుగోలుదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొన్నది. రేటు తక్కువున్న ప్లాట్లను ఎప్పటిలాగే కొంటున్నారు తప్ప రేటెక్కువ అంటే పట్టించుకోవడం లేదు.

నష్టమేం లేదు..

2008లో ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ.. దాన్ని ప్రభావం హైదరాబాద్ మీద పడటానికి దాదాపు ఏడాది పట్టింది. కాకపోతే, ఆతర్వాత వెలుగులోకి వచ్చిన సత్యం స్కామ్, ఏలియెన్స్ డెవలపర్స్ మోసం వంటి అంశాల వల్ల హైదరాబాద్ రియల్ రంగం దెబ్బతిన్నది. అంతేతప్ప, మాంద్యం వల్ల నష్టపోయింది లేదని పెద్దగా నిర్మాణ నిపుణులు అంటున్నారు. పైగా, ఇప్పటికిప్పుడు ప్రపంచ ఐటీ రంగానికి ఎదురయ్యే నష్టమేం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా చర్యల్ని చేపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న బూమ్ స్థాయి నుంచి మార్కెట్ స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్నదని విశ్లేషిస్తున్నారు.

మనవద్ద భూముల ధరల పెరుగుదల మీద ఎలాంటి నియంత్రణ లేదు. నిన్నటివరకూ రేట్లు తక్కువున్న హైదరాబాద్‌లో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటేశాయి. పరిస్థితి ఎలా మారిందంటే.. నగరానికి ఎక్కడో దూరంగా వెళితే తప్ప రేట్లు అందుబాటులో లేని దుస్థితి. ఒకప్పుడు శివార్లలో రేటు తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితుల్లేవు. ప్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. సంగారెడ్డి వంటి ప్రాంతంలో కూడా రేట్లు హైదరాబాద్ స్థాయిలో ఉన్నాయి. అందుకే, కొందరు వేతనజీవులు వేచి చూసే ధోరణీని అవలంబిస్తున్నారు. రేట్లు తగ్గాకే కొనుక్కుందామనే నిర్ణయానికొచారు.
- కింగ్ జాన్సన్ కొయ్యడ
rera1

స్టాక్ మార్కెట్ ఆశించినంత లాభాల్ని అందించట్లేదు.

రెసిడెన్షియల్‌లో రూ.కోటి పెట్టుబడి పెడితే.. రాబడి నెలకు నలభై వేలూ రావడం లేదు. అందుకే, ప్రవాసులు, డాక్టర్లు, పదవీ విరమణ చేసినవారు వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. వాణిజ్య రియల్ రంగానికి మన వద్ద గిరాకీ ఉంటుంది. ప్రధానంగా, పశ్చిమ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ఆదరణ తగ్గనే తగ్గదు. దీనికి ఆర్థిక మాంద్యంతో పెద్దగా సంబంధం లేదు.
- రాజ్‌కుమార్ కుర్రా, ఎండీ, ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా

కొత్తగా నిర్మాణ చట్టాన్ని తేవాలి..

మన దేశీయ ఆర్థిక స్థితిగతుల్ని సంస్కరించడానికి కేంద్రం చర్యల్ని తీసుకుంటున్నది. ఆర్థికమంత్రితో పరిశ్రమ ప్రతినిధులం ఇటీవల చర్చలు జరిపాం. నిధుల లభ్యత సులువుగా లభించాలని కోరాం. అందుకు తగ్గ నిర్ణయాల్ని కేంద్రం తీసుకుంటున్నది. హైదరాబాద్ మీద మాంద్యం ప్రభావం పెద్దగా ఉండదు.

జపాన్, కొరియా వంటి దేశాల్ని క్షుణ్నంగా గమనిస్తే.. అక్కడ నిర్మా ణ కార్యకలాపాల్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా నిర్మాణ చట్టం (కన్‌స్ట్రక్షన్ యాక్ట్) అమలు చేస్తున్నారు. ఫలితంగా, ఈ రంగం పద్ధతి ప్రకారం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది. నిర్మాణ కార్యకలాపాల్ని నియంత్రించే వీలుంటుంది. దీనికి సెక్రెటరీ స్థాయి వ్యక్తిని నోడల్ అథారిటీగా నియమించి ఎప్పటికప్పుడు అవసరమయ్యే సముచిత నిర్ణయాల్ని తీసుకుంటారు. వీరి ద్వారా సింగిల్ విండో అనుమతుల్ని మంజూరు చేస్తారు. మన వద్ద నిర్మాణ రంగం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా నిర్మాణ చట్టాన్ని తీసుకురావాలి.
- ఎన్‌ఆర్ అల్లూరి, ఎండీ, ఎన్‌సీసీ అర్బన్

బల్దియా, హెచ్‌ఎండీలకు రూ.750 కోట్ల రాబడి..

మార్కెట్ మంచి జోష్‌లో ఉన్నది. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ కోసం దాదాపు 150 ప్రాజెక్టులు పదహారు నెలల్నుంచి ఎదురు చూస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు దాదాపు 5 లక్షల చదరపు అడుగుల్లో ప్రాజెక్టులను చేపట్టినా.. వచ్చే ౩ నుంచి ఐదేండ్లలో ఏడున్నర కోట్ల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ ఫైళ్లకు పర్యావరణ కమిటీ క్లియరెన్స్ ఇచ్చాక.. చదరపు అడుక్కీ రూ.100 చొప్పున లెక్కిస్తే.. కేవలం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీలకు రూ.750 కోట్ల ఆదాయం వస్తుంది. మైనింగ్ విభాగం వసూలు చేసే సెస్ ద్వారా దాదాపు రూ.25 కోట్ల రాబడి వస్తుంది. నిర్మాణ సామగ్రి కొనుగోలు చేస్తే.. వాటి మీద జీఎస్టీ వసూలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో పని చేసే కార్మికుల వల్ల లేబర్ సెస్, వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెల రోజుల్లోపు 150 ఫైళ్లకు మోక్షం లభిస్తే.. నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. కాబట్టి, ఎలా చూసినా మాంద్యం వల్ల మనకేం నష్టముండదు.
- రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్

భయపడాల్సిన అవసరమే లేదు..

అనకొండలను ఎదుర్కొన్న మార్కెట్ మనది. ఇప్పుడు వానపాములను చూసి భయపడక్కర్లేదు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి లేదు. కాబట్టి, మన వద్ద ఐటీ పరిశ్రమకు వచ్చే ఢోకా ఏమీ లేదు. నిజాయితీగా నిర్మాణాలు చేపట్టేవారు దిగులు పడక్కర్లేదు. ఒకప్పుడు చాలామంది కారు తీసుకున్నాక ఇల్లు కొనేవారు. ఇప్పుడేమో ఇల్లు కొన్నాకే కారు గురించి ఆలోచిస్తున్నారు. రియల్ బయ్యర్లు ఉన్నారు.. రియల్ సెల్లర్లు ఉన్నారు.. కాబట్టి మాంద్యం గురించి భయపడక్కర్లేదు. అయితే, ప్రస్తుతం మార్కెట్లో అక్కడక్కడా కనిపిస్తున్న ఫేక్ బిల్డర్లు.. ఫేక్ సెల్లర్లు నిష్క్రమించడానికి మాంద్యం తోడ్పడుతుంది.
- ఇంద్రసేనారెడ్డి ఎండీ, గిరిధారి హోమ్స్

318
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles