బడిపిల్లల పిడికెడు బియ్యం


Sat,September 7, 2019 01:42 AM

ఓ పిడికెడు బియ్యం దానం చెయ్యడం చాలా చిన్న విషయం కావచ్చు. అదే పిడికిలికి వందల చేతులు తోడైతే.. అవి కిలోల నుంచి క్వింటాళ్లుగా మారుతాయి. ఆ వందల పిడికిళ్ల బియ్యంతో ఒకపూట అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు ఈ విద్యార్థులు.
వీరి పిడికిలి చిన్నదే అయినా.. మనసుమాత్రం చాలా పెద్దది. ఈ వినూత్న ఆలోచన మొదలైంది ఓ ప్రభుత్వ పాఠశాలలో! కల్మషం లేని ఈ చిన్నారుల యోచన నేడు వందలాది మంది ఆకలి తీరుస్తున్నది. మొదటి అడుగు పడితేనే.. పదులు, వందల అడుగులవుతాయి. ఆ వందల అడుగులే సమాజ శ్రేయస్సుకోరే మార్గమవుతుంది. ఆ సన్మార్గానికి ప్రతిరూపమే ఈ పిడికెడు బియ్యం.

ఎప్పటిలాగే బడికి బయలెల్లిన భార్గవి.. బ్యాగ్ తగిలించుకొని, ఆరోజు బియ్యం మూట వైపే తదేకంగా చూస్తున్నది. బడిలో సత్యం మాస్టారు చెప్పిన పిడికెడు బియ్యం అనే మాటలు భార్గవిని ఒకచోట నిలువనియ్యడం లేదు. బియ్యం తీసుకెళ్తే అమ్మ ఏమంటుదోననే భయంతో.. మొదటిసారి అమ్మకు తెలియకుండా పిడికెడు బియ్యం తీసుకెళుతున్నది. దారిలోనూ అవే ఆలోచనలు..ఎవరైనా బియ్యం తెస్తున్నారో లేదో?, ఒక్కదాన్నే తీసుకెళ్తే క్లాసులో ఏమనుకుంటారో? అంటూ వెళ్లింది. ప్రతిజ్ఞకు ముందే సత్యం మాస్టారు అందరితో పిడికెడు బియ్యం తెచ్చారా? అని అడిగాడు. ఒక్కసారిగా అందరూ తమ గుప్పిళ్లు విప్పారు. ఆ బియ్యాన్ని ఒకచోట చేర్చితే క్వింటాలు అయ్యాయి. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ముందే విషయం చెప్పడంతో పది కేజీల వరకూ బియ్యాన్ని పంపారు. ఆదృశ్యాన్నంతా చూసిన భార్గవికి భయంపోయింది. ఇలా మూడుసార్లు తెచ్చింది. సత్యం సార్ నాలుగో పిలుపుకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది భార్గవి.

Rice
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పిడికెడు బియ్యం ఆలోచన మొదలైంది. దీనికి ఆధ్యుడు ఆ బడి గణితశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యం పైసా. ఏడాది క్రితం పిడికెడు బియ్యం అనే ఆలోచనను విద్యార్థులకు వివరించారు. క్వింటాళ్లు, కిలోల కొద్ది బియ్యం అవసరంలేదు. అందరూ కేవలం పిడికెడు బియ్యం తెస్తే చాలు అని చెప్పారు. ఆ మరుసటిరోజే విద్యార్థులంతా తమకు చేతనైనంతలో బియ్యాన్ని తీసుకొచ్చారు. ప్రతిజ్ఞ సమయంలో సత్యం సార్ విద్యార్థులను వాకబు చేయడంతో అనూహ్యంగా రెండు క్వింటాళ్ల బియ్యం పోగయ్యాయి. ఇందులోనే కొందరు విద్యార్థులు కిలో, ఐదు కిలోలు, పది కిలోల బియ్యంతో వచ్చారు. మొదటి పిలుపు తర్వాత బియ్యం తీసుకురావాలని చాలామంది విద్యార్థుల్లో మార్పు వచ్చింది.

ఎయిడ్స్ బాధితులు, అనాథలకు విరాళం

పిడికెడు బియ్యం కార్యక్రమంతో అనాథలు, ఎయిడ్స్ బాధితుల ఆకలి తీర్చడం, పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో సేవాభావాన్ని నింపాలనేది సత్యం పైసా ఆలోచన. మొదటిసారిగా విద్యార్థులకు ఇచ్చిన పిడికెడు బియ్యం పిలుపులో 3 వందల మంది పాల్గొన్నారు. వారి నుంచి వచ్చిన బియ్యాన్ని బొల్లారంలోని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధిత సంరక్షణ కేంద్రం డిజైర్ సొసైటీ, ఆశ్రిత అనాథాశ్రమంలో అందించారు.

రెండోసారి మూడు క్వింటాళ్లు

మొదటి పిలుపు విజయవంతం అవడంతో.. స్కూల్‌లోని విద్యార్థులంతా రెండో పిలుపుకోసం ఎదురు చూశారు. అప్పటికే ఈ విషయం విద్యార్థుల ఇండ్లలో తెలిసింది. దీంతో తల్లిదండ్రులూ సంతోషించారు. రెండోసారి కూడా పిడికెడు బియ్యం పిలుపు అందడంతో ఈసారి 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు మూడు క్వింటాళ్ల బియ్యం అయ్యాయి. తల్లిదండ్రులు కూడా స్పందించి పది, ఇరవై కిలోల చొప్పున బియ్యం తీసుకువచ్చారు. అదేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థిని సింధు 25 కిలోల బ్యాగ్ తీసుకొచ్చింది. ఇలా 3 క్వింటాళ్ల బియ్యాన్ని అనాథాశ్రమంలో అందజేశారు. తమ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ పిడికెడు బియ్యం కార్యక్రమం మిగతా పాఠశాలలు, సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
Rice1

మంచి కార్యక్రమాలకు చిరునామా

కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చామా.. పాఠాలు చెప్పామా.. ఇంటికి వెళ్లామా..! అన్నట్లుగానే ఉంటారు. అతికొద్ది మంది మంచి ఉపాధ్యాయులు మాత్రమే సత్యం పైసాలా విద్యార్థుల భవిత గురించి ఆలోచనలు చేస్తారు. గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ విద్యార్థుల్లో తెలుగు భాషపై మక్కువను పెంచుతున్నాడు సత్యం మాస్టారు. ప్రతి విద్యార్థి గుండ్రని అక్షరాలతో అందంగా రాసేలా శిక్షణ ఇస్తున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా అందమైన చేతిరాతకు గతేడాది పదో తరగతి విద్యార్థిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ చేతిరాత అవార్డు అందుకుంది. ఇదేకాదు విద్యార్థులకు ఆరోగ్య చిట్కాలు చెబుతూ, యోగాసనాలు నేర్పుతున్నారు సత్యం సార్. పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చాక్లెట్టు బిస్కెట్లు పంచడమే కాకుండా, తప్పనిసరిగా మొక్కలు నాటేలా చేస్తున్నారు. ఆ రోజు పుట్టిన రోజు జరుపుకునే విద్యార్థికి ఒక పూలమొక్కను సత్యం పైసా బహుమతిగా ఇస్తుంటారు. ఆనాథ ఆశ్రమాలలో చిన్నారుల మధ్య విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆపద సమయంలో రక్తదానాలు చేస్తుంటారు. బ్లడ్ అండ్ ఆర్గాన్స్ డోనర్స్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 13సార్లు రక్తదానం, 7సార్లు రక్తకణాలు దానం చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులు కూడా సత్యం పైసాను ఆదర్శంగా తీసుకొని రక్తదానాలు చేస్తున్నారు.

సేవాగుణం పెంపొందాలి

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సేవాగుణం రావాలి. అందుకే మా పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తున్నది.ఇటీవల విద్యార్థుల్లో టెన్షన్ పోగొట్టి మనసును ప్రశాంతపరచడానికి లాఫింగ్ థెరపీని చేపట్టా. దీని ద్వారా మొదటి పీరియడ్‌లో 10 నిమిషాలు విద్యార్థులను నవ్వించిన తర్వాతే క్లాసులు ప్రారంభిస్తాం. ప్రతి శనివారం విద్యార్థులందరికీ ఈ తరగతులు ఉంటాయి. మా పాఠశాలలో ఇక నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి పిడికెడు బియ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
- సత్యం పైసా, గణితశాస్త్రం ఉపాధ్యాయుడు

బియ్యం రోజూ తేవాలనిపిస్తున్నది..

అనాథల ఆకలి తీరుస్తుందంటే పిడికెడు బియ్యం ప్రతిరోజూ తేవాలనిపిస్తున్నది. మేమంత జమ చేసిన బియ్యం అందించేందుకు డిజైర్ సొసైటీ, ఆశ్రిత అనాథాశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడి పిల్లలను చూసి బాధపడ్డా. మాకు ఉన్నంతలో అనాథలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నం. మా తల్లిదండ్రులకు కూడా బియ్యంతో పాటు ఇతర సామగ్రిని అందిస్తున్నారు.
- పి.కురుమూర్తి, పదో తరగతి విద్యార్థి

-ఎం.రమేశ్
-నమస్తే తెలంగాణ, జిన్నారం

Rice2

377
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles