కేరీర్ రీస్టార్ట్ కోసం అవతరించిన సౌందర్యరాజేష్


Mon,September 9, 2019 01:41 AM

కొంతమంది మహిళలకు పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయగలమా లేదా అనే సందేహాలు తలెత్తుతాయి. ఇంకొందరేమో ఇటు పిల్లలను చూసుకోలేక.. అటు ఉద్యోగం చేయలేక మానసికంగా కుంగిపోతారు. పెద్ద చదువులు చదువుకొని.. కష్టపడి జాబ్ సంపాదించి... కెరీర్‌లో పైకొస్తున్న సమయంలో... కేవలం పిల్లల్ని కనడం కోసం ఉద్యోగం మానేస్తున్నారు చాలామంది. ఇలా కెరీర్‌లో బ్రేక్ తీసుకున్నవారికి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు చెన్నైకి చెందిన సౌందర్య రాజేశ్. రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందిస్తున్న ఆమె.. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్, ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక మహిళల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు, ఒత్తిళ్లతో సహవాసం చేసే మహిళలకు అండగా నిలిచారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది. సౌందర్యరాజేష్ సక్సెస్‌మంత్ర.
Saundarya
సౌందర్యరాజేష్ ఆగస్టు 26, 1968న శాంత చంద్రశేఖర్, ఎం.ఎస్.చంద్రశేఖర్ దంపతులకు బెంగళూరులో జన్మించారు. ఈమె తండ్రి ఒక పారిశ్రామిక వేత్త. ఈమె సెయింట్ జోసెఫ్ అఫ్ క్లూనీ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తిచేసుకుంది. తన ప్రాథమిక విద్య అనంతరం తన కుటుంబం పాండిచ్చేరికి వెళ్లింది. అక్కడే భారతిదాసన్ ప్రభుత్వ మహిళల కళాశాలలో తన డిగ్రీ విద్యని 1988లో పూర్తి చేసుకుంది. 1990లో యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి ఆంగ్ల భాషా సాహిత్యంలో పట్టా పొందింది. అదేవిధంగా 2014లో పిహెచ్‌డీని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో పూర్తి చేసుకుంది. సౌందర్యరాజేష్ చిన్నప్పటి నుంచే సృజనాత్మకమైన ఆలోచనలతో తన జీవితాన్ని సాగించింది. తన బ్యాచ్‌మేట్ రాజేష్‌ను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.

ఉద్యోగం..

సౌందర్య 1990లో సిటీబ్యాంకులో ఉద్యోగం చేసి కొంత కాలం తర్వాత రాజీనామా చేసారు. అదే విధంగా 1992-95 సమయంలో అల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో పని చేసారు. 1998- 2003 సమయంలో వైష్ణవి మహిళా కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పని చేసారు. 2000లో అవతార్ కెరీర్ క్రియేటర్, 2008లో అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్‌ను 2011లో ఫ్లెక్సీ కెరీర్ ఇండియా సంస్థలను స్థాపించారు. 2005లో యూకే వెళ్లి, అక్కడ మహిళా ప్రొఫెషనల్స్‌కు అందుతున్న సదుపాయాలను చూసి స్ఫూర్తి పొందారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిని మన దేశంలో కూడా కల్పించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు.

అత్త ఇచ్చిన డబ్బుతో..

సౌందర్య 2000 సంవత్సరంలో అవతార్ కెరీర్ క్రియేటర్స్ సంస్థను తన అత్తగారు ఇచ్చిన రూ. 60,000 సొమ్ముతో ప్రారంభించారు. క్రమేణా అవతార్ హ్యూమన్ కాపిటల్ ట్రస్ట్, ఫ్లెక్సీ కెరీర్స్ ఇండియాను స్థాపించారు. ఈ సంస్థలను భారతదేశం అంతటా స్థాపించి అవగాహనా కార్యకలాపాలను కొనసాగించింది. ఇతర కారణాల దృష్ట్యా ఉద్యోగాన్ని మానేసిన మహిళలకు వారికీ ఉద్యోగకల్పనకు డిసెంబరు 2005 ఇండియా విమెన్ నిపుణుల ఇంటర్‌స్పేస్ నెట్‌వర్క్‌ను స్థాపించి, దేశంలో తొలిసారిగా మహిళలను తిరిగి తమ కెరీర్‌లను రీస్టార్ట్ చేయించే కన్సల్టెన్సీగా అవతార్ పేరు పొందింది. ముఖ్యంగా కౌన్సెలింగ్ ద్వారా మహిళలను తమ కెరీర్‌లను రీస్టార్ట్ చేయించే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంది. ఇప్పటికే సుమారు 75 మంది మహిళా ఉద్యోగినులతో విస్తరించడమే కాదు.. 8000 పైచిలుకు మహిళలను తమ కెరీర్‌లను రీస్టార్ట్ చేసేందుకు సహకరించింది.
Saundarya1

అడ్డంకులను అధికమించి..

మహిళల కెరీర్ రీస్టార్ట్ కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చిన సౌందర్య రాజేష్ ప్రయాణం పూలబాటలా సాగలేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చాలా కంపెనీలు తమ కంపెనీల్లో కెరీర్ బ్రేక్ ఇచ్చిన మహిళలకు మళ్లీ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అంతేకాదు వారి రెజ్యూమెలను కంపెనీలకు ఫార్వర్డ్ చేసినప్పుడు సౌందర్య రాజేష్ చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. అయినా, నిరుత్సాహ పడలేదు. అనేక సంస్థలను ఉద్యోగాలు ఇవ్వమని కోరారు. మహిళల కెరీర్ రీస్టార్ట్ చేయడంపై గల సందేహాలను ఆయా కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలతో చర్చించారు. పరిష్కార మార్గాలనూ సజెస్ట్ చేశారు. సెకండ్ కెరీర్ అనే ప్రోగ్రాంపై ఏడాది పాటు కష్టపడ్డారు. ఫలితంగా సుమారు 400 మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇది అవతార్ ఐ విన్ సాధించిన అతిపెద్ద విజయం.

పురస్కారాలు

భారత మహిళల, పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015లో వంద మంది మహిళా సాధికారత జాబితాలో సౌందర్య ఎన్నికయింది. దేశ వ్యాప్తంగా మహిళాభివృద్ధికి కృషి చేసిన వారికి మూడు విభాగాలుగా పోటీ నిర్వహించి 2015 డిసెంబర్ 31న ఈ జాబితా ను విడుదల చేసింది. 2016 జనవరి 22న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం

ప్రతి సంవత్సరం తమిళనాడు, పాండిచ్చేరి రాష్టాల్లో 10,000 పాఠశాల బాలికలలో నైపుణ్యాన్ని పెంపొందించడం. వారు ఉన్నత విద్యను చదివేలా ప్రోత్సాహాన్ని అందివ్వడం.వారి ఉన్నత విద్య అనంతరం ఉన్నత ఉద్యోగాలలో చేరేలా ప్రోత్సాహాన్ని ఇవ్వడం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలకు ఉద్యోగ కల్పనే ద్యేయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో 8 నుంచి 12 వ తరగతి వరకు ఐదు సంవత్సరాల పాటు శిక్షణని ఇస్తారు. ఈ శిక్షణ వారిలో వృత్తి నైపుణ్యాభివృద్ధికి ఉపకరించే విధంగా, పై చదువులకు ఉన్నత నైపుణ్యాలతో వెళ్లే విధంగా వారిలో విశ్వాసం కల్పిస్తుంది. వారి కుంటుంబాలలో పేదరికాన్ని నిర్మూలించడం, బాలికలలో నిరక్షరాస్యతను నిర్ములించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
Saundarya2

విజయాల బాట

మహిళలను తమ కెరీర్ రీస్టార్ట్ చేసేలా మోటివేట్ చేసేందుకు సౌందర్య చాలా కష్టపడింది. అవతార్ ఐ విన్ ద్వారా సుమారు 40 వేల మంది మహిళలను కాంటాక్ట్‌లో పెట్టుకుంది. వీరిలో పలురంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్రస్తుతం నిపుణులైన మానవ వనరుల కోసం వెతుకుతున్న కంపెనీలకు అవతార్ ఐ విన్ వన్ స్టాప్ పాయింట్‌గా నిలిచింది. ప్రఖ్యాత కంపెనీలైన హిందుస్తాన్ లివర్, యాక్సిస్ బ్యాంక్, గోల్డ్‌మన్ సాక్స్, ఫిడెలిటీ, హెచ్‌సీఎల్, గోద్రేజ్, ఫిలిప్స్, మైక్రోసాప్ట్ అవతార్ ఐ విన్‌ను సంప్రదిస్తున్నాయి. అవతార్ కన్సల్టెన్సీ ద్వారా సౌందర్య అందుకున్న మొదటి ప్రాజెక్టు చెన్నై కంటెయినర్ టెర్మినల్ ప్రైవేటైజేషన్. ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున మహిళా ఇంజనీర్లను అవతార్ కన్సెల్టెన్సీ అందించింది. పురుషులతో సమానంగా పలువురిని రిక్రూట్ చేయడంలో అవతార్ తన ప్రత్యేకతను చాటుకుంది. అత్యంత కఠినమైన పనులను సైతం తమ కెరీర్ రీస్టార్ట్‌లో చేపట్టేందుకు మహిళలు ముందుకు వచ్చారంటే అవతార్ ఇచ్చిన కౌన్సెలింగ్ ఎలా పనిచేసిందో చెప్పవచ్చు.

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles