జ్వరాలతో జాగ్రత్త!


Tue,September 10, 2019 12:03 AM

ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ అన్న తేడా లేదు.. ఏ హాస్పిటల్ చూసినా కిక్కిరిసి ఉన్న పేషెంట్లు.. చిన్నా పెద్దా.., పేదా ధనిక..జ్వరాలకు ఈ తేడాలేవీ లేవు. ఒకవైపు డెంగ్యూ.. మరోవైపు వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. నగర ప్రజలంతా జ్వరాలతో అతలాకుతలం అయిపోతున్నారు. ఇంకోవైపు గ్రామాల్లో మలేరియా జ్వరాలు, హెపటైటిస్ లాంటి ఫుడ్ బోర్న్ డిసీజ్‌లు విలయతాండవం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషజ్వరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ కథనం..
fever
వర్షాకాలం దోమల కాలం. అయితే ఈ ఏడాది ఎప్పటికన్నా ఎక్కువగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే వాటి ద్వారా వచ్చే జ్వరాలూ విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఒకరో ఇద్దరో జ్వరంతో ఉన్నారన్న మాటలే వినిపిస్తున్నాయి. వీటిలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వైరల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, హెపటైటిస్ లాంటి జబ్బులే ఎక్కువ. సాధారణంగా గ్రామాల్లో కన్నా నగరాల్లో పరి
శుభ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిటీల్లో ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అనుకునేవాళ్లు ఇంతకుముందు. కాని మారిన ఆహారపు అలవాట్లు, బయటి ఫుడ్ కి అలవాటు పడటం, పరిసరాల పట్ల బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల నగరాల్లో సైతం ఇలాంటి వ్యాధులు ఎక్కువయ్యాయి. దాంతో పాటు టైఫాయిడ్, హెపటైటిస్ లాంటి వ్యాక్సిన్లు వేయించుకోకపోవడం వల్ల కూడా ముఖ్యంగా గ్రామాల్లో ఈ జబ్బులు పెరుగుతున్నాయి.

Dengue

కారణాలు

మొన్నటివరకు ఎండలు కాచి, వాతావరణం చల్లబడగానే ఫ్లూ వైరస్‌లు సులువుగా పెరుగుతాయి. అందుకే వర్షాకాలం, చలికాలం ఫ్లూ జ్వరాలను ఎక్కువగా చూస్తాం. ఇకపోతే మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇందులో నాలుగు రకాలుంటాయి. కాని ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫేరం పరాన్నజీవుల వల్ల కలిగే మలేరియా ఎక్కువగా కనిపిస్తుంది. ఫాల్సిఫేరం మలేరియా చాలా ప్రమాదకరమైంది.. ప్రాణాంతకమైంది కూడా. మలేరియా వ్యాధి అనాఫిలస్ దోమ వాహకంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మలేరియా ఉన్న రోగిని కుట్టిన దోమ కుట్టినప్పుడు దోమ లాలాజలంలో ఉండే ప్లాస్మోడియం రక్తంలోకి ప్రవేశించి మలేరియా వ్యాధిని కలిగిస్తుంది.

ఇకపోతే టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, ఇ వ్యాధులు నీరు, ఆహారం కలుషితమైనవి తీసుకోవడం ద్వారా వ్యాపిస్తాయి. వీటిలో హెపటైటిస్ వైరస్ వల్ల వచ్చే వ్యాధి అయితే టైఫాయిడ్ బాక్టీరియల్ వ్యాధి. సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో నీరు కలుషితమయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయటి ఫుడ్ తీసుకోవడం, ఎక్కడ పడితే అక్కడి నీరు తాగడం, ఇంట్లో కూడా పరిశుభ్రత పాటించకపోవడం వల్ల టైఫాయిడ్ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు ఏడిస్ అనే జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల వస్తాయి. వర్షాకాలంలో నిలవ అయిన నీటిలో ఇవి పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో ఈ వ్యాధులు ఎక్కువ.

లక్షణాలు

దాదాపుగా అన్ని రకాల జ్వరాల లక్షణాలూ ఒకేలా ఉంటాయి. ఇది ఫలానా వ్యాధి అని లక్షణాలను బట్టి చెప్పలేం. పరీక్షల ద్వారా మాత్రమే కచ్చితంగా తెలుసుకోవచ్చు. మలేరియా ఉన్నప్పుడు హై ఫీవర్ అంటే శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక్కోసారి కామెర్లు కూడా ఉండొచ్చు. చలి బాగా ఉంటుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు జ్వరంతో పాటుగా కడుపునొప్పి, విరేచనాలు ఉంటాయి. హెపటైటిస్ అయితే వీటితో పాటుగా కామెర్లు కూడా కనిపిస్తాయి.

వైరల్ ఫీవర్లు

patients
సాధారణ జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో మొదలయ్యే ఫ్లూ దగ్గరి నుంచి డెంగ్యూ వరకు అన్నీ వైరల్ జ్వరాలే. సాధారణ ఫ్లూ అయితే జ్వరం పెద్దగా బాధించదు. తుమ్ములు, దగ్గు, జలుబు ఎక్కువగా బాధిస్తాయి. సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ కి చల్లని వాతావరణం ఉంటే చాలు. వైరస్ లు సులువుగా పెరుగుతాయి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లాలాజల బిందువుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. సాధారణ వైరల్ ఫీవర్ కూడా వారంరోజుల్లో తగ్గిపోతుంది. కాని చికున్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులే చాలా ప్రమాదకరమైనవి. ఇవి తగ్గిన తరువాత కూడా చాలా రోజులు కీళ్లనొప్పులు బాధిస్తాయి. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధులే ఈ సీజన్ లో చాలా ప్రమాదకరమైనవి.

డెంగ్యూ లక్షణాలు

-జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పులు
-తలనొప్పి, వెన్ను లేదా నడుము నొప్పి
-జ్వరం వచ్చి 3-4 రోజులైన తరువాత శరీరంపై దద్దుర్లు వస్తాయి.
-రక్తంలో ప్లేట్‌లెట్ కణాల సంఖ్య తగ్గిపోతుంది.
-ప్లేట్ లెట్లు పడిపోయినా మేనేజ్ చేయవచ్చు. కానీ వందలో ఇద్దరికి బీపీ పడిపోతుంది. ఇది డేంజర్. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ రావొచ్చు. ఊపిరితిత్తులను అటాక్ చేసినా డేంజరే.
-సాధారణంగా మూడు నాలుగు రోజుల తర్వాత కాంప్లికేషన్లు వస్తాయి.

డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?

DENGUE2
సాధారణ ఫ్లూ జ్వరమైనా, సాధారణ వైరల్ జ్వరమైనా అయిదారు రోజుల్లో తగ్గిపోతుంది. దీనికి సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చినా నెమ్మదిగా దాని నుంచి బయటపడుతారు. అయితే జ్వరం ఎంతకీ తగ్గకపోయినా, 104 డిగ్రీలు ఉన్నా వెంటనే డాక్టర్ ను కలవాలి. జ్వరం ఎక్కువగా లేకపోతే పారసిటమాల్ వేసుకుని మూడు నాలుగు రోజుల్లో తగ్గుతుందేమో చూడవచ్చు. అయినా తగ్గకుంటే డాక్టర్ ను కలవాలి. అయితే 60 ఏళ్లు దాటినవాళ్లు, అయిదేళ్ల లోపు వాళ్లకు రెండు రోజులైనా జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను కలవాలి. డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు ఒక్కోసారి ప్రాణాంతకం అవుతాయి. ఇలాంటప్పుడు వీలైనంత తొందరగా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాలి.

చికిత్స

ఈ జ్వరాలకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో డాక్టర్ దగ్గరికి రాకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేగాని ఈ సీజన్‌లో జ్వరాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ ను కలిసి చికిత్స తీసుకుంటే ఏ ప్రమాదమూ లేకుండా పూర్తిగా నయమవుతుంది. టైఫాయిడ్ బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కాబట్టి యాంటిబయాటిక్స్ ఇస్తారు. ఇమీడియట్ గా మంచి ఫలితాలను ఇచ్చే శక్తివంతమైన యాంటిబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చికిత్స ప్రారంభించిన తరువాత టైఫాయిడ్ తగ్గడానికి కనీసం వారం రోజులు పడుతుంది. మలేరియా పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి కాబట్టి దీనికి యాంటి పారసైటిక్ డ్రగ్స్ ఇస్తారు. ఒకప్పుడు మలేరియాకి మంచి మందులు లేక ప్రాణాల మీదకు వచ్చేది గానీ ఇప్పుడు ఉన్న మందులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైరల్ జ్వరాలకు యాంటి బయాటిక్స్ వాడలేం. వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లకు యాంటిబయాటిక్స్ పనిచేయవు. చాలావరకు వైరల్ జ్వరాలకు సింప్టమాటిక్ ట్రీట్‌మెంటే ఇస్తారు. స్వైన్ ఫ్లూ వచ్చినా ఇప్పుడు భయం లేదు. మంచి టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏ వ్యాధి.. ఎక్కడ ఎక్కువ?

మలేరియా

మలేరియా వ్యాధి కలిగించే అనాఫిలస్ దోమ బాగా మురికిగా ఉన్న నీటిలో పెరుగుతుంది. ఈ దోమల సంతతి పెరగాలంటే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండాలి. గ్రామాల్లో మురికి కాలువలు ఎక్కువ. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా చోట్ల ఉంటుంది. దాంతో వర్షం పడినప్పుడు పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. కాని నగరాల్లో, ఓ మోస్తరు పట్టణాల్లో గానీ అలా కాదు. మురికి కాలువలు ఉండవు. క్లోజ్డ్ డ్రైనేజి సిస్టమ్ ఉంటుంది. పరిసరాలు చాలావరకు శుభ్రంగా ఉంటాయి. మట్టిరోడ్లు కాదు కాబట్టి క్లీన్ గా ఉంటాయి. ఇకపోతే మలేరియా దోమ రాత్రిపూట కుడుతుంది. సిటీల్లో రాత్రిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లే ఎక్కువగా ఉంటారు. కాని గ్రామాల్లో దోమలను పెద్దగా పట్టించుకోరు. జాగ్రత్తలు అంతగా తీసుకోరు. ఆరుబయట పడుకుంటారు. పొలాల్లో పడుకునేవాళ్లూ ఉంటారు. బయట దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుట్టే అవకాశం ఎక్కువ. అందుకే గ్రామాల్లో మలేరియా కేసులు ఎక్కువగా ఉంటాయి. నగరాల్ల్లో మలేరియా బారిన పడేవాళ్లు తక్కువగా ఉంటారు.

వైరల్ ఫీవర్లు

fever2
వైరల్ ఇన్‌ఫెక్షన్ కి చల్లని వాతావరణం ఇంపార్టెంట్. ఇలాంటి వాతావరణంలో ఇవి చాలా సులువుగా ఒకరి నుంచి ఒకరికి తొందరగా స్ప్రెడ్ అవుతాయి. నగరాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది గుమిగూడి ఉండే ప్రదేశాలూ ఎక్కువే. సినిమాహాళ్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్.. ఇలా ఎక్కువమంది ఉండే చోట వైరల్ ఇన్‌ఫెక్షన్లు చాలా సులభంగా వ్యాపిస్తాయి. అందువల్ల గ్రామాల్లో కన్నా వైరల్ జ్వరాలు నగర వాతావరణంలోనే ఎక్కువ. ఈ సీజన్ లో అతి సాధారణంగా కనిపించేవి ఈ వైరల్ ఫీవర్లు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు వైరస్‌ల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అందుకే సిటీల్లో హాస్పిటల్స్ అన్నీ వైరల్ జ్వరాలతో నిండిపోతున్నాయి.

డెంగ్యూ, చికున్ గున్యా

dengue1
డెంగ్యూ వ్యాధి కలిగించే ఏడిస్ దోమలు పెరగడానికి నీరు మురికిగా ఉండనక్కరలేదు. ఈ దోమలు క్లీన్ వాటర్ లో కూడా పెరుగుతాయి. అందుకే డెంగ్యూ నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వర్షపు నీరు నిలిచిపోవడం, కొబ్బరినీళ్లు తాగి పడేసిన కొబ్బరిబోండాల్లో, ట్యాంకులలో, చిన్న చిన్న కంటెయినర్లలో నీరు నిలిచిపోయి ఉంటే వాటిలో ఏడిస్ దోమలు పెరుగుతాయి. డెంగ్యూ దోమలు పెరగడానికి దోసెడు నీరు నిలవ ఉన్నా చాలు. ఈ పరిస్థితి గ్రామాల్లో తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ డెంగ్యూ వ్యాధి తక్కువగా కనిపిస్తుంది. నగరాల్లో మాత్రం డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా డెంగ్యూ దోమలు పగటి సమయంలోనే ఎక్కువగా కుడతాయి. నగరాల్లో ఎక్కువగా కనిపించడానికి ఇదీ ఒక కారణమే. ఇకపోతే చికున్ గున్యా వ్యాధి కూడా ఏడిస్ వల్లనే వస్తుంది కాబట్టి దాని పెరుగుదల పట్టణాల్లోనే ఎక్కువ. అయితే ఈ వ్యాధి తీవ్రత నగరాల్లో, గ్రామాల్లో ఒకే విధంగా కనిపిస్తోంది.

ఫుడ్ బోర్న్ వ్యాధులు

hand-wash
కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు పరిశుభ్రత తక్కువ ఉంటే అటాక్ చేస్తాయి. టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, ఇ ఇలాంటివే. సాధారణంగా ఇవి సబ్ అర్బన్, గ్రామాల్లో ఎక్కువ. కాని నగరాల్లో కూడా వస్తాయి. అయితే పరిశుభ్రత, పరిసరాలను బట్టి కనిపిస్తాయి. ఈ వ్యాధులు వ్యాపించడానికి గ్రామాల్లో పరిశుభ్రత పాటించకపోవడం కారణమైతే, పట్టణాల్లో బయట తినే అలవాటే కారణం. పానీపూరీలలో వాడే నీరు సాధారణంగా ఇలాంటి వ్యాధులు రావడానికి కారణమవుతున్నది. రోడ్డు మీద అమ్మే ఆహారంలో నాణ్యత లేకపోవడం, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, అక్కడే బయటి నీళ్లు తాగడం ఫుడ్ బోర్న్ వ్యాధులను వ్యాపింపచేసే సూక్ష్మజీవుల బారిన పడడానికి కారణమవుతున్నాయి. అంతేకాదు, డ్రైనేజ్ సరిగా ఉండకపోవడం, చేతులు సరిగా కడుక్కోకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకుండానే ఆహార పదార్థాలను ముట్టుకోవడం, తినడం ఈ వ్యాధులను కలుగజేస్తాయి.

జాగ్రత్తలు

ఈ సీజన్‌లో వ్యాపించే వైరల్ జ్వరాలైనా, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లయినా, ఏ వ్యాధులైనా చాలావరకు నివారించదగినవే. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకోవాలని చేతులు ముడుచుకుని కూర్చోకుండా వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరి పరిసరాలను వాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిలవ ఉండకుండా జాగ్రత్తపడాలి. ఇంటిముందు, ఇంటి దగ్గరి రోడ్డులో నీరు నిలిచిపోయినా వాటిని తీసేయడానికి తగిన ప్రయత్నం చేయాలి. వ్యాధులు రావడానికి ముఖ్యంగా శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడమే కారణం.

వ్యాధినిరోధక శక్తికి జన్యుపరమైన స్వభావమే కొంతవరకు కారణమైనప్పటికీ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా రోగ నిరోధకతను పెంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవచ్చు. ఇకపోతే ఇమ్యూనిటీ పెంచే మరో ఆయుధం వ్యాక్సినేషన్. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు అవసరమే. గ్రామాల్లో అడల్ట్ వ్యాక్సినేషన్ గ్రామాల్లో జీరో. నగరాల్లో కొంతవరకు అవగాహన ఉన్నప్పటికీ చాలామంది టైఫాయిడ్, హెపటైటిస్ లాంటి వ్యాక్సిన్లు తీసుకోవడం లేదు. వృద్ధులు, డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ వ్యాక్సిన్లు ప్రతి ఏటా తప్పనిసరిగా వేయించుకోవాలి.

డెంగ్యూ బారిన పడొద్దంటే..

pune
-నీటి నిలవ లేకుండా చూసుకోవాలి.
-చిన్న వాటర్ కలెక్షన్ ఉన్నా చాలు, దోసిటలో ఉన్నన్ని నీళ్లు నిలవ ఉన్నా డెంగ్యూ దోమలు పెరుగుతాయి. కాబట్టి కొంచెం కూడా నీళ్లు నిలవ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
-బయటకు వెళ్లేవాళ్లు, ముఖ్యంగా స్కూల్ పిల్లలు చేతులు, కాళ్లు మొత్తం కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి. ఇలాంటి దుస్తులను స్కూల్స్ కూడా అనుమతించాలి. వీటివల్ల దోమలు కుట్టే ఏరియా తగ్గుతుంది.
-పిల్లలకు మస్కిటో రిపెల్లెంట్ స్టిక్కర్స్ పెట్టాలి. కొంతవరకైనా అవి ప్రొటెక్షన్ ఇస్తాయి.
-ఇంట్లో పగలూ, రాత్రి ఎప్పుడూ మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి.
-ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలి. జనరల్ హైజిన్ పాటించాలి.

ఫ్లూ రావొద్దంటే..

fever1
-దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరు కవర్ చేసుకోవాలి.
-దగ్గినా, తుమ్మినా చేతులు అడ్డం పెట్టుకుని, ఆ చేతులతో ఏదైనా ముట్టుకుంటే వైరస్‌లు దానికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మళ్లీ వేరెవరైనా దాన్ని ముట్టుకున్నప్పుడు వాళ్లకి వైరస్ వ్యాపిస్తుంది. అందువల్ల జలుబు, దగ్గు లాంటివి ఉన్నప్పుడు, తుమ్మినప్పుడు తరచుగా చేతులు కడుక్కోవాలి.
-దగ్గు ఉంటే పిల్లల్ని స్కూల్ కి పంపొద్దు.
-ఫ్లూ కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి వేయించడం మరిచిపోవద్దు.
-అయిదేళ్ల్ల లోపు పిల్లలు, గర్భిణులు, డయాబెటిస్ ఉన్నవాళ్లు, 60 ఏళ్లు పైబడినవాళ్లు ప్రతి ఏటా వ్యాక్సిన్లు తీసుకోవాలి.

టైఫాయిడ్, హెపటైటిస్ రాకుండా..

Water
-పరిశుభ్రత చాలా ముఖ్యం. ఇల్లు, పరిసరాల శుభ్రత పాటించాలి.
-రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి.
-బయటికి వెళ్తే సొంత వాటర్ బాటిల్ పట్టుకెళ్లడం మేలు.
-ఆహారాన్ని పూర్తిగా ఉడికించిన తరువాతే తినాలి.
-సలాడ్స్ లాంటివి తీసుకోకపోవడమే మంచిది.
-హెపటైటిస్ ఇ, ఎ కూడా టైఫాయిడ్ లాగానే స్ప్రెడ్ అవుతాయి. హెపటైటిస్ ఎ కి, టైఫాయిడ్ కి వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటిని వేయించుకోవాలి.

గర్భిణులు.. మరింత భద్రం!

pregnant
గర్భంతో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు స్ప్రెడ్ అయ్యేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హెపటైటిస్ ఇ గర్భిణుల్లో వస్తే అయిదుగురిలో ఒకరు చనిపోతారు. కడుపులో బిడ్డ పోవచ్చు. తల్లికి ప్రాణాంతకం కావొచ్చు. అందుకే గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ కలుషిత ఆహారం వల్లనే వస్తుంది కాబట్టి గర్భిణులు బయటి ఫుడ్ అసలు తినొద్దు.
Hari-Kishan-Boorugu
-డాక్టర్ హరి కిషన్ బూరుగు
-సీనియర్ ఫిజీషియన్యశోద హాస్పిటల్స్ హైదరాబాద్

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles