సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే క్యాన్సర్లు


Tue,September 17, 2019 12:48 AM

వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అనీ, అలసట అనీ, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడటం వల్ల , వయసు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం.. ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్‌కు ప్రమోషన్ ఇచ్చి లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి.
omega
అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే కనుక్కుంటే ఆధునిక వైద్యంలో ఏ సవాలుకైనా సమాధానం లభిస్తుంది. అయితే రోగం దాని తాలూకు లక్షణాలు, ఆ వ్యాధికి ఎలాంటి చికిత్స అనే విషయాల్లో రోగి మనస్తత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.


తలనొప్పి

ఇది తరచూ అందరూ ఎదుర్కొనేదే. చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్ లేదా తలనొప్పి అప్పుడప్పుడూ రావడం సహజమే. తలనొప్పి మందులను జేబులో వేసుకుని కొద్దిగా లక్షణాలు కనిపించగానే వేసుకుంటూ పోతే కాలేయం, కిడ్నీలు, రక్తపోటు మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. మైగ్రేన్ అయితే నిర్దుష్టకాలం పాటు సరైన మందులు వాడితే సమస్య తగ్గుతుంది. ఉదయం లేవగానే తల భారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్‌ట్యూమర్‌కు సంకేతంకావొచ్చు.

గొంతునొప్పి

చల్లటి పదార్థాలు, వాతావరణం, కొత్త ప్రదేశం, తాగే నీరు మారాయి. అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడేవారిని చాలామందినే చూస్తుంటాం. రెండు మూడు రోజుల్లో తగ్గకపోతే మందులు కోర్సుగా వాడటం లాంటి ప్రయత్నాలు చేశాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించి చెకప్స్ చేయించుకోవడం తప్పనిసరి. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి.

దగ్గు, ఆయాసం

ముఖ్యంగా సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు కానీ వీరికి లంగ్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహిస్తే మంచిది. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లెలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు.

కడుపుబ్బరం, మంట

వేళకు ఆహారం తీసుకోకపోవడం, కంటికి ఇంపుగా నోరూరించే అనారోగ్య పదార్థాలు, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో మనలో చాలామంది కడుపులో మంట, తేన్పులు, ఉబ్బరం, ఆకలి తగ్గడం, వికారం వంటి లక్షణాలను తరచూ చూస్తున్నారు. యాంటాసిడ్స్ మందులు ఇంట్లో పెట్టుకుని ఏల్ల తరబడి వాడేవారిని అనేక మందిని చూస్తుంటాం. ముందు సరైన జీవనశైలి అలవర్చుకుని నీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్ బ్లాడర్ క్యాన్సర్లను తొలిదశలోనే కనుక్కునే అవకాశం ఉంది.

మూత్ర వ్యవస్థలో తేడాలు

మూత్రంలో రక్తం పడటం, ఆగి ఆగి రావడం, మంటగా ఉండడం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడి చేసిందని కొందరు భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువగా తాగడం, ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల వంటి కారణాల వల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్ కావొచ్చని అనుమానించాలి. 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరి మధ్య రక్తస్రావం, పొట్ట భారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా (పిఎంఎస్) పొరబడవచ్చు గానీ కొన్ని సందర్భాల్లో ఒవేరియన్, యుటిరిన్ క్యాన్సర్లు కూడా అయ్యే అవకాశాలుంటాయి.

మలవిసర్జనలో తేడాలు

అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే మాత్రం దాన్ని పైల్స్ అనుకుంటే పొరబాటు పడుతున్నట్టే. దక్షిణ భారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా కనిపించే కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావొచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. ఆహార పదార్థాలు మార్చి మార్చి తీసుకుంటూ ఇబ్బందిపడే కంటే సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్టయితే గాలి సోకింది, దయ్యం పట్టింది, చేతబడి చేశారు.. అంటూ పూజలు, మంత్రాలు, విబూది, తాయెత్తుల వంటి మూఢ నమ్మకాల పాలబడకుండా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉంటే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.

క్యాన్సర్ అసలు భాగం నుంచి ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావొచ్చు. ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాల గడ్డలనీ, రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. అలసట, చర్మం మీద ఊదా రంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్ క్యాన్సర్‌కు హెచ్చరికలవ్వొచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్, లంగ్ క్యాన్సర్లకు సూచన కావొ చ్చు. శరీరం మీద మచ్చలు, వాటిలో మార్పుల మీద కూడా ఒక కన్నేసి ఉంచితే మంచిది. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్రం చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలా వరకు క్యాన్సర్ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు.

ch-mohana-vamshi

152
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles