పేషెంట్ సేఫ్‌గా ఉన్నారా?


Tue,September 17, 2019 12:51 AM

జబ్బు చేసిందని హాస్పిటల్‌కి వెళ్తే మరో మొండిజబ్బును వెంటబెట్టుకు రావడం.. ఒక కిడ్నీలో సమస్య ఉంటే ఇంకో కిడ్నీకి ఆపరేషన్ చేయడం.. ఒక మందు బదులుగా ఇంకోటి ఇవ్వడం... హెల్త్‌కేర్‌లో ఇలాంటి పొరపాట్లు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి మెడికల్ ఎర్రర్స్ వల్ల కొన్నిసార్లు రోగులకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇలాంటి లోపాలు తలెత్తకుండా పేషెంట్ సేఫ్టీ కోసం ఏం చేయాలనే అంశంపై ఇటీవల హైదరాబాద్‌లో ఓ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ కేర్‌లో ఎక్కడ పొరపాట్లు జరుగుతాయో, రోగుల సంరక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు డాక్టర్ హరిప్రసాద్.
patient-and-doctor
తప్పు చేయనివాళ్లు ఎవరూ ఉండరు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఇందుకు అతీతులు కారు. కాని వైద్యం అందించడంలో పొరపాట్లు జరిగితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి పేషెంటు ప్రాణాల మీదకు కూడా రావొ చ్చు. అందుకే పేషెంట్ సేఫ్టీ కోసం ఏం చేయాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. వైద్యరంగంలో జరిగే పొరపాట్లలో 99.5 శాతం పేషెంట్ల దాకా వెళ్లవు. మధ్యలోనే ఆ పొరపాట్లకు అడ్డుకట్ట పడుతుంది. ఉదాహరణకు ఒక డయాబెటిస్ పేషెంటుకు ఆహారం కూడా ఒక మెడిసినే. అలాంటప్పుడు ఆ పేషెంటుకు ఇచ్చే డైట్ సాధారణమైనది వెళ్తే ప్రాబ్లం అవుతుంది. కాని కిచెన్ నుంచి పేషెంటు వరకు వెళ్లేలోపే ఎవరో ఒకరు గుర్తించి ఆపేందుకు ఆస్కారం ఉంటుంది. పేషెంటు వరకు వెళ్లేలోపు ప్రతి దశలోనూ ఇలా చెక్ చేసుకుంటే పొరపాట్లు జరుగకుండా నివారించవచ్చు.


HandHygiene

హాస్పిటల్ ఇన్‌ఫెక్షన్లు

ఒక జబ్బుకోసం హాస్పిటల్‌లో చేరితే ఇన్‌ఫెక్షన్‌తో మరో జబ్బు బారిన పడుతుంటారు కొందరు. హాస్పిటల్‌లో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవడంలో విఫలమైనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సాధారణంగా హాస్పిటల్స్‌లో వివిధ రకాల యాంటిబయాటిక్స్ వాడుతారు. వాటికి బాక్టీరియా కూడా ఎక్స్‌పోజ్ అవుతాయి. అందువల్ల హాస్పిటల్స్‌లో సూపర్ బగ్స్ తయారయ్యే అవకాశం ఎక్కువ. యాంటిబయాటిక్స్‌కి నిరోధకతను పెంచుకున్న బాక్టీరియాను సూపర్ బగ్స్ అంటారు. వీటి ఇన్‌ఫెక్షన్ మరొకరికి వస్తే అలా వాటి సంఖ్య పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లను నివారించేందుకు సింపుల్ హ్యాండ్ వాష్ కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎసెప్టిక్ ప్రీకాషన్స్ తీసుకోవాలి. ఇంజెక్షన్ల నుంచి సర్జరీ దాకా స్టెరిలైజ్ ప్రాసెస్ ఉండాలి. పేషెంట్ అటెండెంట్స్ కి కూడా ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలి. పేషెంట్లను హ్యాండిల్ చేసేటప్పుడు నర్సులు, ఇతర సిబ్బంది చేతులు కడుక్కున్నారా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి.

MEDICINE

మెడికేషన్‌లో లోపాలు..

పేషెంట్లకు మందులు ఇచ్చేటప్పుడు నాలుగు స్థాయిల్లో లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. డ్రగ్ ఎంచుకోవడంలో తప్పు జరగొచ్చు. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో తప్పు జరగొచ్చు. ఒకేపేరుతో ఉన్న కొన్ని మందులు ఉంటాయి. ఒకటి యాంటిబయాటిక్ కావొచ్చు. మరొకటి యాంటి డయాబెటిక్ కావొచ్చు. ఒకదాని బదులు ఒకటి ఇస్తే మొదటికే మోసం వస్తుంది. డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్‌లో స్పష్టత ఉండాలి. కంప్యూటర్లో పేషెంట్ వివరాలను పొందుపరిచే క్రమంలో కూడా పొరపాట్లు జరగొచ్చు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. జబ్బు, పరీక్షల రిపోర్టులు, మందు పేరులో చిన్న స్పెలింగ్ తప్పు రాసినా మొత్తం తేడా వచ్చేస్తుంది. ఫార్మసీలో మందులు ఇచ్చేటప్పుడు ఒకదాని బదులు ఒకటి ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. మందుల అడ్మినిస్ట్రేషన్‌లో తేడా రాకుండా చూడాలి. రక్తనాళం ద్వారా ఇవ్వాల్సిన మందును కండరం ద్వారా ఇస్తే తీవ్రమైన పర్యవసానాలు కలుగుతాయి.

doctors-performing-surgery

సర్జరీ సమయంలో..

ఎడమవైపు ఆపరేషన్ కుడివైపు చేశారని, సర్జరీ సమయంలో ఏ కత్తెరో మర్చిపోయారనీ, అనెస్తీషియా డోస్‌లో తేడా వచ్చిందనీ ఇలాంటి సంఘటనలు అడపాదడపా వింటుంటాం. పేషెంట్ కేస్‌స్టడీ సరిగా చెక్ చేయకపోయినా, డయాగ్నస్టిక్ పరీక్షల ఫలితాల్లో పొరపాట్లు జరిగినా ఇలాంటి తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సర్జరీ మొదలుపెట్టేముందు అన్నీ ముందుగానే పరిశీలించి చూసుకోవాలి. ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో విమానం ఎగరడానికి ముందు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఒక చెక్‌లిస్ట్ ఉంటుంది. చెక్ చేసి అన్నీ బావున్నాయని నిర్ధారణ అయ్యాకే విమానం ఎగురుతుంది. ఇదే పద్ధతిని హెల్త్‌కేర్‌లో కూడా అప్లయి చేస్తున్నాం. అనెస్తీషియా ఇచ్చేముందు, సర్జరీ చేసేముందు చెక్ లిస్ట్ పెట్టుకుని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని నిర్ధారణ చేశాకే సర్జరీ చేయాలి.

intravenousinfusion

పేషెంట్ ఏం చేయాలి?

పేషెంటు గానీ, పేషెంటుకు సంబంధించినవాళ్లు గానీ జబ్బు గురించి, దాని చికిత్స గురించి పూర్తి వివరాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకోవాలి. తమ జబ్బు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రశ్నలు అడిగే తత్వం ఏర్పరుచుకోవాలి. డాక్టర్ ఏమనుకుంటారో అని సంశయించవద్దు. అది రోగి హక్కు. ఏ జ్వరమో వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు డాక్టర్ ఇచ్చిన మందులను గుడ్డిగా వేసుకోకుండా ఏ మందు దేనికి పనిచేస్తుంది.. జ్వరం టాబ్లెట్ ఏది, యాంటిబయాటిక్ ఏది.. లాంటివన్నీ అడిగి తెలుసుకోవాలి. జ్వరం తగ్గితే జ్వరం టాబ్లెట్ ఆపొచ్చు. యాంటిబయాటిక్ కోర్సు పూర్తయ్యేవరకు వేసుకోవాలి. సర్జరీ అన్నప్పుడు అది దేనికోసం చేస్తున్నారు, సర్జరీ వల్ల ఫలితాలేంటి, దీనికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా.., దాని పర్యవసానాలేంటి.. లాంటి అంశాలన్నీ తెలుసుకోవాలి. వైద్య సిబ్బంది చేతులు కడుక్కున్నారా లేదా, నర్సు డాక్టర్ చెప్పిన మెడిసినే ఇస్తుందా లేదా.. లాంటి విషయాలను చెక్ చేసుకోవాలి. పేషెంట్ అటెండర్లు కూడా చేతులు కడుక్కునే పేషెంటును హ్యాండిల్ చేయాలి.

Meditsina

ఇవి పాటించాలి..

-పేషెంట్ సేఫ్టీ అనేది సంక్లిష్టమైన విషయం. హౌజ్ కీపింగ్ వాళ్ల దగ్గరి నుంచి సీనియర్ డాక్టర్ వరకు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కడ లోపం జరిగినా సమస్యే. ఇందులో టెక్నాలజీ పాత్ర కూడా ఉంటుంది. ఈ అన్ని స్థాయిల్లో అప్రమత్తతతో ఉండడమే రోగికి శ్రీరామరక్ష.
-ఇద్దరు పేషెంట్లు ఒక చికిత్సకు ఒకే విధంగా రియాక్ట్ కారు. అందువల్ల ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పేషెంటు శరీర స్వభావం గురించి అవగాహన కలిగివుంటే పొరపాట్లు పేషెంటు దాకా చేరకుండా నివారించవచ్చు.
-ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో గుర్తించి, మళ్లీ రాకుండా ఏం చేయాలో విశ్లేషించుకుని ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.
-హాస్పిటల్స్‌కి అక్రిడిటేషన్ ఇచ్చేటప్పుడు సరైన వైద్య పరికరాలు, వైద్యనిపుణులు ఉన్నారా లేదా అనే అంశాలతో పాటుగా పేషెంట్ సేఫ్టీకి ఇస్తున్న ప్రాధాన్యతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల గుర్తింపు పొందిన హాస్పిటల్స్‌లో ఫోకస్ పేషెంట్ సేఫ్టీ పైనే ఉండే అవకాశం ఉంది.
-పేషెంట్ సేఫ్టీ కూడా హెల్త్ కేర్ లో భాగమే. పేషెంటు, తన ఫ్యామిలీ కూడా హెల్త్ కేర్‌లో భాగస్వామ్యం వహించాలి. పేషెంటుకు ఏ మందులు, ఏ డైట్ లాంటి సంగతులన్నీ తెలుసుకోవాలి. పేషెంటు వైద్యం, నివారణ, జాగ్రత్తల పట్ల అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్లు డాక్టర్లను ప్రశ్నించగలుగుతారు. రోగి సంరక్షణ కోసం పేషెంటు, ఫ్యామిలీ, డాక్టర్ కలిసి సమన్వయంతో పనిచేయాలి.

dr-k-h-prasad

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles