అద్దెకు బైకులిచ్చే ఎరవాన్‌ విజయం!


Tue,September 17, 2019 12:51 AM

Vijaya
ఒకప్పుడు సైకిల్‌ కిరాయికి ఇచ్చేవారు. ఇప్పుడు బైక్‌లు. పురుషాధిక్యం ఉన్న రంగమది. అందులోనూ ఓ మహిళ రాణిస్తున్నది. బైక్‌లు కిరాయికి ఇస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లో బైక్‌లు అద్దెకు ఇచ్చే తొలి మహిళగా కూడా ఆమె పేరు తెచ్చుకున్నది.


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌. బల్లార్షా నుంచి భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆరో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై వచ్చి ఆగింది. పల్లెల నుంచి అటవీ ఉత్పత్తులు తీసుకొని కొందరు గిరిజన రైతులు రైలు దిగారు. బైటికొచ్చి ఎవరికో ఫోన్‌ చేశారు. కొద్దిసేపటికి పది స్కూటీలు అక్కడికి వచ్చాయి. అవి తీసుకుని వారు బయలుదేరారు. సరుకు అమ్ముడుపోగానే మళ్లీ సికింద్రాబాద్‌కు వచ్చి.. మళ్లీ ఫోన్‌ చేశారు. స్కూటీలవాళ్లు వచ్చి వాటిని తీసుకెళ్లారు. ఇలా వారికి ఆ స్కూటీలతో పని జరిగిపోయింది. ఇంతకూ ఆ స్కూటీల సంగతేంటి అనుకుంటున్నారా? అవి అద్దె బైక్‌లు. ఎరవాన్‌ బైక్స్‌ ఆ సేవల్ని అందిస్తున్నది. ఎరవాన్‌ వ్యవస్థాపకురాలే వల్లూరి విజయ.

‘మగవాళ్లు చేసే వ్యాపారం నీకెందుకు? వదిలెయ్‌' అని బెదిరిస్తూ చెప్పినవాళ్లున్నారు. ‘ఆ చూస్తాంలే.. డబ్బులు ఎక్కువుండి చేస్తున్నట్లుంది. ఆ డబ్బులు పోకపోయేనా.. మేం చూడకపోదుమా’ అని నిరుత్సాహపరిచినవాళ్లూ ఉన్నారు. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా లేనిపోని సమస్యలెందుకు తెచ్చుకుంటావ్‌?’ అని ఉచిత సలహాలిచ్చినవాళ్లూ ఉన్నారు. అందరి మాటలకూ తలూపింది కానీ.. ఎంచుకున్న మార్గాన్ని మాత్రం వీడలేదు. అంత పట్టుదల ఉన్న మహిళే వల్లూరి విజయ. కష్టపడి పనిచేస్తూ.. దాని ఫలితం అనుభవిస్తూ విజయం దిశగా వెళ్తున్నారు విజయ.
Vijaya3

తొలి మహిళా బైక్‌ రెంటర్‌

విజయది హైదరాబాదే. ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం చేసేవారు. మంచి జీతం ఉన్నప్పటికీ వ్యాపారంపైనే ఆసక్తి ఉండేది. సోదరులు మోటార్‌ ఫీల్డ్‌లో ఉన్నారు. తాను కూడా ఆ ఫీల్డ్‌లోకే వెళ్లాలి అనుకున్నారు విజయ. బైక్‌ రెంటల్‌ కంపెనీ పెట్టాలనుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. ఓ బైక్‌ రెంటల్‌ కంపెనీని కొనుగోలుచేసి 2017 ఏప్రిల్‌లో ‘ఎరవాన్‌ బైక్స్‌' ప్రారంభించారు. పది బైక్‌లతో ఇది ప్రారంభం అయింది. ఎరవాన్‌ అంటే థాయ్‌ భాషలో ఐరావతం. తక్కువ ధరలో అందరికీ బైక్స్‌ అందుబాటులో ఉంచాలనేదే ఎరవాన్‌ ఉద్దేశం. ప్రస్తుతం 110 బైక్‌లు ఎరవాన్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మహిళా తొలి బైక్‌ రెంటర్‌గా పేరు పొందారు విజయ.

మహిళల నేస్తం

ఎరవాన్‌లో అన్ని రకాల బైక్‌లు ఉంటాయి. 100 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం గల బైక్స్‌ ఇక్కడ లభిస్తున్నాయి. నాలుగు గంటలకు రూ. 100 తీసుకుంటారు. మహిళా ఉద్యోగులు.. గృహిణులు ఎరవాన్‌కు రెగ్యులర్‌ కస్టమర్లు. ఎక్కడికి కావాలంటే బైక్‌ అక్కడికే తీసుకొచ్చి ఇస్తారు. మళ్లీ తీసుకెళ్తారు. ఎరవాన్‌ బైక్‌ వాడాలనుకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి.

ఉపాధి మార్గం

ఎరవాన్‌ బైక్స్‌ ప్రారంభం నుంచి అందులో పది మంది పనిచేస్తున్నారు. బైక్స్‌ ఇచ్చిరావడం.. తీసుకోవడం.. రిపేర్‌ చేయడం వీరి బాధ్యత. నిరుద్యోగ యువతకు ఎరవాన్‌ సంపాదన మార్గం చూపిస్తున్నది. అదెలా అంటారా? చాలామంది యువకులు ఎరవాన్‌లో బైక్‌ అద్దెకు తీసుకొని స్విగ్గీ, జొమాటో, మెడిసిన్‌ డెలివరీ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. అమీర్‌పేట్‌లో దాదాపు 18 మంది ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ ఎరవాన్‌కు పర్మినెంట్‌ కస్టమర్లు. వేర్వేరు ప్రొఫెషన్లో ఉన్నవారందర్నీ కలుపుకొని ఒక్క అమీర్‌పేట ప్రాంతంలోనే 60 మంది ఎరవాన్‌ బైక్స్‌ ద్వారా తమ డ్యూటీలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఎరవాన్‌ మానవీయతను చాటుకోవడంలోనూ ముందుంటుంది. ఉదాహరణకు ఫుడ్‌ డెలివరీ చేసేవారికి సరైన ఆర్డర్స్‌ దొరకలేదు అనుకోండి.. లేదా హెల్త్‌ బాలేకపోవడంతో ఆరోజు డ్యూటీకి రాలేదనుకోండి బైక్‌ కిరాయి తీసుకోకుండా ఎరవాన్‌ సేవలందిస్తున్నది.

కష్టాలు.. నష్టాలు..

మోటారు ఫీల్డ్‌లో పురుషాధిపత్యం ఉంటుంది. నిజంగానే మహిళలతో కాదేమో అనే సందేహం వస్తుంది. ఊహించినట్టుగానే చాలా కష్టాలు చూశారు విజయ. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. చలాన్లు.. యాక్సిడెంట్లు నిత్యం ఉండేవే. కానీ వాటిని తెలివిగా డీల్‌ చేస్తూ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా.. తమ సేవలకు ఆటంకం జరగకుండా రవాణాశాఖ చర్యలకు లోబడి నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల్ని నియమించారు. 24 గంటల సేవలు కాబట్టి రెంట్‌కు ఇచ్చిన బైక్‌ ఎక్కడైనా ఆగిపోయినా.. ప్రమాదం జరిగినా వీరు సకాలంలో స్పందిస్తారు. విజయ సక్సెస్‌ను చూసి అమీర్‌పేట చుట్టుపక్కల పదుల సంఖ్యలో బైక్‌ రెంటల్స్‌ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అవేమీ తనకు పోటీగా భావించకుండా సేవాభావంతో కంపెనీని నడిపిస్తున్నారు విజయ.

స్వయంగా ఫీల్డ్‌లోకి.

ఎరవాన్‌ ప్రారంభంలో బైక్‌ గురించి విజయకు ఏమీ తెలియదు. కానీ, అనంతరం నిత్యం బైక్‌ల మధ్య గడపాల్సి రావడంతో వాటిపై పూర్తి పట్టు దొరికింది. బైక్‌ విడిభాగాలు, అది పనిచేసే తీరు. అనేక విషయ పరిజ్ఞానాన్ని సంస్థ ఉద్యోగుల నుంచి విజయ నేర్చుకున్నారు. ప్రస్తుతం బైక్స్‌ వినియోగదారుల నాడీ పట్టుకున్నారు. గతంలో ఆమెకు డ్రైవింగ్‌ కూడా వచ్చేది కాదు. కానీ, కంపెనీ ప్రారంభించిన తర్వాత అనేకసార్లు కస్టమర్లకు బైక్‌ ఇచ్చి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె పర్‌ఫెక్ట్‌గా బండి నడిపిస్తున్నారు.
Vijaya1

మీక్కావాలా?

అమీర్‌పేట్‌లోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వెనుక భాగం పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనాలు నిలిపి ఉంటాయి. ఇదే కంపెనీ ఉన్న చోటు. పక్కనే ఓ మర్రిచెట్టు దానికింద రెండు కుర్చీలు, ఒక టేబుల్‌ వేసి ఉంటుంది ఇదే కంపెనీ కార్యాలయం. ఎరవాన్‌ బైక్స్‌ అద్దెకు తీసుకోవాలంటే 9908566377 నంబర్‌కు ఫోన్‌చేసి సంప్రదించవచ్చు. www.erawanbikes.comలో బైక్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఎరవాన్‌ యాప్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు.
Vijaya2

1000 బైక్స్‌ లక్ష్యం:

కొందరు మా సంస్థ బైక్స్‌ను అద్దెకు తీసుకుని ఉపాధి పొంది సొంతగా బైక్స్‌ కొనుక్కున్నారు. “మేడం మీ బైక్‌ను వాడుకొని మేం కొత్త బైక్‌ కొన్నాం” అని చెప్తే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఇప్పటికీ కొందరు ‘మాకు గిరాకీ కాలేదు అద్దె చెల్లించలేం’ అంటే వారికి మినహాయింపు ఇస్తాను. అప్పుడు ఎన్ని లక్షలు పోసినా చూడలేని ఆనందాన్ని వారిలో చూస్తాను. నేను సంస్థను ప్రారంభించిన మొదట్లో ఉన్న పదిమంది సిబ్బంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. 2020 వరకు 1000 బైక్స్‌ అద్దెకు ఇచ్చేలా కంపెనీని విస్తరిస్తాను. స్నేహితులు రవికుమార్‌, తమ్ముళ్ల సహకారంతో బిజినెస్‌లో రాణించగలుగుతున్నా.
- వల్లూరి విజయ

- పడమటింటి రవికుమార్‌, చిన్న యాదగిరిగౌడ్‌

3528
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles