పితృలోకం పిలుస్తున్నది!


Sun,September 22, 2019 01:23 AM

పితృపక్షం ఈ వారాంతం (శనివారం: 28వ తేది)తో ముగుస్తున్నది. ఆ రోజు పెత్రమాస (మహాలయ అమావాస్య), చివరిరోజు. ఈ సందర్భంగా అసలు పితృదేవతలను ఎందుకు ఆరాధించాలో చదువండి.
Tatwabhodha


ఈ ఆఖరి రోజులను సద్వినియోగం చేసుకొందాం!

పితృలోకం అంటూ నిజంగా ఒకటుంటుందా? చనిపోయిన మన పూర్వీకులు అందరూ అక్కడే ఉంటారా? మనం ఇక్కడ్నించే మంత్రయుక్తంతో చేసే దానాలు, ధర్మాలు, తర్పణాలు, పిండప్రదానాలు అన్నీ వారికి నిజంగా చేరుతాయా? ఇదెలా సాధ్యం?? మహారాష్ట్రకు చెందిన స్వామి ముక్తానంద పరమహంస (జీవితకాలం: 1908-1982) గురించి ఈతరంలో చాలా తక్కువమందికి తెలుసు. నమ్మశక్యం కాని విధంగా తాను ధ్యానంలో పితృలోకాన్ని దర్శించినట్ల వారు చెప్పుకున్నారు. పై అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వారి అద్భుత పుస్తకాలలో ఒకటైన చిత్‌శక్తి విలాసంలో ఈ పితృలోక సందర్శన గురించి చాలా శాస్ర్తోక్తంగా పేర్కొన్నారు.

స్వర్గలోకానికీ, సిద్ధలోకానికీ మధ్య పితృలోకం ఉంటుందని, మనం చేసే తర్పణ, పిండప్రదానాలు, దానధర్మాలు అక్కడి మన పూర్వీకులకు చెందుతాయని తాను ధ్యానంలో తెలుసుకొన్నట్లు స్వామి ముక్తానంద అప్పట్లోనే వెల్లడించారు. అయితే, ఆ పితృలోకం మన భూలోకంలా లేదు. స్వర్గ, నాగ, చంద్రలోకాలలో ఉన్నవారికి వలె భోగభాగ్యాలూ వారికి అక్కడ లేవు. నా చిన్నతనంలో నేను చూసిన కొందరు వృద్ధులు నాకు అక్కడ కనిపించారు. ఇక్కడ మనం వారి పేరుమీద సమర్పించే వాటిని అక్కడ వారు తింటున్నారు. మన దానపుణ్యాల్ని వారు స్వీకరిస్తున్నారు. తమ వారసులను ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా సత్యం. నా కండ్లారా చూశాను అని ఆయన పై పుస్తకంలో నమోదు చేశారు. మంత్రవాహకమైన చిత్‌శక్తియే తనను మంత్రశక్తిద్వారా అక్కడికి తీసుకెళ్లిందని స్వామి ముక్తానంద చెప్పుకొన్నారు.

మంత్రపిండం మంత్రం ద్వారా సూక్ష్మరూపంలో పితృలోకాన్ని చేరుకొంటుంది. ధ్యానంలో నాకు ఒక నీలనక్షత్రం కనిపించింది. అదే నన్ను లోకాలన్నింటినీ దర్శింపజేసింది అని వారన్నారు. వారింకా ఇలా అనేవారు: మనం పిల్లలం. మన పితృదేవతలకు ఋణపడి ఉన్నాం. ఎలాగంటే, తల్లిదండ్రులు మనకు తమ రసాన్నీ, రక్తాన్నీ, తాము తినే ఆహారంలో సగభాగాన్నీ మనకిచ్చి పోషిస్తుంటారు. వారు తాము తినరు, పిల్లలకు పెడతారు. తాము నిద్రపోరు, పిల్లలను నిద్ర పుచ్చుతారు. మంచి ఆహారమేదైనా లభించినప్పుడు ముందు పిల్లలకే. తర్వాత మిగిలితేనే తాము తింటారు. అసలు తల్లిదండ్రులు పిల్లలకు ఏది చేయరని? అందువల్లనే మనం మన పితృదేవతలకు ఋణపడి ఉన్నాం అని వారనేవారు. ఈ రకంగా పితృతర్పణాలు, దానధర్మాలతో ఋణం తీర్చుకోవలసిందేనన్నది ఆయన అభిప్రాయం.

- సావధానశర్మ

405
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles