నర్మద పరిక్రమ


Sun,September 22, 2019 01:24 AM

ఆవులు ఎదురొస్తే ఏం చేయాలి?
(గత సంచిక తరువాయి)
Narmada
* బయలుదేరేప్పుడు నా మెళ్లోని స్ఫటికమాలను ఇచ్చి దాన్ని శక్తివంతం చేసి ఇవ్వమని ఇస్తే, దాన్ని చేతిలో ఉంచుకొని కళ్లు మూసుకొని ప్రార్థించి ఇచ్చారు.

ఆ జైనగురువు సమక్షంలో నాకు చక్కటి ప్రశాంతత లభించింది. ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నారని భావించాను. ఓ రూళ్ల నోట్‌బుక్‌లో మొదటిపేజీలో నాకు ఆశీస్సులను రాసిచ్చారు. తెలుగులో ఆనువాదానికి దాన్ని వాడమన్నారు. ఆయన సెల్‌ఫోన్ మోగితే ఆయన సహాయకుడు/ సేవకుడు మంగేష్వర్ అవతలివైపు చెప్పింది విని ఆయనకి చెప్పి, ఆయన సౌంజ్ఞల ప్రకారం అవతలి వాళ్లకి జవాబులు చెప్పారు. బయలుదేరేప్పుడు నా మెళ్లోని స్ఫటికమాలను ఇచ్చి దాన్ని శక్తివంతం చేసి ఇవ్వమని ఇస్తే, దాన్ని చేతిలో ఉంచుకొని కళ్లు మూసుకొని ప్రార్థించి ఇచ్చారు. వెంకటేశ్వరరావుకు దిక్కులు చూసుకొని తలను ఉత్తరదిక్కుకు పెట్టుకొని పడుకొనే అలవాటు ఉన్నది. ఇందుకోసం దిక్సూచిని వెంట తెచ్చారు. నా పడకపైన దూలం వచ్చింది. దూలం కింద పడుకోకూడదని, పీడకలలు వస్తాయని అతను చెప్పారు. ఇల్లు కూలితే దూలం మీద పడి చస్తారని, అలా పడుకోకూడదని చెప్తారని కూడా అన్నారు. ఐతే, ఆ రాత్రికి ఆ ఇల్లు కూలే అవకాశం లేదని నేను జవాబు చెప్పాను. వెంకటేశ్వరరావు ఇలాంటి ఆచారాలను చాలా నిజాయితీగా పాటిస్తారు.

మధ్యాహ్నం ఆదిదేవుడి కొండకు వెళ్లేప్పుడు మాకు ఆవులు ఎదురొస్తే ఆగిపోయారు. ఆవుకు కుడివైపునుంచి తప్ప ఎడమవైపు నుంచి వెళ్లకూడదని, ఆవుకూడా మనిషి తనకు కుడివైపు ఉండేలా చూసుకొనే వెళుతుందని చెప్పారు. ఉదయం నిద్ర లేచేటప్పుడు శ్వాస ఏ ముక్కులోంచి ఆడుతుందో చూసుకొని అటువైపు నుంచే మంచం దిగుతారు. ఒకోసారి ఆ శ్వాసను ఏదో ఎక్సర్‌సైజ్ ద్వారా రెండో ముక్కులోకి మార్చికాని లేవరు.

అక్టోబర్ 22, బుధవారం: నాలుగో రోజు మర్నాడు ఉదయం నేను నిద్ర లేచేసరికి ప్రభు అనుష్ఠానం చేసుకొంటున్నారు. అతను రోజూ ఉదయం శివలింగానికి పూజాభిషేకాలు చేస్తారు. ఓసారి దేశాయ్‌కు నర్మద నదిలో దొరికిన శివలింగం అది. దాన్ని తన వెంట తెచ్చి ప్రతీ ఉదయం ఆ అనుష్ఠానాన్ని పాటిస్తున్నారు ప్రభు. వంట చేసే గెస్ట్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌ను వాడమని వెంకటేశ్వరరావు నాకు చెప్పారు. క్రితం రోజు నేను బయట ఉన్న ఓ బాత్‌రూమ్‌కు వెళ్లాను. శుభ్రత కోరుకునే వారికి అది నరకంతో సమానం. దాన్నిండా పెద్దపెద్ద దోమలు. టాయ్‌లెట్‌లో ఫ్యాన్‌లో కూడా దోమలున్నాయి. అవి కుడితే జబ్బులు వస్తాయని అనిపించింది. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సత్రాలు, ధర్మశాలలు నిర్వహించేవారు బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్‌ల శుభ్రత విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం అనేక యాత్రల్లో గమనించాను. ఈ విషయంలో దేవుడు వారికి సద్బుద్ధిని ఇవ్వాలని ఆశిద్దాం. ఆ బాత్‌రూమ్‌లోనూ దీపాలు లేవు. వంటావిడ మౌసి నాకు ఓ కొవ్వొత్తిని వెలిగించి ఇచ్చింది. ఆ బాత్‌రూమ్ క్రితం రోజు నేను ఉపయోగించిన బాత్‌రూమ్ కన్నా శుభ్రంగా, దోమలు లేకుండా ఉంది. ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్‌గా పోహా (అటుకుల ఉప్మా)ను పెట్టారు. కరంట్ కట్ అధికం. అది వస్తూ పోతూ ఉన్నది. సంస్థానానికి జనరేటర్ ఉంది. కమర్షియల్‌గా సాగే యాత్రల నిర్వాహకులు పర్యాటకులను ఈ జైన సంస్థానానికి తీసుకురారు.

మాటల్లో వెంకటేశ్వరరావు నాకు మూకాంబికా తల్లి ఆలయంలో జరిగిన అనుభవం గురించి ప్రభుకు చూచాయగా చెప్పారు. ప్రభు నన్ను ఆసక్తిగా అక్కడేం జరిగిందని అడిగితే, మేం బయలుదేరే లోపల అది క్లుప్తంగా వివరించాను. ఇదికూడా ఆధ్యాత్మిక విషయమే కాబట్టి, ఆ వివరాలు ఇక్కడ రాస్తున్నాను.

ఆధ్యాత్మిక మేలుకొలుపు

చిన్నప్పటి నుంచీ నాకు పెద్దగా దైవభక్తి ఉండేది కాదు. గుడికి వెళ్లినా సాధారణంగా ఎవరితోనైనా కలిసి వెళ్లడం తప్ప నా అంతట నేను వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది 1999 సెప్టెంబర్‌లో గోవాకు వెళ్లినపుడు నేను కర్నాటకలోని కొన్ని పుణ్యక్షేత్రాలకు ఒంటరిగా వెళ్లాను. గోవాకు వెళ్లబోయే ముందు ఆ సంగతి మిత్రులు, రచయిత పి.ఎస్.నారాయణకు చెప్తే దగ్గరే ఉన్న గోకర్ణానికి కూడా వెళ్లమని వారు సలహా ఇచ్చారు. చిక్కడపల్లిలోని సుధా హోటల్‌కు వెళ్లి, అక్కడి ఓ కన్నడ వెయిటర్‌ను గోకర్ణానికి గోవానుంచి ఎలా వెళ్లాలని అడిగాను. అతను ఉత్సాహంగా గోకర్ణం దగ్గరే ఉన్న మరికొన్ని పుణ్యక్షేత్రాలను కూడా రెండు, మూడు రోజుల్లో చూడవచ్చునని, అన్నీ పెద్ద దూరంలో లేవని, సముద్రం ఒడ్డున ఉన్న నేషనల్ హైవేమీదుగా వెళ్లవచ్చునని చెప్పి వాటి పేర్లుకూడా రాసిచ్చాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

mvk-murthy

తీర్థయాత్ర

theertha-yatra

-సశేషం

184
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles