రాముడు ఎందుకు దేవుడు?


Sun,September 22, 2019 01:26 AM

-రాబోయే విజయదశమి సందర్భంగా.. శ్రీరాముని కర్మనిష్ఠను తెలిపే వ్యాసం
-అందాల ధర్మమూర్తి నీతికి నిలువెత్తు రూపం

god-ram
వచ్చే (8వ తేది) దసరా పండుగ రోజు చెడుపై మంచి సాధించిన విజయంగా రామ్‌లీల (రావణ దహనం) జరుపుకోవడం మన దేశవ్యాప్తంగా ఆనవాయితీ. సరదా కోసమైతేనేం, నాటకీయంగా సాగే ఈ కార్యక్రమంలో రామునివైపు కొందరు, రావణునివైపు ఇంకొందరు చేరుతారు. ఆ ఇద్దరిలో ఎవరు, ఎందువల్ల గొప్పవారు, యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్న దానిపై వారు పరస్పరం వాదోపవాదాలు చేసుకొంటారు. ఈ నేపథ్యంలోనే రాముడు ఎందువల్ల దేవుడయ్యాడు?, ఆయనలోని సుగుణాలు ఏమిటి? వంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గవి. ఆ విశేషాలే ఇక్కడ చదువండి. రామాయణం సీతారాముల కథ. రామస్య అయనం అంటే రాముడు నడిచిన బాట. సామాన్యులను ముక్తిపథం వైపు నడిపించే మార్గమది. ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి శ్రీరాముడు తాను ముళ్లబాటలో నడిచాడు. అనేక కష్టాలను అనుభవించి సత్యాన్ని బతికించాడు. నిరాశగా నిట్టూరుస్తూ దిగాలు పడిన ధర్మానికి ఊపిరిపోశాడు. అందుకే, రాముడంటే పుణ్యాల ప్రోవు. సుగుణాల కూర్పు. ధర్మాల ప్రాపు. రాముడు దేవుడిలా అవతరించలేదు. సమస్త లోకాన్ని తన చల్లని వెన్నెలతో ఆహ్లాదపరిచే చంద్రుడిలా, తనతో వున్న ప్రతివారినీ, తండ్రిని, తల్లులను, తమ్ములను, భార్యను, స్నేహితులను, ఆశ్రితులను, ప్రజలను అందరినీ ఆనందపరిచిన ఆనందమూర్తి.

బుద్ధి, హృదయ పక్షాలకు చెందిన విద్యలన్నింటినీ ఆయన అభ్యసించాడు. వేదవేదాంగాలతోపాటు ఆయుధవిద్యలూ, సంగీతం, చిత్రలేఖనం, నృత్యవాద్య గాంధర్వాది విద్యలన్నీ నేర్చాడు. (ఈ హృదయ సంబంధ విద్యలు నేర్చినవాడే సంపూర్ణ మానవుడు అన్నది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ నిర్వచనం). పరాక్రమంలో శ్రీమహావిష్ణువు అంతటివాడని, వీరశౌర్యాల్లో తనను మించిన వారుండరని రామాయణం చెబుతున్నది. 15 ఏండ్ల వయసులోనే భీకర రాక్షసి తాటకిని వధించాడు. ఆరు పగళ్లు-ఆరు రాత్రుళ్లు కంటిమీద కునుకు లేకుండా, తమ్ముడు లక్ష్మణుడు తోడుగా విశ్వామిత్రుని యాగరక్షణ చేశాడు. మారీచుణ్ణి 100 యోజనాల ఆవలకు పడేయడమేకాక సుబాహుడిని వధిస్తాడు. దండకారణ్యంలో రావణుని తమ్ముళ్లయిన ఖర, దూషణాదులూ, 14వేల మందినీ ఒక్కచేతితో అలుపు లేకుండా సంహరిస్తాడు. విరాధుణ్ని, కబంధుణ్ని తమ్ముడితో కలిసి హతమార్చాడు. సుగ్రీవునితో అగ్నిసాక్షిగానే స్నేహం చేశాడు. అతని రెండు పరీక్షల్లోనూ రాముడు గెలిచాడు.

రాముడిలో ఈర్ష, అసూయలు, రాగద్వేషాలు లేవు. కట్టుబాట్లకు, ఔచిత్యానికి అవధి రాముడు! ఆయా సందర్భాలలో కొన్నిసార్లు కోపం కలిగినా అది క్షణికమే. తనను చిన్నమ్మ కైకేయి అడవికి పంపడం దైవనిర్ణయంగా భావించాడు. రావణాసురుని విషయంలోనూ రాముడు వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శించలేదు. యుద్ధంలో మరణించిన రావణునికి కర్మ చేయనన్న విభీషణునికి జ్ఞానోదయం కలిగేలా తాను అతనిలో దుర్బుద్ధినే చూస్తున్నానని చెప్తాడు. ఆశ్చర్యకరంగా మారీచుడు సైతం రాముణ్ణి ధర్మమూర్తిగానే భావించాడు. సుగ్రీవుని రాజ్యాభిషేకం వేళ తాను ముని వేషంతో కిష్కింధ వంటి నగర ప్రవేశం చేయననీ అంటాడు. ఋషులను బాధించే రాక్షసులను చంపడం రాజుగా తన ధర్మమని, ధర్మనిష్ఠలో తన ప్రాణమైనా వదులుతానని అన్నాడు. ఆఖరకు ధర్మం కోసం అవసరమైతే భార్య సీతను, తమ్ముడు లక్ష్మణుడినైనా విడిచి వెళతాననీ తెలిపాడు. రాముని ధర్మవ్రతం ఎంతటిదో దీన్నిబట్టి తెలుస్తున్నది. తమ్ముళ్లందరినీ కూడగట్టుకోవడానికే తాను రాజ్యం కోరుకుంటున్నానని, అన్యాయంగా వచ్చే ఇంద్రపదవి అయినా వద్దని అంటాడు. ఇదీ రామచంద్రుని న్యాయనిరతి.

ప్రతి ఒక్కరితోనూ రాముడు చాలా మృదువుగా మాట్లాడాడు. ముఖంపై చిరునవ్వు చెక్కుచెదరదు. రాముని అభివృద్ధి కోసం రాజ్య ప్రజలంతా దేవతలను పూజించేవారు. రాముడికి తండ్రి దశరథుడంటే ఎనలేని ఇష్టం. ఆ తండ్రికీ ఈ కొడుకంటే పంచప్రాణాలు. విశ్వామిత్రుని మాటను పాటించమని తండ్రి చెప్పాడు కనుకే, తనకు ఇష్టం లేకపోయినా స్త్రీ అయిన తాటకిని చంపానన్నాడు. శివధనుర్భంగం చేసికూడా తండ్రిమాట తర్వాతే సీతను పెండ్లాడాడు. పితృవాక్య పాలనకు పూర్తిగా కట్టుబడ్డాడు. తండ్రి ఒప్పుకోవడం వల్లే సీతపట్ల పంచప్రాణాలు ఏర్పరచుకొన్నాడు. తండ్రి మరణవార్త విని స్పృహ తప్పి పడిపోతాడు. సీత జాడ తెలుసుకొన్న హనుమను ఆప్యాయంగా కౌగిలించుకొంటాడు.

ఇక, సీతంటే రామునికి వల్లమాలిన ప్రేమ. ఆమె సన్నిధిలో తాను మహోన్నతమైన అనురాగాన్ని పొందినట్లు చెప్పాడు రాముడు. అలా, సీతారాముల అనురాగం లోకానికే ఆదర్శమైంది. పువ్వుకంటే తేజోవంతమైంది సీత. పరాయి పురుషుడి ఇంట సంవత్సరాల తరబడి ఉన్న సీతను స్వీకరించకుండా తనను తాను క్షోభ పెట్టుకొన్నాడు. తన ప్రియాతి ప్రియమైన ఇల్లాలు అగ్నిప్రవేశం చేస్తుంటే, ధర్మం కోసం నిర్లిప్తంగా ఉండిపోయాడు. మొత్తంగా రాముడు కర్మయోగి, ధర్మయోగి. ఆ ధర్మానికి రెండువైపులా పదును ఉంటుంది. అందుకే, రాముడిలాంటి రాజు మరొకరు లేరు, ఉండరు కూడా.

అత్యంత ఆదర్శ పురుషుడు!

మొత్తం 64 సద్గుణాలతో సకలగుణాభి రాముడుగా శ్రీరామచంద్రమూర్తి వినుతికెక్కాడు. వాటిలో 20 రూపగుణాలు, 20 పరిపాలనాదక్షతకు చెందినవి అయితే, మరో 24 గుణాలు ఆయనను అత్యంత ఆదర్శ పురుషుణ్ణి చేశాయి. రామాయణంలో వాల్మీకి మహర్షి రాముని ప్రతీ అవయవాన్నీ అద్భుతంగా వర్ణిస్తాడు. అవన్నీ సాముద్రిక శాస్త్రంలో పేర్కొన్న శుభలక్షణాలు, చక్రవర్తి సుగుణాలలోనూ వున్నవే. అరణ్యాలకు తనతో రావద్దని, అడవిలో క్రూరమృగాలు ఉంటాయని సీతతో రాముడు అన్నప్పుడు- ఆ మహాతల్లి ఆయన రూపంలోని గొప్పతనాన్ని వెల్లడించిన తీరు అపురూపం. అవి మిమ్మల్ని తొలిసారి చూస్తాయి కనుక వెంటనే పారిపోతాయి. రూపం మన శక్తిని వెల్లడిస్తుందని వేదమూ పేర్కొన్నది. అలాగే, రూపంతో మనిషి మనస్తత్వమూ బోధపడుతుందని మనస్తత్వ శాస్త్రం కూడా చెబుతున్నది.

ఆజానుబాహుడి అద్భుత సుగుణాలు!

చతుష్షష్ఠి కళలుగా లోకప్రసిద్ధిగాంచిన శ్రీరాముని అద్భుతమైన 64 సుగుణాలు ఇవీ:
1.నిశ్చిత, నిర్వికార స్వభావం
2.గొప్ప పరాక్రమం
3.మంచికాంతి
4.మహాధైర్యం
5.ఇంద్రియ నిగ్రహం
6.బుద్ధిమంతుడు
7.నీతిమంతుడు
8.సర్వశాస్త్ర పాండిత్యం
9.ఐశ్వర్యం
10.శత్రు వినాశనం
11.(సాముద్రిక శాస్త్రం చెప్పినట్లుగా సర్వోన్నత, మంగళకర శరీర లక్షణాలు) ఎత్తయిన మూపులు
12.బలమైన బాహువులు
13.శంఖం వంటి కంఠం
14.ఎత్తయిన చెక్కిళ్ల పైభాగం
15.విశాల వక్షస్థలం
16.గొప్ప ధనుస్సు
17.పొడవాటి బాహువులు
18.పాపక్షయకారుడు
19.సలక్షణాల శిరస్సు
20.అందమైన నడక, పాదవిన్యాసం
21.పొట్టిగాకానీ, పొడవుగాకానీ లేని మధ్యస్థ శరీరం
22.చక్కని శరీరఛాయ
23.గొప్ప తేజస్సు
24.అవయవాలన్నీ హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండడం
25.విశాలమైన కండ్లు
26.శరణాగత రక్షణ ధర్మం ఎరిగిన వాడు
27.ప్రతిజ్ఞాపాలన
28.ప్రజాహితంపై ఆసక్తి
29.గొప్పకీర్తి
30. సర్వమూ తెలిసిన సర్వజ్ఞుడు
31.పరిశుద్ధ నిజాయితీ
32.గురువులు/ పెద్దలకు లొంగి వుండడం
33.ఆశ్రితుల రక్షణకు దీక్షాపరుడు
34.బ్రహ్మసమానుడు
35.సర్వోన్నతుడు
36.సర్వలోకాల పోషణ
37.శత్రుసంహరణ
38.సమస్త ప్రపంచాన్ని, ప్రాణికోటిని రక్షించేవాడు
39.ధర్మరక్షణ
40.క్షత్రియధర్మ రక్షణ
41.ఆశ్రిత దీనబంధువర్గ రక్షకుడు
42.వేదవేదాల పారంగతుడు
43.ధనుర్వేదం (విద్య)లో పరిపూర్ణ జ్ఞానం
44.సర్వశాస్ర్తాల అర్థతత్వాలు తెలిసినవాడు
45.మంచిజ్ఞాపకశక్తి 46.గొప్ప ఉత్తరోత్తర యుక్తులు
47.ప్రజలందరికీ ఇష్టుడు
48.ప్రజలందరినీ ఇష్టపడేవాడు
49.అపకారులకూ ఉపకారం
50.అతిదు:ఖంలోనూ కలత చెందని మనసు
51.సందర్భోచిత విచక్షణా జ్ఞానం (ఏఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలో)
52.సత్పురుషులను ఆకర్షించగలగడం
53.పూజ్యనీయుడు
54.తరతమ భేదాలు లేని సమానత్వం
55.ఎల్లవేళలా ఒకేలా దర్శనం
56.సకల సుగుణాల ప్రోది
57.సముద్రమంతటి గాంభీర్యం
58.ధైర్యంలో హిమవంతుడు
59.పరాక్రమంలో శ్రీమహావిష్ణువు
60.చంద్రునివలె ప్రియదర్శనుడు
61.కోపంలో ప్రళయాగ్ని
62.ఓర్పులో భూదేవి
63.దానంలో కుబేరుడు
64.సత్యరక్షణలో ధర్మదేవత వంటివాడు.

* రాముని సద్గుణాలు ఇంతేనా? అంటే, ఇంకెన్నో లెక్కకు మించి! అందుకే ఆయనను శతకోటి (100 కోట్లు: 1 బిలియన్) నామాలవాడు అన్నారు కదా.

dr-k-a-vyas

884
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles