సరదాగా.. సయేషాతో!


Sun,September 22, 2019 01:26 AM

దిలీప్‌కుమార్ మనవరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. అఖిల్ సినిమాతో టాలీవుడ్‌లో మంచి నటిగా పేరు సంపాదించుకున్నది. కోలీవుడ్‌లో అగ్రహీరోలతో నటిస్తూ బిజీ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరింది.రీల్‌లైఫ్‌లోనే కాకుండా రియల్‌లైఫ్‌లో కూడా.. ఆర్యతో జతకట్టి ఆడిపాడుతున్నది.. పెండ్లి అయితే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే అన్న మాటలను తుడిచి పెట్టేలా.. బందోబస్త్ సినిమాలో తనఅభినయంతో ఆకట్టుకున్నది. పెండ్లి తర్వాత ఆర్యతో జంటగా కాకుండా.. ఒకే సినిమాలో కలిసి నటించడం..
ఎప్పటికీ గుర్తిండి పోతుందంటున్న సయేషా జిందగీతో సరదాగా మాట్లాడింది.

Dilip-Kumars

అఖిల్ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు?

అవును!. 2017లో తమిళ్‌లో నటించిన వనమగన్ పెద్ద హిట్టయింది. దాంతో నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తమిళ్ సినిమాలతో బిజీ అయ్యాను. టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాను. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరించారు. అక్కినేని అఖిల్ నాకు మంచి ఫ్రెండ్. డాన్స్, యాక్టింగ్‌లో నాకు చాలా సపోర్ట్ చేశాడు. తెలుగువారితో నాకు మంచి బంధం ఏర్పడింది. టాలీవుడ్‌లో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న. తెలుగులో చేసిన అఖిల్ సినిమా నాకు ఎప్పటికీ స్పెషలే.

బందోబస్త్ సినిమా గురించి చెబుతారా?

ఇది పొలిటికల్ డ్రామా సినిమా. ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన చంద్రకాంత్ (మోహన్‌లాల్) ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తాడు. అక్కడ ఆయన మీద జరిగిన అటాక్ నుంచి రక్షించిన మిలిటరీ ఆఫీసర్ రవి ట్రాక్ రికార్డ్ నచ్చి, అతన్ని తన సెక్యూరిటీ వింగ్ ఎస్పీజీకి హెడ్‌గా నియమించుకుంటాడు. అయితే రవికి ఓపెన్‌గా చాలెంజ్ విసిరి, మినిస్టర్‌ను చంపేస్తారు. దాని కారణంగా రవిని సస్పెండ్ చేస్తారు. ఇంతకీ ప్రైమ్ మినిస్టర్‌ను చంపింది ఎవరు? వాళ్లని రవి ఎలా కనిపెట్టాడు? అన్నదే కథ. డైరెక్టర్ కేవీ ఆనంద్ సినిమాలో అందరికీ మంచి పాత్రలు ఇచ్చారు.

కోలీవుడ్‌లో అంతమంది హీరోయిన్లు ఉండగా హీరో సూర్యతో నటించే అవకాశం మీకు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు?

ముందుగా ఈ సినిమాలో చాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కేవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. కోలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉండగా ఈ సినిమాలో హీరో సూర్యకి జోడీగా నేను సరిపోతానని గ్రహించి నాకు చాన్స్ ఇచ్చారు. నా రోల్‌కు పూర్తి న్యాయం చేశానో లేదో మీరే చెప్పాలి.

సినిమాలో కోలీవుడ్ స్టార్ మోహన్‌లాల్, సూర్య, ఆర్యతో కలిసి నటించారు. అనుభవం ఎలా ఉంది?

మోహన్‌లాల్ సార్ లెజండరీ యాక్టర్. ఆయన నటిస్తున్న సినిమాలో నాకు అవకాశం వచ్చిందనగానే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇక సూర్య విషయానికి వస్తే మంచి వ్యక్తి. ఆర్య గురించి చెప్పాలంటే పెండ్లి తర్వాత మేమిద్దరం కలిసి నటించిన మొదటి చిత్రం ఇది.

బందోబస్త్ షూటింగ్ ఎలాంటి అనుభవానిచ్చింది?

సినిమా మొదలుపెట్టాక పూర్తవ్వక తప్పదు. ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా సినిమా సక్సెస్‌తో పోతుంది. ఇన్ని రోజులు పెద్ద స్టార్స్‌తో పనిచేశాను. ప్రతిరోజూ వారి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. షూటింగ్‌లో కొంచెం ఖాళీ దొరికితే చాలు నాకంటే పెద్దవాళ్లతో మాట్లాడి తెలియని విషయాలు నేర్చుకుంటూ ఉండేదాన్ని.

తెలుగు అర్థమవుతుందా?

హా.. అర్థమవుతుంది (నవ్వుతూ). దీనికోసం ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. తమిళ్ బాగా మాట్లాడగలను. అఖిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్‌లో తెలుగు మాట్లాడేవారందరినీ గమనించేదాన్ని. తిరిగి మాట్లాడలేకపోయినా సంభాషణలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. అప్పటి నుంచి తెలుగువారితో మాట్లాడేటప్పుడు వారిని తెలుగులోనే మాట్లాడమని చెబుతాను. తెలుగులో మంచి ఆఫర్ వస్తే తెలుగు పూర్తిగా నేర్చుకుంటా.

పుట్టింది ముంబైలో. పనిచేస్తున్నది తమిళియన్స్‌తో.. ఎలా అనిపిస్తుంది?

ఇక్కడ ఎలాంటి బేదభావాలు లేవు. నేను స్పష్టంగా తమిళ్ మాట్లాడగలను. కోలీవుడ్‌లో నాకు మంచి ఆదరణ దొరికింది. ఎక్కడికెళ్లినా ప్రజలు గుర్తుపట్టినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. టాలీవుడ్‌లో కూడా నేనేంటో నిరూపించుకుంటాను.

బందోబస్త్ సినిమాలో ఆర్య రోల్ ఏంటి?

ఆర్య రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి ఆర్య గుండెలాంటివాడు అని చెప్పొచ్చు. సూర్యకి పోటీగా నటించాడు. అతని క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు.

అమ్మానాన్నల సపోర్ట్ ఉంటుంది. మరి అత్తామామల సపోర్ట్ ఉందా?

నాకు 14 ఏండ్లకే సినిమా ఆఫర్లు వచ్చాయి. అమ్మానాన్నలు నాకు సపోర్ట్‌గా నిలిచారు. యాక్టింగ్ గురించి మెళకువలు నేర్పారు. నాకు ఎలాంటి సందేహం ఉన్నా వారితో చర్చిస్తూ ఉంటాను. వారే నా గురువు దైవం. పెండ్లి తర్వాత అమ్మానాన్నలతో పాటు అత్తామామల ఆదరణ కూడా దొరికింది. అత్తామామల సపోర్ట్ నాకు మంచి బూస్టప్‌ను ఇచ్చింది.
Dilip-Kumars2

పెండ్లి తర్వాత హీరోయిన్లకు సినిమా ఆఫర్లు రావంటారా?

పెండ్లి అనేది జీవితంలో ఒక భాగం. కెరీర్ అనేది కూడా జీవితంలో భాగమే. రెండింటికి ఎందుకు ముడిపెడుతారు. టాలీవుడ్‌లో పెండ్లి చేసుకున్న సమంతకి ఆఫర్లు రావట్లేదా? సినిమా సక్సెస్ సాధించడంలేదా? అలాగే దీపికా పడుకొనె, ప్రియంకా చోప్రా వీళ్లకి పెండ్లి తర్వాత అవకాశాలు వస్తున్నాయో లేదో మీరే చూస్తున్నారు. పెండ్లి అయితే హీరోయిన్లకు సినిమా ఆఫర్లు రావు అన్నది వట్టిమాట. టాలెంట్ ఉంటే ఈ పప్పులేమీ ఉడకవు.

ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు?

షూటింగులు కాకుండా కొంచెం ఖాళీ దొరికితే డాన్స్ చేస్తుంటా. అదికాకుండా కిచెన్‌లోకి వెళ్లి వంటలు చేసి అందరికీ వడ్డిస్తా. వీటితో పాటు స్విమ్మింగ్ చేయడం
అంటే చాలా ఇష్టం.

ఆర్య గురించి చెబుతారా?

ఆర్య నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. నా ఇష్టాలు, అభిరుచులను గౌరవిస్తాడు. నాకు వచ్చిన సినిమా స్టోరీ గురించి ఆర్యతో చర్చిస్తాను. నాకు ఏం కావాలో నాకన్నా ఆర్యాకే బాగా తెలుసు. ఇంటికి వచ్చాక షూటింగ్ విషయాలు పక్కన పెట్టి కుటుంబంతోనే గడుపుతాం.

పెండ్లికి ముందు, పెండ్లి తర్వాత మీ లైఫ్‌లో ఏమైనా మార్పు వచ్చిందా?

మార్పు అంటే.. పెండ్లికి ముందు అంటే నా లైఫ్‌లో అమ్మానాన్నలే ప్రపంచం. పెండ్లి తర్వాత ఆర్య, అత్తామామలు కూడా చేరారు. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మంచి మార్పే వచ్చింది. ఆర్య సినిమాలతో బిజీ, నేను ఇలా.. ఇద్దరం అలా మూవ్ అవుతున్నాం.

సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది?

మా అమ్మనాన్న, గ్రాండ్ పేరెంట్స్ అందరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే. వారి సినిమాలు చూస్తూ పెరిగాను. చిన్నప్పటినుంచి వారిలా నేను కూడా మంచి హీరోయిన్ కావాలనకునేదాన్ని. అలానే అయ్యాననుకుంటున్నా (నవ్వుతూ). ఇక సినిమాల విషయానికి వస్తే యాక్టింగ్ అనేది నా జీవితంలో ఒక భాగం. ఇది నా ప్యాషన్ కూడా. సినిమా అంటే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలి. వారికి మంచి మెసేజ్ ఇవ్వాలి.

తెలుగు, తమిళంలో ఇప్పటివరకు సూర్య, కార్తీ, అఖిల్, మోహన్‌లాల్‌లతో పనిచేశారు. వారి గురించి ఒక్కమాటలో?

సూర్య : ఆయన డెడికేటెడ్ పర్సన్.
అఖల్ : వెరీ గుడ్ ఫ్రెండ్. అఖిల్ చాలా స్పెషల్
మోహన్‌లాల్ : లెజండరీ పర్సన్
కార్తిక్ : చాలా నేచురల్‌గా ఉంటాడు.
Dilip-Kumars1

సినీ ఇండస్ట్రీలో మీ ఇనిస్పిరేషన్ ఎవరు?

సినీ ఇండస్ట్రీలో చెప్పాలంటే.. ఒకరనేం లేదు.. ప్రతీ ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. నేను పనిచేసిన వారినుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. మోహన్‌లాల్, సూర్య ఇలా అందరినీ నేను ఆదర్శంగా తీసుకుంటాను.

బందోబస్త్ తర్వాత ఎలాంటి రోల్స్ చేద్దామనుకుంటున్నారు?

బందోబస్త్ తర్వాత రెండు సనిమాలు చేస్తున్నాను. సినిమాలో నా పాత్రకు గుర్తింపు ఉండాలి. ఏదో ఒకటిలే అని సినిమాకు ఒకే చెప్పలేను. నేను చేసే పాత్ర ముందుగా నాకు నచ్చాలి. ఇలాంటి రోల్స్ చేయాలనేం లేదు. పాత్ర మంచిదైతే చాలు.

చిన్న వయసులోనే పెండ్లి చేసుకున్నారు కదా? పెండ్లికి ఇదే మంచి సమయం అనుకున్నారా?

అవును చిన్న వయసులోనే చేసుకున్నాను. ఇది నా కెరీర్‌కు ఎలాంటి అడ్డుకాదు. ప్రతిఒక్కరూ ఏదోక రోజు పెండ్లి చేసుకోవాల్సిందే. కాకపోతే నేను కాస్త తొందరగా చేసుకున్నాను. మంచి అబ్బాయి దొరికితే లేట్ చేయడం ఎందుకు. అందుకే చేసేసుకున్నా.

-వనజ వనిపెంట

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles