మూగజీవాలకు పునర్జన్మ


Wed,October 2, 2019 01:15 AM

yuva
‘నాన్నా ! నా జిమ్మీని ఎలాగైనా బతికించు’ గంట నుంచి ఏడుస్తున్నాడు కొడుకు. ‘ఏం చేయాల్రా.. ఎవ్వరిని అడిగినా ఒక్కరూ హెల్ప్‌ చేస్తలేరు. కుక్కపిల్లే కదా.. అని తీసిపడేస్తుండ్రు’ కాస్త బాధతో సమాధానం చెప్పిండు రాహుల్‌ తండ్రి. ‘ప్లీజ్‌ నాన్న నా కిడ్డీ బ్యాంకులో ఉన్న రూ.670 ఇచ్చేస్తాను. ఎవ్వరికైనా ఇచ్చి నా జిమ్మీని బయటకు తీయమనవా? ప్లీజ్‌ నాన్న ప్లీజ్‌.. ప్లీజ్‌' అంటూ తండ్రి గడ్డం పట్టుకున్నాడు రాహుల్‌. ‘డబ్బులు ఎన్నైనా ఇస్తా అంటున్నా.. ఎవరు మాత్రం ఏం చేస్తారు. చెప్పు జిమ్మీ ఆ చిన్న పైపులో ఇరుక్కుపోతే’ అనగానే రాహుల్‌ ఏడుపు రెట్టింపయ్యింది. ఇదంతా గమనిస్తున్న పక్కింటి ఇంజినీరింగ్‌ చదువుతున్న కిరణ్‌ ‘అంకుల్‌ నేను మొన్న ఫేస్‌బుక్‌లో చూశాను. ఇలా ఏమైనా జరిగినప్పుడు కాపాడేందుకు కొంతమంది ఉన్నారు. ఆగండి నేను ఫేస్‌బుక్‌లో నంబర్‌ చూసి చెప్తాను’ అన్నాడు. రాహుల్‌కు కాస్త ధైర్యం కలిగింది. ఫేస్‌బుక్‌లో సర్చ్‌ చెసి ఓ నంబర్‌ చెప్పాడు. రాహుల్‌ వాళ్ల ఫాదర్‌ ఫోన్‌ చేశారు. వాళ్లడిగినట్లుగానే వాట్సప్‌లో లొకేషన్‌ షేర్‌ చేశారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత కొంతమంది యువకులు వాళ్లింటి ముందుకొచ్చి ఆగారు. పదినిమిషాల తర్వాత రాహుల్‌ జిమ్మీని ముద్దుపెట్టు కుంటున్నాడు. గుండెలకు హత్తుకుంటున్నాడు. ఎదురుగా ఉన్న వారికి ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పాడో లెక్కే లేదు. ఇంతకీ వాళ్లెవరంటే..
yuva1
అది చలికాలం. రాత్రి పదయ్యింది. ఆల్వాల్‌ పొలిమేరలో కొన్ని వెహికిల్స్‌ ఆగి ఉన్నాయి. కాస్త దూరాన ఒక వ్యవసాయ బావి. అక్కడ కొంతమంది గుమిగూడారు. వారు ఎందుకు అక్కడున్నారో తెలుసుకునేందుకు మరికొందరు వెళ్లి చూడసాగారు. వాళ్లంతా మొబైల్‌ టార్చ్‌ ఆన్‌ చేసి బావిలోకి తొంగి చూస్తున్నారు. వెళ్లిపోతున్నారు. అందులో మంచిర్యాలకు చెందిన ఒకతను ఎవరికో ఫోన్‌ చేశాడు. అక్కడి పరిస్థితిని వివరించాడు. వెళ్లిపోయాడు. గంట తర్వాత కొంతమంది పెద్ద పెద్ద తాళ్లను తీసుకొని వచ్చారు. అందులో ఒకరు వెళ్లి క్రేన్‌ను తీసుకొచ్చారు. వారిలో నలుగురు నడుముకు తాళ్లు కట్టుకొని బావిలోకి దిగారు. ఎద్దు నడుముకు తాళ్లు కడుదామని ప్రయత్నిస్తున్నారు. అసలే వర్షాకాలం. ఆపై ఓపెన్‌ ప్లేస్‌ కావడంతో చలి మరింత బెదిరించింది. వారు ప్రతి పదినిమిషాలకు ఓసారి బయటికొచ్చి చలికాగుతున్నారు. మళ్లీ బావిలోకి వెళ్తున్నారు. రెండు గంటల తర్వాత క్రేన్‌ తీగలను ఎద్దుకు చుట్టారు. బయటకు తీసే క్రమంలో ఎద్దు బెదిరింది. తీగలు తెగిపోయాయి. ఇలా రెండు సార్లు జరిగింది. “ఇక లాభం లేదు. నేను పోత. నా బండి తీగలు తెగినయ్‌” అని క్రేన్‌ డ్రైవర్‌ గొణుగుతున్నాడు. అతడిని బతిమాలారు. ఈసారి ఎద్దునడుముకు తాళ్లు చుట్టారు. తాళ్ల ద్వారా ఎద్దును బయటకు తీశారు. ఆ తర్వాత ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. నాలుగు గంటలు కష్టపడి ఎద్దును బయటకు తీసిన వారిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఎందుకంత రిస్క్‌ చేస్తున్నారు అంటే..
yuva2

దయగల హృదయమే భగవాన్‌ నిలయం!

2018లో వరదలు కేరళను వణికించాయి. సర్వం జలార్పితమైంది. మనుషుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఇక మూగజీవాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రక్షక చర్చలు చేపట్టాయి. అయినా ప్రాణ నష్టానికి లెక్కలేదు. మూగజీవాలైతే మూల్గుతూ మూల్గుతూ.. శక్తి ఉన్నంత దూరం వెళ్లి ప్రాణాలు విడిచాయి. ఇంతటి విపత్కర పరిస్థితులను చూసిందో మిత్రబృందం. మనిషికి రూ. 5వేలు పోగు చేసింది. కేరళకు వెళ్లింది. రెండు రోజులు శ్రమించి దాదాపు 400కు పైగా మూగజీవాల్ని కాపాడింది. కుక్కలు, అడవిజంతువులు, సాధుజంతువులు ఇలా ఎన్నింటికో ప్రాణభిక్ష పెట్టారు. ఆ మిత్రబృందం ఎవరంటే.. ప్రదీప్‌ పారాకుత్‌, సంజీవ్‌ వర్మ, సంతోషి, మనీష్‌, అనురుధ్‌ సహదేవ్‌, ప్రభు, పవన్‌, అనిరుధ్‌ సహదేవ్‌, నమ్రత, పూజిత, సునిల్‌, శ్రిత, రామకృష్ణ, జ్యోతి, సాయి. వీళ్లంతా హైదరాబాదీలే. వీళ్లంతా ఎవరు? ఎందుకు స్వచ్ఛందంగా డబ్బులు జమచేసి సేవచేస్తున్నారంటే..
yuva3

ప్రేమను పంచి.. మంచిని పెంచి

వారికి మూగజీవాలంటే ప్రాణం. వాటినీ మనుషుల్లాగే చూస్తారు వారంతా. సామాజిక మాధ్యమాలే వేదికగా వారందరినీ కలిపారు పారాకుత్‌ ప్రదీప్‌ నాయర్‌. ఆయన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వీలు దొరికినప్పుడల్లా మూగజీవాలకోసం పని చేస్తూ ఉండేవారు. వివిధ సంస్థలతో కలిసి పదేళ్లు పనిచేశారు. వందలాది మూగజీవాల్ని రక్షించారు. నాలుగేండ్ల క్రితం యాక్సిడెంట్‌లో ఓకుక్కకు రెండుకాళ్లు విరిగాయి. చలించిన ప్రదీప్‌ దానిని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించాడు. అప్పటి నుంచి మూగజీవాలకు ఆపదలో ఉంటే సొంత ఖర్చుతో వైద్యం చేయించేవారు. ఆ తర్వాతి కాలంలో నడుము, కాళ్లు విరిగిన పది కుక్కలకు వైద్యం అందించారు. ఇప్పటికీ వాటిని సంరక్షిస్తున్నారు. ఈ పని తానొక్కడే చేయడం తనకు నచ్చలేదు. ప్రతి ఒక్కరికీ మూగజీవాలపట్ల ప్రేమ ఉంటుంది. కానీ వారికి ఎలా సేవ చేయాలో తెలియదు. అలాంటి వారందరినీ తన సేవలో భాగస్వామ్యం చేయాలనుకున్నారు. ఒక సిరా చుక్క.. కొన్ని మెదళ్లకు కదలిక “మూగజీవాలపై ప్రేమ ఉందా..? అవి ఆపదలో ఉంటే రక్షించాలని ఉందా.. అయితే మీరు మా వెంట రండి.. మనమంతా కలిసి వాటికి పునర్జన్మనిద్దాం” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టుపెట్టారు. చాలా మంది స్పందించారు. కానీ కొంత మంది మాత్రమే స్వచ్ఛందంగా సేవచేయడానికి ముందుకొచ్చారు. ఈ ఏడాది జనవరి 19న ‘ఏనిమల్‌ వారియర్‌ కన్జర్వేషన్‌ సొసైటీని ప్రారంభించారు. ఇందులో కొందరు గృహిణులు, మరికొందరు ఉద్యోగస్తులు, విద్యార్థులు వలంటీర్లుగా ఉన్నారు. వీరంతా స్వచ్ఛందంగా మూగజీవాలకు సేవచేస్తారు. వీరికి ప్రదీప్‌ ఉచితంగా శిక్షణ ఇస్తారు. ‘మూగజీవాల్ని ఎలా కాపాడాలి. వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా అంచనా వేయాలి తదితర అంశాలన్నింటిపై శిక్షణ ఇస్తారు.

ఏమేం చేస్తారంటే..

బోరు బావిలో కుక్కలు, పిల్లులు పడితే రక్షిస్తారు. వ్యవసాయ బావుల్లో పశువులు పడితే తీస్తారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మూగజీవాల్ని రక్షిస్తారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. పట్టణంలోని చిన్నారులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు. అరుదైన పక్షిజాతుల్ని రక్షించేలా ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా వేసవిలో పిచ్చుకలు గూడు పెట్టేందుకు 200 ఫ్లైవుడ్‌ బాక్సుల్ని తయారు చేసి ఉచితంగా పంచిపెడతారు. పక్షులకు నీరు అందేలా సిమెంటు గిన్నెలు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల వికారాబాద్‌లో ఓ కుక్క మున్సిపాలిటీ పైప్‌లైన్‌లో పడితే సంస్థ సభ్యులు వెళ్లి రక్షించారు. తాండూరులో ఓ పిల్లి సన్నని పైపులో పడితే వెళ్లి రక్షించారు. అదిలాబాద్‌ జిల్లా భైంసాలో ఓ కుక్క తల బిందెలో ఇరుక్కుపోయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సంస్థ సభ్యులు వెళ్లి తీసి వచ్చారు. ఇలా ఎవ్వరు ఫోన్‌ చేసినా స్పందించి వారికి ఉచితంగా సేవలందిస్తున్నారు. ఇటీవల అమీన్‌పుర్‌ సమీపంలోని కింగ్‌ఫిషర్‌ చెరువు నుంచి రోజంతా కష్టపడి 12 బస్తాల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీశారు. స్థానికులకు ప్లాస్టిక్‌ వినియోగం వద్దని అవగాహన కల్పించారు.

ఫోన్‌ చేయండి రక్షిస్తారు!

మీ పెంపుడు జంతువులు బోరులో పడినా.. మూగజీవాలు బావిలో పడినా ‘ఏనిమల్‌ వారియర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’ సభ్యులు రక్షిస్తారు. పక్షుల రెక్కలు విరిగినా వచ్చి చికిత్స అందిస్తారు. జంతువులు రోడ్డు ప్రమాదానికి గురైనా సంస్థ సభ్యులు చికిత్స అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అయితే సభ్యులు సొంత ఖర్చులతో వెళ్లి రక్షిస్తారు. దూరప్రాంతాల్లో అయితే మాత్రం ఫోన్‌లోనే సంరక్షణ సూచనలు చెప్తారు. మీ ఇంట్లో కుక్క తల బిందెలో ఇరుక్కుపోయినా.. కుక్క, పశువులు బావిలో పడినా.. మూగజీవాలకు సంబంధించి మరే ఇతర హెల్ప్‌ కావాలన్నా.. ‘ఏనిమల్‌ వారియర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ హెల్ప్‌లైన్‌ ణ/9697887888లో సంప్రదించవచ్చు.

మీ భాగస్వామ్యం కోసం..

సంస్థ సభ్యులు ఫోన్‌ చేస్తే ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిలో వివిధ ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. విద్యార్థులు, గృహిణులు ఉన్నారు. పనులన్నీ పక్కనపెట్టి మూగజీవాల్ని రక్షించడానికి వెళ్తున్నారు. ఇందుకు ఇంతవరకు ఒక్కరూపాయి తీసుకోలేదు. కానీ ప్రయాణం భారం అవుతుండడంతో సంస్థ సభ్యులు మీ నుంచి ఆర్థికసాయం కోరుతున్నారు. మీరు సాయం చేయాలనుకుంటే హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయవచ్చు
- పడమటింటి

267
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles